హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్
కోర్సులు.. పరిధులు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా హ్యూమన్ రిసోర్స్ సబ్జెక్టుకు సంబంధించి డిప్లొమా నుంచి పీజీ స్థాయి వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)లో హెచ్‌ఆర్‌ను ఒక స్పెషలైజేషన్‌గా దాదాపు అన్ని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నాయి. రెండేళ్ల వ్యవధితో పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఎంఏ- హెచ్‌ఆర్‌ఎం/ ఐఆర్‌పీఎం కోర్సులు కూడా చదవొచ్చు. హెచ్‌ఆర్ స్పెషలైజేషన్‌గా ఎంబీఏ విద్యార్థుల కంటే పీజీలో ఎంఏ-హెచ్‌ఆర్‌ఎం/ఐఆర్‌పీఎం కోర్సు లేదా కొన్ని యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్‌లు రూపొందించిన హెచ్‌ఆర్ కోర్సులతో ప్రయోజనం ఎక్కువనేది నిర్వివాదాంశం.
కోర్సు... స్వరూపం
కార్పొరేట్ ప్రపంచం ముందున్న సవాళ్లను స్వీకరించేలా హెచ్‌ఆర్ కోర్సుల స్వరూపం ఉంటుంది. ప్రస్తుతం మానవ వనరుల విభాగంలో ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కోవడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. జనరల్ మేనేజ్‌మెంట్, బిజినెస్‌కు సంబంధించి ముఖ్య విధులు, పూర్తి పరిజ్ఞానం తెలుసుకోవచ్చు. ప్రభావవంత నాయకులుగా, సంస్థ అభివృద్ధికి దోహదపడేలా కోర్సు బోధనాంశాలు ఉంటాయి. థియరీతోపాటు సిలబస్‌లో భాగమైన కేస్ స్టడీస్, ప్రెజెంటేషన్స్, ఎసైన్‌మెంట్స్..ఒక అభ్యర్థిలో ప్రాక్టికాలిటీ పెరగడానికి దోహదపడతాయి.
బోధించే అంశాలు:
ఎంఏ.. ఎంబీఏ.. పీజీ డిప్లొమా.. కోర్సు ఏదైనా హెచ్‌ఆర్‌కు సంబంధించి బోధనాంశాలు ఒకే తీరుగా ఉంటాయి. మానవ వనరులు, మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన అంశాలతో కరిక్యులం రూపొందిస్తున్నారు. ఆ అంశాలు.. మేనేజ్‌మెంట్ కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, బిజినెస్ స్టాటిస్టిక్స్ అండ్ రిసెర్చ్ మెథడాలజీ కంప్యూటర్ అప్లికేషన్స్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఆర్గనైజేషనల్ డెవలప్‌మెంట్, బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ లాస్, సమ్మర్ ట్రైనింగ్, ఇండస్ట్రియల్ టూర్, హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ అండ్ సెలక్షన్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్,కంపెన్సేషన్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంప్లాయీ వెల్ఫేర్ నెగోషియేషన్స్ అండ్ యూనియన్ మేనేజ్‌మెంట్ రిలేషన్స్, మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ ఈ-బిజినెస్, ఆర్గనైజేషనల్ సైకాలజీ, మేనేజ్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్, కాంటెంపరరీ ఇష్యూస్ ఆఫ్ హెచ్‌ఆర్‌ఎం, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ ఎంపోవర్‌మెంట్ అండ్ పార్టిసిపేటివ్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ రిపోర్ట్, వైవా.
జనరల్ ఎంబీఏ వర్సెస్ ఎంఏ హెచ్‌ఆర్‌ఎం/ పీజీపీ హెచ్‌ఆర్:
ఈ మూడు కోర్సులు.. ఒకదానికొకటి సమానమే. సిలబస్‌లో వ్యత్యాసాలుంటాయి. ఎంబీఏలో హెచ్‌ఆర్ స్పెషలైజేషన్ ఎంచుకుంటే...కేవలం ద్వితీయ సంవత్సరంలోనే హెచ్‌ఆర్‌కు సంబంధించి శిక్షణ పొందుతారు. దీంతో లోతైన విశ్లేషణ లేకుండా..హెచ్‌ఆర్‌కు సంబంధించి ముఖ్యాంశాలు మాత్రమే నేర్చుకుంటారు. అదే.. ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ కోర్సు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం ఇన్ హ్యూమన్ రిసోర్స్ కోర్సులో.. రెండేళ్లపాటు హ్యూమన్ రిసోర్స్‌కు సంబంధించిన అంశాలను ఔపోసన పడతారు. సంస్థ- మానవ వనరులు-స్వీయ నియమావళి-లేబర్ లాస్...ఇలా వీరి అధ్యయనం అంతా ప్రతి అంశంలోనూ లోతుగా, క్షుణ్నంగా కేస్ స్టడీస్‌తో సాగుతుంది. అంటే హెచ్‌ఆర్ ఉద్యోగానికి సిసలైన వారసులు హెచ్‌ఆర్‌ఎం/ పీజీపీహెచ్‌ఆర్ కోర్సు చదివిన వారని చెప్పవచ్చు. దీంతో హెచ్‌ఆర్ విభాగంలో ఉద్యోగ నియామకాల సమయంలో ఎంబీఏ (హెచ్‌ఆర్) అభ్యర్థులకంటే పీజీ స్థాయిలో హెచ్‌ఆర్‌ఎం లేదా ఐఆర్‌పీఎం చదివిన వారు ఒకడుగు ముందుంటారని చెప్పవచ్చు.
కెరీర్ వ్యూ
ఎడ్యుకేషన్ టు ఎంటర్‌టైన్‌మెంట్.. ఎఫ్‌ఎంసీజీ టు ఫార్మా.. ఐటీ టు ఇన్సూరెన్స్..ఆటోమొబైల్ టు టెలికాం..ఇలా ఉత్పత్తి రంగమైనా, సేవా రంగమైనా చిన్న తరహా సంస్థ అయినా, బహుళజాతి కంపెనీ అయినా హెచ్‌ఆర్ సిబ్బంది కావాల్సిందే. ఇవేకాక యర్నెస్ట్ యంగ్ వంటి ప్రముఖ కన్సల్టెన్సీలు హెచ్‌ఆర్ విభాగాల్లో నిరంతరం పరిశోధనలు చేస్తుంటాయి. వీటికి హెచ్‌ఆర్‌లో సుశిక్షితులు అవసరమే. దీంతో అవకాశాలు అనేకం.
బాధ్యతలు... విధులు
సంస్థ ఉత్పాదకతను పెంచడంలో ఓ ఉద్యోగి లేదా కార్మికుడి పాత్ర ఎంత కీలకమో..ఆ సిబ్బందికి ఆహ్లాదకర వాతావరణం కల్పించడం..పని ఒత్తిడి భావించకుండా చూడటం హెచ్‌ఆర్ సిబ్బంది ప్రధాన విధి. ఈ నేపథ్యంలో యాజమాన్యానికి, ఉద్యోగులకు మధ్య వారధిలా పని చేయాలి. ఇద్దరి మన్ననలూ పొందాలి. ఒకవైపు అందరినీ ఒకే తాటిపై నడిపిస్తూ సంస్థ లాభాల్లోకి దూసుకుపోయేలా చేయాలి. బోనస్‌లు, ఇంక్రిమెంట్లతో ఉద్యోగులను మెప్పించాలి. సంస్థను ఒప్పించాలి. ఆల్కెమిస్ట్‌లా వ్యవహరించాలి. ఎంపిక, శిక్షణ, బృంద నిర్మాణం, పని తీరు, వేతనం, అదనపు లాభాలు, జీతాల పెంపు, ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత, శిక్షణా తరగతుల నిర్వహణ, సెలవులు..వీటన్నింటినీ చూసుకోవాలి. అంతేకాక కంపెనీలో తలెత్తే సమ్మెలు ఇతర పారిశ్రామిక వివాదాలను పరిష్కరించే కీలక బాధ్యత కూడా వీరిదే. అందువల్ల మానసికంగా ద్రుఢత్వం కూడా అవసరం.
వేతనాలు:
ఆరంభంలో బహుళజాతి కంపెనీలకు ఎంపికైన వాళ్లు సంవత్సరానికి రూ.1.8 - రూ.2.4 లక్షల వరకు అందుకోవచ్చు. దేశీయ కంపెనీల్లో పనిచేసేవారు రూ. 1.2 -రూ. 1.8 లక్షల వేతనాన్ని ఆశించొచ్చు (ప్రముఖ సంస్థల్లో హెచ్‌ఆర్ కోర్సు చేసిన విద్యార్థులు రూ. 4.8 - రూ. 7.2 లక్షల ప్యాకేజీతో ఆఫర్ లెటర్ అందుకోవడం సాధారణమే). మూడేళ్ల అనుభవం ఉన్నవారు ఏడాదికి రూ. 3 లక్షల నుంచి రూ. 4.5 లక్షల వరకు వేతనం పొందొచ్చు. ఐదేళ్ల అనుభవంతో, కొత్త స్కిల్స్ నేర్చుకుంటే రూ. 4.8-6 లక్షల వరకు వేతనం ఆశించొచ్చు. పదేళ్లు, ఆపైన అనుభవం ఉంటే సమర్థత బట్టి బహుళ జాతి కంపెనీల్లో నెలకు రూ.లక్ష పొందడం సాధ్యమే.
స్కిల్స్
* మానవ సంబంధాలు అర్థం చేసుకోవాలి
* నాయకత్వ లక్షణాలుండాలి
* బేరమాడే పరిజ్ఞానం పక్కాగా ఉండాల్సిందే
* ఉద్యోగుల అవసరాలు గుర్తించాలి
* మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి
* సంస్థ-ఉద్యోగులను గెలుపుబాటవైపు పరుగులు తీయించాలి.
* హెచ్‌ఆర్ ట్రెండ్స్ పసిగట్టాలి.
* మెరిట్స్ అండ్ డీ మెరిట్స్
* సరైన అభ్యర్థిని ఉద్యోగానికి ఎంపిక చేసినందుకు సంతోషం కలుగుతుంది.
* సంస్థ, ఉద్యోగులను సునిశితంగా పరిశీలించే అవకాశం దక్కుతుంది.
* యాజమాన్యం-ఉద్యోగుల మధ్య వారధిలా పని చేయడం కాస్త ఒత్తిడితో కూడుకునే వ్యవహారమే.
* కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు.
ప్రవేశం:
మన రాష్ట్రంలో ఎంబీఏలో ప్రవేశానికి ఐసెట్ పరీక్ష రాయాలి. తద్వారా ఎంబీఏ(హెచ్‌ఆర్‌ఎం) స్పెషలైజేషన్‌తో పూర్తి చేయవచ్చు. సంబంధిత నోటిఫికేషన్ సాధారణంగా ప్రతి ఏడాది ఫిబ్రవరి/మార్చిలలో వెలువడుతుంది. మేలో ఎగ్జామ్ ఉంటుంది. జాతీయ స్థాయిలో క్యాట్, మ్యాట్, ఎక్స్‌ఏటీ, సీమ్యాట్ వంటి పరీక్షలకు హాజరు కావడం ద్వారా కూడా ఎంబీఏ(హెచ్‌ఆర్‌ఎం) స్పెషలైజేషన్‌తో పూర్తి చేయవచ్చు.
రాష్ట్రంలో ఎంఏ- హెచ్‌ఆర్‌ఎం ఆఫర్ చేస్త్తున్న కళాశాలలు
* ఆంధ్రా యూనివర్సిటీ-ఎంహెచ్‌ఆర్‌ఎం
* కాకతీయ యూనివర్సిటీ
* ఆచార్య నాగార్జునా యూనివర్సిటీ
* గీతం యూనివర్సిటీ
* శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ
* శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (పీజీడి-హెచ్‌ఆర్‌ఎం)
పర్సనల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ (పీఎం అండ్ ఐర్)
వెబ్‌సైట్: www.xlri.ac.in
వెబ్‌సైట్: www.tiss.edu
పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ (పీజీపీ-హెచ్‌ఆర్)
వెబ్‌సైట్: www.mdi.ac.in
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ (పీజీడీఎం-హెచ్‌ఆర్)
వెబ్‌సైట్: www.imi.edu
పీజీడీఎం-హెచ్‌ఆర్
వెబ్‌సైట్: www.ssim.ac.in