Skip to main content

సినీ కోర్సులు.. క్రేజీ కెరీర్లు

దేశంలో సినీ పరిశ్రమ తొమ్మిది శాతం వార్షిక వృద్ధితో పయనిస్తూ, 2015 నాటికి మార్కెట్ విలువ 2.8 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. ఇలా వినోద ప్రపంచం శరవేగంగా విస్తరిస్తూ నవ తరానికి నయా అవకాశాలను అందిస్తోంది. సినిమాను ఒక దృశ్య కావ్యంలా.. రమణీయ రంగుల చిత్రంలా మలచడంలో సాంకేతిక నిపుణుల పాత్ర కీలకం. అక్షరాలను అద్భుత చిత్రంలా మార్చే సినిమాటోగ్రఫీలోనూ, ముడి చిత్రాన్ని ప్రేక్షకులు మెచ్చేలా తీర్చిదిద్దే వీడియో ఎడిటింగ్‌లోనూ అద్భుత అవకాశాలున్నాయి.

మీడియా రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో సినిమాటోగ్రఫీకు క్రేజ్ పెరిగింది. వ్యాపారపరంగా, వినోదపరిశ్రమలోనూ అవకాశాలు వస్తున్నాయి. అయితే కేవలం ఏదో కోర్సు నేర్చుకుని ఈ రంగంలోకి వద్దామనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్న విద్య, సాధించిన మార్కులకంటే కూడా ప్రతిభకే పట్టం.

అందుబాటులో ఎన్నో కోర్సులు:
సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్‌లో ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. షార్ట్‌టర్మ్ కోర్సుల నుంచి పీజీ కోర్సుల వరకు పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సులను అందిస్తున్నాయి. సాధారణంగా షార్ట్‌టర్మ్ కోర్సుల వ్యవధి 12 వారాల నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది. డిప్లొమా, పీజీ డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీల కోర్సుల వ్యవధి మూడేళ్లు. కాగా పీజీ కోర్సుల వ్యవధి రెండేళ్లు.

ప్రవేశం ఇలా:
ప్రవేశాలకు విద్యా సంస్థలు వేర్వేరు విధానాలను పాటిస్తున్నాయి. కొన్ని ఇన్‌స్టిట్యూట్లు అకడమిక్ మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తుంటే.. ప్రముఖ సంస్థలు ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్ ఇస్తున్నాయి.

కావాల్సిన స్కిల్స్:
  • లేటెస్ట్ టెక్నాలజీపై పట్టు ఉండాలి.
  • సృజనాత్మకత
  • ఫొటోగ్రఫీ, పెయింటింగ్‌లపై ఆసక్తి ఉండాలి.
  • ఎక్కడికైనా ప్రయాణించడానికి సిద్ధంగా ఉండాలి.
  • ఓర్పు, సహనం ఉండాలి.
  • ఇంటర్‌పర్సనల్ స్కిల్స్
అనుకూలతలు:
  • సమాచార సాంకేతిక రంగం శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో అపార అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు.
  • భారీ స్థాయిలో వేతనాలు పొందొచ్చు.
  • కష్టించే గుణం ఉంటే అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించొచ్చు.
ప్రతికూలతలు:
  • రోజులో ఏ సమయంలోనైనా పనిచేయాల్సి ఉంటుంది.
  • ఎక్కువ పనిగంటలు
  • మారుమూల ప్రదేశాలకు కూడా వెళ్లాల్సి రావడం
  • మిగిలిన కోర్సులతో పోల్చుకుంటే ఖర్చు ఎక్కువ
పనిగంటలు:
  • సాధారణంగా ఎనిమిది గంటలపాటు (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు) విధులు నిర్వహించాలి. షిప్టులవారీగా, ఒక్కోసారి రాత్రిళ్లు పనిచేయాల్సి ఉంటుంది.
కెరీర్:
సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కోర్సులు పూర్తిచేసినవారికి అపార అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. దేశీయ సంస్థలకు తోడుగా విదేశీ సంస్థలు మనదేశంలో అడుగుపెడుతున్నాయి. హాలీవుడ్ తర్వాత భారతీయ సినీ పరిశ్రమ అతిపెద్దది. సగటున ఏటా 200 సినిమాల వరకు విడుదల అవుతున్నాయి. వీటిల్లో సినిమాటోగ్రాఫర్‌గా, వీడియో ఎడిటర్‌గా అవకాశాలు పొందొచ్చు. టీవీ చానెళ్లు కూడా భారీ స్థాయిలో ఏర్పాటవుతున్నాయి. వీటిల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు. ప్రత్యేకతను కోరుకుంటే యానిమేటెడ్, గ్రాఫిక్స్ ఆధారిత సినిమాల్లోనూ కెరీర్ వెతుకోవచ్చు. ఇంకా యానిమల్ ప్లానెట్, డిస్కవరీ, నేషనల్ జియోగ్రాఫిక్, హిస్టరీ 18 వంటి చానెళ్లలోనూ అవకాశాలుంటాయి. సినిమాటోగ్రాఫర్లు ఫ్యాషన్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ, టూరిజం రంగాల్లో వివిధ హోదాల్లో జాబ్స్ పొందొచ్చు.

ఉద్యోగాలిక్కడ:
  • ఫిల్మ్ ప్రొడక్షన్ యూనిట్స్
  • టీవీ చానెళ్లు
  • వీడియో ఇండస్ట్రీస్
  • స్టూడియోలు
  • డాక్యుమెంటరీ కంపెనీలు
  • వీడియో మ్యూజిక్ కంపెనీలు
  • అడ్వర్టైజింగ్ కంపెనీలు
  • యానిమేటెడ్, మల్టీమీడియా కంపెనీల
వేతనాలు:
ఫ్రీలాన్స్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసేవారు రోజుకు రూ.5,000 - రూ.10,000 వరకు పొందొచ్చు. అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్లు ప్రారంభంలో నెలకు రూ.15,000 - 20,000 వరకు ఆర్జించొచ్చు. ఈ రంగంలో కొన్నేళ్ల అనుభవం తర్వాత ఆదాయానికి ఆకాశమే హద్దు. సృజనాత్మకత, మంచి పనితీరు ఉన్నవారు నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు.

కోర్సులు.. అందిస్తున్న సంస్థలు
మన రాష్ట్రంలో:
Bavitha
  • రామానాయుడు ఫిల్మ్ స్కూల్ - హైదరాబాద్
    కోర్సు:
    ఎంఎఫ్ టెక్ (ఫిల్మ్ అండ్ టెలివిజన్ సినిమాటోగ్రఫీ)
    వ్యవధి: రెండేళ్లు
    అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
    షార్ట్‌టర్మ్ కోర్సులు:
    • డిజిటల్ సినిమాటోగ్రఫీ
    • ఎడిటింగ్
    వ్యవధి: సెమిస్టర్
    అర్హత: 10+2 ఉత్తీర్ణత.
    వెబ్‌సైట్: ramanaidufilmschool.net/
  • అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్+మీడియా - హైదరాబాద్
    షార్ట్ కోర్సులు:
    • డీఎస్‌ఎల్‌ఆర్ ఫొటోగ్రఫీ/సినిమాటోగ్రఫీ
      వ్యవధి:
      12 వారాలు
    • ఇంట్రడక్షన్ టు ఎడిటింగ్
      వ్యవధి:
      12 వారాలు
    • ఇంట్రడక్షన్ టు సినిమాటోగ్రఫీ (ఫిల్మ్+టీవీ)
      వ్యవధి:
      10 వారాలు
    వెబ్‌సైట్: www.aisfm.edu.in
మన దేశంలో:
  • ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) - పుణే
    కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ ఎఫ్‌టీఐఐ. ఇది అందించే కోర్సులకు మంచి పేరుంది.
    కోర్సులు: పీజీ డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ, పీజీ డిప్లొమా ఇన్ ఎడిటింగ్
    వ్యవధి: మూడేళ్లు
    అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఎలక్ట్రానిక్ సినిమాటోగ్రఫీ (టెలివిజన్)
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ వీడియో
    ఎడిటింగ్ (టెలివిజన్)
    వ్యవధి:
    ఏడాది
    అర్హత: బ్యాచిలర్ డిగ్రీ
    ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
    స్కాలర్‌షిప్స్: ప్రవేశపరీక్షలో, అకడమిక్ ఎగ్జామ్స్‌లో ప్రతిభ చూపినవారికి స్కాలర్‌షిప్స్ కూడా అందిస్తారు
    వెబ్‌సైట్: www.ftiindia.com

  • సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ -కోల్‌కతా
    కోర్సులు:
    పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ సినిమాలో భాగంగా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కోర్సులను అందిస్తోంది.
    వ్యవధి: మూడేళ్లు
    అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ.
    ఎంపిక: ప్రవేశపరీక్ష, వైవా, వైద్య పరీక్షల ద్వారా
    వెబ్‌సైట్: srfti.ac.in/

  • రూప కళా కేంద్రో - కోల్‌కతా
    కోర్సు:
    పీజీ డిప్లొమా ఇన్ ఎడిటింగ్
    వెబ్‌సైట్: www.kendroonline.org

  • డిజిటల్ అకాడమీ - ది ఫిల్మ్ స్కూల్ - ముంబై
    కోర్సులు:
    పీజీ డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఎడిటింగ్
    వెబ్‌సైట్: www.dafilmschool.com

ప్రతిభకు మాత్రమే పట్టం
Bavitha
దిగ్విజయంగా కోర్సు పూర్తికాగానే అవకాశాలు వెతుక్కుంటూ రావనేది గమనించాలి. దీన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి సృజనాత్మకత, సమయస్ఫూర్తి రెండూ అవసరమే. చిత్రీకరణ సమయంలో అప్పటి వరకు కనిపించిన వెలుగు మాయమవుతుంది. అకస్మాత్తుగా వర్షంపడి లైటింగ్‌లో మార్పులు వస్తాయి. ఆయా సమయాలకు అనుగుణంగా వ్యవ వహరించే ఓర్పు, నేర్పు కావాలి. హైదరాబాద్‌లో జె.ఎన్.ఏ.ఎఫ్.యు., వెంకటేశ్వరా ఫైన్ ఆర్ట్స్ కళాశాలల్లో ఫొటోగ్రఫీ కోర్సులున్నాయి. ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె వంటి నగరాల్లోనూ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. కోర్సు పూర్తిచేశాక కమర్షియల్, యాడ్‌ఏజెన్సీ, డాక్యుమెంటరీ, షార్ట్‌ఫిల్మింగ్, సినిమా, సీరియల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా నచ్చిన రంగాన్ని ఎంచుకోవచ్చు. ప్రతిభను ప్రదర్శించగలిగితే సినీరంగంలో స్థిరపడొచ్చు.

విదేశాల్లో ఇలా..
Bavitha
లాస్‌ఏంజెల్స్‌లోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడెమీ (ఎన్‌వైఎఫ్‌ఏ)లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ.. థియరీ కంటే ప్రాక్టికల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. విద్యార్థులు తరగతి గది పాఠాల ద్వారా కంటే ప్రత్యక్ష అనుభవం ద్వారానే ఎక్కువ పరిజ్ఞానం పొందుతారనే ఉద్దేశంతో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యతనిస్తూ ఈ కోర్సులను రూపొందించారు. కెమెరాల వినియోగంతో సినిమాటోగ్రఫీని, ఫైనల్ కట్ ప్రో (ఎఫ్‌సీపీ) ప్రక్రియ ద్వారా ఎడిటింగ్‌ను క్షుణ్నంగా నేర్చుకునేందుకు తగిన సమయం ఉంటుంది. అనుభవజ్ఞులైన ఇన్‌స్ట్రక్టర్లు విలువైన సలహాలు, సూచనలిస్తుంటారు. సినిమాటోగ్రఫీ ఉత్సాహంగా సాగిపోయే కోర్సు. ఎడిటింగ్ కూడా ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవచ్చు. పగలు వేరే ఉద్యోగం చేస్తూ సాయంత్రం ఖాళీ సమయంలో నేర్చుకునేందుకు ఇవి ఉత్తమ కోర్సులని చాలా మందికి సూచించాను. ఎన్‌వైఎఫ్‌ఏలో ఫుల్‌టైమ్ కరికులమ్ కూడా అందుబాటులో ఉంది.

భారత్‌లో అవకాశాలు..
భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఎడిటింగ్ విషయంలో ఇప్పుడిప్పుడే అవిడ్ సాఫ్ట్‌వేర్ నుంచి ఫైనల్ కట్ ప్రో ప్రక్రియలోకి అడుగులేస్తోంది. సినిమా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతుండటం, డి జిటల్ కెమెరాలు, స్మార్ట్‌ఫోన్‌లతోనే షార్ట్ ఫిల్మ్‌లను విరివిగా రూపొందిస్తుండటంతో సినిమాటోగ్రాఫర్లు, ఎడిటర్లకు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. అమెరికాలో ఎన్‌వైఎఫ్‌ఏతోపాటు ఈ కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీలు..
  1. న్యూయార్క్ యూనివర్సిటీ టిస్చ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్
  2. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద ఆర్ట్స్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్/వీడియో
  3. యూసీఎల్‌ఏ స్కూల్ ఆఫ్ థియేటర్, ఫిల్మ్ అండ్ టెలివిజన్
  4. యూనివర్సిటీ ఆఫ్ చికాగో
  5. వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ
Published date : 26 Dec 2013 01:51PM

Photo Stories