Skip to main content

బహుళ వ్యాధులను నయంచేసే.. ఆక్యుపేషనల్ థెరపిస్ట్

 

శిశువుల ఎదుగుదలలో లోపాలు, ఆటిజం, పెరాలిసిస్, మతిమరుపు, కీళ్ల నొప్పులు, కుంగుబాటు, పార్కిన్‌సన్స్, స్కిజోఫ్రెనియా, మహిళల్లో ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు మన దేశంలో సర్వసాధారణమయ్యాయి. వీటి చికిత్సపై జనంలో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. ఇలాంటి వ్యాధులను నయం చేసే ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌లకు డిమాండ్ క్రమంగా అధికమవుతోంది. రోగులను ఆరోగ్యవంతులుగా మార్చడంలో డాక్టర్లు, నర్సులు, ఫిజియో థెరపిస్ట్‌లతోపాటు ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. భారత్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌ల కంటే మరో 10 రెట్లు అవసరమని నిపుణులు అంటున్నారు. అందుకే ఈ రంగాన్ని కెరీర్‌గా మలచుకుంటే అవకాశాలకు కొరతే లేదని చెప్పొచ్చు. మరోవైపు మన దేశంలో శిక్షణ పొందిన ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌లకు విదేశాలు ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. భారీ వేతన ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి.
విదేశాల్లో కొలువుల స్వాగతం
ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌లకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులతోపాటు స్పోర్ట్స్, ఆక్యుపేషనల్ హెల్త్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో చివరి సంవత్సరంలో ఉండగానే కొలువు దక్కించుకోవచ్చు. భారత్‌లో ఈ కోర్సులు చదివిన 40 శాతం గ్రాడ్యుయేట్లు విదేశీ బాట పడుతున్నారు. అమెరికా, రష్యా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, మలేషియా, సింగపూర్‌తోపాటు మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. మన దేశంలో వేలాది మంది నిపుణులు అవసరం. ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌లు బోధనపై ఆసక్తి ఉంటే విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీగా పనిచేయొచ్చు. సొంతంగా క్లినిక్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రమాదాల బారిన పడి వికలాంగులుగా మారిన వారికి, సెరిబ్రల్ పాల్సీ, లెర్నింగ్ డిజాబిలిటీస్, బిహేవియరల్, ఎమోషనల్ ప్రాబ్లమ్స్, ఆర్థోపెడిక్, న్యూరోలాజికల్, సైకియాట్రిక్ వంటి శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నవారికి చికిత్స చేయాల్సి ఉంటుంది.

కావాల్సిన నైపుణ్యాలు: ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌కు సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ తప్పనిసరిగా ఉండాలి. మెరుగైన ఇంటర్ పర్సనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. అన్ని వయస్సుల రోగులకు వైద్య సేవలందించగలగాలి. చిన్న పిల్లలు, వయోవృద్ధులు, వికలాంగుల పట్ల సేవా దృక్పథం ముఖ్యం.

అర్హతలు: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి, నాలుగున్నరేళ్ల ఆక్యుపేషనల్ థెరపీబ్యాచిలర్స్ ప్రోగ్రామ్‌లో చేరొచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతతో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. అయితే, కెరీర్‌లో ఉన్నతంగా ఎదగడానికి ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌తో మాస్టర్స్ డిగ్రీ కోర్సు కూడా పూర్తిచేయడం మంచిది.

వేతనాలు: ఆరో వేతన సంఘం సిఫార్సుల అమలుతో ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌లకు వేతనాలు భారీగా పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభంలో నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు అందుకోవచ్చు. సీనియారిటీ ఆధారంగా జీతభత్యాలు పెరుగుతాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రారంభంలో నెలకు రూ.6 వేల నుంచి రూ.20 వేల వరకు పొందొచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటే నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదించుకోవచ్చు. రోగులకు అందిస్తున్న సేవల్లో నాణ్యతను బట్టి ఆదాయం లభిస్తుంది. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ డబ్బు ఆర్జించే అవకాశం ఇందులో ఉంది.

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:

 

 

  • పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్- న్యూఢిల్లీ;
    వెబ్‌సైట్:
    www.iphnewdelhi.in
  • జామియా హమ్‌దర్ద్;
    వెబ్‌సైట్: 
    www.jamiahamdard.edu
  • క్రిస్టియన్ మెడికల్ కాలేజీ-వెల్లూరు;
    వెబ్‌సైట్:
    www.cmch&vellore.edu
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్-కటక్
    వెబ్‌సైట్:
    nirtar.nic.in/
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఆర్థోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్-కోల్‌కతా
    వెబ్‌సైట్:
    www.niohkol.nic.in

 

Published date : 28 Oct 2021 11:09AM

Photo Stories