Skip to main content

పార్ట్‌టైం ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ

మేనేజ్‌మెంట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికీ.. సెలవుపై వెళ్లి ఉన్నత విద్యాభ్యాసం చేసే అవకాశం రాకపోవచ్చు. అంతమాత్రాన వాళ్లు చదువుకోవాలనే కోరికను వదులుకోవాల్సిన అవసరం లేదు. కొలువులకు హాజరవుతూనే క్లాసులకు వెళ్లేందుకు పార్ట్‌టైం ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ వీలు కల్పిస్తోంది. నిర్వహణ సంబంధ అంశాల్లో లోతైన పరిజ్ఞానాన్ని అందిస్తోంది. ఈ కోర్సుతో ఇలాంటి ప్రయోజనాలు మరెన్నో ఉన్నాయి. వాటిపై స్పెషల్ ఫోకస్..
సమయానుకూలం పార్ట్‌టైం ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ తరగతులకు మనకు అనుకూలమైన, ఖాళీ సమయాల్లో హాజరయ్యే వీలుంటుంది. ఉదయం/సాయంత్రం వెళ్లొచ్చు. వారాంతపు సెలవు దినాల్లోనూ అటెండ్ కావొచ్చు. ఒక్కో బిజినెస్ స్కూలు ఒక్కో టైమ్ టేబుల్‌ను అనుసరిస్తోంది. కొన్ని స్కూళ్లు క్లాస్ రూం టీచింగ్‌తోపాటు ఆన్‌లైన్ బోధనా విధానాన్నీ సంయుక్తంగా అమలుచేస్తున్నాయి. కోర్సు కాల వ్యవధి కనీసం ఏడాది మొదలుకొని మూడేళ్లు ఉంటోంది. అందువల్ల తరగతి గది బోధనకు చాలా తక్కువ సమయాన్ని (షార్ట్ అవర్స్‌ను/పీరియడ్స్‌ను) కేటాయిస్తున్నారు.

సమన్వయం
వృత్తిగత, వ్యక్తిగత జీవితాల మధ్య సమన్వయం చేసుకోవచ్చు. ఉద్యోగం చేసే నగరంలోనే ఉన్నత విద్యను పొందొచ్చు. ఫుల్‌టైం కోర్సు విద్యార్థుల్లా ఫ్యామిలీకి దూరంగా వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. రోజువారీ కార్యక్రమాలను యథాతథంగా కొనసాగించొచ్చు. ఒకే రోజులో ముచ్చటగా మూడు పనులు చేసుకునేలా డైలీ షెడ్యూల్‌ను రూపొందించుకోవచ్చు. కార్యాలయ పని వేళలు ముగియగానే క్లాసులకు వెళ్లి, తర్వాత ఇంటికొచ్చి ఇతర అసైన్‌మెంట్లు, రెగ్యులర్ ప్రిపరేషన్ ఏమైనా ఉంటే పూర్తిచేసుకోవచ్చు. అయితే పని.. చదువు.. పర్సనల్ లైఫ్.. ఈ మూడింటినీ సమర్థవంతంగా సమన్వయం చేసుకోవడం సవాల్‌తో కూడిన పని.

తక్కువ ఫీజులు
ఫుల్‌టైం ఎగ్జిక్యూటివ్ ఎంబీఏతో పోల్చుకుంటే పార్ట్‌టైం కోర్సుకు ఫీజులు చాలా తక్కువ. పార్ట్‌టైం ఎగ్జిక్యూటివ్ ఎంబీఏకి ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.15 లక్షలు ఉంటుంది. కొన్ని బీ స్కూళ్లు పార్ట్‌టైం కోర్సుకి స్కాలర్‌షిప్ ఇస్తాయి. కొన్ని కంపెనీలైతే స్పాన్సర్‌షిప్‌నూ ఆఫర్ చేస్తాయి.

ఒకే కరిక్యులం-ఒకే ఫ్యాకల్టీ
పార్ట్‌టైం ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సు చేయాలనుకుంటే పేరొందిన విద్యా సంస్థల్లో చేరడం వల్ల ముఖ్యంగా రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి.. ఫుల్‌టైం కోర్సులకు, పార్ట్‌టైం కోర్సులకు దాదాపు ఒకే కరిక్యులం (పాఠ్య ప్రణాళిక-సిలబస్) ఉంటుంది. సిలబస్‌ను పార్ట్‌టైం కోర్సు విద్యార్థుల అవసరాల కోసం కాస్త రీడిజైన్ చేసినప్పటికీ కీలకాంశాల్లో మాత్రం మార్పుండదు. రెండు.. ఫుల్‌టైం కోర్సుల ఫ్యాకల్టీయే పార్ట్‌టైం కోర్సులనూ బోధిస్తారు. అందువల్ల చదువుల నాణ్యత ఏమాత్రం తగ్గదు. ఫుల్‌టైం ఎగ్జిక్యూటివ్ ఎంబీఏతో పోల్చితే పార్ట్‌టైం కోర్సు కొంత సులువుగానే ఉంటుంది. ఫుల్‌టైం కోర్సులో క్లాసులు, అసైన్‌మెంట్ల సంఖ్య ఎక్కువ. వీటికి ఎక్‌స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అదనం.

క్లాస్‌రూం అనుసంధానం
పార్ట్‌టైం ఎగ్జిక్యూటివ్ ఎంబీఏలో ఉన్న ప్రాథమిక ప్రయోజనం ఏమిటంటే తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను రోజువారీ వృత్తిగత జీవితంలో అమలుచేసే అవకాశం ఉండటం. దీనివల్ల ఉద్యోగి పని తీరు మెరుగుపడటమే కాకుండా వర్క్‌ప్లేస్‌లో తలెత్తే సందేహాలను అదే రోజు క్లాస్‌రూంలో నివృత్తి చేసుకోవచ్చు.

నెట్‌వర్కింగ్
పార్ట్‌టైం కోర్సు వల్ల ఉద్యోగుల నెట్‌వర్క్, కాంటాక్ట్‌లు పెరుగుతాయి. వివిధ రంగాల ప్రముఖులు, విశ్లేషకులు గెస్ట్ లెక్చర్స్‌లో భాగంగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు. దీంతో రెండు వర్గాల మధ్య పరిచయాలు ఏర్పడతాయి. భవిష్యత్‌లో ఒక ఫీల్డ్ నుంచి మరో ఫీల్డ్‌లోకి మారాలనుకున్నప్పుడు ఇవి ఉపయోగపడతాయి.

పనితీరులో మార్పు వచ్చింది
పార్ట్‌టైం ఎగ్జిక్యూటివ్ ఎంబీఏలో చేరకముందు సేల్స్, మొడాలిటీలో రోజూ రొటీన్‌గా పనిచేసేవాణ్ని. ఈ కోర్సులో చేరిన తర్వాత నా పనితీరులో చాలా మార్పు వచ్చింది. ఫైనాన్స్, మార్కెటింగ్, స్ట్రాటజీ, ఎస్‌సీఎం, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌పై పూర్తి అవగాహన ఏర్పడింది. క్లాస్‌లో నేర్చుకున్న కొత్త అంశాలను రోజువారీ పనిలో అన్వయించేవాణ్ని. ఫలితంగా నాలో విశ్లేషణ సామర్థ్యం పెరిగింది. దీంతో వినియోగదారుల, సహోద్యోగుల దృష్టిని ఆకర్షించ గలిగాను.
- చందర్ శేఖర్ సిబల్, లక్నో ఐఐఎం పూర్వ విద్యార్థి.
Published date : 06 Jul 2016 04:40PM

Photo Stories