Skip to main content

కెరీర్ గైడెన్స్.. హాస్పిటల్ మేనేజ్‌మెంట్/హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్

మాస్టర్ ఆఫ్ బిజినె‌స్ అడ్మినిస్ట్రేషన్.. సంక్షిప్తంగా ఎంబీఏ.. ప్రస్తుత మార్కెట్ ఎకానమీలో ఈ కోర్సు చదవాలని.. భవిష్యత్తులో మేనేజర్లు, సీఈఓలుగా ఎదగాలని కోరుకోని విద్యార్థి లేడంటే అతిశయోక్తి కాదు. ఈ లక్ష్య సాధనలో ప్రతి విద్యార్థికి దోహదపడేవి.. ఎంచుకునే స్పెషలైజేషన్‌లే..‘ఏజ్ ఓల్డ్ అండ్ ఎవర్‌గ్రీన్’ స్పెషలైజేషన్లు మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్‌తోపాటు.. మారుతున్న అవసరాలకనుగుణంగా మరెన్నో స్పెషలైజేషన్స్‌కు రూపకల్పన జరిగింది.. అలాంటి వినూత్న స్పెషలైజే షన్స్‌లో ఒకటి.. హాస్పిటల్ మేనేజ్‌మెంట్.. ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందుతున్న హాస్పిటల్ మేనేజ్‌మెంట్.. కోర్సు.. కెరీర్.. తదితర అంశాలపై ఫోకస్..

సంస్కరణల యుగం.. మారుతున్న పరిస్థితులకనుగుణంగా మేనేజ్‌మెంట్ విద్య కూడా కొత్త పుంతలు తొక్కుతుంది.. ప్రతి రంగంలోను కార్పొరేట్ సంస్కృతి రోజు రోజుకి విస్తరిస్తుండడంతో.. సంబంధిత విభాగాలను నిర్వహించడానికి స్పెషలైజ్డ్ మ్యాన్ పవర్ అవసరం పెరుగుతోంది.. తదనుగుణంగా టూరిజం నుంచి ఇన్సూరెన్స్ వరకు.. ఇలా అన్ని రంగాల అవసరాలను దష్టిలో ఉంచుకుని పలు రకాల వినూత్న స్పెషలైజేషన్స్ ఎంబీఏ కోర్సులో అందుబాటులోకి వచ్చాయి.. వాటిల్లో రూరల్ మేనేజ్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూరల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ- టూరిజం, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్, అగ్రి బిజినెస్, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటివి ప్రముఖమైనవి. ఈ క్రమంలో హెల్త్ కేర్ అవసరాలకనుగుణంగా రూపొందించిన కోర్సు.. హాస్పిటల్ మేనేజ్‌మెంట్/అడ్మినిస్ట్రేషన్ లేదా హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్.

నేపథ్యం:
ప్రస్తుతం అధిక శాతం ఆస్పత్రుల్లో డాక్టర్లు మాత్రమే.. సంబంధిత నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఈ అంశంలో వారికి ఎటువంటి ప్రొఫెషనల్ డిగ్రీ లేదా నాలెడ్జ్ లేకపోయినప్పటికీ.. అనుభవ పూర్వక అవగాహన, పరిశీలన ద్వారా మాత్రమే ఈ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దీంతో తమ ప్రాథమిక విధి అయిన.. ట్రీట్‌మెంట్, సర్జరీ వంటి బాధ్యతలతోపాటు.. రోగులకు తమ విలువైన సమ యాన్ని కేటాయించలేపోతున్నారు. కాబట్టి ఇటువంటి నిర్వహణ పరమైన విభాగాల నుంచి వైద్యులను మినహాయించి.. ఆస్పత్రులలోని సంబంధిత విభాగాల నిర్వహణ దిశగా.. ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉన్న నిపుణులను తయారు చేయాలన్న ఉద్దేశంతో.. హెల్త్‌కేర్/హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు రూపకల్పన జరిగింది.

విధులు:
హాస్పిటల్/హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ అభ్యర్థుల విధులు కూడా.. ఇతర పరిశ్రమల్లోని మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ మాదిరిగానే ఉంటాయి. తేడా ఏమిటంటే.. హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ అభ్యర్థుల విధులన్నీ హాస్పిటల్ నేపథ్యంలో ఉంటాయి. హాస్పిటల్ నిర్వహణ, సిబ్బంది నియామకం, పరిపాలన సంబంధ విధులు, వివిధ విభాగాల మధ్య సమన్వయం, ఆరోగ్య సేవల మూల్యాంకనం, తదితర బాధ్యతలను వీరు నిర్వహిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. హాస్పిటల్ దక్షత (Efficiency)ను పెంచడంతోపాటు నాణ్యమైన వైద్యాన్ని అందించడంలో అనుసంధానకర్తలుగా పని చేస్తారని చెప్పొచ్చు.

ఏఏ అంశాలు బోధిస్తారు?
హాస్పిటల్స్ అవసరాలను దష్టిలో ఉంచుకుని హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కోర్సును రూపొందించారు. ఈ కోర్సులో ఉండే సబ్జెక్ట్‌లన్నీ కూడా ఇతర(జనరల్) ఎంబీఏ డిగ్రీ మాదిరిగానే ఉంటాయి. తేడా ఏమిటంటే హెల్త్‌కేర్ రంగానికి ఎంత వరకు అవసరమో అంత వరకు మాత్రమే సిలబస్‌లో ప్రస్తావన ఉంటుంది.

ఉదాహరణకు మర్కంటైల్ లా విభాగాన్ని తీసుకుంటే.. అందులో ఉండే అన్ని అంశాలను బోధించకుండా.. హెల్త్‌కేర్ రంగానికి అవసరమైన చట్టాలు (What are the acts relevent to hospital), నిబంధనల వంటి అంశాల వరకే సిలబస్ పరిమితం అవుతుంది. ఉదాహరణ: ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాన్‌టేషన్ లా. రెండేళ్ల ఈ కోర్సు.. నాలుగు సెమిస్టర్లుగా ఉంటుంది. సంబంధిత అంశాలపై హాస్పిటల్స్‌లో ప్రాక్టికల్ శిక్షణనిస్తారు. ఈ కోర్సులో ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్, అకౌంటింగ్, హెల్త్‌కేర్ ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఐటీ ఫర్ హెల్త్‌కేర్, హాస్పిటల్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్ లాస్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్ అండ్ రిపోర్ట్ రైటింగ్, మెడికల్ టూరిజం, క్వాలిటీ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ రీసెర్చ్, ఎంటర్‌ప్రెన్యూషిప్ అండ్ కన్సల్టెన్సీ, హెల్త్ కేర్ టెక్నాలజీ అండ్ ఫార్మాస్యుటికల్ మేనేజ్‌మెంట్, రిస్క్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలను ఆయా సెమిస్టర్ల వారీగా బోధిస్తారు.

ప్రత్యేక లక్షణాలు తప్పనిసరి:
ఇతర రంగాలతో పోల్చితే హెల్త్ సెక్టార్ విభిన్నమైంది. దీంతో సాధారణ ఎంబీఏ మాదిరిగా కాకుండా ఈ స్పెషలైజేషన్‌ను ఎంచుకోవాలంటే మాత్రం కొన్ని రకాల స్కిల్స్ తప్పనిసరి. ముఖ్యంగా సేవా దృక్ఫథం (సర్వీస్ ఓరియెంటెడ్ మైండ్)తో విధులు నిర్వహించాలనుకునే వారికి ఈ స్పెషలైజేషన్ సరిగా సరిపోతుంది. గంటల తరబడి పని చేసేందుకు వీలుగా ఓర్పు చాలా అవసరం. వివిధ అవసరాల రీత్యా హాస్పిటల్స్‌కు వచ్చే వారిని రీసివ్ చేసుకోవడంతో పాటు మార్గదర్శకం చేయడానికి చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్, సేవాభావం కలిగి ఉండాలి. పరిస్థితులకనుగుణంగా సమయస్ఫూర్తిగా నిర్ణయం తీసుకునే చాతుర్యం, వివిధ విభాగాలను సమన్వయం చేసే నాయకత్వ లక్షణాలు వంటివి ఉంటేనే ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంపిక చేసుకోవచ్చు.

కోర్సులు:
హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ అవసరాన్ని గుర్తించిన పాశ్చాత్య దేశాల్లోని యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్‌లు చాలా కాలం నుంచే ఈ తరహా కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. మన దేశంలో మాత్రం కొన్ని సంవత్సరాల క్రితమే హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు అంకురార్పణ జరిగింది. ఈ స్పెషలైజేషన్‌లో డిప్లొమా నుంచి, బ్యాచిలర్, పీజీ ఇలా వివిధ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ విభాగంలో పీజీ చేస్తేనే చక్కని అవకాశాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. పీజీ స్థాయిలో.. ఎంబీఏ/ ఎంఎస్సీ రెండు విధాలుగా అందుబాటులో ఉంది. అధిక శాతం యూనివర్సిటీలు ఎంబీఏ స్పెషలైజేషన్‌గా హస్పిటల్ మేనేజ్‌మెంట్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు (ఫైన్ ఆర్ట్స్, ఓరియెంటల్ లాంగ్వేజెస్ మినహా) ఈ కోర్సుకు అర్హులు. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించే రాత పరీక్ష ద్వారా ప్రవేశం ఉంటుంది. కొన్ని యూనివర్సిటీలు మెడికల్ బ్యాగ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు అడ్మిషన్స్ సమయంలో ప్రాధాన్యతనిస్తున్నాయి.

విపరీతమైన డిమాండ్:
గత కొంత కాలంగా వైద్య రంగం శరవేగంగా అభివద్ధి సాధిస్తోంది. ప్రస్తుతం టైర్-1 పట్టణాలకు పరిమితమైన.. కార్పొరేట్ సంస్థలు తమ వైద్య సేవలను.. టైర్-2, 3 పట్టణాలకు కూడా విస్తరింపజేస్తున్నాయి. ఇతర రంగాలతో పోల్చితే భిన్నమైన సెక్టార్ కావడంతోపాటు 24×7×365 సేవలు అందించాల్సి ఉంటుంది. కాబట్టి హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సంబంధిత కోర్సులు చేసిన అభ్యర్థులకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. కోర్సు పూర్తయ్యాక ఏ ఒక్క అభ్యర్థి కూడా ఉద్యోగం లేకుండా ఖాళీగా లేడని కచ్చితంగా చెప్పొచ్చు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వివిధ ఆరోగ్య పథకాల కారణంగా రాబోయే కాలంలో దాదాపు 7 లక్షల మంది మెడికల్- అనుబంధ ప్రొఫెషనల్స్ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కోర్సు పూర్తి చేసిన వారి అవకాశాలకు ఎటువంటి ఢోకా లేదని చెప్పొచ్చు.

కెరీర్:
సాధారణంగా ఎంబీఏ-హెల్త్ కేర్/హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్/మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు మేనేజర్ హోదాలో కెరీర్‌ను ప్రారంభిస్తారు. తర్వాత అనుభవం, స్కిల్స్ ఆధారంగా సీనియర్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, జూనియర్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) హోదా వరకు చేరుకోవచ్చు. పే-ప్యాకేజ్ విషయానికొస్తే.. రూ.5 నుంచి 6 లక్షల వార్షిక వేతనంతో కెరీర్ ప్రారంభమవుతుంది. తర్వాత చేరుకున్న హోదాను బట్టి నెలకు రూ.5 లక్షల వరకు కూడా సంపాదించే అవకాశం ఉంటుంది.

ఐటీ కంపెనీలు కూడా:
ఈ కోర్సు పూర్తి చేసిన వారికి వివిధ కార్పొరేట్ హాస్పిటల్స్, క్లినిక్స్, రిహాబిలిటేషన్ సెంటర్స్, హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు, మెడికల్ కాలేజ్‌లు, నర్సింగ్ హోమ్స్, ఫార్మాస్యుటికల్- హాస్పిటల్ సపెల ఫర్మ్స్‌లలో అవకాశాలు ఉంటాయి. వివిధ సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా ఎంబీఏ-హెల్త్ కేర్/హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసిన అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం అన్ని హాస్పిటల్స్‌లోని ప్రతి విభాగం కంప్యూటరీకరణ చేయడంతో.. సంబంధిత సాఫ్ట్‌వేర్ రూపొందించడం కోసం హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ అభ్యర్థులను ఐటీ కంపెనీలు నియమించుకుంటున్నాయి. బీపీఓ రంగంలో.. అమెరికా తదితర దేశాలు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, సంబంధిత వ్యవహారాలను అవుట్ సోర్సింగ్ రూపంలో భారత్‌కు అందజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీపీఓ రంగం కూడా అవకాశాలకు వేదికగా నిలుస్తుంది. మన దేశంలోని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా థర్డ్ పార్టీ విషయాల పర్యవేక్షణ కోసం హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. విదేశాల్లోను కూడా వీరికి అవకాశాలు ఉంటాయి.

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు
అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్-హైదరాబాద్
వెబ్‌సైట్: www.apolloiha.ac.in

అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్-హైదరాబాద్
వెబ్‌సైట్: www.apolloihcm.ac.in

నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్-హైదరాబాద్
వెబ్‌సైట్: https://nims.ap.nic.in

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రెజెస్-హైదరాబాద్
వెబ్‌సైట్: www.ipeindia.org

దక్కన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్-హైదరాబాద్
వెబ్‌సైట్: www.dshm.co.in

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
వెబ్‌సైట్: www.uohyd.ac.in
Published date : 26 Dec 2012 01:00PM

Photo Stories