Skip to main content

ఎంబీఏతో ఉద్యోగావకాశాలు తగ్గడానికి కారణాలు

ఎంబీఏతో కార్పొరేట్ కొలువు.. ఐదంకెల జీతం.. తక్కువ సమయంలోనే ఉన్నత స్థానాలు.. ఇవన్నీ ఒకప్పటి మాటలేనా! అవుననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.తాజాగా వెలువడిన పలు సర్వేల్లో కేవలం 20 శాతం మంది ఎంబీఏలు మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నట్లు స్పష్టమైంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది? కంపెనీలు ఎంబీఏలకు ఎందుకు మఖం చాటేస్తున్నాయి? ఒకవేళ ఉద్యోగాలు ఇచ్చినా ప్యాకేజీల్లో కోతెందుకు పెడుతున్నాయి? ఎంబీఏతో కెరీర్ అవకాశాలు తగ్గడానికి కారణాలేంటో తెలుసుకుందాం...
2017లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంలు), ప్రముఖ బిజినెస్ స్కూల్స్ మినహా ఇతర ఇతర మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి బయటికొచ్చిన ఎంబీఏ గ్రాడ్యుయేట్లల్లో కేవలం 20 శాతం మందికే ఉద్యోగాలు లభించాయి. అసోచామ్ రిపోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు, వ్యాపార ప్రతికూలతల కారణంగా కొత్త ప్రాజెక్టులు నిలిచిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అసోచామ్ నివేదిక స్పష్టంచేసింది.

తగ్గిన వేతనాలు :
గతేడాది ఎంబీఏ పూర్తిచేసిన వారిలో 30 శాతం మందికి ఉద్యోగాలు వస్తే.. ఈ సంవత్సరం కేవలం 20 శాతం మందికే ఉద్యోగాలు వచ్చాయి. దేశంలోని టాప్ 20 బిజినెస్ స్కూల్స్‌ను మినహాయిస్తే క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలో ఉద్యోగాలు పొందే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కేవలం 20 శాతం మందే కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు పొందుతున్నట్లు అసోచామ్ వెల్లడించింది. ఎంబీఏ గ్రాడ్యుయేట్ల వేతనాలు సైతం గణనీయంగా పడిపోయాయి. గతేడాదితో పోల్చితే వేతనాల్లో 40 నుంచి 45 శాతం తగ్గుదల ఉందని పేర్కొంది.

సిలబస్‌ను మార్చాల్సిందేనా!
మార్కెట్‌లో ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు డిమాండ్ ఉన్నప్పటికీ.. ప్రస్తుత క్యరికులం కారణంగానే వారు ఉద్యోగాలు పొందలేకపోతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సిలబస్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు ‘జాబ్ రెడీ స్కిల్స్’తో బయటికి రావాలంటే తదనుగుణంగా సిలబస్‌ను రూపొందించాలి. ఎంబీఏ, తత్సమాన కోర్సుల సిలబస్‌ను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నిరంతరం మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగ నైపుణ్యాలు లోపించడానికి, అరకొర జీతాలతో మేనేజ్‌మెంట్ విద్యార్థులు సర్దుకుపోవడానికి అవుట్‌డేటెడ్ కరిక్యులం, సిలబస్‌లే కారణాలనే వాదన గట్టిగా వినిపిస్తోంది.

ఫ్యాకల్టీ కొరత :
మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ పరంగా ఫ్యాకల్టీ కొరత ఎక్కువగా ఉంది. నిబంధనల ప్రకారం నిర్టిష్ట నిష్పత్తిలో బోధన-విద్యార్థుల సంఖ్య ఉండాలి. బోధన పరంగా ప్రతి విభాగంలో పీహెచ్‌డీ ఫ్యాకల్టీ తప్పనిసరి. అయితే పీహెచ్‌డీ ఫ్యాకల్టీని నియమించుకుంటే భారీగా వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో కళాశాలలు ఈ విషయంలో ప్రమాణాలు పాటించడం లేదు. ఈ పరిస్థితి విద్యార్థుల కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

వారికి భారీ వేతనాలు..
ఐఐఎంలు, స్వయంప్రతిపత్తి ఇన్‌స్టిట్యూట్‌లలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. వాటిలో చదివిన విద్యార్థులకు కంపెనీలు భారీ వేతనాలు అందిస్తున్నాయి. అంతేకాదు కోర్సు వ్యవధిలోనే ఇంటర్న్‌షిప్స్, ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. అయితే నాణ్యతా ప్రమాణాలను పాటించలేక ఇబ్బంది పడుతున్న యాజమాన్యాలు మాత్రం కళాశాలలను మూసివేస్తున్నాయి. 2015 నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో, డెహ్రాడూన్‌లలో 250 పైగా బీ స్కూళ్లు మూతపడ్డాయి. మరో 99 బిజినెస్ స్కూళ్లు మూతపడే పరిస్థితిలో ఉన్నాయి.

ఎంబీఏ నా.. వద్దులే..!
టాప్ బీ స్కూల్స్ మినహా స్థానిక కాలేజీల్లో ఎంబీఏలో చేరడం పై ఒకటికి రెండు సార్లు ఆలోచించాలనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. లక్షలు వెచ్చించి మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు, చదివించేందుకు తల్లిదండ్రులు పునరాలోచిస్తున్నారని అసోచామ్ నివేదిక తెలిపింది. ఎంబీఏ కోసం రెండేళ్లు కేటాయించే కంటే.. గ్రాడ్యుయేషన్‌తో ఉద్యోగంలో చేరడం మేలని ఎక్కువ మంది విద్యార్థులు భావిస్తున్నారు. ఉద్యోగంలో చేరితే వాస్తవ నిర్వహణ నైపుణ్యాలు అలవడటంతోపాటు పని అనుభవం, మంచి వేతనం లభిస్తుండటమే దీనికి కారణం.

నైపుణ్యాలే కీలకం...
ఎంబీఏ కోర్సుతో విద్యార్థులు ప్రాథమిక నైపుణ్యాలను మాత్రమే పొందుతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితులకు సంబంధించిన ఉద్యోగ అనుభవం, సన్నద్ధత పరంగా వెనుకంజలో ఉంటున్నారు. విద్యార్థులు స్పెషలైజేషన్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఇందులో భాగంగానే సాధారణ నిర్వహణా నైపుణ్యాలు, విలక్షణ ఆలోచనా దృక్పథం, సమస్యను పరిష్కరించే సామర్థ్యం, వ్యక్తిగత నైపుణ్యాలు, స్ఫూర్తి పొందడం తదితర అంశాలపై విద్యార్థులకు ఆసక్తి లోపించింది.

ఉద్యోగావకాశాలు పొందాలంటే అలవర్చుకోవాల్సిన నైపుణ్యాలు...
  • కమ్యూనికేషన్ స్కిల్స్
  • బిహేవియరల్ స్కిల్స్
  • డెసిషన్ మేకింగ్ స్కిల్స్
  • పాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్
  • ఇంటర్ పర్సనల్ స్కిల్స్
Published date : 20 Dec 2017 04:26PM

Photo Stories