అవకాశాల వేదిక... ఆప్టోమెట్రీ
హెల్త్‌కేర్ రంగంలో విస్తృత అవకాశాలు కల్పిస్తున్న మరో రంగం ఆప్టోమెట్రీ. కళ్లలో ఏర్పడే సమస్యలను గుర్తించడం, సంబంధిత పరీక్షలను నిర్వహించడం, చికిత్సను సూచించడం వంటి అంశాలు ఉన్న శాస్త్రమే ఆప్టోమెట్రీ. కంటి ఆసుపత్రుల్లో నేత్ర వైద్యులకు అనుబంధంగా సేవలు అందించటంలో ఆప్టోమెట్రీషియన్ల పాత్ర ఎంతో కీలకం. ఇటీవలి కాలంలో ఈ కోర్సుకు చాలా డిమాండ్ ఏర్పడింది. అవసరాలకు సరిపడా ఆప్టోమెట్రీషియన్లు లేకపోవడంతో ఈ కోర్సు పూర్తయిన వెంటనే జాబ్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆప్టోమెట్రీ కోర్సుపై కెరీర్ గెడైన్స్..
అప్టోమెట్రీకి సంబంధించి పలు డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను పూర్తి చేయడం ద్వారా ఆప్టోమెట్రీషియన్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. వీరు కంటి ఆసుపత్రుల్లో నేత్ర వైద్యులకు అనుబంధంగా సేవలు అందించటంలో కీలక పాత్ర వహిస్తారు. తర్వాత పీజీ కోర్సులను చేయడం ద్వారా డాక్టర్‌కు సమానమైన స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.
అవకాశాలు:
ఒక్క భారతదేశంలోనే దాదాపు కోటిమందికి అంధత్వమున్నట్లు అంచనా. వీటిలో దాదాపు 80 శాతం అంధత్వ సమస్యలను శిక్షణ పొందిన నిపుణుల సేవలు, ప్రాథమిక వసతులు కల్పించడం ద్వారా ప్రారంభ స్థాయిలోనే నివారించవచ్చు. ఈ నేపథ్యంలో ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ సేవలు ఎంతో కీలకమైనవి. కాబట్టి ఆప్టోమెట్రీ రంగంలో కోర్సులు పూర్తి చేసిన వారికి వెంటనే ఉపాధి ఖాయమని చెప్పొచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. తర్వాత అర్హత, అనుభవం ఆధారంగా సొంతంగా క్లినిక్ ప్రారంభించుకోవచ్చు. సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీగా కూడా స్థిరపడొచ్చు. ఐ హాస్పిటల్స్, ఐ బ్యాంక్స్, కాంటాక్ట్ లెన్స్-ఆఫ్తాల్మిక్ పరిశ్రమలు, ఆప్టీషియన్ షో రూమ్స్, ఐ-కేర్ సంబంధిత ప్రొడక్ట్స్‌ను తయారు చేసే సంస్థలు వీరికి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి.
వేతనాలు:
కెరీర్ ప్రారంభంలో సంబంధిత ఫిజీషియన్స్, ఇన్‌స్టిట్యూట్, క్లినిక్స్‌ల్లో అసిస్టెంట్‌గా పని చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో వీరికి నెలకు రూ. 8 వేల నుంచి రూ. 15 వేల వరకు లభిస్తుంది. తర్వాత ఈ రంగంలోని ఉన్నత విద్య పూర్తి చేయడం ద్వారా డాక్టర్‌కు సమానమైన స్థాయి వస్తుంది. ఈ సమయంలో నెలకు రూ. 30 వేల నుంచి రూ. 60 వేల వరకు సంపాదించవచ్చు.
కోర్సులు- వివరాలు:
మన రాష్ట్రంలో ఆప్టోమెట్రీకి సంబంధించి డిప్లొమా, బ్యాచిలర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా విభాగంలో రెండు రకాల కోర్సులు ఉన్నాయి. అవి..డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్.
డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నీషియన్: ఆప్టోమెట్రీకి సంబంధించిన ప్రాథమిక కోర్సు ఇది. ఈ కోర్సును రాష్ట్రంలో దాదాపు ఆరు ఇన్‌స్టిట్యూట్‌లను ఆఫర్ చేస్తున్నాయి.
అర్హత: పదో తరగతి
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
డిప్లొమా ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్: ఈ కోర్సును రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 కాలేజీలు ఆఫర్ చేస్తున్నాయి.
అర్హత: ఇంటర్మీడియెట్ (సెన్సైస్)
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
ప్రవేశం: ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ఈ డిప్లొమా కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సాధారణంగా మే/జూన్/జూలై నెలలో వెలువడుతుంది.
వివరాలకు: https://dme.ap.nic.in, www.appmb.org
రాష్ట్రంలోని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు:
ఉస్మానియా మెడికల్ కాలేజ్-హైదరాబాద్
గాంధీ మెడికల్ కాలేజ్-హైదరాబాద్
సరోజినీ దేవి ఐ హాస్పిటల్-హైదరాబాద్
ఆంధ్రా మెడికల్ కాలేజ్-విశాఖపట్నం
ఎస్వీ మెడికల్ కాలేజ్-తిరుపతి
సిదార్థ మెడికల్ కాలేజ్-విజయవాడ
రిమ్స్-కడప
కాకతీయ మెడికల్ కాలేజ్-వరంగల్.
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఆప్టోమెట్రీ:
మన రాష్ట్రంలో ఆప్టోమెట్రీలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సును బిట్స్-పిలానీ క్యాంపస్ మాత్రమే ఆఫర్ చేస్తుంది. ఈ బ్యాచిలర్ డిగ్రీ కోర్సును కోర్సును బిట్స్-పిలానీ (ఆఫ్ క్యాంపస్ ప్రోగ్రాం మోడ్‌లో) అందజేస్తోంది. కోర్సు వ్యవధి-నాలుగేళ్లు. ఇందులో క్లాస్ రూం బోధన, లేబొరేటరీ వర్క్, క్లినికల్ ట్రైనింగ్, ఇంట్నర్‌షిప్ ఉంటాయి. క్లాస్, లాబొరేటరీ వర్క్‌లను బాస్క్ అండ్ లాంబ్ స్కూల్ ఆఫ్ ఆప్టోమెట్రీ-కిస్మత్‌పూర్ (రంగారెడ్డి జిల్లా)లో నిర్వహిస్తారు. క్లినికల్ ట్రైనింగ్, ఇంట్నర్‌షిప్‌ను ఎల్వీప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ (హైదరాబాద్)లో చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సాధారణంగా మే/జూన్ నెలలో వెలువడుతుంది.
అర్హత: 10+2 లేదా తత్సమానం (ఫిజిక్స్,కెమిస్ట్రీ,మ్యాథ్స్/బయాలజీలతో పాటు ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉండాలి).
వివరాలకు: https://lvpei.org/education/educationlvpei/optometry.html
ఉన్నత విద్య:
ఆప్టోమెట్రీలో బ్యాచిలర్ కోర్సు తర్వాత పీజీ చేయవచ్చు. ఈ కోర్సును మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీ(ఎం.ఆప్ట్)గా వ్యవహరిస్తారు. కోర్సు కాల వ్యవధి: రెండేళ్లు. కానీ ఈ కోర్సును దేశ వ్యాప్తంగా ఆఫర్ చేసే ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్య చాలా స్వల్పం.
ఎం.ఆప్ట్ కోర్సును ఆఫర్ చేస్తున్న ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు:
భారతీవిద్యాపీఠ్-పుణే
వివరాలకు: https://www.bharatividyapeeth.edu
లోటస్ కాలేజ్ ఆఫ్ ఆప్టోమెట్రీ-ముంబై.
వివరాలకు: https://www.optomeyeinstitute.org
జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లు:
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)-న్యూఢిలీ:
ఎయిమ్స్ బీఎస్సీ(ఆనర్స్-ఆఫ్తాల్మిక్ టెక్నిక్స్) కోర్సును ఆఫర్ చేస్తుంది. అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/మ్యాథమెటిక్స్). జాతీయ స్థాయిలో నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. అబ్జెక్టివ్ పద్ధతిలో ఉండే రాత పరీక్షకు 100 మార్కులు కేటాయించారు. కాల వ్యవధి: రెండు గంటలు. ఇందులో ఫిజిక్స్(30 మార్కులు), కెమిస్ట్రీ(30 మార్కులు), బయాలజీ(30 మార్కులు), జనరల్ నాలెడ్జ్(10 మార్కులు) విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. సంబంధిత నోటిఫికేషన్ మార్చి/ఏప్రిల్‌లో వెలువడుతుంది. జూన్‌లో రాత పరీక్ష ఉంటుంది.
వివరాలకు: www.aiims.edu
భారతీ విద్యాపీఠ్-పుణే
ఈ ఇన్‌స్టిట్యూట్ బ్యాచిలర్ ఆఫ్ క్లినికల్ ఆప్టోమెట్రీ (బి.ఆప్ట్) కోర్సును ఆఫర్ చేస్తుంది. అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/మ్యాథమెటిక్స్). ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. కోర్సు కాల వ్యవధి: నాలుగేళ్లు. సంబంధిత నోటిఫికేషన్ మార్చి/ఏప్రిల్‌లో వెలువడుతుంది. జూన్‌లో రాత పరీక్ష ఉంటుంది.
వివరాలకు: https://www.bharatividyapeeth.edu
మణిపాల్ యూనివర్సిటీ-మణిపాల్ కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సెన్సైస్
ఈ ఇన్‌స్టిట్యూట్ బ్యాచిలర్ ఆఫ్ క్లినికల్ ఆప్టోమెట్రీ(బి.ఆప్ట్) కోర్సును ఆఫర్ చేస్తుంది. అర్హత: ఇంటర్మీడియెట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/మ్యాథమెటిక్స్). అర్హత కోర్సులో సాధించిన మెరిట్ ఆధారంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. కోర్సు కాల వ్యవధి: నాలుగేళ్లు. సంబంధిత నోటిఫికేషన్ మార్చి/ఏప్రిల్‌లో వెలువడుతుంది.
వివరాలకు: https://www.manipal.edu
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో):
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)...ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్తాల్మిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ సహకారంతో బీఎస్సీ (ఆనర్స్) ఇన్ ఆప్టోమెట్రీ అండ్ ఆఫ్తాల్మిక్ టెక్నిక్స్ కోర్సును నిర్వహిస్తుంది. అర్హత: అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ). ప్రతి ఏడాది జూన్ నుంచి అకడెమిక్ సెషన్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం డిసెంబర్ నుంచి మే 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హత కోర్సులో సాధించిన మార్కులు (90 శాతం వెయిటేజీ), ఇంటర్వ్యూ (10 శాతం వెయిటేజీ) ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. థియరీ క్లాసులను ఇగ్నో నిర్వహిస్తుంది. ప్రాక్టికల్స్ మాత్రం సంబంధిత ఐ హాస్పిటల్స్/ఐ రీసెర్చ్ సెంటర్స్/ ఐ ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఉంటాయి.
వివరాలకు: https://prog_details.ignou.ac.in