Skip to main content

ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో దూసుకెళ్లేందుకు ‘స్టార్టప్ ఇండియా’

స్టార్టప్.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. ప్రధాని నుంచి ఐఐటీ విద్యార్థి వరకు ఇప్పుడు అందరి నోటా ఇదే మాట. ఇన్‌స్టిట్యూట్ స్థాయి నుంచి ఇండస్ట్రీ దిగ్గజాల వరకు ప్రతి ఒక్కరి ఆసక్తి దీనిపైనే! ఉపాధి కల్పన, సంపద సృష్టికి స్టార్టప్ కంపెనీలే చోదకాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలంగా నమ్ముతున్నాయి. ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ ఔత్సాహికులకు ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఔత్సాహికులకు ఇప్పుడు కావాల్సిందల్లా.. మంచి ఐడియాలు.. వాటిని ఆచరణలోపెట్టగలిగే పదునైన వ్యూహాలు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘స్టార్టప్ ఇండియా’ పోగ్రామ్ ద్వారా యువ వ్యాపారవేత్తలపై వరాలజల్లు కురిపించింది. ఈ నేపథ్యంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. స్టార్టప్‌లో రాణించడానికి ఉపయోగపడే మార్గాలు...
దేశంలోని ప్రముఖ కంపెనీల అధిపతులు ఇదే దృక్పథంతో వెంచర్ క్యాపిటలిస్ట్‌లుగా మారి ఔత్సాహికుల భుజం తడుతున్నారు. వెన్నంటి ఉంటాం.. ముందుకు నడవండంటూ నిధులు సమకూరుస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలు, స్టార్టప్ ఔత్సాహికుల కోసం పలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి.

స్టార్టప్ ఇండియా
  • కేంద్ర ప్రభుత్వం ‘స్టార్టప్ ఇండియా’ పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ‘ఐడియా ఉంటే ఇండియాదే ఫ్యూచర్’ అనే విధంగా స్టార్టప్ ఔత్సాహికులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది.
  • కేంద్ర మంత్రి స్టార్టప్‌లకు ప్రధానంగా ఎదురయ్యే పెట్టుబడుల సమస్యకు పరిష్కారంగా రూ.10,000 కోట్లతో కార్పస్ ఫండ్స్ ఏర్పాటు చేసింది.
  • నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ ద్వారా వచ్చే నాలుగేళ్లపాటు ఏటా రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీటికి అదనంగా మూడేళ్లపాటు ట్యాక్స్‌హాలిడే, కార్మిక, పర్యావరణ చట్టాల నుంచి మినహాయింపు, పేటెంట్ ఫీజులో 80 శాతం తగ్గింపు, బయోటెక్ స్టార్టప్‌లకు 7 ఇన్నోవేషన్ పార్కులు, స్టార్టప్‌ఫెస్ట్‌లు వంటి ప్రోత్సాహకాలను ప్రకటించింది.
ఐడియాతో ఆరంభం
  • స్టార్టప్ ఔత్సాహికుల ప్రయాణం ఐడియాతో ప్రారంభం కావాలి. ఆయా ఆలోచనలు వ్యాపార పరంగా సాధ్యమా? కాదా? అని విశ్లేషించుకోవాలి. ఆలోచన పరిధి, ఏర్పాటు చేయనున్న స్టార్టప్ స్థాయి గురించి ఆందోళన చెందక్కర్లేదు.
  • ఐడియా (ఆలోచన) వినూత్నమైంది అయితే ఒక్క కంప్యూటర్‌తో మొదలయ్యే స్టార్టప్ తక్కువ సమయంలోనే కోట్ల టర్నోవర్ స్థాయికి చేరుకుంటుంది. ఈ క్రమంలో అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి. వ్యాపారపరంగా సాధ్యమని తేలితే.. ప్రాజెక్ట్ రిపోర్ట్‌ల రూపకల్పనకు ముందడుగేయాలి.
  • స్టార్టప్ ఐడియాకు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్ సమగ్రంగా ఉండాలి. ప్రారంభ పెట్టుబడులు మొదలు భవిష్యత్తు అంచనాల వరకు.. అన్నీ సమగ్రంగా రూపొందించుకోవాలి.
  • మార్కెట్ పరిస్థితులు, పోటీదారులకంటే ఒకడుగు ముందుండేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, అవసరమైన పెట్టుబడులు, మార్కెటింగ్ పద్ధతులు.. ఇలా అన్ని కోణాల్లోనూ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్‌తో ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసుకోవాలి.
పెట్టుబడి ‘రెడీ’
  • ఆలోచన అద్భుతం.. మార్కెట్లో మెరుస్తామనే ధీమా ఉంది. కానీ, అసలు సమస్య ఇన్వెస్ట్‌మెంట్ (పెట్టుబడి). ఐడియాను ఆచరణలో పెట్టేందుకు అవసరమైన పెట్టుబడిలేక స్టార్టప్ ప్రయత్నాన్ని విరమించుకున్న ఔత్సాహికులు ఎందరో! కానీ, ఇప్పుడు అలాంటి ఆందోళనకు ఫుల్‌స్టాప్ పెట్టేయొచ్చు.
  • ప్రభుత్వాలు, ప్రైవేటు సీడ్ ఫండింగ్ సంస్థలతోపాటు ఇండస్ట్రీ దిగ్గజాలు సైతం వెంచర్ క్యాపిటలిస్ట్‌లుగా మారుతున్నారు. స్టార్టప్ ఔత్సాహికులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అయితే ఔత్సాహికులు తమ ఐడియాలను వారికి వివరించి ఒప్పించడం చాలా ముఖ్యం.
  • నాస్కామ్, సీఐఐ, ఐఐఎం, ఐఐటీలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు స్టార్టప్ ఔత్సాహికులు వెంచర్ క్యాపిటలిస్ట్‌లను ఒకే వేదికపై కలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. మంచి ఐడియాలకు వెంచర్ క్యాపిటలిస్ట్‌లు అప్పటికప్పుడే ‘ఒకే, గో ఎ హెడ్’ అంటూ నిధులు ప్రకటిస్తున్నారు.
  • ప్రభుత్వ పరంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ, సేతు ప్రాజెక్ట్‌ల ద్వారా సింగిల్ విండో అనుమతులు లభిస్తున్నాయి. ఇన్ని సదుపాయాలు, ప్రోత్సాహకాలు లభిస్తున్న సమయంలో మంచి ఐడియాలను ఆచరణలో పెట్టేందుకు ఏ మాత్రం సంకోచించక్కర్లేదు.
విస్తరణపైనా దృష్టి
  • ఒక ఐడియాతో స్టార్టప్ సంస్థను నెలకొల్పి ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనుకునే యువతకు ఆయా వ్యాపార విస్తరణావకాశాలపై అవగాహన ఉండాలి. ప్రారంభంలో ఒక సెగ్మెంట్ వినియోగదారులను టార్గెట్ చేసుకుని ఎంట్రీ ఇచ్చే ఎంటర్‌ప్రెన్యూర్స్ తర్వాత దశలో అనుబంధ రంగాల్లోనూ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలి.
  • ఈ-కామర్స్ వెబ్‌సైట్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఒకప్పుడు బి2బి స్థాయితో మొదలైన సంస్థలు ఇప్పుడు బి2సి స్థాయికి చేరుకున్నాయి. ఆన్‌లైన్ గ్రోసరీస్‌తో ప్రారంభమైన సంస్థలు.. ఇప్పుడు అన్ని రకాల సర్వీసులు అందిస్తున్నాయి. ఆయా సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు, ఎక్కువ మందిని వినియోగదారులుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సేవా రంగంలో స్టార్టప్స్ విస్తరిస్తున్న శైలికి ఇదొక ఉదాహరణ.
  • ఉత్పత్తి రంగ స్టార్టప్ ఔత్సాహికులకు కూడా ఇదే తరహా దృక్పథం కలిగుండాలి. ఉదాహరణకు ఆటోమొబైల్ రంగంలో ఒక ప్రైమ్ ప్రొడక్ట్‌కు అవసరమైన స్పేర్ పార్ట్ ఉత్పత్తి సంస్థను ప్రారంభించే ఎంటర్‌ప్రెన్యూర్స్ భవిష్యత్తులో మరిన్ని స్పేర్‌పార్ట్స్‌ను ఉత్పత్తి చేసేందుకు గల వ్యూహాలను ముందుగానే రూపొందించుకోవాలి.
నిర్వహణ నైపుణ్యాలు..
  • స్టార్టప్ సంస్థల జయాపజయాలను శాసించేవి నిర్వహణ నైపుణ్యాలే! స్టార్టప్‌ను ఒకరు ప్రారంభించినా లేదా ఇద్దరు, ముగ్గురి భాగస్వామ్యంతో మొదలుపెట్టినా.. నిర్వహణ సరిగా ఉంటేనే విజయం సొంతమవుతుంది. సంస్థలోని కింది స్థాయి సిబ్బంది మొదలు, మార్కెట్‌లోని క్లయింట్ల వరకు అందరిని సమన్వయం చేసే నైపుణ్యాలు తప్పనిసరి.
  • నిరంతర పర్యవేక్షణ, మార్కెట్ తాజా పరిస్థితులను అంచనా వేస్తూ దానికి అనుగుణంగా సమయోచిత నిర్ణయాలు తీసుకునే ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. పూర్తిస్థాయి నిర్వహణ కోణంలో ముడి పదార్ధాల సరఫరాదారుల నుంచి ఎండ్ యూజర్స్ వరకు అందరితో కలసిమెలసి వ్యవహరించాలి.
  • నిర్వహణ నైపుణ్యాలు.. మేనేజ్‌మెంట్ స్కూల్స్‌లో నేర్చుకుంటేనే అలవడతాయి అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ, వాస్తవ పరిస్థితిలో నిర్వహణలో వ్యక్తి దృక్పథం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. స్టార్‌‌టప్ సక్సెస్‌లో మార్కెటింగ్ నైపుణ్యాలు కీలకం.
  • ఒక వ్యాపారం విజయవంతం కావాలంటే.. సంబంధిత సంస్థ ఉత్పత్తులు లేదా సేవలు ఎలాంటి అంతరాయం నాణ్యత లోపం లేకుండా కొనుగోలుదారులకు చేరేలా చూడాలి. వేగవంతమైన, కచ్చితమైన, నమ్మకమైన సేవలను అందించే విషయంలో రాజీ పడకుండా మార్కెటింగ్ చేయగలిగే నైపుణ్యాలు ఉండాలి.
  • స్టార్టప్ ఔత్సాహికులకు ఉండాల్సిన మరో ముఖ్య లక్షణం.. నిత్య నూతనంగా వ్యవహరించడం. ఈ క్రమంలో వినియోగదారుల అవసరాలు, వారు కొత్తగా కోరుకుంటున్న సేవలు/వస్తువుల గురించి తెలుసుకోవడం నిరంతర విధిగా అలవరచుకోవాలి.
  • అప్పుడే ఎలాంటి ఐడియాతో అడుగు పెట్టినా రాణించొచ్చు. ఎంతటి పోటీ ఉన్నా ఎలాంటి ఒత్తిడి లేకుండా ముందుకు సాగి విజయాలను సొంతం చేసుకోవచ్చు.
‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో రాణించేందుకు లక్షలు ఖర్చు పెట్టి అత్యుత్తమ బిజినెస్ స్కూల్స్ నుంచి సర్టిఫికెట్లు పొందక్కర్లేదు. కోట్ల రూపాయలు జేబులో పెట్టుకుని ఈ దిశగా అడుగులు వేయక్కర్లేదు.. కార్పొరేట్ ఆఫీసుల్ని తలదన్నేలా కార్యాలయాలు కూడా అవసరం లేదు. కావాల్సిందల్ల్లా ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో మార్కెట్‌లో రాణించేందుకు చక్కటి ఐడియా.. దాన్ని అమలు చేసేందుకు అవసరమైన వ్యూహాలు’
- స్టార్టప్ ఔత్సాహికులను ఉద్దేశించి టాటా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వంటి ప్రముఖుల అభిప్రాయాలు.

బెస్ట్ టైం ఫర్ ‘ఎంట్రీ’
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఔత్సాహికులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ప్రధానంగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లభిస్తుండడటం అత్యంత హర్షణీయం. ఔత్సాహిక యువత వీటిని అందిపుచ్చుకోవాలి. మేనేజ్‌మెంట్ కోర్సులు అభ్యసిస్తేనే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవలవడుతుందనే భావన వీడాలి. ఈ దిశగా కీలకమైంది ‘ఐడియా’నే. వినూత్నమైన, విలక్షణమైన ఐడియా ఉంటే ఐఐటీ, ఐఐఎంలలో చదివిన విద్యార్థికి, సాధారణ కళాశాలలో చదివిన విద్యార్థికి ఎలాంటి తేడా ఉండదు. కాబట్టి ఏ స్థాయి ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చాం అనే విషయంలో ఆందోళన అనవసరం. అందుబాటులో ఉన్న వనరులను అందిపుచ్చుకునేందుకు అవసరమైన అంశాలపై అవగాహన ఏర్పరచుకుంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఎవరైనా ఎంట్రీ ఇవ్వొచ్చు.
- ప్రొ. భాస్కర్ రామమూర్తి, డెరైక్టర్, ఐఐటీ-చెన్నై

మార్పులకు తగ్గట్లు..
నేటి స్టార్టప్ ఔత్సాహికుల మార్పులకు అనుగుణంగా తమను తాము మార్చుకోవడం, ఐడియాలను విశ్లేషించుకోవటం చాలా అవసరం. ఏదో ఒక వ్యాపారానికే పరిమితమవుదాం అనుకునే రోజులు పోయాయి. ముఖ్యంగా ఈ-కామర్స్, ఆన్‌లైన్ సర్వీసెస్ స్టార్టప్స్ విషయంలో మార్పులకు తగ్గట్లు వ్యాపార వ్యూహాలు మార్చుకోవాల్సిన పరిస్థితులున్నాయి. స్టార్టప్ ఔత్సాహికుల్లో ఎక్కువ మంది ఆన్‌లైన్ షాపింగ్ లేదా ఆన్‌లైన్ సర్వీసెస్‌వైపు దృష్టి పెట్టడానికి కారణం ఇతర రంగాలతో పోల్చితే ఆయా రంగాల్లో రిస్క్ శాతం తక్కువగా ఉండటమే. వినియోగదారులు ప్రస్తుతం ఏ ఒక్క ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌కో పరిమితం కావట్లేదు. వస్తువులను కొనుగోలు చేసేముందు పలు వెబ్‌సైట్లు వీక్షించి, విశ్లేషించుకొని స్పష్టమైన నిర్ణయానికి వస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ షాపింగ్ స్టార్టప్ ఔత్సాహికులు ఆ దిశగా అడుగులు వేయాలి.
- ఎం.శేషకాంత్, ఫౌండర్ అండ్ సీఈఓ, హెల్త్‌ఔట్ డాట్ కామ్
Published date : 29 Jan 2016 12:19PM

Photo Stories