Skip to main content

సుస్థిర కెరీర్‌కు వేదికగా..పాత్రికేయం

పాత్రికేయం.. ప్రజా సమస్యలపై పోరాడే పాశుపతాస్త్రం. సమాజ హితాన్ని కాంక్షిస్తూ అక్షరాలతో అందరినీ ఆలోచింపజేసే అరుదైన అవకాశం జర్నలిజం ద్వారా మాత్రమే లభిస్తుంది.
వ్యక్తిగత వికాసానికే కాకుండా పది మంది పురోగతికి ఉపయోగపడాలన్న తపన ఉన్నవారికి జర్నలిజం సరైన కెరీర్ ఆప్షన్.

దేశంలో మీడియా రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ రంగంలో పెట్టుబడులు పెరగడంతో అనేక కొత్త సంస్థలు ఏర్పాటవుతున్నాయి. పత్రికలు, చానళ్లు, ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్ వెలుస్తున్నాయి. ముఖ్యంగా 24 గంటల వార్తా చానళ్ల సంఖ్య అధికమవుతోంది. వీటికి తోడు స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, పీసీల వాడకం కూడా ఎక్కువ కావడంతో టైర్-2, టైర్-3 నగరాల్లో డిజిటల్ కంటెంట్ వినియోగం అధికమైంది. దీంతో ఆన్‌లైన్ జర్నలిజం సరికొత్త ఉద్యోగాలకు ద్వారాలు తెరుస్తోంది.

పెరుగుతున్న ప్రాధాన్యం :
నిత్యం కొత్తదనానికి అవకాశం ఉండటం, సరిపడ వేతనాలతోపాటు సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుండటంతో జర్నలిజం వైపు అడుగులు వేసే వారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. ఈ క్రమంలో విశ్వవిద్యాలయాలు సైతం వివిధ రకాల జర్నలిజం కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. దేశంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో డిప్లొమా, పీజీ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్, పరిశోధన స్థాయి కోర్సులను అందిస్తున్నాయి.

జర్నలిజం- కరిక్యులం :
 • జర్నలిజం కోర్సు కరిక్యులంను తరగతి గది పాఠాలు, క్షేత్రస్థాయి ప్రాక్టికల్ వర్క్, గెస్ట్ లెక్చర్స్, ఇంటర్న్‌షిప్‌ల సమ్మేళనంగా రూపొందిస్తున్నారు.
 • జాతీయాలు, సామెతలు, నుడికారాలు, సరళ వాక్యాలు, సంక్లిష్టత లేని సమగ్రమైన, స్పష్టమైన రచన.
 • జర్నలిజం-ప్రాథమికాంశాలు, లోతైన అవగాహన; సమాజానికి వార్తల అవసరం.
 • రిపోర్టింగ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమాచారాన్ని ఇతరుల నుంచి రాబట్టే నేర్పు.
 • సేకరించిన సమాచారాన్ని వార్తలా లేదా కథనంలా రాయగలిగే నేర్పు- వివిధ వర్గాలు, వనరుల నుంచి వార్తల సేకరణ ఎలా?
 • రిపోర్టర్లు రాసిన వార్తల్లో అక్షర, అన్వయ, విషయ దోషాలుంటే వాటిని పరిహరించి తిరగరాయడం, అవసరమైన మేరకు వార్తను కుదించడం (ఎడిటింగ్).
 • జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమిక అంశాలు.
 • రోజువారీ పరిణామాలపై సొంత అభిప్రాయ వ్యక్తీకరణ.

సొంత జర్నలిజం కోర్సులు :

ప్రస్తుత సాంకేతిక ప్రపంచం ఒక గ్లోబల్ గ్రామంగా మారిన పరిస్థితుల్లో కచ్చితత్వంతో పాటు వేగం కూడా అత్యవసరమైంది. దీంతో మీడియా రంగంలో తీవ్ర పోటీ వాతావరణం నెలకొంది. సమర్థవంతమైన, సుశిక్షితులైన మానవ వనరుల కోసం పత్రికలు, చానళ్ల యాజమాన్యాలు సొంతంగా జర్నలిజం స్కూళ్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పత్రికలన్నీ ఈ తరహా జర్నలిజం శిక్షణ కేంద్రాలను నడుపుతూ తమకు అవసరమైన సిబ్బందిని నియమించుకుంటున్నాయి.
 • రాత పరీక్ష, బృంద చర్చ, ఇంటర్వ్యూల్లో ప్రతిభ కనబరిచిన వారికి పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సులో ప్రవేశం కల్పిస్తున్నాయి. జర్నలిజం స్కూళ్లలో ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఈ కాలంలో భాషా నైపుణ్యాలు, వర్తమాన వ్యవహారాలు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, రిపోర్టింగ్, ఎడిటింగ్ వంటి అంశాలపై అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు.

ఉద్యోగ అవకాశాలు..
 • జర్నలిజం కోర్సులు పూర్తిచేసిన వారికి పత్రికలు, చానెళ్లలో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్/కాపీ ఎడిటర్‌గా ఉద్యోగాలు లభిస్తాయి. రిపోర్టర్.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పనిచేసే ప్రాంతంలో రోజూ జరిగే కీలక పరిణామాలను గమనిస్తూ కథనాలు, వార్తలను రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
 • సబ్‌ఎడిటర్/కాపీ ఎడిటర్.. రిపోర్టర్లు తీసుకొచ్చిన వార్తలను తీర్చిదిద్దుతారు. వార్తా సంస్థలు అందించే ఇంగ్లిష్ వార్తలను స్థానిక భాషలోకి అనువదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ వార్తలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం జరుగుతుంది.

అవసరమైన నైపుణ్యాలు..

1. సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, చొరవ, కష్టపడే తత్వం.
2. రోజువారీ లక్ష్యాలు, వాటి సాధనకు వ్యూహ రచన సామర్థ్యం.
3. కమ్యూనికేషన్ స్కిల్స్ (లిజనింగ్, రైటింగ్, స్పీకింగ్..).
4. ఆత్మవిశ్వాసం, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం.
5. భాష, స్వేచ్ఛానువాద నైపుణ్యం.
Published date : 10 Apr 2018 01:59PM

Photo Stories