Skip to main content

కెరీర్ గైడెన్స్ - మీడియా మేనేజ్‌మెంట్


రిపోర్టింగ్.. ఎడిటింగ్.. యాంకరింగ్.. మీడియా అనగానే ప్రధానంగా గుర్తొచ్చే విభాగాలు. ఓ ఛానల్ లేదా న్యూస్ పేపర్ ప్రింట్ - ఎండ్ ఆపరేషన్స్‌లో కీలక విధులు. వీటికి సంబంధించిన అకడెమిక్ కోర్సులు కూడా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అయితే.. గత దశాబ్ద కాలంగా శరవేగంగా విస్తరిస్తున్న మీడియా రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో కొత్త కోర్సు తెరపైకి వచ్చింది. అదే.. మీడియా మేనేజ్‌మెంట్. ఆ కోర్సుకు సంబంధించిన విశేషాలతో ‘కెరీర్ గైడెన్స్'..
దేశంలో మీడియూ రంగం విలువ రూ. 35,300 కోట్లు. మరి కొన్నేళ్లలో 19 శాతం వృద్ధి సాధిస్తుంది- భారత్‌లో మీడియా రంగం ప్రగతిపై ప్రముఖ ఆడిటింగ్ ఏజెన్సీ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అంచనా. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కొత్త ఛానళ్ల హవా కొనసాగుతోంది. ఒక్కో ప్రాంతీయు భాషలో సగటున 25 వరకు ఛానళ్లు ప్రసారాలు సాగిస్తున్నారు. మరోవైపు ప్రింట్ మీడియాలో కూడా కొత్త పత్రికల పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రిపోర్టింగ్, ఎడిటింగ్ వంటి ప్రింట్- ఎండ్ ఆపరేషన్స్‌తోపాటు సర్క్యులేషన్, షెడ్యూలింగ్, యూడ్ సేల్స్, బ్రాండ్ మేనేజ్‌మెంట్, మీడియా ప్లానింగ్ వంటి బిజినెస్ ఎండ్-ది విధులు, విభాగాల ఆవశ్యకత ఏర్పడుతోంది. వాటికి సంబంధించిన ప్రొఫెషనల్స్ కోసం అన్వేషణ సాగుతోంది. అలాంటి ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దే కోర్సే ‘మీడియా మేనేజ్‌మెంట్’.
మీడియా మేనేజ్‌మెంట్ అంటే..
మీడియా స్కూల్స్ అభ్యర్థులకు కేవలం ప్రింట్ ఎండ్‌కు సంబంధించిన అంశాలైన రిపోర్టింగ్, ఎడిటింగ్ విషయాలపైనే శిక్షణనిస్తాయి. అయితే బిజినెస్ ఎండ్- ది ఆపరేషన్స్‌లో పని చేయడానికి మాత్రం నిష్ణాతులైన ప్రొఫెషనల్స్ అవసరం. మార్కెట్ అధ్యయనం, బిజినెస్ డెవలప్‌మెంట్, ఆర్గనైజేషన్ ఆర్థిక వ్యవహారాలను సమర్థంగా నిర్వహించాలంటే ప్రొఫెషనల్ డిగ్రీ హోల్డర్ల అవసరం ఎంతో. ఈ నైపుణ్యాలన్నీ మీడియా మేనేజ్‌మెంట్ కోర్సు ద్వారా పొందొచ్చు. మీడియాలోని వివిధ విభాగాల పనితీరుపై అవగాహన, సమర్థ నిర్వహణ, మీడియా టెక్నాలజీ-దానికి అవసరమైన ప్రాథమిక అంశాలు.. ఇలా సంబంధిత విభాగాలపై కావాల్సిన నైపుణ్యం ఈ కోర్స్ ద్వారా అలవడుతుంది.
సాధారణంగా ఇతర వ్యాపార సంస్థలు, పరిశ్రమల్లో జనరల్ మేనేజ్‌మెంట్ విభాగాలుంటారు. (ఉదా: ఫైనాన్స్, హెచ్‌ఆర్, మార్కెటింగ్, తదితర). అయితే దీనికి భిన్నంగా మీడియా సంస్థలకే ప్రత్యేకమైన కొన్ని విభాగాలుంటారు. బ్రాండ్ మేనేజ్‌మెంట్, మీడియూ ప్లానింగ్, యాడ్ సేల్స్ వంటివి ఈ కోవకి చెందినవే. ఈ అంశాలపట్ల అవగాహన సాధారణ మేనేజ్‌మెంట్ డిగ్రీతో లభించదు. ఈ లోటును మీడియా మేనేజ్‌మెంట్ భర్తీ చేస్తుంది.ఈ కోర్సులో అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్, ప్రొడక్షన్, బ్రాడ్ కాస్టింగ్, మోడర్న్ ఎలక్ట్రానిక్ మీడియా (టెలివిజన్, రేడియో, ఇంటర్నెట్ తదితర) అభివృద్ధికి తోడ్పడే నైపుణ్యాలను బోధిస్తారు. దాంతోపాటు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలోఉంచుకుని పర్సనాల్టీ డవలప్‌మెంట్ అంశాలపై కూడా అవగాహన కల్పిస్తారు.
ప్రస్తుతం మీడియా రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేయడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. వ్యాపారపరంగా అనుసరించాల్సిన వ్యూహాలు, టెక్నాలజీ పరంగా మార్పులు, ప్రేక్షకుల/వినియోగదారుల అభిరుచి, ఆర్గనైజేషన్‌లో ఫ్రెండ్లీ నేచర్ ఏర్పరిచేందుకు కృషి తత్సంబంధ అంశాల్లో నిష్ణాతులుగా రూపొందడానికి ఈ కోర్సు దోహదం చేస్తుంది.
ఈ కోర్సులో బోధించే కొన్ని ముఖ్యమైన విభాగాలు..
మీడియా ఎకనామిక్స్: ఈ విభాగంలో సంబంధిత రంగాలు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, వనరుల అభివృద్ధి, అడ్వర్టయిజింగ్ వంటి అంశాలను అధ్యయనం చేయాలి.
మీడియా స్టడీస్: సమాజాన్ని, ప్రేక్షకులు లేదా వినియోగదారుల అభిరుచిని తెలుసుకోవడానికి సోషియాలజీ, కల్చరల్ స్టడీస్, ఆంత్రోపాలజీ, సైకాలజీ, ఆర్ట్ థియరీ, ఇన్ఫర్మేషన్ థియరీ వంటి అంశాలుంటాయి.
మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం: ప్రేక్షకులు లేదా వినియోగదారులను ఆకర్షించే విధంగా ఎటువంటి కంటెంట్.. ఏ విధంగా ప్రెజెంట్ చేయాలనే అంశాలపై కూడా అవగాహన కల్పిస్తారు.
మీడియా మేనేజర్ విధులివే: మీడియా-విధులు, నిబంధనలు, సమాజంపై దాని ప్రభావం తదితర అంశాలకు బాధ్యత వహించాలి. ఆన్‌లైన్ టెక్నాలజీతోపాటు సంప్రదాయ పద్ధతుల్లో పని చేయాల్సి ఉంటుంది. గ్లోబల్ మార్కెట్ యుగంలో ఉద్యోగులకు అందించే సేవలు మొదలు ఉత్పత్తుల బ్రాండ్ విలువ పెంచేందుకు అనుసరించే వ్యూహాల వరకు అన్ని రకాల మేనేజ్‌మెంట్ బాధ్యతలను నిర్వర్తించాలి.

కొన్ని ప్రత్యేక విధులు:
మీడియూ మేనేజ్‌మెంట్ విధులు.. సాధారణ మేనేజ్‌మెంట్ విధుల మాదిరిగానే ఉంటాయి. కానీ మీడియా సంస్థలకు కావాల్సిన కొన్ని ప్రత్యేక అంశాలకనుగుణంగా ఆ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి.. ఆన్‌లైన్ కంటెంట్ మేనేజ్‌మెంట్, డిజిటల్ ప్రొడక్షన్-మేనేజ్‌మెంట్, ఆన్‌లైన్ బ్రాడ్ కాస్ట్ మేనేజ్‌మెంట్, అడ్వర్టయిజింగ్ టెక్నిక్స్, వెబ్‌డిజైన్ తదితర విభాగాలు.

అవకాశాలు.. ఆదాయం:
వీరికి సాధారణంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, ఇంటర్నెట్, వెబ్‌సైట్‌లను నిర్వహిస్తున్న సంస్థలు, మీడియా హౌస్‌లు, పబ్లికేషన్స్ సంస్థలు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలలో ఉపాధి అవకాశాలుంటాయి. సినీ తారలు, సెలెబ్రెటీస్, రచయితలు, సంగీత దర్శకులకు , క్రీడాకారులు, ప్రముఖ వ్యక్తులకు మీడియా మేనేజర్‌గా కూడా వ్యవహరించవచ్చు.
మీడియా మేనేజర్ల వేతనాలు.. సాధారణ ఎంబీఏ గ్రాడ్యుయేట్ల కంటే అధికమనే చెప్పొచ్చు. అనుభవం, సంస్థలో హోదా ఆధారంగా జీతభత్యాలు ఉంటాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం కాబట్టి వేతనాలు కూడా అదే మాదిరిగానే ఉంటున్నారు. సాధారణంగా వీరి ప్రారంభ వేతనం రూ.15,000-30,000 మధ్య ఉంటుంది.

సర్టిఫికెట్ టు పీజీ కోర్సులు:
ప్రస్తుతం పలు ఇన్‌స్టిట్యూట్‌లు సర్టిఫికెట్, డిప్లొవూ, పీజీ డిప్లొవూ, పీజీ స్థాయిలో మీడియూ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్నారు. సాధారణంగా పీజీ ఉత్తీర్ణులకు మీడియూ మేనేజర్‌గా అవకాశాలు లభిస్తాయి. డిప్లొమాతో కూడా అవకాశాన్ని దక్కించుకోవచ్చు. కానీ కెరీర్ పరంగా పీజీ అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తారనే విషయాన్ని గమనించాలి.

ఎంబీఏ స్పెషలైజేషన్:
కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు మీడియూ మేనేజ్‌మెంట్‌ను ఎంబీఏ స్పెషలైజేషన్‌గా కూడా అందిస్తున్నారు. రాష్ట్రంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయుంలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. కొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు ఆఫర్ చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఎంబీఏలో కూడా మీడియూ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ లభిస్తుంది. అడ్వర్టయిజింగ్, పబ్లిక్ రిలేషన్స్ కోర్సులకు సమ్మిళితంగా కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు మీడియూ మేనేజ్‌మెంట్‌ను అందిస్తున్నారు. ఇగ్నో ‘ఎలక్ట్రానిక్ మీడియూ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్’ పీజీ అందిస్తోంది.

అర్హతలు:
మీడియా/కమ్యూనికేషన్స్/హ్యుమానిటీస్/సోషల్ సెన్సై స్/మేనేజ్‌మెంట్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వారు మీడియా మేనేజ్‌మెంట్‌లో పీజీ చేయడానికి అర్హులు. జర్నలిస్ట్ లేదా ఏదైనా సృజనాత్మకత రంగం లేదా మేనేజ్‌మెంట్ విభాగంలో అనుభవం ఉన్న వారికి అడ్మిషన్లలో ప్రాధాన్యం ఉంటుంది.

మీడియా ప్లానింగ్
మీడియా మేనేజ్‌మెంట్‌లో మరో కీలక విభాగం మీడియా ప్లానింగ్. వివిధ వస్తువుల ప్రచారం కోసం మీడియా సంస్థలను ఎంపికచేయడం, దానికి సంబంధించి బడ్జెట్, ఇతర వ్యవహరాలను పర్యవేక్షించడం మీడియూ ప్లానర్ బాధ్యత. ఒక్క మాటలో చెప్పాలంటే మీడియా ఆర్గనైజేషన్‌కు, ఉత్పత్తిదారునికి మధ్య అనుసంధాన కర్త. ఒక ప్రొడక్ట్ ప్రచారం కోసం నిర్ణీత మీడియూను ఎంచుకునే వుుందు.. మీడియా ఆర్గనైజేషన్స్‌కు సంబంధించిన వివరాలపై పట్టు, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్, అ మీడియాకు సంబంధించిన టార్గెట్ పీపుల్- వారి సైకాలజీ తదితర అంశాలను విశ్లేషణాత్మక దృష్టితో అధ్యయనం చేస్తాడు. చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్, మార్కెట్ పరిస్థితులపై అప్‌డేట్‌గా ఉండడం, వేగంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యం, భావాలను సమర్థంగా వ్యక్తం చేయడం, సునిశిత పరిశీలన, సమస్య పరిష్కారంలో చతురత ఉంటే మీడియా ప్లానర్‌గా రాణించవచ్చు.
మీడియా ప్లానింగ్ కోసం ప్రత్యేకంగా ఎటువంటి కోర్సు లేదు. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు మీడియా మేనేజ్‌మెంట్, మాస్ కమ్యూనికేషన్, అడ్వర్టయిజింగ్ విభాగాల్లో అందించే వివిధ కోర్సుల్లో భాగంగా మీడియా ప్లానింగ్‌ను స్పెషలైజేషన్‌గా ఆఫర్ చేస్తున్నాయి. మాస్ కమ్యూనికేషన్/అడ్వర్‌టైజింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ ఉన్న వారు మీడియా ప్లానింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఎంబీఏ-మీడియా మేనేజ్‌మెంట్(మీడియాప్లానింగ్ స్పెషలైజేషన్)ను అందిస్తున్నాయి. కోర్సు పూర్తి చేసిన వారికి అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలు, ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆన్‌లైన్ మీడియా ఆర్గనైజేషన్స్‌తోపాటు వివిధ ప్రొడక్షన్ హౌసెస్‌లో అవకాశాలుంటాయి.

ఆఫర్ చేస్తున్న సంస్థలు
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయుం-తిరుపతి
వెబ్‌సైట్: https://www.spmvv.ac.in/
 
ఏషియన్ అకాడెమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్-నోయిడా
వెబ్‌సైట్: www.aaft.com

ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్-దేవి అహల్య విశ్వవిద్యాలయ-ఇండోర్,
వెబ్‌సైట్: www.emrcdavv.edu.in

ఇన్‌స్టిట్యూట్ ఫర్ మీడియా మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్టడీస్ -న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.imcsindia.com

మణిపాల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ -బెంగళూరు
వెబ్‌సైట్: www.me.manipal.edu

స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మాస్ కమ్యూనికేషన్, సర్ హిగ్గిన్‌బాథమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ సెన్సైస్- అలహాబాద్
వెబ్‌సైట్: www.aaidu.org

ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టడీస్ -న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.isomes.com
అమిటీ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్ -నోయిడా
వెబ్‌సైట్: www.amity.edu
Published date : 16 Apr 2012 05:36PM

Photo Stories