Skip to main content

కెరీర్ గైడెన్స్... కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ)

అకౌంటింగ్ రంగాల్లో సమున్నత భవిష్యత్తును కోరుకునే విద్యార్థులకు చక్కటి అవకాశం కల్పిస్తున్న కోర్సు.. కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ). ఈ కోర్సును ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ) నిర్వహిస్తుంది.

అర్హత: ఇంటర్మీడియెట్

మూడు దశలుగా:
  • కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ) కోర్సు మూడు దశలుగా ఉంటుంది. అవి..
  • ఫౌండేషన్ కోర్సు
  • ఇంటర్మీడియెట్ కోర్సు
  • ఫైనల్ కోర్సు
ఫౌండేషన్ కోర్సు:
కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెన్సీ కోర్సు క్రమంలో తొలి దశ ఫౌండేషన్ కోర్సు. ఈ కోర్సులో పేరు నమోదు చేసుకోవడానికి కనీస అర్హత ఇంటర్మీడియెట్ / 10+2 / తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూసే వారు కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ ఫౌండేషన్ కోర్సు పరీక్షలు ప్రతి ఏటా రెండు సార్లు జూన్, డిసెంబర్ నెలల్లో జరుగుతాయి. జూన్‌లో జరిగే పరీక్షలకు హాజరవ్వాలనుకుంటే అంతకుముందు సంవత్సరం డిసెంబర్ 5వ తేదీలోపు, డిసెంబర్‌లో జరిగే పరీక్షలకు హాజరవ్వాలనుకుంటే అదే సంవత్సరం జూన్ 5వ తేదీలోపు పేరు నమోదు చేసుకోవాలి. ఫౌండేషన్ కోర్సులో మొత్తం నాలుగు పేపర్లుంటాయి. అవి..
  1. ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ఫండమెంటల్స్
  2. అకౌంటింగ్
  3. ఎకనామిక్స్ అండ్ బిజినెస్ ఫండమెంటల్స్
  4. బిజినెస్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఫండమెంటల్స్.
ప్రతి పేపర్‌కు వంద మార్కులు.

ఇంటర్మీడియెట్ కోర్సు:
ఐసీఎంఏఐ ఫౌండేషన్ కోర్సు ఉత్తీర్ణులు లేదా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ ఇంటర్మీడియెట్ కోర్సుకు తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్ కోర్సు రెండు స్టేజ్‌లుగా ఉంటుంది. ప్రతి స్టేజ్‌లో మూడు పేపర్లుంటాయి. అవి..

స్టేజ్-1 :
ఫైనాన్షియల్ అకౌంటింగ్; కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ లాస్ అండ్ ఆడిటింగ్, అప్లయిడ్ డెరైక్ట్ ట్యాక్సేషన్.

స్టేజ్-2:
కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ; ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అప్లయిడ్ ఇన్ డెరైక్ట్ ట్యాక్సేషన్

ఔత్సాహిక అభ్యర్థులు ఏదో ఒక స్టేజ్ కోసం, లేదా ఒకేసారి రెండు స్టేజ్‌ల కోసం పేరు నమోదు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం:
ప్రతి ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్‌లలో నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే క్రమంలో నిర్ణీత తేదీల్లోపు సంబంధిత దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. డిసెంబర్‌లో జరిగే పరీక్షలకు జూన్ 5వ తేదీలోపు; జూన్‌లో జరిగే పరీక్షలకు అంతకు ముందు సంవత్సరం డిసెంబర్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఫైనల్ కోర్సు:
ఇంటర్మీడియెట్ కోర్సు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో కాస్ట్ అండ్ వవర్క్ అకౌంటెన్సీ ప్రొషెషనల్‌గా తీర్చిదిద్దే క్రమంలో చివరి దశ ఫైనల్ కోర్సు. ఇది రెండు స్టేజ్‌లలో (స్టేజ్ -3, 4) ఉంటుంది.

స్టేజ్- 3:
  • క్యాపిటల్ మార్కెట్ అనాలిసిస్ అండ్ కార్పొరేట్ లాస్.
  • ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్.
  • మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ - స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్.
  • ఇన్‌డెరైక్ట్ అండ్ డెరైక్ట్ ట్యాక్స్ మేనేజ్‌మెంట్.
స్టేజ్-4
  • మేనేజ్‌మెంట్ అకౌంటింగ్- ఎంటర్‌ప్రైజ్ పెర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్.
  • అడ్వాన్‌‌సడ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్.
  • కాస్ట్ ఆడిట్ అండ్ ఆపరేషనల్ ఆడిట్.
  • బిజినెస్ వాల్యుయేషన్ మేనేజ్‌మెంట్.
సీఎంఏ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు తమ ఆసక్తికి అనుగుణంగా మొదట ఫైనల్ కోర్సులోని రెండు స్టేజ్‌లలో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఒకేసారి రెండు స్టేజ్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలను కూడా ఏటా రెండుసార్లు (జూన్, డిసెంబర్‌లలో) నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన దరఖాస్తు తేదీల క్రమం కూడా.. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్ కోర్సుల మాదిరిగానే ఉంటుంది.

ఉన్నత విద్య:
సీఎంఏ కోర్సుకు కూడా ప్రభుత్వం గ్రాడ్యుయేషన్‌తో సమానమైన గుర్తింపునిచ్చింది. ఈ నేపథ్యంలో కామర్స్, అకౌంటింగ్, మేనేజ్‌మెంట్ సంబంధిత తదితర అకౌంటింగ్ సంబంధిత కోర్సుల్లో బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా ఉండే అన్ని ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశించొచ్చు. అదే అర్హతతో నిర్వహించే పోటీ పరీక్షలకు కూడా హాజరు కావచ్చు.

ఇగ్నో సంయుక్త కోర్సులు:
సాధారణంగా సీఎంఏ కోర్సులో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసి ఇంటర్మీడియెట్ కోర్సులో ప్రవేశం పొందుతారు. అయితే 10+2 తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతో ఫౌండేషన్ కోర్సులో ప్రవేశించిన విద్యార్థుల సౌలభ్యం కోసం ఇన్‌స్టిట్యూట్.. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీతో ఒప్పందం ద్వారా బీకాం (ఫైనాన్షియల్ అండ్ కాస్ట్ అకౌంటింగ్), అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఇంటర్మీడియెట్ కోర్సులో నమోదు చేసుకున్న విద్యార్థుల కోసం ఎంకాం (మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్) అనే రెండు స్థాయిల స్పెషలైజ్డ్ కోర్సులను అందిస్తోంది.

కావల్సిన నైపుణ్యాలు:
కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెన్సీ ప్రధాన లక్ష్యం వస్తువును ఉత్పత్తి చేసే క్రమంలో ఎదురయ్యే ఖర్చులను.. నిర్ణీత ఉత్పత్తి లక్ష్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా తగ్గించడం. అంటే ఒకవైపు వస్తువుల ఉత్పత్తి సాఫీగా సాగాలి. మరోవైపు ఖర్చులు తగ్గాలి. ఇలాంటి బాధ్యతను నిర్వర్తించాలంటే లెక్కల చిక్కుముడులను ఇట్టే విప్పే నైపుణ్యం కావాలి. ఇందుకోసం లెక్కల నిర్వహణకు ఎక్కువ సమయం గడిపే విధంగా సహనం అలవర్చుకోవాలి. అనలిటికల్ స్కిల్స్, అప్లికేషన్ ఓరియంటెడ్‌గా చదవగలగడం, మ్యాథమెటిక్స్‌పై పట్టు, వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల నేర్పు చాలా అవసరం.

తప్పనిసరి:
2011లో వచ్చిన కొత్త చట్టం ప్రకారం-దేశంలో ప్రతి కంపెనీ ఐసీఎంఏఐ కోర్సు చదివిన కాస్ట్ అకౌంటెంట్లను నియమించుకోవాల్సిందే. దేశంలో 12లక్షల రిజిస్టర్డ్ కంపెనీలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 80 వేల వరకు ఉన్నాయి. వీటిలో మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్, ప్రాసెస్ విభాగాలున్నవే ఎక్కువ. ఈ కంపెనీల ఉత్పాదక శక్తి, ఉత్పాదక వ్యయ వివరాలన్నీ ఎప్పటికప్పుడు కాస్ట్ కంప్లయెన్స్ రిపోర్ట్, కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ రూపంలో ప్రభుత్వానికి నివేదికను ఇవ్వాలి. ఈ నేపథ్యంలో ప్రతి కంపెనీ లేదా పరిశ్రమ ఈ నివేదికల రూపకల్పన, ఇతరత్రా మేనేజ్‌మెంట్ పనులకు తప్పనిసరిగా కాస్ట్ అకౌంటెంట్లను నియమించుకోవాల్సిందే. కాబట్టి ఈ రంగంలో ఉద్యోగాలకు కొరత లేదని చెప్పొచ్చు.

కెరీర్ ఆప్షన్స్:
సీఎంఏ పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలకు కొదవే ఉండదు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, వస్తూత్పత్తి సంస్థలు, ఇన్సూరెన్స్ సంస్థలు, మైనింగ్ సంస్థలు, డెవలప్‌మెంట్ ఏజెన్సీలు, ట్రెనింగ్ అండ్ రీసెర్చ్ సెక్టర్, ఇతర పారిశ్రామిక సంస్థల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, కాస్ట్ ఆడిటర్ వంటి హోదాలో ప్రవేశించొచ్చు. అతర్వాత ప్రతిభ ఆధారంగా సీఈఓ, మేనేజింగ్ డెరైక్టర్ కమ్ చైర్మన్ స్థాయికి చేరుకోవచ్చు. ఈ క్రమంలో ఉండే జాబ్ ప్రొఫైల్స్..
  • జనరల్ మేనేజర్
  • వెల్త్ మేనేజర్
  • చీఫ్ డీలర్
  • మేనేజింగ్ డెరైక్టర్
  • ఫైనాన్స్ డెరైక్టర్
  • చీఫ్ ఫైనాన్షియల్ కంట్రోలర్
  • చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్
  • కాస్ట్ కంట్రోలర్
  • మార్కెటింగ్ మేనేజర్
  • చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్
సీఎంఏ ఫైనల్ వరకు వేచిచూడకుండా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో కూడా పలు ఉద్యోగావకాశాలు చేజిక్కించుకోవచ్చు. ముఖ్యంగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని మైనింగ్ సంస్థలు సీఎంఏ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులను ట్రైనీలుగా నియమించుకుంటున్నాయి. దీంతోపాటు ఐసీఎంఏఐకి దేశవ్యాప్తంగా ఉన్న చాప్టర్లలో పలు సంస్థలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు నిర్వహిస్తున్నాయి. సగటున నెలకు రూ. 25 వేల కనీస వేతనం ఖాయం చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్య విషయం భారత ప్రభుత్వం.. ఐఏఎస్, ఐపీఎస్ మాదిరిగానే ఇండియన్ కాస్ట్ అకౌంట్స్ సర్వీస్ అనే కేంద్ర సర్వీస్‌ను కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి ఐసీఎంఏఐలో ఫైనల్ పూర్తి చేసిన వారికి కేంద్ర సర్వీసులో అడుగుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. సొంతంగా కూడా కాస్ట్ అకౌంటెంట్‌గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

టాప్ రిక్రూటర్స్:
  • బ్యాంకులు
  • కోల్ ఇండియా
  • నేషనల్ క్యాపిటల్ రీజన్ ప్లానింగ్ బోర్డు
  • నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్
  • సింగరేణి కాలరీస్
  • ఉక్కు కర్మాగారాలు
  • బీహెచ్‌ఈఎల్
  • ఈసీఐఎల్
  • అరబిందోఫార్మా
  • రెడ్డీస్‌ల్యాబ్స్
  • బీడీఎల్
  • ఎల్ అండ్ టీ తదితరాలు.
వేతనాలు:
ప్రారంభంలో ఏడాదికి రూ. 6 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ ఆధారంగా రూ.30 నుంచి రూ.40 లక్షల వేతనాలు కూడా అందుకోవచ్చు.
వెబ్‌సైట్: https://icmai.in/
Published date : 13 May 2013 03:44PM

Photo Stories