Skip to main content

Career Guidance: సరికొత్త కెరీర్ మార్గంగా డిజిటల్ జర్నలిజం.. ప్రారంభంలో రూ.20 వేల వేత‌నం..

జర్నలిజం లేదా పాత్రికేయ రంగం అంటే.. వార్తలను ప్రజలకు చేరవేయడం.. పాఠకులకు నచ్చే రీతిలో కథనాలు రాయడం.. క్షేత్ర స్థాయి పరిశోధనలు చేసి మరీ.. ప్రత్యేక కథనాలు రాయడం.. వాటి ద్వారా సంబంధిత సమస్యలకు పరిష్కారం లభించేలా చూడటం!! అందుకే.. దిన పత్రికలను చదవడం ప్రజల జీవితంలో ముఖ్య భాగమైంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పాత్రికేయ రంగం.. ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీ వినియోగంతో మీడియా రంగం డిజిటల్‌ రూపు సంతరించుకుంటోంది. దీంతో.. ఇటీవల కాలంలో డిజిటల్‌ జర్నలిస్ట్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. డిజిటల్‌ జర్నలిజం అంటే ఏమిటి.. డిజిటల్‌ జర్నలిస్ట్‌లుగా కెరీర్‌ ప్రారంభించేందుకు అర్హతలు, నైపుణ్యాలు, డిజిటల్‌ మీడియాలో లభించే ఇతర కొలువులు తదితర అంశాలపై విశ్లేషణ..
Digital Journalism: Qualifications, Skills, Journalist, Jobs, Employment, Career Opportunities
Digital Journalism: Qualifications, Skills, Journalist, Jobs, Employment, Career Opportunities
  • మీడియా రంగంలో డిజిటల్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం
  • డిజిటల్‌ జర్నలిస్ట్‌లకు, ఇతర టెక్నికల్‌ కొలువులకు డిమాండ్‌
  • నైపుణ్యాలు, టెక్నాలజీతో కెరీర్‌ ఖాయం అంటున్న నిపుణులు

డిజిటల్‌ జర్నలిజం.. క్లుప్తంగా చెప్పాలంటే.. మనకు అందుబాటులో ఉన్న సాంకేతికత లేదా ఆన్‌లైన్‌ మార్గాల ద్వారా వార్తలను పాఠకులకు చేరవేయడం. ట్విటర్, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియానే కాకుండా.. ఆయా మీడియా సంస్థలకున్న ఆన్‌లైన్‌ వేదికల్లో ఒక వార్తను క్షణాల్లో చేరవేసేలా చేయగలిగేదే డిజిటల్‌ జర్నలిజంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం డిజిటల్‌ జర్నలిజానికి ప్రాధాన్యం పెరుగుతోంది. అరచేతిలోనే సమస్త సమాచారం తెలుసుకునే అవకాశం కల్పిస్తున్న స్మార్ట్‌ ఫోన్లు డిజిటల్‌ రంగంలో కీలకంగా మారుతున్నాయి. దీంతోపాటు పాఠకుల అభిరుచిలోనూ మార్పు రావడం కూడా డిజిటల్‌ జర్నలిజానికి ఊతం ఇస్తోంది.

డిజిటల్‌ మీడియా విభాగం
మారుతున్న పరిస్థితుల్లో పాఠకుల అవసరాలకు అనుగుణంగా మీడియా సంస్థలు డిజిటల్‌ విభాగాలను ప్రత్యేకంగా నెలకొల్పుతూ.. పాఠకులకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. అందుకోసం మొబైల్‌ యాప్స్, తమ సంస్థల అధికారిక సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ద్వారా అనుక్షణం తాజా వార్తలను అందించేందుకు కృషి చేస్తున్నాయి. అంతేకాకుండా లేటెస్ట్‌ న్యూస్‌కు సంబంధించిన అలర్ట్స్‌ను సైతం పంపించే విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో పాఠకులు డిజిటల్‌ మీడియా ద్వారా.. ఒక సంఘటనకు సంబంధించిన తాజా సమాచారాన్ని అప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. దాని పూర్వాపరాలు, విశ్లేషణాత్మక కథనాల కోసం మాత్రం మరుసటి రోజు వచ్చే దిన పత్రికలపై ఆధార పడుతున్నారు. 

డిజిటల్‌ జర్నలిస్ట్‌
డిజిటల్‌ మీడియాకు ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో.. డిజిటల్‌ జర్నలిస్ట్‌గా రాణించేందుకు పలు అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. 2022 చివరి నాటికి డిజిటల్‌ మీడియా విభాగంలో దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు లభించనున్నాయని అంచనా. వీటిలో జర్నలిస్ట్‌ హోదాలోనే 30 నుంచి 40 శాతం కొలువులు ఉంటాయని ఆయా సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 

మరెన్నో కొలువులు
జర్నలిజం అనగానే మనకు గుర్తొచ్చేది విలేకరులు(జర్నలిస్ట్‌) అనేది నిస్సందేహం. అలాగే డిజిటల్‌ జర్నలిజంలో కూడా క్షేత్ర స్థాయిలో వార్తల సేకరణ చేసేది రిపోర్టర్లే. వీటితోపాటు డిజిటల్‌ జర్నలిజంలో మరెన్నో కొలువులు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కంటెంట్‌/కాపీ ఎడిటర్, కంటెంట్‌ రైటర్, క్రియేటివ్‌ రైటర్, కంటెంట్‌ క్రియేటర్స్, ఎస్‌ఈఓ స్పెషలిస్ట్, సోషల్‌ మీడియా స్ట్రాటజిస్ట్, వెబ్‌ డెవలపర్స్‌ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. 

కంటెంట్‌/కాపీ ఎడిటర్‌
క్షేత్ర స్థాయి నుంచి రిపోర్టర్లు పంపించే సమాచారాన్ని పరిశీలించి.. దానికి మెరుగులు దిద్ది.. పాఠకులను ఆకట్టుకునే రీతిలో కూర్చడం కంటెంట్‌ ఎడిటర్‌ లేదా కాపీ ఎడిటర్‌ విధులు. ఈ కొలువు కోరుకునే వారికి ఆన్‌లైన్‌ నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. వీరికి ప్రారంభంలో రూ.20 వేల వరకూ వేతనం లభిస్తోంది. 

కంటెంట్‌ రైటర్‌
రిపోర్టర్లు పంపించే వార్తలు ఎడిటింగ్‌ చేసి ప్రచురించడమే కాకుండా.. విశ్లేషణాత్మక కథనాలను కూడా డిజిటల్‌ న్యూస్‌ పోర్టల్స్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. ఈ సందర్భాల్లోనే కంటెంట్‌ రైటర్లు కీలకంగా మారుతున్నారు. ఏదైనా ఒక అంశంపై లోతుగా విశ్లేషణ చేసి..దాన్ని కథనంగా మలచడం కంటెంట్‌ రైటర్స్‌ విధులు. రాయగలిగే నేర్పుతోపాటు ఆయా రంగాలకు సంబంధించిన తాజా పరిణామాలు, నేపథ్యం వంటి వాటిపైనా వీరికి అవగాహన అవసరం. 

క్రియేటివ్‌ రైటర్స్‌
డిజిటల్‌ మీడియా ద్వారా వార్తలను చేరవేస్తున్న సంస్థలు.. పాఠకులను ఆకట్టుకునేందుకు వినూత్న కథనాలు అందించాలని భావిస్తున్నాయి. సైన్స్, టెక్నాలజీ, టెక్‌–ట్రెండ్స్‌.. ఇలా పలు రంగాలకు సంబంధించి తమదైన శైలిలో కథనాల ప్రచురణకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఆయా రంగాలపై అవగాహనతోపాటు రైటింగ్‌ స్కిల్స్‌ ఉన్న వారిని కంటెంట్‌ రైటర్స్‌గా నియమించుకుంటున్నాయి. 

కంటెంట్‌ క్రియేటర్స్‌
డిజిటల్‌ మీడియాలో కీలకమైన హోదాగా కంటెంట్‌ క్రియేటర్స్‌ను పేర్కొనొచ్చు. పాఠకుల అభిరుచులు, ఆసక్తులను పరిగణనలోకి తీసుకుంటూ.. వారిని ఆకట్టుకునేందుకు నిరంతరం కొత్త కథనాలను అందించాల్సి వస్తోంది. ఏ అంశంపై కథనం ప్రచురిస్తే బాగుంటుంది.. ఏ అంశానికి వ్యూయర్‌షిప్‌ లభిస్తుంది.. వంటి అంశాలను విశ్లేషించి.. కంటెంట్‌కు సంబంధించి ఐడియాను జనరేట్‌ చేయడం, ఆ తర్వాత దానికి తగిన రీతిలో కథనాలు రాసేలా కంటెంట్‌ రైటర్స్‌కు, డిజిటల్‌ జర్నలిస్ట్‌లకు సలహాలు ఇవ్వడం వంటి విధులు వీరు నిర్వర్తించాల్సి ఉంటుంది. 

ఎస్‌ఈఓ స్పెషలిస్ట్‌
డిజిటల్‌ జర్నలిజంలో కథనాలు,వార్తలు అందించడమే కాకుండా.. వాటికి వ్యూస్‌ పెరిగేలా చేయడం కూడా ఎంతో ప్రధానం. దాని ఆధారంగా సదరు డిజిటల్‌ మీడియా సంస్థలకు మార్కెట్‌లో మనుగడ ఉంటుంది. అందుకోసం సదరు వెబ్‌సైట్స్, బ్లాగ్స్‌కు ఆదరణ లభించాలంటే.. సెర్చ్‌ ఇంజన్‌లో తొలి రెండు, మూడు పేజీల్లో కనిపించాలి. ఈ సందర్భంలోనే ఎస్‌ఈఓ(సెర్చ్‌ ఇంజన్‌ ఆప్టిమైజేషన్‌) స్పెషలిస్ట్‌ హోదా కీలకంగా మారుతోంది. ఒక వార్తకు సంబంధించి కీ వర్డ్స్‌ను, ట్యాగ్స్‌ను విభిన్నంగా రాసి.. సదరు వార్తను సెర్చ్‌ చేసే క్రమంలో ముందంజలో నిలిపేలా చేయడం ఎస్‌ఈఓ స్పెషలిస్ట్‌ విధులుగా చెప్పొచ్చు.

సోషల్‌ మీడియా స్ట్రాటజిస్ట్‌
డిజిటల్‌ మీడియాలో.. మరో ముఖ్యమైన జాబ్‌ ప్రొఫైల్‌.. సోషల్‌ మీడియా స్ట్రాటజిస్ట్‌. సదరు సంస్థ అందించే వార్తలను, సమాచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా అందరికీ అందుబాటులో ఉంచడమే కాకుండా.. ఆ సమాచారాన్ని ఆకట్టుకునే రీతిలో రూపొందించేలా చూడటం సోషల్‌ మీడియా స్ట్రాటజిస్ట్‌ ప్రధాన విధి. సమాచారంలో కనిపించే ఆకర్షణను బట్టే సదరు వెబ్‌సైట్‌ వ్యూయర్స్‌ సంఖ్య పెరుగుతుంది. ఈ ఉద్యోగానికి బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు సోషల్‌ మీడియా మార్కెటింగ్‌లో నైపుణ్యం, ముఖ్యంగా క్రియేటివ్‌ రైటింగ్‌ ఎబిలిటీస్‌ ఉండాలి.

వెబ్‌ డెవలపర్స్‌
డిజిటల్‌ జర్నలిజంలో సాంకేతిక కొలువుగా వెబ్‌ డెవలపర్స్‌ను పేర్కొనొచ్చు. న్యూస్‌ వెబ్‌సైట్స్‌ లేదా యాప్స్‌ను వీక్షకులను ఆకట్టుకునే రీతిలో రూపొందించడం, సంస్థల్లో వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా వెబ్‌ డెవలప్‌మెంట్‌ చేయడం వీరి ప్రధాన విధి. ఈ ఉద్యోగాలకు టెక్నికల్‌ నైపుణ్యాలతోపాటు వెబ్‌ డెవలప్‌మెంట్‌లో సర్టిఫికేషన్‌ ఉన్న వారికి ప్రాధాన్యం లభిస్తోంది. సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన నెలకు రూ.20వేల వరకు వేతనం పొందొచ్చు. ఫ్రీలాన్సింగ్‌ విధానంలోనూ పని చేసే అవకాశం ఉంది.

రాణించాలంటే
డిజిటల్‌ జర్నలిస్ట్‌గా రాణించాలంటే.. అభ్యర్థులకు డిజిటల్‌ నైపుణ్యాలు ఎంతో కీలకం. వార్తలు రాసే నైపుణ్యమే కాకుండా.. ఆడియో, వీడియో క్లిప్స్‌ సేకరించడం.. వాటిని సంబంధిత సంస్థలకు ఆన్‌లైన్‌ విధానంలో అందించే నేర్పు అవసరం. అంతేకాకుండా సదరు సమాచారం, దాని ఉద్దేశం, కారణాలను విశ్లేషిస్తూ.. క్లుప్తంగా రాసే నైపుణ్యం ఉండాలి. అదేవిధంగా యాప్స్, ఇతర సోషల్‌ మీడియాలను వినియోగించే స్కిల్స్‌ తప్పనిసరి.

టెక్‌ స్కిల్స్‌
డిజిటల్‌ జర్నలిజం విభాగంలో కెరీర్‌ ప్రారంభించాలనుకునే కొన్ని సాంకేతిక నైపుణ్యాలు అవసరం. అవి.. కంప్యూటర్‌ లాంగ్వేజ్‌ స్కిల్స్, కంటెంట్‌ రైటింగ్, గ్రాఫిక్‌ డిజైనింగ్, హెచ్‌టీఎంఎల్‌ టెక్నాలజీలపై అవగాహన, విజువలైజేషన్‌ టెక్నిక్స్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, లాంగ్వేజ్‌ స్కిల్స్‌ ఉండాలి. 

అకడమిక్‌ మార్గాలు

  • డిజిటల్‌ జర్నలిజంలో కెరీర్‌ కోరుకునే వారికి సంబంధిత నైపుణ్యాలు అందించే కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. బ్యాచిలర్, పీజీ స్థాయిలో డిజిటల్‌ మీడియా స్పెషలైజేషన్‌ కోర్సులు చదివే అవకాశం ఉంది. 
  • ఏపీజే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌: పీజీ డిప్లొమా ఇన్‌ డిజిటల్‌ మీడియా అండ్‌ ఆన్‌లైన్‌ జర్నలిజం.
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ న్యూ మీడియా: పీజీ డిప్లొమా ఇన్‌ మల్టీ మీడియా జర్నలిజం.
  • మణిపాల్‌ యూనివర్సిటీ: గ్రాఫిక్స్‌ అండ్‌ డిజిటల్‌ మీడియలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ కోర్సు.
  • సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌: పీజీ డిప్లొమా ఇన్‌ డిజిటల్‌ మీడియా.
  • వీటితోపాటు పలు ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

డిజిటల్‌ జర్నలిజం ప్రత్యేకతలు

  • 24“7 వార్తలు వీక్షించే అవకాశం.
  • స్మార్ట్‌ఫోన్‌తోనే సమస్త సమాచారం తెలుసుకోవచ్చు.
  • సోషల్‌ మీడియాలో న్యూస్‌ పోస్టింగ్స్‌ ద్వారా గుర్తింపు పొందే అవకాశం.
  • యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌ వంటి మాధ్యమాల ద్వారా సొంతంగా వార్తలు అప్‌లోడ్‌ చేసే వీలు.

డిజిటల్‌ జర్నలిజం కెరీర్స్‌.. ముఖ్యాంశాలు

  • సరికొత్త కెరీర్‌ మార్గంగా డిజిటల్‌ జర్నలిజం.
  • 2022 చివరి నాటికి డిజిటల్‌ జర్నలిజంలో దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు.
  • జర్నలిజం జాబ్‌ ప్రొఫైల్స్‌తోపాటు ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం, వెబ్‌ డెవలపర్స్‌ వంటి కొత్త కొలువులు. 
  • ప్రారంభంలో సగటున నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం
  • మీడియా సంస్థలకు అనుబంధంగా ఏర్పాటవుతున్న డిజిటల్‌ విభాగాలు. 

కాలంతోపాటే మార్పులు
అన్ని రంగాల్లోనూ కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి. మీడియా రంగంలోనూ ఈ ట్రెండ్‌ కనిపిస్తోంది. ప్రధానంగా ప్రస్తుత ఇంటర్నెట్, స్మార్ట్‌ ఫోన్‌ ప్రపంచంలో అధిక శాతం మంది ఆన్‌లైన్‌ న్యూస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో సహజంగానే డిజిటల్‌ మీడియాకు ప్రాధాన్యం పెరుగుతోంది. జర్నలిజం వృత్తిలో ఉన్న వారు, ఔత్సాహికులు ఈ మార్పులను గమనించి టెక్నాలజీని వినియోగించుకుంటూ రాణించాలి. డిజిటల్‌లో శరవేగంగా వార్తలు అందించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేర్పు కూడా సొంతం చేసుకుంటే.. డిజిటల్‌ జర్నలిజంలో కెరీర్‌ ఉజ్వలంగా ఉంటుంది.
– ప్రొ‘‘ ఉషా రామన్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.
 

చ‌ద‌వండి: Media & Film Studies

Published date : 10 Feb 2022 07:10PM

Photo Stories