Skip to main content

కొత్త పుంతలు తొక్కుతున్న మీడియారంగం.. ఈ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌..

మీడియా.. సమాజానికి దిక్సూచి లాంటిది. సమాజ అవసరాలు గుర్తించి.. విశ్లేషించడంలో మీడియా ముందుంటుంది.

డిజిటల్‌ మీడియా ప్రవేశంతో ఈ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. మీడియా రంగంలో ఇప్పుడు సమాజానికి అవసరమైన సమాచారం అత్యంత వేగంగా, కచ్చితత్వంతో అందించడంతోపాటు వ్యాపార కోణం కూడా కీలకంగా మారింది. ఇలాంటి తరుణంలో మీడియా సంస్థల నిర్వహణ బాధ్యతలను చూసే మీడియా మేనేజ్‌మెంట్‌ నిపుణుల సేవలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. మీడియా మేనేజ్‌మెంట్‌ విభాగంలో అవకాశాలు,అవసరమైన అర్హతలు, నైపుణ్యాలపై ప్రత్యేక కథనం...

మీడియా అనగానే దినపత్రికలు, టీవీ ఛానెల్స్‌ గుర్తుకొస్తాయి. వాస్తవానికి రేడియో, సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌ (డిజిటల్‌ మీడియా), సినిమాలు, మల్టీమీడియా.. ఇలాంటివన్నీ కూడా మీడియా విభాగంలోకే వస్తాయి. అత్యంత వ్యవస్థీకృత రంగాల్లో మీడియా ఒకటి. ప్రపంచ పోకడలకు అద్దం మీడియా. ఇలాంటి కీలకమైన మీడియా కంపెనీల నిర్వహణ, ప్లానింగ్, ఆపరేషన్స్, బ్రాండ్‌ బిల్డింగ్‌ వంటి అంశాలను మీడియా మేనేజ్‌మెంట్‌ విభాగం పర్యవేక్షిస్తుంది.

వారధిగా..
అందుబాటులో ఉన్న పరిమిత వనరులతో మీడియా కంపెనీల పనితీరును సమర్థంగా నిర్వహించడం, బిజినెస్‌ వ్యవహారాల్లో క్రమశిక్షణ, మార్కెట్‌ పరంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం వంటివి మీడియా మేనేజ్‌మెంట్‌ నిపుణుల ముఖ్య బాధ్యతలుగా చెప్పొచ్చు. అంతేకాకుండా మీడియా మేనేజ్‌మెంట్‌ నిపుణులు.. సంస్థ నిర్వహణతోపాటు,అంతర్గతంగా సంస్థలోని వివిధ విభాగాల మధ్య వారధిగా పనిచేస్తారు. ఇలాంటి ఎంతో కీలకమైన ఈ విభాగానికి అవసరమైన నిపుణులను అందించేందుకు పలు సంస్థలు మీడియా మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్నాయి.

కోర్సులు– అర్హతలు..
• మన దేశంలో పలు ఇన్‌స్టిట్యూట్స్‌ మీడియా మేనేజ్‌మెంట్‌లో బీబీఏ/ఎంబీఏ వంటి కోర్సులను అందిస్తున్నాయి.
• ఎక్కువ మంది విద్యార్థులు ఎంబీఏ/పీజీడీబీఎం స్థాయిలో మీడియా మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరు గ్రాడ్యుయేషన్‌ అర్హతతో క్యాట్‌/మ్యాట్‌/గ్జాట్‌/సీమ్యాట్‌ వంటి ఎంట్రన్స్‌ల్లో సాధించిన మెరిట్‌ ఆధారంగా వీటిలో ప్రవేశం పొందొచ్చు.
• బీబీఏ వంటి కోర్సుల్లో ఇంటర్మీడియెట్‌/10+2 అర్హతతో చేరే అవకాశముంది.
• పలు ఐఐఎంలు, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ఢిల్లీ యూనివర్సిటీ తదితర ఇన్‌స్టిట్యూట్స్‌ అందించే కోర్సులకు మంచి గుర్తింపు ఉంది.

నైపుణ్యాలు..
• మీడియా మేనేజ్‌మెంట్‌ కోర్సుల ద్వారా మీడియా సంస్థల కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించే నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు.
• మీడియా మేనేజ్‌మెంట్‌ రంగంలో రాణించేందుకు సంబంధిత కోర్సు ఉత్తీర్ణతతోపాటు చక్కటి కమ్యూనికేషన్‌ స్కిల్స్, గణాంకాల ద్వారా విశ్లేషణ, విజువల్‌ థింకింగ్, బృంద నైపుణ్యాలు వంటి స్కిల్స్‌ ఉండాలి.

ఇంకా చదవండి : part 2: మీడియా మేనేజ్‌మెంట్‌ విద్యార్థుల అవకాశాలు.. రిక్రూట్‌మెంట్‌ సంస్థలు ఇలా..

Published date : 23 Jun 2021 03:14PM

Photo Stories