Skip to main content

కెరీర్ ‘నిర్మాణా’నికి అనుకూల రంగం

రియాల్టీ రంగం పరిధి విస్తృతమవుతుండడంతో విద్యా ఉపాధి అవకాశాలకు కూడా ఊతమిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వాలు పెద్దపీట వేస్తుండటంతో ఈ రంగంలో శరవేగంగా వృద్ధి నమోదు చేసుకుంటోంది. గృహ నిర్మాణాలు మొదలుకుని భారీ పరిశ్రమలు, ప్రాజెక్టుల వరకు అన్నింటికీ మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. తద్వారా ఈ రంగంలో క్షేత్రస్థాయి ఉద్యోగాలు మాత్రమే కాకుండా కార్యాలయాలకు అవసరమైన అన్ని రకాలైన కొలువులు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా రియాల్టీ సెక్టార్ అభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. రియాల్టీ రంగంలో యువతకు కెరీర్ అవకాశాలు, వాటిని అందుకునే మార్గాలపై విశ్లేషణ...
ఉన్నత చదువులు చెప్పించడం.. సొంతంగా చిన్నపాటి ఇల్లు కట్టుకోవడం..ఇవీ సాధారణంగా మధ్య తరగతి ఉద్యోగులకు ఉండే జీవిత లక్ష్యాలు! ఇప్పుడు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు మార్గాలు అనేకం. ఆ మార్గాలు అందించే రంగమే రియాల్టీ సెక్టార్!

రియాల్టీ రంగం ఇటు మధ్యతరగతికి సొంతింటి కలను సాకారం చేస్తూనే యువతకు కెరీర్ పరంగానూ అవకాశాలు కల్పిస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా ఆయా వర్గాల ప్రజల ఇంటి నిర్మాణానికి పలు పథకాలు ప్రవేశ పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022’ పేరుతో ఓ కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఈ రంగంలో ఎఫ్‌డీఐలకు సైతం అనుమతులు మంజూరు చేస్తోంది. దీంతో భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రంగంలో ఉజ్వల కెరీర్ అవకాశాలు సొంతమవడం ఖాయం అంటున్నారు నిపుణులు. టాటా, మహీంద్రా అండ్ మహీంద్రా, డీఎల్‌ఎఫ్, మంత్రి డెవలపర్స్ వంటి ఇండస్ట్రీ దిగ్గజాలతోపాటు మరెన్నో భారీ నిర్మాణ సంస్థలు ఈ రంగంలో వ్యాపారం చేయడం ముమ్మరం చేశాయి. ఈ సంస్థలు అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా వ్యక్తిగత గృహ సముదాయాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు చేపడుతున్నాయి. గతేడాది ప్రముఖ రియాల్టీ సంస్థ డీఎల్‌ఎఫ్ ఐఐఎంలకు సైతం వెళ్లి క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా అభ్యర్థులను నియమించుకోవడమే ఈ రంగంలో మానవ వనరులకు ఏర్పడుతున్న డిమాండ్‌కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

అందరికీ అవకాశాలు
రియాల్టీ రంగంలో ఇంటర్మీడియెట్ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల వరకు ప్రతి ఒక్కరూ అవకాశాలు అందుకోవచ్చు. అభ్యర్థుల అర్హతలు, నైపుణ్యాల మేరకు జీతభత్యాలు, హోదాలు లభిస్తాయి. నేరుగా వినియోగదారులతో సంప్రదించే మార్కెటింగ్ విభాగం, ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకంగా నిలిచే సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ విభాగం వంటి వాటిలో ఉపాధి పొందొచ్చు. ప్రాజెక్ట్ తొలి దశలో కీలకమైన ల్యాండ్ సర్వేయింగ్, టెక్నికల్ డ్రాఫ్ట్‌మెన్స్ వంటి ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు మేనేజ్‌మెంట్, లీగల్ స్టడీస్ అభ్యర్థుల అవసరం కూడా ఈ రంగంలోని సంస్థలకు ఏర్పడుతోంది. సంస్థ కార్యకలాపాల నిర్వహణ పరంగా ఫైనాన్స్, హెచ్‌ఆర్ విభాగంలో మేనేజ్‌మెంట్ నిపుణులు అవసరమవుతున్నారు. అలాగే ప్రాజెక్ట్ చేపట్టినప్పటి నుంచి పూర్తిచేసే వరకు ఎలాంటి న్యాయ పరమైన సమస్యలు తలెత్తకుండా చూసేందుకు సంబంధిత న్యాయ శాస్త్ర అభ్యర్థుల అవసరం ఏర్పడుతోంది.

ప్రత్యేక కోర్సుల్లో నైపుణ్యాలు తప్పనిసరి
నాలుగేళ్ల కిందటి వరకు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రత్యేక కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌లు అందుబాటులో లేవు. కానీ ఈ రంగంలో పెరుగుతున్న వృద్ధి, కార్పొరేట్ సంస్థల ప్రవేశం వంటి కారణాలతో అకడమిక్ పరంగానూ కొన్ని సంస్థలు రియల్ ఎస్టేట్ సెక్టార్ విధులకు అవసరమైన స్పెషలైజ్డ్ కోర్సులను అందిస్తున్నాయి. నెగోషియేషన్, ల్యాండ్ సర్వేయింగ్, లే-ఔట్ డిజైన్ అండ్ డ్రాయింగ్, లైజనింగ్ స్కిల్స్ నైపుణ్యాలతోపాటు ల్యాండ్ యాక్ట్స్‌కు సంబంధించిన నైపుణ్యాలు అందించే కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటి ద్వారా కార్పొరేట్ రియాల్టీ సంస్థల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. ఈ కోర్సులను దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో ప్రవేశాలు ఆయా సంస్థల నియమ నిబంధనల మేరకు ఏటా జరుగుతాయి. ఔత్సాహికులు నిర్దిష్ట లక్ష్యంతో సిద్ధమైతే ఈ కోర్సుల్లో రాణించొచ్చు.

నైపుణ్యం కొద్దీ వేతనాలు
ప్రస్తుతం రియాల్టీ సెక్టార్‌లో వేతనాలు కూడా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. క్షేత్ర స్థాయిలో పనిచేసే మార్కెటింగ్ విభాగంలో ఎంట్రీ లెవల్‌లో మూడు లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. ఇక సంస్థ కార్యకలాపాలపరంగా నిర్వహణ, సాంకేతిక నైపుణ్యాలున్న మేనేజ్‌మెంట్, టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు దాదాపు 55 లక్షల వార్షిక వేతనం ఖరారవుతోంది. లోధా గ్రూప్, మంత్రి డెవలపర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, డీఎల్‌ఎఫ్ వంటి సంస్థలు ఐఐఎం, ఇతర ప్రముఖ బిజినెస్ స్కూళ్లకు వెళ్లి క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా ఫైనాన్స్, కన్సల్టింగ్ విభాగాల్లో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. వీరికి సగటున రూ. 14 లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. దీనికితోడు ఉద్యోగంలో చేరాక ఓ వైపు విధులు నిర్వహిస్తూనే అనుభవం, నైపుణ్యం సంపాదిస్తే కెరీరపరంగా మంచి పురోగతి సాధ్యమవుతుంది.

ఇవీ ఇన్‌స్టిట్యూట్లు
రియాల్టీ సెక్టార్‌లో అవసరమైన మేరకు కోర్సులు అందిస్తున్న స్పెషలైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ల వివరాలు..
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.nirem.org
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్
వెబ్‌సైట్: www.iire.co.in
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండ్ ఫైనాన్స్
వెబ్‌సైట్: www.iref.co.in
- నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్
వెబ్‌సైట్: www.narindia.com
- ఎడ్యుమార్క్ ఇండియా
వెబ్‌సైట్: www.edumarkindia.in
- రియల్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్
వెబ్‌సైట్: www.remi.edu.in
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్
వెబ్‌సైట్: www.nicmar.ac.in
- ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లెర్నింగ్ ఇన్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.iilm.edu.in
- గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.ipu.ac.in

ఈ ఇన్‌స్టిట్యూట్‌లు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి వివిధ రకాల కోర్సులను డిప్లొమా, పీజీ డిప్లొమా స్థాయిలో అందజేస్తున్నాయి. మేనేజ్‌మెంట్ పీజీలో రియల్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల్లో ప్రకటనలు ఆయా ఇన్‌స్టిట్యూట్ల షెడ్యూలుకు అనుగుణంగా వెలువడతాయి. ఔత్సాహికులు వాటిలో ప్రవేశాలు పొంది చక్కటి నైపుణ్యాలతో రాణిస్తే కార్పొరేట్ సంస్థల్లో కొలువులు ఖాయం.

రియాల్టీ రంగం-అంచనాలు
 • నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అంచనా ప్రకారం- 2015లో ఉపాధి కల్పనలో రియాల్టీ సెక్టార్ నాలుగో స్థానంలో నిలవనుంది.
 • 2017 నాటికి రియల్ ఎస్టేట్ కన్‌స్ట్రక్షన్ మార్కెట్ ఇరవై శాతం వృద్ధి చెందనుంది.
 • వచ్చే అయిదేళ్లలో ఈ రంగంలో పలు స్థాయిలు / హోదాల్లో 35 మిలియన్ ఉద్యోగాలు ఉత్పన్నం కానున్నాయి.
 • రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ ఏర్పాటుతో రియాల్టీ రంగం మరింత ఆశాజనకంగా మారనుంది.
 • 2020 నాటికి రియల్ ఎస్టేట్ మార్కెట్ 180 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది.
 • 2022 నాటికి ‘హౌసింగ్ ఫర్ ఆల్ స్కీం’ కారణంగా రియాల్టీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందనుంది.
కావలసిన నైపుణ్యాలు
రియల్ ఎస్టేట్ రంగంలో కెరీర్ ఔత్సాహికులకు ప్రధానంగా సంప్రదింపు నైపుణ్యాలు, ఇంటర్ పర్సనల్ నైపుణ్యాలు చాలా అవసరం. ముఖ్యంగా మార్కెటింగ్ విభాగాల్లో చేరే అభ్యర్థులకు ఇవి తప్పనిసరి. టెక్నికల్ విభాగాల ఔత్సాహికులకు క్షేత్ర స్థాయిలో పనిచేసే ఓర్పు ఉండాలి. సంస్థ టార్గెట్ వినియోగదారులు, వారికి అనుకూలమైన రీతిలో డిజైన్ రూపొందించే నైపుణ్యాలు కావాలి. వినియోగదారులను ఒప్పించి ఉత్పత్తులను అమ్మే నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఈ రంగంలో టెక్నాలజీలో వస్తున్న మార్పులు, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలో వంటి వినూత్న మార్పులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలి.

టాప్ కంపెనీలు
 • డీఎల్‌ఎఫ్ బిల్డింగ్
 • సన్ సిటీ ప్రాజెక్ట్స్
 • మహీంద్రా లైఫ్ స్పేసెస్
 • టాటా హౌసింగ్
 • మ్యాజిక్ బ్రిక్స్
 • మంత్రి డెవలపర్స్
 • మిట్టల్ బిల్డర్స్
 • రహేజా కన్‌స్ట్రక్షన్స్
అవకాశాలు అందిపుచ్చుకోవాలి
రియాల్టీ లేదా రియల్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్ అంటేనే చాలా మందికి ఇప్పటికీ ప్రతికూల భావన! ముఖ్యంగా కెరీర్ పరంగా యువత ఈ రంగంవైపు పెద్దగా దృష్టి సారించడం లేదు. ఎందుకంటే సాధారణంగా రియల్ ఎస్టేట్ అనగానే కేవలం క్రయ, విక్రయాలు జరిపే ఏజెంట్లే గుర్తుకొస్తారు. అయితే ట్రెండ్ మారుతోంది. ఈ రంగం కూడా కార్పొరేట్ రూపు సంతరించుకుంటోంది. పలు బహుళ జాతి సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ప్రవేశిస్తున్నాయి. కెరీర్ అవకాశాలు అనేకం లభిస్తున్నాయి. మరోవైపు బ్యాంకులు సైతం గృహ రుణాల్లో వడ్డీ రేట్లు తగ్గించడం, కార్పొరేట్ సంస్థలు చేపడుతున్న హౌసింగ్ ప్రాజెక్ట్‌ల విషయంలో పరస్పర ఒప్పందాల ద్వారా రుణ మంజూరు వంటి చర్యల నేపథ్యంలో ఈ రంగం వృద్ధి పరంగా పురోగమిస్తోంది.
- కె.అనిల్ కుమార్, డీజీఎం, మహీంద్రా లైఫ్ స్పేసెస్

ప్రత్యేక నైపుణ్యాలతో రాణించొచ్చు
కార్పొరేట్ సంస్థలు అడుగు పెడుతున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం కెరీర్ ఔత్సాహికులకు స్వాగతం పలుకుతోంది. అవసరమైన మేరకు ప్రత్యేక నైపుణ్యాలతో రాణించే వారికి ఈరంగంలో చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా టెక్నికల్ డ్రాయింగ్, సర్వేయింగ్ వంటి నైపుణ్యాలు ఉంటే ఎంట్రీ లెవల్‌లోనే మంచి వేతనం అందుకోవచ్చు. అంతేకాకుండా ప్రాజెక్ట్ అప్రైజల్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ వంటి నైపుణ్యాలతో మిడిల్ లెవల్ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఉద్యోగాలు పొందిన తర్వాత కూడా నైపుణ్యాలను వృద్ధి చేసుకుని మరింతగా రాణిస్తే కెరీర్లో ఉన్నత స్థానాలకు ఎదగవచ్చు. మార్కెట్లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా డిజైన్లను రూపొందిస్తే కంపెనీలు మంచి ప్రోత్సాహకాలు అందిస్తాయి.
- రవి గుప్తా, సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్, NICMAR
Published date : 23 Oct 2015 05:30PM

Photo Stories