Skip to main content

ఫారెన్ ట్రేడ్‌లో పదిలమైన కెరీర్‌కు ఐఐఎఫ్‌టీ ఎంబీఏ

గ్లోబలైజేషన్ కారణంగా దేశీయ వ్యాపార విపణి ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానమైంది. మరోవైపు అంతర్జాతీయ వాణిజ్యం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఆ మేరకు ప్రపంచ మార్కెట్‌పై అవగాహన పెంపొందించుకొని, వాణిజ్యాన్ని పరుగులు పెట్టించే నైపుణ్యాలున్న మేనేజ్‌మెంట్ నిపుణులకు ఎంఎన్‌సీలు రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) అందిస్తున్న ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సుకు జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తాజాగా ఐఐఎఫ్‌టీ 2017-19 కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో వివరాలు..
కోర్సు: ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్)
సీట్ల వివరాలు: ఐఐఎఫ్‌టీ.. ఢిల్లీ, కోల్‌కతా క్యాంపస్‌ల్లో ఇంటర్నేషనల్ బిజినెస్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఢిల్లీ క్యాంపస్‌లో 220; కోల్‌కతా క్యాంపస్‌లో 140 సీట్లు ఉన్నాయి.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ. ఫైనలియర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు 2017, అక్టోబర్ 7 నాటికి డిగ్రీ ఉత్తీర్ణతను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఎలాంటి వయోపరిమితి లేదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ అండ్ ఎస్సే రైటింగ్ ఉంటాయి.
పరీక్ష విధానం: ప్రశ్నపత్రం మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్; లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలసిస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.

ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్
రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబైల్లో గ్రూప్ డిస్కషన్ , ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

కోర్సు వివరాలు
ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సులో ప్రధానంగా అంతర్జాతీయ వ్యాపారం, అనుబంధ అంశాలపై ఫోకస్ చేస్తారు. అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య, వ్యాపార విభాగాల్లో దేశీయ అవసరాలకు అనుగుణంగా ఫారిన్ ట్రేడ్‌కు సంబంధించి సమగ్ర అవగాహన కల్పిస్తారు.

ప్లేస్‌మెంట్స్
ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన ప్లేస్‌మెంట్ సెల్.. కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందిస్తోంది. ఈ ఏడాది ఢిల్లీ, కోల్‌కతా క్యాంపస్‌ల్లో మొత్తం 75 కంపెనీలు ప్లేస్‌మెంట్స్ కల్పించాయి. ఇందులో నలుగురు విద్యార్థులు రూ.కోటికి పైగా వార్షిక వేతన ప్యాకేజీ ఆఫర్‌ను అందుకున్నారు. అత్యధిక అంతర్జాతీయ ప్యాకేజ్ 1,50,000 అమెరికన్ డాలర్లు ఉండగా, అత్యధిక దేశీయ ప్యాకేజ్ రూ.29 లక్షలు.

2016- రిక్రూటింగ్ నిర్వహించిన కొన్ని కంపెనీలు
  • 3ఎం, యాక్చ్యుయేట్ బిజినెస్ కన్సెల్టింగ్, అడోబ్, ఎయిర్‌టెల్, అమెజాన్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బ్రిటిష్ టెలికామ్, కాగ్నిజెంట్ బిజినెస్ కన్సెల్టింగ్, గెయిల్, గోద్రేజ్ కన్జ్యూమర్, గూగుల్, హెచ్‌సీఎల్, హెచ్‌ఎస్‌బీసీ, ఐబీఎం, ఐసీఐసీఐ, ఐటీసీ, ఎస్‌బీఐ, సోనీ ఎంఎస్‌ఎం, స్విస్ సింగపూర్, టాటా స్కై, టాటా స్టీల్, ట్రైడెంట్, వొడాఫోన్, విప్రో, ఎస్ బ్యాంక్.

దరఖాస్తు విధానం
ఆన్‌లైన్:
www.iift.edu ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్: పూర్తిచేసిన దరఖాస్తును పోస్టు ద్వారా లేదా స్వయంగా ఐఐఎఫ్‌టీ క్యాంపస్‌లో అందించవచ్చు. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్.. ‘‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, బీ-21 కుతుబ్ ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, న్యూఢిల్లీ-110016’’.

ముఖ్య తేదీలు
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 5, 2016.
  • ఆఫ్‌లైన్ దరఖాస్తు చేరేందుకు చివరి తేది: సెప్టెంబర్ 5, 2016.
  • దరఖాస్తు ఫీజు: రూ.1,550 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ.775)
  • ప్రవేశ పరీక్ష: నవంబర్ 27, 2016
  • ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్: జనవరి/ఫిబ్రవరి-2017
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
వెబ్‌సైట్: edu.iift.ac.in

డీమ్డ్ హోదా
విదేశీ వాణిజ్య రంగానికి నిపుణులైన మానవ వనరులను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1963లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)ను ఏర్పాటు చేశారు. ఇంటర్నేషన్ బిజినెస్‌లోని ఆధునిక పద్ధతులు, నూతన విధానాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ.. ఐఐఎఫ్‌టీ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (నాక్)‘ఎ’ గ్రేడ్ గుర్తింపుతో పాటు 2002లో డీమ్డ్ యూనివర్సిటీ హోదాను పొందింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటర్నేషనల్ బిజినెస్ ఎడ్యుకేషన్‌ను అందిస్తోంది. ఇంటర్నేషనల్ ట్రేడ్‌కు సంబంధించి కార్పొరేట్ విభాగాలు, ప్రభుత్వ సంస్థలతో పాటు వ్యక్తిగత స్థాయిలోనూ శిక్షణ, పరిశోధనావకాశాలను కల్పిస్తోంది. బోధన, పరిశోధనలతో పాటు విదేశీ విశ్వవిద్యాలయాలతో కొలాబరేషన్స్ ద్వారా అభ్యర్థులకు పూర్తిస్థాయి బిజినెస్ నాలెడ్జ్‌ను అందిస్తోంది. అంతేకాకుండా ఐఐఎఫ్‌టీ వివిద అంతర్జాతీయ విద్యా సంస్థలతో అవగాహన ఒప్పందాలు కలిగి ఉంది.
Published date : 22 Jul 2016 12:38PM

Photo Stories