Skip to main content

క్యాట్ 2015.. మలి దశ ఎంపికకు ప్రణాళిక

కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2015 ముగిసింది. ఆన్‌లైన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాతతొలిసారి ఒకే రోజు (రెండు స్లాట్లు) నిర్వహించడం ఈ ఏడాది క్యాట్ ప్రత్యేకత. క్యాట్-2015పై విశ్లేషణతోపాటు ఎంత పర్సంటైల్ సాధిస్తే ఐఐఎంల నుంచి చివరి దశ ఎంపిక ప్రక్రియకు కాల్ అందుకోవచ్చు? మలి దశ ఎంపిక ప్రక్రియలో ఉండే గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, రిటెన్ ఎబిలిటీ టెస్ట్ తదితర అంశాల్లో రాణించేందుకు నిపుణుల సలహాలు.. సూచనలు..
క్యాట్-2015 గణాంకాలు
  • 2,28,644.. దరఖాస్తుల సంఖ్య
  • 1,79,602.. హాజరైన అభ్యర్థులు
  • 67,590.. నాన్-ఇంజనీరింగ్ విద్యార్థులు
  • 1,12,012.. ఇంజనీరింగ్ విద్యార్థులు
  • 58,270.. మహిళా అభ్యర్థులు (ఆన్‌లైన్ విధానంలో క్యాట్ నిర్వహిస్తున్నప్పటి నుంచీ ఇదే అత్యధికం).

పెరిగిన ఎంసీక్యూల సంఖ్య
క్యాట్-2015 ను ఐఐఎం-అహ్మదాబాద్ ముందుగా ప్రకటించినట్లుగానే మూడు సెక్షన్లలో నిర్వహించింది. ఇక్కడ ప్రధాన మార్పు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల సంఖ్య పెరగడం. మొత్తం మూడు సెక్షన్లలో వంద ప్రశ్నలకు గాను 67 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలే వచ్చాయి. ఇది అభ్యర్థులు మంచి స్కోర్లు సాధించే దిశగా ఇబ్బందికి గురి చేసే పరిణామంగా మారింది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రశ్నల క్లిష్టత స్థాయి పెరిగిందని చెప్పొచ్చు.

వీఏఆర్‌సీ ఇలా
వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్‌లో మొత్తం 34 ప్రశ్నలు అడగ్గా వాటిలో 24 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉన్నాయి. ఈ సెక్షన్ క్లిష్టత స్థాయి సాధారణం నుంచి కఠినంగా ఉంది. మొత్తం 34 ప్రశ్నల్లో సాధారణ విద్యార్థులు 18 వరకు సమాధానం ఇచ్చే విధంగా ఉన్నాయి. ఈ సెక్షన్‌లో 22 నుంచి 24 ప్రశ్నలకు సమాధానాలిస్తే 95 పర్సంటైల్, 26 నుంచి 28 ప్రశ్నలకు సమాధానమిస్తే 99 పర్సంటైల్ పొందే అవకాశం ఉంది.

డీఐఎల్‌ఆర్.. అత్యంత క్లిష్టంగా
మొత్తం మూడు సెక్షన్లలో అత్యంత క్లిష్టంగా ఉన్న సెక్షన్.. డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్. ఈ విభాగంలోనూ ఎంసీక్యూలే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 32 ప్రశ్నల్లో 24 ప్రశ్నలను మల్టిపుల్ ఛాయిస్ విధానంలో అడిగారు. సాధారణ అభ్యర్థులు 8 కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలివ్వడం కష్టతరంగా ఉండొచ్చు. ఈ విభాగంలో 12 ప్రశ్నలకు సరైన సమాధానాలిస్తే 95 పర్సంటైల్, 14 నుంచి 15 ప్రశ్నలకు సరైన సమాధానాలిస్తే 99 పర్సంటైల్ పొందే అవకాశం ఉంది.

క్యూఏ.. సాధారణ స్థాయిలో
క్వాంటిటేటివ్ ఎబిలిటీ సెక్షన్ క్లిష్టత సాధారణ స్థాయిలో ఉంది. ఈ విభాగంలోని 34 ప్రశ్నల్లో 19 ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో, 15 ప్రశ్నలు కొశ్చన్-ఆన్సర్ విధానంలో ఉన్నాయి. 21 నుంచి 23 ప్రశ్నలకు సమాధానమిస్తే 95 పర్సంటైల్, 25 నుంచి 27 ప్రశ్నలకు సమాధానమిస్తే 99 పర్సంటైల్ పొందే అవకాశాలున్నాయి.

99 పర్సంటైల్ పొందేందుకు అవకాశం!
ప్రశ్నలు అడిగిన తీరు స్వరూపాన్ని బట్టి క్యాట్-2015ను కొంచెం క్లిష్టంగా ఉందని చెప్పొచ్చు. మొత్తం వంద ప్రశ్నలకు జరిగిన ఈ పరీక్షలో 54 నుంచి 59 ప్రశ్నలకు సరైన సమాధానాలిస్తే 95 పర్సంటైల్, 65 నుంచి 70 ప్రశ్నలకు సరైన సమాధానమిస్తే 99 పర్సంటైల్ పొందే అవకాశం ఉంది.

మలి దశపై ఫోకస్
క్యాట్-2015 క్లిష్టంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగానే... మరోవైపు ఐఐఎంలలో 2016-18 ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతోంది. దాదాపు అన్ని ఐఐఎంలు గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలకు సన్నాహాలు చేస్తున్నాయి. అభ్యర్థులు వీటిలో ప్రతిభ చూపితే ప్రవేశాలను దాదాపు ఖరారు చేసుకోవచ్చు.

గ్రూప్ డిస్కషన్
క్యాట్ స్కోర్, అకడమిక్ రికార్డ్, ఇతర వెయిటేజీల ఆధారంగా ఎంపిక ప్రక్రియకు అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. జీడీలో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి సోషల్ ఇష్యూస్ వరకు ఏదైనా ఒక అంశం గురించి చర్చించమంటారు. ప్రతి అభ్యర్థికి 10 నుంచి 15 నిమిషాల వ్యవధి లభిస్తుంది. సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలకు సంబంధించిన టాపిక్ అయితే దానికి పరిష్కార మార్గాలు సూచించే విధంగా అభ్యర్థులు మాట్లాడాలి. ఇందులో భాగంగా సమకాలీన చర్చనీయాంశాలపై అవగాహన పెంచుకోవాలి.

రిటెన్ ఎబిలిటీ టెస్ట్
కొన్ని ఐఐఎంలు మాత్రమే మలి దశ ఎంపికలో రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌ను నిర్వహిస్తున్నాయి. దాదాపు గ్రూప్ డిస్కషన్ ఉద్దేశానికి సరితూగే విధంగానే రిటెన్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. అభ్యర్థులకు ఏదైనా ఒక అంశం ఇస్తారు. దీనిపై అభ్యర్థులు చిన్నపాటి వ్యాసం రాసి, చివరలో అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఇప్పటి నుంచే అభ్యర్థులు సమకాలీన అంశాలపై పట్టుతోపాటు సెంటెన్స్ ఫార్మేషన్, బేసిక్ గ్రామర్ వంటి నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి.

పర్సనల్ ఇంటర్వ్యూ
పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రధానంగా అభ్యర్థుల్లో మేనేజ్‌మెంట్ కోర్సు పట్ల ఉన్న ఆసక్తి, లక్ష్యసాధనలో మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను వినియోగించే తీరుపై ప్రశ్నలు ఉంటాయి. వీటి కోసం అభ్యర్థులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి. మాక్ ఇంటర్వ్యూస్‌కు హాజరు కావడం ప్రయోజనకరంగా ఉంటుంది.

రెండు దశలుగా వెయిటేజీలు
ఐఐఎంలు రెండు దశలుగా విద్యార్థులను షార్ట్ లిస్ట్ చేస్తున్నాయి. తొలి దశలో క్యాట్ స్కోర్ ఇతర అంశాలకు వెయిటేజీ ఆధారంగా గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలకు ఎంపిక చేయడం. ఇందులో భాగంగా క్యాట్ స్కోర్ , పదో తరగతి నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకు పొందిన మార్కులు, పని అనుభవం, జండర్ డైవర్సిటీ, అకడమిక్ డైవర్సిటీ అంశాలను వెయిటేజీ పరంగా పరిగణలోకి తీసుకొంటున్నారు. తర్వాత తుది జాబితాల రూపకల్పలో మరోసారి ఆయా అంశాలకు సంబంధించి నిర్దిష్ట వెయిటేజీల ఆధారంగా ప్రవేశాలను ఖరారు చేస్తున్నాయి. అవి.. క్యాట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, పని అనుభవం, అకడమిక్ డైవర్సీటీ కోణంలో బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఆయా కోర్సులకు ఇచ్చిన రేటింగ్. ఈ వెయిటేజీలు ప్రతి ఐఐఎంకు వేర్వేరుగా ఉంటున్నాయి. ఉదాహరణకు.. ఐఐఎం కోల్‌కత మలి దశ ఎంపిక ప్రక్రియలోని రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసే క్రమంలో క్యాట్ స్కోర్‌కు 67 పాయింట్లు, పదో తరగతి మార్కులకు 15 పాయింట్లు, ఇంటర్ మార్కులకు 15 పాయింట్లు, జండర్ డైవర్సిటీకి మూడు పాయింట్ల చొప్పున వెయిటేజీ ఇస్తోంది. కానీ తుది జాబితా రూపొందించేటప్పుడు మాత్రం క్యాట్ స్కోర్‌కు 35 పాయింట్లే ఉండటం గమనార్హం. అయితే పర్సనల్ ఇంటర్వ్యూ (44 పాయింట్లు), రిటెన్ ఎబిలిటీ టెస్ట్ (10 పాయింట్లు)లకు తుది జాబితా రూపకల్పనలో అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.

ఐఐఎం అహ్మదాబాద్.. ప్రత్యేకంగా
అహ్మదాబాద్ ఐఐఎం ఎంపిక ప్రక్రియలో ప్రత్యేక విధానాలు పాటిస్తోంది. అప్లికేషన్ రేటింగ్ పేరుతో తుది జాబితా రూపకల్పన చేస్తోంది. పదో తరగతి, ఇంటర్, డిగ్రీలలో ఆయా విభాగాలకు ప్రత్యేకంగా కేటాయించిన రేటింగ్ పాయింట్లు ఆధారంగా టాప్-100 అభ్యర్థులు లేదా బ్యాచిలర్ డిగ్రీలో ఆయా విభాగాల్లో టాప్-1 పర్సంట్‌లో నిలిచిన అభ్యర్థులను మలి దశలో ఉండే అకడమిక్ రైటింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తుంది.

క్యాట్ కనీస కటాఫ్.. తప్పనిసరి
క్యాట్ స్కోర్‌తో పాటు ఇతర అంశాలకు వెయిటేజీ ఇచ్చినప్పటికీ..అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసే క్రమంలో అన్ని ఐఐఎంలు క్యాట్ కనీస కటాఫ్ పర్సంటైల్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ మేరకు.. క్యాట్-2015లో ఓపెన్ కేటగిరీలో పొందాల్సిన కనీస కటాఫ్ పర్సంటైల్ వివరాలు ఇన్‌స్టిట్యూట్‌ల వారీగా..

ఐఐఎం

వీఆర్‌సీ

డీఐఎల్‌ఆర్

క్యూఏ

మొత్తం

అహ్మదాబాద్

80

80

80

90

కోల్‌కత

80

80

80

90

బెంగళూరు

85

85

85

90

లక్నో

85

85

85

90

ఇండోర్

80

80

80

90

కోజికోడ్

80

80

80

90

ట్రిచీ

80

80

80

90

రాంచీ

80

80

80

90

రాయ్‌పూర్

80

80

80

90

ఉదయ్‌పూర్

80

80

80

90

కాశీపూర్

80

80

80

90

షిల్లాంగ్

70

70

70

85

రోహ్‌తక్

80

80

80

85

విశాఖపట్నం

80

80

80

90

బుద్ధగయ

80

80

80

90

అమృత్‌సర్, సంబల్‌పూర్, సిర్మౌర్

80

80

80

90


95 పర్సంటైల్‌కు పైగా
ఐఐఎంలు క్యాట్-2015 కనీస కటాఫ్ పర్సంటైల్‌లు ప్రకటించినప్పటికీ ప్రస్తుతమున్న పోటీ, సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే 95 పర్సంటైల్‌కు పైగా సాధించిన అభ్యర్థులే మలి దశకు అర్హత సాధించే పరిస్థితులున్నాయి. ఐఐఎం విశాఖపట్నంలో క్యాట్ - 2014 ద్వారా ప్రవేశాలు కల్పించిన 2015-16 విద్యా సంవత్సరంలో 96.03 పర్సంటైల్‌తో చివరి సీటు భర్తీ అయ్యింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే 95 పర్సంటైల్ పొందడం తప్పనసరిని తెలుస్తుంది.

మలి దశకు మరింత సన్నద్ధంగా
క్యాట్-2015 క్లిష్టతను పరిగణనలోకి తీసుకుంటే 50కి పైగా ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశామని భావించిన అభ్యర్థులు మలి దశకు సన్నద్ధం కావాలి. ఈ క్రమంలో గ్రూప్ డిస్కషన్‌లో ఎలాంటి టాపిక్ ఇచ్చినా చర్చించేందుకు సిద్ధమవ్వాలి. రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో రాణించేందుకు ఇంగ్లిష్ గ్రామర్ నైపుణ్యాలను పెంచుకుంటూ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. సొంతగా షార్ట్ స్టోరీస్ రాయడం, ప్రామాణిక ఇంగ్లిష్ దినపత్రికల్లోని వ్యాసాల సారాంశంతో సొంతగా నోట్స్ రాసే నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. పర్సనల్ ఇంటర్వ్యూలో రాణించేందుకు మాక్ ఇంటర్వ్యూస్‌కు హాజరవటం అభ్యర్థులకు లాభిస్తుంది.
- రామ్‌నాథ్ ఎస్ కనకదండి, క్యాట్ కోర్స్ డెరైక్టర్, టైమ్ ఇన్‌స్టిట్యూట్

అన్నిటికీ ప్రాధాన్యం
ఐఐఎంలలో ప్రవేశానికి క్యాట్ స్కోర్ తప్పనిసరైనప్పటికీ.. దాంతోపాటు ఇతర అంశాలు కూడా ప్రధానమే. ఇటీవల కాలంలో డైవర్సిటీ/ఈక్వాలిటీలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అకడమిక్ డైవర్సటీ, జండర్ డైవర్సిటీ వంటి వాటికి ఇన్‌స్టిట్యూట్‌లు ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. దీంతో క్యాట్ స్కోర్‌తో పాటు అకడమిక్ స్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన విద్యార్థులు మలిదశ ఎంపికలో ముందుంటారు. అభ్యర్థికి మేనేజ్‌మెంట్ నైపుణ్యాల అభ్యసనంపై ఉన్న ఆసక్తి, కోర్సులో చేరుతున్న లక్ష్యాలను పరీక్షించేలా ఇంటర్వ్యూ ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి నుంచి మొదలయ్యే ప్రక్రియలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి.
- ప్రొఫెసర్ సౌరవ్ ముఖర్జీ, కోఆర్డినేటర్, ఐఐఎం-వి
Published date : 10 Dec 2015 05:15PM

Photo Stories