Skip to main content

సుస్థిర కెరీర్‌కు...సీఎంఏ!

మేనేజ్‌మెంట్ సేవల్లో కాస్ట్ అకౌంటెన్సీ చాలా ముఖ్యమైనది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో, ఆర్థిక ఒత్తిళ్లు సర్వసాధారణమైన తరుణంలో దీని ప్రాధాన్యం బాగా పెరిగింది.
కాస్ట్ అకౌంటెంట్లు ఇచ్చిన సమాచారం నాణ్యతపై కంపెనీల విజయాపజయాలు ఆధారపడి ఉంటున్నాయి! ఇలా కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే కాస్ట్ అకౌంటెంట్లకు నేడు డిమాండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే యువతకు కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ) సుస్థిర కెరీర్‌కు సరైన సోపానంగా నిలుస్తోంది. ఈ కోర్సు విధివిధానాలు, కెరీర్ అవకాశాలపై ఫోకస్...

వ్యయ వ్యవస్థల రూపకల్పన, పెట్టుబడుల విశ్లేషణ, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, అంతర్గత ఆడిట్, నిధుల నిర్వహణ, ధరల ప్రణాళికల రూపకల్పన-అమలు... ఇలా వివిధ కార్యకలాపాల ద్వారా కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్లు కంపెనీలో కీలక పాత్ర పోషిస్తారు. టాప్ మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయాలకు వీరిచ్చిన సమాచారమే ముడిసరకు. అందుకే ప్రతి రంగంలోనూ కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్లకు ప్రాధాన్యం పెరిగింది. చిన్న, పెద్దా అని తేడా లేకుండా ప్రస్తుతం అన్ని సంస్థలకూ వీరి సేవలు అవసరమవుతున్నాయి. ఈ క్రమంలో కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ) కోర్సును పూర్తిచేసి, ఉన్నత వేతనాలతో కార్పొరేట్ కొలువులను అందుకోవచ్చు.

సీఏంఏ కోర్సు:
1959 పార్లమెంటు చట్టం ద్వారా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థను ఏర్పాటు చేశారు. ఇది కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ(సీఎంఏ) కోర్సును నిర్వహిస్తోంది. ఈ కోర్సు మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్ కోర్సు, ఇంటర్మీడియెట్ కోర్సు, ఫైనల్ కోర్సు. సీఎంఏ కోర్సును ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంటెంట్స్ (ఐఎఫ్‌ఏసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులతో అందిస్తున్నారు.

ఫౌండేషన్ కోర్సు:
ఈ కోర్సుకు కనీస అర్హత ఇంటర్మీడియెట్/10+2/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూసే వారు కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ ఫౌండేషన్ కోర్సు పరీక్షలు ఏటా మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో జరుగుతాయి. జూన్‌లో జరిగే పరీక్షలకు హాజరుకావాలంటే జనవరి 31 లోగా దరఖాస్తు చేసుకోవాలి. అదే విధంగా డిసెంబర్ పరీక్షలకు హాజరుకావాలంటే జులై 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఫౌండేషన్ కోర్సులో మొత్తం నాలుగు పేపర్లుంటాయి. అవి.. పేపర్ 1: ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్‌మెంట్, పేపర్-2: ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, పేపర్-3: ఫండమెంటల్స్ ఆఫ్ లాస్ అండ్ ఎథిక్స్; పేపర్-4: ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్.

ఇంటర్మీడియెట్ కోర్సు:
సీఎంఏ ఫౌండేషన్ కోర్సు ఉత్తీర్ణులు లేదా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ ఇంటర్మీడియెట్ కోర్సుకు తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్ కోర్సు రెండు స్టేజ్‌లుగా ఉంటుంది. ప్రతి దశలో మూడు పేపర్లుంటాయి. ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే క్రమంలో నిర్ణీత తేదీల్లోపు సంబంధిత దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి.

ఫైనల్ కోర్సు:
ఇంటర్మీడియెట్ కోర్సు పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో కాస్ట్ అండ్ వర్‌‌క అకౌంటెన్సీ ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దే క్రమంలో చివరి దశ ఫైనల్ కోర్సు. సీఎంఏ- ఇంటర్మీడియెట్ కోర్సు పూర్తిచేసిన వారు ఆర్నెల్లు ప్రాక్టికల్ శిక్షణ పొందితేనే ఫైనల్ పరీక్ష రాసేందుకు అర్హులు.
  • ఫైనల్ పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. సీఎంఏ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు తమ ఆసక్తికి అనుగుణంగా మొదట ఫైనల్ కోర్సులోని రెండు దశల్లో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఒకేసారి రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనల్ తర్వాత మూడేళ్లు ప్రాక్టికల్ శిక్షణ పూర్తిచేయాలి.

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్:
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా... ఎప్పటికప్పుడు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌ను ఏర్పాటు చేస్తోంది. కోర్సు పూర్తిచేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఈ ప్లేస్‌మెంట్స్‌కు హాజరవుతున్నాయి. ఉన్నత వేతనాలతో ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ అండ్ ఐటీఈఎస్, కన్సల్టింగ్, ఫైనాన్స్/బ్యాంకింగ్ తదితర రంగాలకు చెందిన కంపెనీలు సీఎంఏ కోర్సు పూర్తిచేసిన వారికి అవకాశాలు ఇస్తున్నాయి. యాక్సెంచర్, అశోక్ లేల్యాండ్ లిమిటెడ్, జెన్‌ప్యాక్ట్ లిమిటెడ్, హెచ్‌సీఎల్, ఐసీఐసీఐ, ఐగేట్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, టీసీఎస్, విప్రో, సెబీ వంటి సంస్థలు నైపుణ్యవంతులైన కాస్ట్ అకౌంటెంట్లకు లక్షల ప్యాకేజీలతో ఆఫర్లు ఇస్తున్నాయి.

గత క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ఆధారంగా రంగాల వారీగా అవకాశాలు:
‘కార్పొరేట్’ అవకాశాలు:
సీఎంఏ పూర్తిచేసిన అభ్యర్థులు ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, వస్తూత్పత్తి సంస్థలు, ఇన్సూరెన్స్ సంస్థలు, మైనింగ్ సంస్థలు, డెవలప్‌మెంట్ ఏజెన్సీలు, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెక్టార్, ఇతర పారిశ్రామిక సంస్థల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, కాస్ట్ ఆడిటర్ వంటి హోదాలో ప్రవేశించొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ మాదిరిగానే ఇండియన్ కాస్ట్ అకౌంట్స్ సర్వీస్ అనే కేంద్ర సర్వీస్‌ను కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి ఐసీఎంఏఐలో ఫైనల్ పూర్తి చేసిన వారికి కేంద్ర సర్వీసులో అడుగుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. సొంతంగా కూడా కాస్ట్ అకౌంటెంట్‌గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

జాబ్ ప్రొఫైల్స్:
  • అకౌంట్స్ ఆఫీసర్
  • కాస్ట్ ఆఫీసర్
  • ఎగ్జిక్యూటివ్-అకౌంట్స్
  • ట్యాక్స్ అనలిస్ట్
  • కాస్ట్ ఆడిటర్

వేతనాలు:
వేతనాలు పూర్తిగా సంస్థ ప్రాధాన్యం, అభ్యర్థి నైపుణ్యాల ఆధారంగా ఉంటాయి. ప్రారంభంలో ఏడాదికి దాదాపు రూ.6 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ ఆధారంగా రూ. 30 నుంచి రూ. 40 లక్షల వేతనాలు కూడా అందుకోవచ్చు.

ప్రాక్టికల్ శిక్షణకు పెద్దపీట
మారిన నిబంధనల నేపథ్యంలో సేవా రంగం, సాఫ్ట్‌వేర్ రంగం ఇలా అన్ని రంగాల్లోనూ ప్రస్తుతం కాస్ట్ అకౌంటెంట్ల అవసరం పెరిగింది. ముఖ్యంగా ఉత్పత్తి (మ్యానుఫ్యాక్చరింగ్) సంస్థల్లో కాస్ట్ అకౌంటెంట్లకు డిమాండ్ ఎక్కువ. అందువల్ల సీఏంఏ కోర్సు నిర్వహణ సంస్థ ఐసీఏఐ... విద్యార్థుల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలకు పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో సీఏ తరహాలో మూడున్నరేళ్ల ప్రాక్టికల్ శిక్షణను తప్పనిసరి చేసింది. అయితే సీఎంఏ కోర్సు శిక్షణ విషయంలో కొంత వెసులుబాటు ఉంది. సీఏ తరహాలో మూడేళ్లు ఆర్టికల్‌షిప్ చేస్తేనే ఫైనల్ పరీక్షకు అర్హత అనే నిబంధన సీఎంఏలో లేదు. కోర్సు రెండో దశగా పేర్కొనే ఇంటర్మీడియెట్ తర్వాత ఆర్నెల్లు తొలి దశ ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను పూర్తి చేసుకుంటే ఫైనల్ పరీక్షలో హాజరయ్యేందుకు అనుమతి లభిస్తుంది. తర్వాత ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాక మాత్రం తప్పనిసరిగా మూడేళ్లపాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేయాలి. అప్పుడే సంస్థ నుంచి స్టూడెంట్‌షిప్ లభిస్తుంది.

అవకాశాలు అపారం
  • కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ) కోర్సు పూర్తిచేసిన వారికి వివిధ అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో అడుగుపెట్టొచ్చు.
  • బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో అధిక అవకాశాలుంటాయి. కన్సల్టెంట్‌గా కూడా వ్యవహరించవచ్చు.
  • విద్యా సంస్థలు, యూనివర్సిటీల్లో టీచింగ్ విభాగంలోనూ చేరొచ్చు. కామర్స్, అనుబంధ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ దిశగా కూడా వెళ్లొచ్చు.

Bavitha

Published date : 28 Aug 2015 12:56PM

Photo Stories