Skip to main content

ఎవర్‌`గ్రీన్` కెరీర్.. ఫారెస్ట్ మేనేజ్‌మెంట్

పర్యావరణ పరిరక్షణ దిశగా చేపడుతున్న చర్యలు.. జీవ జాతుల మనుగడ కోసం అనుసరిస్తున్న విధానాలు.. వాతావరణంలో సమతుల్యత సాధించేందుకు వృక్ష సంపద పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటు కెరీర్ పరంగాఅటు పారిశ్రామికంగా కూడా ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తోంది.
ఈ క్రమంలో ఎన్నో కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌లు ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ నిపుణులను తీర్చిదిద్దేందుకు ఆవిష్కృతమవుతున్నాయి. వీటిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్-భోపాల్ నోటిఫికేషన్ వెలువరించింది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా లభించే అవకాశాలు, ఈ ఇన్‌స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలపై ఫోకస్...

ఫారెస్ట్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఔత్సాహికులకు అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు. సహజ సంపదలుగా పేర్కొనే అటవీ వనరుల నిర్వహణ, వాటి సుస్థిరతకు అనుసరించాల్సిన వ్యూహాల గురించి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో శిక్షణనిచ్చే కోర్సు ఫారెస్ట్ మేనేజ్‌మెంట్. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో అడుగుపెట్టే అవకాశం ఉన్న ఈ కోర్సును పూర్తిచేస్తే కొలువులు ఖాయం.

ఉపాధి వేదికలు
ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేటు రెండు రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ పరంగా వన్యప్రాణి సంరక్షణ విభాగాలు, అటవీ శాఖలో ఎక్కువగా ఉంటాయి.

ప్రైవేటు రంగంలో పర్యావరణ పరిరక్షణ దిశగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, టింబర్ ప్లాంటేషన్స్, మెడిసినల్ ప్లాంట్ ప్రొడక్షన్ యూనిట్స్, మెడిసినల్ ప్లాంట్స్‌లలో ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ కోర్సు ఉత్తీర్ణులకు అవకాశాలు ఖాయం. అదే విధంగా గ్రామీణ బ్యాంకులు, నాబార్డ్, ఇతర బ్యాంకుల్లోనూ కొలువులు సొంతం చేసుకోవచ్చు.

ఆకర్షణీయ వేతనాలు
ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ నిపుణులకు ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. ప్రారంభంలోనే రూ. 25 వేల నుంచి రూ. 30 వేల జీతంతో కెరీర్ ప్రారంభించొచ్చు. అనుభవం, పనితీరు ఆధారంగా రెండు, మూడేళ్లలో రూ. 40 వేల వరకు నెల జీతం పొందే అవకాశం ఉంటుంది. ప్రారంభంలో ప్లాంట్ ఇన్‌చార్జ్, ఎన్విరాన్‌మెంటల్ ప్లానర్, ఎన్విరాన్‌మెంటల్ కన్సల్టెంట్ వంటి హోదాలు లభిస్తాయి.

పరిశోధనావకాశాలు పుష్కలం
కేవలం ఉద్యోగావకాశాలే కాకుండా ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ అనుబంధ విభాగాల్లో రీసెర్చ్ అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్, సస్టెయినబుల్ ప్రొడక్షన్ వంటి విభాగాల్లో పీహెచ్‌డీలకు ఇప్పుడు క్రేజ్ నెలకొంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నిర్వహించే అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఫారెస్ట్రీ, ఆగ్రో ఫారెస్ట్రీ విభాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశించొచ్చు. అదే విధంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అనుబంధ సంస్థ ఇన్‌స్టిట్యూట్‌లలోనూ రీసెర్చ్ అవకాశాలు పుష్కలం.

ఐఐఎఫ్‌ఎం-భోపాల్‌కు అంతర్జాతీయ గుర్తింపు
ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా ఈ రంగంలో భవిష్యత్తు కోరుకునే వారికి మెరుగైన అవకాశాలు కల్పిస్తోంది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ - భోఫాల్. బోధన, మౌలిక సదుపాయాలపరంగా అనుసరిస్తున్న ప్రమాణాల ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా పీజీ డిప్లొమా ఇన్ ఫారెస్ట్రీ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు..

కోర్సు
పీజీ డిప్లొమా ఇన్ ఫారెస్ట్రీ మేనేజ్‌మెంట్ (స్పెషలైజేషన్స్: కన్జర్వేషన్ అండ్ లైవ్‌లీహుడ్, డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్). అభ్యర్థులు ఈ మూడు స్పెషలైజేషన్లలో ఒక స్పెషలైజేషన్‌ను మేజర్‌గా ఎంచుకోవడంతోపాటు మిగతా రెండు స్పెషలైజేషన్లలో ఒక స్పెషలైజేషన్‌ను మైనర్‌గా ఎంపిక చేసుకోవాలి.
కాల వ్యవధి: రెండేళ్లు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులు/తత్సమాన సీజీపీఏతో ఉత్తీర్ణత. (రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం సడలింపు).
ఎంపిక: క్యాట్, ఎక్స్‌ఏటీ స్కోర్ల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రిటెన్ ఎబిలిటీ టెస్ట్,ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్ విధానంలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 20, 2016

వెబ్‌సైట్: www.iifm.ac.in
Published date : 08 Jan 2016 10:54AM

Photo Stories