Skip to main content

డిమాండింగ్ ఏరియా..డిజిటల్ మీడియా

రోజూ వినూత్న యాప్‌ల ఆవిష్కరణలతో డిజిటల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతోంది. దీంతో తలచిందే తడవుగా కోరుకున్న సమాచారం చిటికెలో కళ్లముందు ప్రత్యక్షమవుతోంది. వృత్తి సంబంధిత సమాచారమైనా, తాజా పరిణామాలకు సంబంధించిన వార్తలైనా ఆన్‌లైన్‌లో ఒక్క క్లిక్‌తో కనిపిస్తున్న రోజులివి. వీటన్నింటినీ డిజిటల్ మీడియా సాధ్యం చేస్తోంది. ఒకవైపు దినపత్రికలు, టెలివిజన్ చానళ్లకు ఆదరణ కొనసాగుతూనే ఉండగా మరో వైపు డిజిటల్ మీడియా శరవేగంగా విస్తరిస్తోంది. ఇందుకు అనుగుణంగా కెరీర్ అవకాశాలు సైతం అందిస్తోంది. డిజిటల్ మీడియా కెరీర్ పై విశ్లేషణ...
డిజిటల్ మీడియా అత్యంత ప్రాముఖ్యం సంతరించుకుంటోంది. రోజురోజుకీ శరవేగంగా విస్తరిస్తోంది. దీనికి కారణం ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్స్ నుంచి న్యూస్ చానల్స్ వరకు అన్నీ పోటీ ప్రపంచంలో రాణించడానికి డిజిటల్ మీడియాను మెరుగైన మార్గంగా ఎంచుకోవడమే. సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్లు, బ్లాగులు, ఈ-షాపింగ్, ఈ-పేపర్ ఇలా.. అంతటా డిజిటల్ యుగమే రాజ్యమేలుతోంది. దాంతో యువతకు కెరీర్ అవకాశాలు సైతం ఈ రంగంలో విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి.

ఆన్‌లైన్‌లో అనంత సమాచారం
ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా ఒక వస్తువు కొనుగోలు చేయాలన్నా, లేదా ఇంటర్నెట్ ఆధారంగా ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా సదరు సమాచారం ఒక్క క్లిక్‌తో కళ్లముందు కనిపిస్తుంది. తాజాగా మార్కెట్‌లో కొలువుదీరిన మొబైల్ ఫోన్ వివరాలు తెలుసుకోవాలంటే సంబంధిత కీ వర్డ్స్‌తో సెర్చ్ టూల్ క్లిక్ చేస్తే పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది. దీనికి తోడు మారిన జీవనశైలి వల్ల తాజా వార్తల కోసం టీవీల ముందు కూర్చోలేని పరిస్థితులు, ఉదయాన్నే లేచి న్యూస్ పేపర్లలోని వార్తలను ఆసాంతం చదవలేని దైనందిన బిజీ జీవితాలు. వీటన్నింటికీ ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయం నుంచి స్థానిక వార్తల వరకు ఎలాంటి సమాచారాన్నయినా సదరు న్యూస్ చానల్ లేదా పత్రిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే క్షణాల్లో కనిపిస్తాయి. దినపత్రికలు అందిస్తున్న ఈ-పేపర్ సదుపాయం కూడా డిజిటల్ మీడియా కోవలోదే. ఆయా రంగాల్లో నిపుణులు రూపొందించే బ్లాగుల్లోని సమాచారం, సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్లలో కనిపించే సమాచారం అంతా డిజిటల్ మీడియా పరిధిలోకి వస్తుంది. ప్రతి ఒక్కరూ తమ రంగం, ఆసక్తికి అనుగుణంగా వాటికి సంబంధించిన బ్లాగులు, వెబ్‌సైట్లు లేదా ఇతర ఇంటర్నెట్ ఆధారిత ప్రసార మాధ్యమాలపైనో ఆధారపడుతున్నారు. దీని వల్ల అనుదిన జీవితంలో డిజిటల్ మీడియా ప్రాధాన్యం పెరిగింది.

మానవ వనరులకు పెరుగుతున్న డిమాండ్
డిజిటిల్ మీడియా సంస్థలు, వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ షాపింగ్ పోర్టళ్లు నిపుణులైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నాయి. ముఖ్యంగా ఈ-కామర్స్ రంగంలో డిజిటల్ మీడియా నిపుణుల అవసరం మరింత ఎక్కువ. నేరుగా తమ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన వినియోగదారులకు తాము ఎంపిక చేసుకున్న ఉత్పత్తుల సమాచారాన్ని ఆకర్షణీయంగా అందించేందుకు అవసరమైన నిపుణుల అవసరం పెరుగుతోంది. అదే విధంగా సెర్చ్ ఇంజన్ల ద్వారా ఉత్పత్తుల వివరాలు, వెబ్‌సైట్ సర్వీసుల సమాచారం తెలుసుకునే వినియోగదారులను ఆకట్టుకునే రీతిలో, తమ వెబ్‌సైట్‌ను రూపొందించగలిగే నిపుణులకు డిమాండు పెరుగుతోంది. వీటన్నిటి కారణంగా నేడు డిజిటల్ మీడియా బెస్ట్ కెరీర్ ఆప్షన్‌గా నిలుస్తోంది.

లభించే హోదాలు: అర్హత, నైపుణ్యం ఆధారంగా డిజిటల్ మీడియా రంగంలో వివిధ రకాల ఉద్యోగాలు, హోదాలను అర్హులైన అభ్యర్థులు సొంతం చేసుకోవచ్చు.

ఎస్‌ఈఓ స్పెషలిస్ట్
డిజిటల్ మీడియా పరంగా అత్యంత క్రియాశీలకమైన ఉద్యోగం సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ స్పెషలిస్ట్. ప్రతి వెబ్‌సైట్ రేటింగ్స్ పరంగా ముందుండాలని కోరుకుంటుంది. అలా ముందుండాలంటే సదరు వెబ్‌సైట్ ద్వారా లభించే సేవలు, సదుపాయాలు, ప్రత్యేకతలు తెలియజేస్తూ ఆకట్టుకునే రీతిలో కంటెంట్‌ను రూపొందించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తులనే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ స్పెషలిస్ట్‌లు అంటారు. ఎస్‌ఈఓ స్పెషలిస్ట్‌లుగా కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు బ్యాచిలర్ డిగ్రీతోపాటు హెచ్‌టీఎంల్, సీఎస్‌ఎస్, బ్లాగింగ్ నైపుణ్యాలు ఉంటే సులువుగా కెరీర్ సొంతమవుతుంది.

సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్
డిజిటల్ మీడియాలో కంపెనీ డెవలప్‌మెంట్ కోణంలో మరో ముఖ్యమైన ఉపాధి అవకాశం సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్. సదరు కంపెనీ అందించే సేవలు, ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా అందరికీ అందుబాటులో ఉంచడమే కాకుండా, ఆ సమాచారాన్ని ఆకట్టుకునే రీతిలో రూపొందించడం సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ ప్రధాన విధి. సమాచారంలో కనిపించే ఆకర్షణను బట్టే సదరు వెబ్‌సైట్‌ను చూసే వారి సంఖ్య పెరుగుతుంది. ఈ హోదాలో కెరీర్ ప్రారంభించాలనుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అర్హత, సోషల్ మీడియా మార్కెటింగ్‌లో నైపుణ్యం, సృజనాత్మకంగా రాసే సామర్థ్యాలు అవసరం.

ఆన్‌లైన్ కమ్యూనిటీ మేనేజర్
డిజిటల్ మీడియా రంగంలో సోషల్ నెట్‌వర్క్ గ్రూప్స్, ఈ-మెయిల్ గ్రూప్స్‌కు సంస్థకు మధ్య వారధులుగా నిలిచే వ్యక్తులు ఆన్‌లైన్ కమ్యూనిటీ మేనేజర్లు. వీరి బాధ్యతలు ఏమిటంటే ఆన్‌లైన్ కమ్యూనిటీస్‌కు తమ సంస్థకు సంబంధించిన సమాచారాన్ని, బ్రాండ్ లాయల్టీని తెలియజేసే విధంగా వ్యవహరించి వెబ్ ట్రాఫిక్ పెరిగేలా చూడటం. ఇది ప్రధానంగా విజువలైజేషన్ నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. అంటే తమ సంస్థకు సంబంధించిన సమాచారాన్ని చిత్రాలు, వీడియోల రూపంలో ఆకట్టుకునే రీతిలో రూపొందించడం. ఈ ప్రొఫైల్ జాబ్ కోరుకునే అభ్యర్థులకు బ్యాచిలర్ డిగ్రీతోపాటు వీడియో ఎడిటింగ్, ఫోటోషాప్, వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ వంటి ఇతర టెక్నికల్ నైపుణ్యాలు కీలకం.

సోషల్ మీడియా మార్కెటింగ్ మేనేజర్
ఆన్‌లైన్ ద్వారా తమ సంస్థకు సంబంధించిన సమాచారాన్ని వీక్షకులకు ఆకట్టుకునే రీతిలో రూపొందించాల్సిన బాధ్యత సోషల్ మీడియా మార్కెటింగ్ మేనేజరుది. దీనికితోడు సోషల్ మీడియా తీరుతెన్నులు, ఇతర వ్యూహాలకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వర్తించాల్సి ఉంటుంది.

అవకాశాలకు అనుకూల వేదిక
శరవేగంగా విస్తరిస్తున్న డిజిటల్ మీడియా మరెన్నో అవకాశాలకు వేదికగా నిలుస్తోంది. ముఖ్యంగా బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత, ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు, ‘సి’ లాంగ్వేజ్, హెచ్‌టీఎంల్, వెబ్ డిజైనింగ్ వంటి బేసిక్ సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలు ఉంటే ఈ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ క్రమంలో లభించే కొన్ని ముఖ్యమైన ఉద్యోగాలు కంటెంట్ డెవలపర్, కంటెంట్ రైటర్, వెబ్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్.

అంకెల్లో డిజిటల్ మీడియా
  • ఇంటర్నెట్ వినియోగంలో భారతదేశం ప్రపంచంలో రెండో పెద్ద దేశంగా నిలుస్తోంది.
  • 2016 చివరి నాటికి 4జీ, ఇతర స్మార్ట్‌ఫోన్లవినియోగదారుల సంఖ్య 420 మిలియన్లకు చేరుకోనుంది.
  • 2015లో డిజిటల్ మీడియా అడ్వర్టయిజింగ్‌లో 50 శాతం వృద్ధిని నమోదు చేసింది.
  • డిజిటల్ మీడియాలో ప్రధాన భాగస్వామిగా మారిన ఈ- కామర్స్ రంగం 2016 సంవత్సరాంతానికల్లా 15 బిలియన్ డాలర్ల వృద్ధి సాధించనుంది.
  • డిజిటల్ మార్కెటింగ్ రంగంలో 2016 నాటికి లక్షన్నర ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.
డిజిటల్ మీడియా కోర్సులు- ఇన్‌స్టిట్యూట్‌లు
నానాటికీ డిజిటల్ మీడియా విస్తరిస్తున్న క్రమంలో నిపుణుల డిమాండు పెరుగుతోంది. ఈ రంగంలో స్పెషలైజ్డ్ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు...
  • ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం, సోషల్ మీడియా అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు
    సంస్థ:
    ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్
    వెబ్‌సైట్:  www.aima.in
  • ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం, డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు
    సంస్థ:
    డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ
    వెబ్‌సైట్:  www.digitalmarketing.ac.in
  • ఎస్‌ఈఓ, ఎస్‌ఎంఓ, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ కోర్సులు
    వెబ్‌సైట్:
      www.digitalmarketingacademy.co.in
పీజీ మీడియా మేనేజ్‌మెంట్‌లో ఒక సబ్జెక్టుగా..
ఇంతలా ప్రాచుర్యం పొందుతున్న డిజిటల్ మీడియా మేనేజ్‌మెంట్ కోర్సును మీడియా మేనేజ్‌మెంట్ పీజీ కోర్సులో భాగంగా పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఒక సబ్జెక్ట్‌గా అందిస్తున్నాయి. ఎస్‌పీ జైన్ ఇన్‌స్టిట్యూట్, సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, పెర్ల్ అకాడమీ వంటి పలు సంస్థలు పీజీ ఇన్ మీడియా మేనేజ్‌మెంట్‌లో ఒక కోర్సుగా డిజిటల్ మీడియాను అందిస్తున్నాయి.

సృజనాత్మకత ఉంటే అవకాశాలు అపారం
డిజిటల్ మీడియా రంగం వేగంగా విస్తరిస్తోంది. ఇదే సమయంలో పోటీ కూడా పెరుగుతోంది. ఈ రంగంలో ఔత్సాహికులకు సృజనాత్మకత, సంస్థకు సంబంధించిన సమాచారాన్ని ఆకర్షణీయంగా రూపొందించే నైపుణ్యాలు ఉంటే మరిన్ని అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ నైపుణ్యాలతో ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం వంటి హోదాల్లో చేరే వ్యక్తులకు ప్రారంభంలోనే సంవత్సరానికి రూ. నాలుగు లక్షల వరకు వేతనం లభించే అవకాశముంది. అదే విధంగా కంటెంట్ డెవలపర్, కంటెంట్ రైటర్ వంటి హోదాల్లో రెండు లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. ఏ హోదా అయినా కావలసిందల్లా సృజనాత్మకత, భావ ప్రసార నైపుణ్యాలు, వీక్షకులకు తప్పుల్లేకుండా సైరె న సమాచారాన్ని ఆకర్షణీయంగా చూపించగలిగే దృక్పథం అవసరం. ఇవే డిజిటల్ మీడియాలో కీలకం.
- అమితేశ్ కుమార్, ట్రైనర్, డిజిటల్ మీడియా మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్
Published date : 29 Jan 2016 11:43AM

Photo Stories