Skip to main content

చేతిస్పర్శతో ఒంటి చికిత్సకు..ఫిజియోథెరపిస్ట్

ఆటలు ఆడుతున్నప్పుడు కాలు బెణుకుతుంది. నడుస్తున్నప్పుడు కింద పడితే కీళ్లు పట్టేస్తాయి. ఆ బాధ వర్ణనాతీతం. ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, మెడ నొప్పి, బ్యాక్ పెయిన్ వంటివి తరచుగా వేధిస్తుంటాయి. చేతిస్పర్శతోనే ఇలాంటి బాధల నుంచి ఉపశమనం కలిగించే వైద్యుడు.. ఫిజియోథెరపిస్ట్. ఈ తరహా వైద్యంపై గతంలో ప్రజల్లో అంతగా అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఒళ్లు నొప్పుల నుంచి విముక్తి కోసం సంబంధిత వైద్యులను ఆశ్రయించేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఫిజియోథెరపిస్ట్‌లకు అవకాశాలు మెరుగవుతున్నాయి. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంటే ఉద్యోగాలకు, ఉపాధి అవకాశాలకు ఢోకా లేకపోవడం యువతను ఆకర్షిస్తోంది.

నిపుణులకు అవకాశాలు పుష్కలం: ఫిజియోథెరపీ/ఫిజికల్ థెరపీ గతంలో కాళ్ల నొప్పులు, మెడ నొప్పులు వంటి వాటికే పరిమితం. వైద్య రంగంలో ప్రస్తుతం ఫిజియోథెరపిస్ట్‌ల పరిధి విస్తరించింది. దాదాపు అన్ని విభాగాల్లో వీరి సేవలు అవసరమవుతున్నాయి. ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, గైనకాలజీ, స్పోర్ట్స్ మెడిసిన్ వంటి వాటిలో వీరి భాగస్వామ్యం తప్పనిసరిగా మారింది. ఈ వైద్యులు ఉష్ణం, వ్యాక్స్, ఎలక్ట్రిసిటీ వంటివి ఉపయోగించి ఎక్సర్‌సైజ్‌లు, థెరపీల ద్వారా రోగులకు స్వస్థత చేకూర్చాల్సి ఉంటుంది. తగిన వ్యాయామాలను సూచించాలి. ఫిజియోథెరపిస్ట్‌లకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, రిహాబిలిటేషన్ సెంటర్లు, స్పెషల్ స్కూల్స్, ఫిట్‌నెస్ సెంటర్లు, స్పోర్ట్స్ అకాడమీలు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వేతర సంస్థల్లో కొలువులు ఉన్నాయి. తగిన అనుభవం, వనరులు అందుబాటులో ఉంటే సొంతంగా ఫిజియో థెరపీ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అనుకూలమైన పనివేళలు ఉండడం ఇందులోని సానుకూలాంశం.

కావాల్సిన నైపుణ్యాలు: రోగులకు సేవ చేయాలన్న దృక్పథం ఫిజియోథెరపిస్ట్‌లకు ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. చికిత్స ఫలించేదాకా ఓపిక, సహనంతో పనిచేయగలగాలి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ రంగంలో ప్రారంభంలో తక్కువ వేతనాలున్నా అనుభవం పెరిగేకొద్దీ సంపాదన కూడా పెరుగుతుంది. ఎప్పటికప్పుడు పనితీరును తప్పనిసరిగా మెరుగుపర్చుకోవాలి.

అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైన తర్వాత ఫిజియోథెరపీ/ఫిజికల్ థెరపీలో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులో చేరొచ్చు. తర్వాత పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సు కూడా పూర్తిచేస్తే కెరీర్ పరంగా మంచి అవకాశాలుంటాయి.

వేతనాలు: ఫిజియోథెరపిస్ట్‌కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభంలో నెలకు రూ.25 వేల వేతనం అందుతుంది. చీఫ్ ఫిజియోథెరపిస్ట్ స్థాయికి చేరుకుంటే నెలకు రూ.75 వేలు పొందొచ్చు. ప్రైవేట్ రంగంలో ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వేతనం లభిస్తుంది. అనుభవాన్ని బట్టి వేతనంలో పెరుగుదల ఉంటుంది. సొంతంగా ఫిజియోథెరపీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటే పనితీరును బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు.

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
  • ఉస్మానియా మెడికల్ కాలేజీ-హైదరాబాద్
    వెబ్‌సైట్:
    www.osmaniamedicalcollege.com
  • నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్)
    వెబ్‌సైట్:
    www.nims.edu.in
  • అపోలో కాలేజీ ఆఫ్ ఫిజియోథెరపీ-హైదరాబాద్
    వెబ్‌సైట్:
    www.apollocollegedurg.com
  • డెక్కన్ కాలేజీ ఆఫ్ మెడికల్ సెన్సైస్
    వెబ్‌సైట్:
    deccancollegeofmedicalsciences.com
  • పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండీకాప్డ్-న్యూఢిల్లీ
    వెబ్‌సైట్:
    www.iphnewdelhi.in
  • పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
    వెబ్‌సైట్:
    pgimer.edu.in/
Published date : 23 Sep 2014 01:11PM

Photo Stories