Skip to main content

ఆయుర్వేదం.. అద్భుత అవకాశాల వారధి..

మెడికల్‌కు ప్రత్యామ్నాయంగా డాక్టర్ వృత్తిని చేపట్టడానికి అవకాశం కల్పించే కోర్సులు ఎన్నో ఉన్నాయి.. వాటిల్లో ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షిస్తున్న విభాగం ఆయుర్వేదం.. పురాతన కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు కూడా తన ప్రాముఖ్యాన్ని చాటుకుంటున్న ఈ సంప్రదాయ భారతీయ వైద్య విధానానికి.. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించడంతోపాటు.. దీన్ని అనుసరించే వారి సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతోంది.. దాంతో ఆయుర్వేద కోర్సులను అభ్యసించడం ద్వారా డాక్టర్ కలను సాకారం చేసుకోవాలనుకునే ఔత్సాహికుల సంఖ్య అధికమవుతోంది.. త్వరలో నిర్వహించే మెడికల్ కౌన్సెలింగ్ నేపథ్యంలో ఆయుర్వేద కోర్సులు.. అవకాశాలపై ఫోకస్...

బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడికల్ అండ్ సర్జరీకి సంక్షిప్త రూపమే బీఏఎంఎస్. ఆయుర్వేదం.. భారతీయ సంప్రదాయ వైద్య విధానం. తరతరాలుగా భారతీయుల జీవన విధానంతో ఇది పెనవేసుకుని ఉంది. ప్రకృతిసిద్ధంగా లభించే మొక్కలు, ఆకులు, అలములతో వివిధ రోగాలను నయం చేసేదే ఆయుర్వేదం. మారుతున్న కాలానుగుణంగా కొంత టెక్నాలజీని జోడించి ఆయుర్వేదం కోర్సుగా రూపుదిద్దుకుంది. అలోపతి ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ ఆయుర్వేదానికి ఏ మాత్రం ప్రాధాన్యం తగ్గలేదు. వివిధ వ్యాధులకు శాశ్వత పరిష్కారం ఆయుర్వేదంలో లభిస్తుండటమే దీనికి కారణం. ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేకపోవడం, రసాయనాలతో కాకుండా ప్రకృతిసిద్ధంగా లభించే వనరులతో వైద్యం చేయడం.. అలోపతితో పోలిస్తే ఖర్చు కూడా తక్కువగా ఉండటం వల్ల సంప్రదాయ వైద్య విధానం వైపు మొగ్గు చూపేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ప్రత్యామ్నాయం:
ఎంబీబీఎస్, బీడీఎస్‌పై దృష్టిపెట్టి ఎంసెట్ మెడికల్ కౌన్సెలింగ్‌లో తమకు వచ్చిన ర్యాంకుకు సీటు లభించనివారు ఎంబీబీఎస్ సీటు కోసం మరో ఏడాది దీర్ఘకాల శిక్షణ తీసుకునేకంటే బీఏఎంఎస్ కోర్సులో చేరితే అద్భుత అవకాశాలను ఒడిసి పట్టొచ్చు. ఎందుకంటే నేడు ఓ మాదిరి పట్టణాల్లో సైతం ఆయుర్వేద కేంద్రాలు వెలుస్తున్నాయి. కేరళీయ ఆయుర్వేద స్పా సెంటర్లు, పంచకర్మ థెరపీ కేంద్రాలు వంటివి ఏర్పాటవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయుర్వేద కోర్సులు అభ్యసించిన విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలున్నాయి. ఎంసెట్‌లో 10,000 ర్యాంకు వచ్చినవారికి కూడా ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో సీటు లభించలేదంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతుంది.

అర్హతలు, ఎంపిక:
మన రాష్ర్టంలో ఈ కోర్సులో ప్రవేశించాలంటే ఇంటర్ బైపీసీలో ఉత్తీర్ణత సాధించి ఎంసెట్ మెడికల్ విభాగంలో ర్యాంకు సాధించాలి. కళాశాలల సంఖ్య కూడా తక్కువే. మన రాష్ట్రంలో మూడు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలు మాత్రమే ఉన్నాయి. అవి.. హైదరాబాద్, వరంగల్, విజయవాడలో ఉన్నాయి. సంగారెడ్డి, తిరుపతిలో ప్రైవేట్ కళాశాలలున్నాయి. తిరుపతిలో ఆయుర్వేద కళాశాలకు స్వయంప్రతిపత్తి హోదా ఉంది. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తుంది. విద్యార్థులు గవర్నమెంట్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. విద్యార్థులకు ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తారు.

కోర్సు స్వరూపం:
బీఏఎంఎస్ కోర్సు కాల వ్యవధి ఐదున్నర సంవత్సరాలు. కోర్సులో భాగంగా నాలుగున్నరేళ్లు ఆయుర్వేదానికి సంబంధించిన వివిధ సబ్జెక్టుల బోధన ఉంటుంది. ఆయుర్వేదానికి సంబంధించి వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. 18 నెలల కాలాన్ని ప్రొఫెషన్ గా పరిగణిస్తారు. ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఇందులో ఇంటర్నల్‌గా ఆయుర్వేద హాస్పిటల్‌లో ఆరు నెలలు ఇంటర్న్‌షిప్ చేస్తారు. మిగతా ఆరు నెలలు అలోపతి ఆస్పత్రిలో, నెలకొక హస్పిటల్‌లో ఒక్కో విభాగంలో పనిచేస్తూ, ఆ విభాగం పట్ల ప్రాథమిక అవగాహన పెంచుకునేలా ఇంటర్న్‌షిప్ ఉంటుంది.

మొదటి ప్రొఫెషన్:
మొదటి ప్రొఫెషన్‌లో... ఆయుర్వేదానికి సంబంధించిన ఫిలాసఫీ, చరిత్ర గురించి తెలుసుకుంటారు. పదార్థ విజ్ఞానం, ఆయుర్వేద దర్శన్, నిరూపణ, ద్రవ్య, గుణ, కర్మ విజ్ఞాన్ తదితర విషయాలుంటాయి. ఆయుర్వేద ఇతిహాసంలో పరీక్ష, ప్రమాణ, ప్రత్యక్ష పరీక్ష, అనుమాన్ పరీక్ష, యుక్తి పరీక్ష గురించి తెలుసుకుంటారు. క్రియ శరీర్(ఫిజియాలజీ), మోడ్రన్ ఫిజియాలజీ, ధాతు, ఉపధాతు, రక్త ధాతు, రసధాతు, అస్థి ధాతు, మేథా ధాతుల గురించి చెబుతారు. రచన శరీర్(అనాటమీ)లో మానవ శరీర నిర్మాణం గురించి బోధిస్తారు. సంధి శరీర, గర్భ శరీర, పరిభాష శరీర, ప్రమాణ శరీర, మౌలిక సిద్ధాంతం, అష్టాంగ హృదయ మొదలైనవాటికి సంబంధించి ప్రాథమిక సూత్రాలను నేర్పిస్తారు.

రెండో ప్రొఫెషన్:
రెండో ప్రొఫెషన్‌లో చరక సంహిత (పూర్వర్థ)కు సంబంధించి సూత్రస్థాన, నిదాన స్థాన, విమన స్థాన, శరీర్ స్థాన, ఇంద్రియస్థాన వంటి విషయాలుంటాయి. ఇందులో పరిచయంతోపాటు దినచర్య, రాత్రి చర్య, రీతుచర్య, సద్‌వ్రిట్టాలతోపాటు పార్ట్ బీలో ప్రజారోగ్యంలో భాగంగా డిజాస్టర్ మేనేజ్‌మెంట్, స్కూల్ హెల్త్ మేనేజ్‌మెంట్‌ల గురించి బోధిస్తారు. ద్రవ్య గుణ విజ్ఞాన్‌లో ద్రవ్య, రస, గుణ, విపక, విర్య, ప్రభవ, కర్మ తదితర అంశాలుంటాయి. రస శాస్త్ర అండ్ బాషాజ్య కల్పనలో మహారస, ఉప రస, సాధారణ రస, ధాతు, రత్న, సుధావర్గ, క్షార వర్గ మొదలైనవి. రోగ విజ్ఞాన్ ఇవం వికృతి విజ్ఞన్‌లో దోషదోషాది విజ్ఞాన, వ్యాధి విజ్ఞానం, నిదాన పంచకర్మ విజ్ఞానతోపాటు బేసిక్ పేథాలజీకి సంబంధించినవి ఉంటాయి. అగాథ తంత్ర విష చికిత్సలో ఇందులో విష ప్రభావానికి గల కారణాలు, విష లక్షణాలు తదితర అంశాలుంటాయి. పార్ట్‌బీలో ఫొరెన్సిక్ మెడిసిన్ గురించి, మెడికో లీగల్‌కు సంబంధించిన విషయాలను వివరిస్తారు.

మూడో ప్రొఫెషన్:
మూడో ప్రొఫెషన్‌లో చరక సంహిత (ఉత్తరార్థ)లో చికిత్స స్థాన, కల్పస్థాన, సిద్ధిస్థానలు గురించి వివరిస్తారు, కాయచికిత్స వివిధ రోగాలు- నివారణా చర్యలు గురించి, శల్యచికిత్సలో చెవి, ముక్కు, కన్నుకు సంబంధించి వచ్చే రోగాలు- చికిత్స గురించి ఉంటుంది. శల్యలో అగ్నికర్మ రక్తమోక్షన, మర్మ, త్రివిధ కర్మ, క్షార కర్మ, ప్రశాంత శల్య, కార్నియో సెలిబ్రెరల్ ఇన్‌జ్యూరిస్‌కు సంబంధించిన అంశాలుంటాయి. ప్రసూతిలో గైనకాలజీ గురించి, పంచకర్మలో స్నేహన, స్వేదన, వమన, విరేచన కర్మ, బస్తీ, నాశ్య, వ్యాయామోపచారకు సంబంధించిన అంశాలను వివరిస్తారు.

ఉన్నత విద్య:
బీఏఎంఎస్ అయిన తర్వాత పీజీ చేయొచ్చు. పీజీలో పంచకర్మ, కాయచికిత్స(జనరల్ మెడిసిన్), శల్య (సర్జరీ), షాలక్య(ఈ అండ్ టీ), ప్రసూతి (గైనిక్ అండ్ అబ్‌సెస్టిక్స్), ద్రవ్యగుణ (ఫార్మకాలజీ), రస శాస్త్ర (మెడిసిన్ ప్రిపరేషన్) వంటి కోర్సులున్నాయి. ఎంబీబీఎస్ చేసినవారు కూడా ఆయుర్వేదలో పీజీ చేసే అవకాశం ఉంది. కొన్ని దేశాల్లో ఈ కోర్సుకు అనుమతి ఉంది. కాకపోతే ఆయుర్వేద డాక్టర్‌గా కాకుండా మెడికల్ ప్రాక్టీషనర్ పేరుతో ఉంటుంది. కాబట్టి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంది.

కావాలిసిన స్కిల్స్:
బీఏఎంఎస్ విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు అదనంగా అన లిటికల్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఇందులో ఆయుర్వేదంలో ఉన్న వివిధ పద్ధతుల్ని రోగిపై ప్రయోగించాల్సి ఉంటుంది. ఎక్కువ సమయం కష్టపడాల్సి వస్తుంది. రోగి చెప్పిన విషయాల్ని అర్థం చేసుకొని, దానికి గల కారణాలను కనుక్కుని విశ్లేషించుకోవాలి. సేవ చేయాలనే దృక్పథంతోపాటు, సమాజం పట్ల అవగాహన ఉండాలి. చెప్పింది వినే ఓపిక ఉండాలి. ఇవన్నీ స్వతహాగా రావాలే తప్ప ఒకరు నేర్పిస్తే వచ్చే లక్షణాలు కావు. ఇవన్నీ ఉన్నప్పుడే హస్తవాసి గల ఆయుర్వేద డాక్టర్‌గా ఎదగగలరు.

కెరీర్:
ఆయుర్వేదంలో ఇటీవల కాలంలో అవకాశాలు మెరుగుపడుతున్నాయి. అలోపతి వైద్యం, కోర్సులు సునామీలాగా ముందుకు వచ్చినప్పటికీ సంప్రదాయ వైద్యానికి ఉన్న డిమాండ్ మాత్రం తగ్గలేదు. బీఏఎంఎస్ కోర్సు చేసిన తర్వాత ప్రభుత్వ ఆయుర్వేద డాక్టర్లుగా అవకాశాలు లభిస్తాయి. ఇప్పుడు ప్రభుత్వ డాక్టర్లకు బేసిక్ రూ.18 వేలు ఉంది. అంటే రూ. 30 వేల వరకు నెట్ వస్తుంది. సవరించిన వేతనాల ప్రకారం అయితే రూ. 40 వేల వరకు కూడా డ్రా చేయొచ్చు. అదే ప్రైవేట్ ఆయుర్వేద ఆస్పత్రుల్లో, హిమాలయ, డాబర్, జండు వంటి వివిధ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో, రీసెర్చ్ సంస్థలో రీసెర్చర్‌గా, టెక్నికల్‌స్టాఫ్‌గా అవకాశాలు లభిస్తాయి. వీరికి ప్రారంభవేతనం రూ. 25 వేలు నుంచి ప్రారంభం అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం (సీజీహెచ్‌ఎస్), ఈఎస్‌ఐ, సీసీఆర్‌ఏఎస్ వంటి సంస్థల్లో ఆయుర్వేద డాక్టర్లను యూపీఎస్‌సీ యూజీ, పీజీ విద్యార్థులతో భర్తీ చేస్తుంది. వీటిల్లో రూ. 50 వేలు నుంచి వేతనం ప్రారంభమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిధులతో నేషనల్ రూరల్ హెల్త్ మిషిన్ పేరుతో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న హాస్పిటల్స్‌లో ఆయుర్వేద విభాగాన్ని ఏర్పాటు చేసి డాక్టర్లకు అవకాశం కల్పిస్తున్నారు. లేదా సొంతంగా ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. స్పా సెంటర్లు, ఆయుర్వేద క్లినిక్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. హెల్త్ సెంటర్స్, ఆయుర్వేద ఉత్పత్తులను తయారుచేసే కంపెనీలు, హాస్పిటల్స్, మెడికల్ టూరిజం, పంచకర్మ (మసాజ్) సెంటర్స్‌లో ఆయుర్వేదిక్ సూపర్ వైజర్స్, కన్సల్టెంట్, మెడికల్ ఆఫీసర్, న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్, ఫిజిషియన్, ప్రొడెక్షన్ మేనేజర్, రీసెర్చర్, సర్జన్ , థెరపిస్ట్, ఆయుర్వేద కళాశాలల్లో అధ్యాపకులుగా అవకాశాలను పొందవచ్చు.

జాతీయ స్థాయిలో ప్రముఖ విద్యా సంస్థలు:
- బెనారస్ హిందూ యూనివర్సిటీ- వారణాసి
వివరాలకు: www.bhu.ac.in

- తమిళనాడు ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ- చెన్నై
వివరాలకు: https://web.tnmgrmu.ac.in

- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద- జైపూర్
వివరాలకు: https://nia.nic.in

- గుజరాత్ ఆయుర్వేద యూనివర్సిటీ- జామ్‌నగర్
వివరాలకు: www.ayurveduniversity.com

- డాక్టర్ డీవై పాటిల్ యూనివర్సిటీ- నవీ ముంబై
వివరాలకు: https://dypatil.in

- యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ- ఢిల్లీ
వివరాలకు: www.du.ac.in

రాష్ట్రంలో ఉన్న కళాశాలలు- సీట్లు
- బీఆర్‌కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల- హైదరాబాద్: 50 సీట్లు
- శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల- తిరుపతి: 40
- అనంత లక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల- వరంగల్: 50
- డాక్టర్ ఎన్‌ఆర్ శాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల- విజయవాడ: 30
అర్హత: ఇంటర్మీడియెట్ (బైపీసీ).

ప్రవేశం:
ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
Published date : 10 Sep 2013 12:31PM

Photo Stories