Skip to main content

ఎంబీఏలో ఆరు వినూత్న స్పెషలైజేషన్స్

ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్.. ఇవి సాధారణంగా అందరికీ తెలిసిన, ఠక్కున గుర్తుకొచ్చే ఎంబీఏ స్పెషలైజేషన్స్. కానీ ప్రస్తుత కార్పొరేట్ యుగంలో.. మారుతున్న బిజినెస్ అవసరాలు, మార్కెట్ డిమాండ్ నేపథ్యంలో.. అనేక సరికొత్త స్పెషలైజేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఎంబీఏ గ్రాడ్యుయేట్స్.. తమ విద్యానేపథ్యం.. ఆసక్తి.. అవకాశాలు- ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకొని స్పెషలైజేషన్‌ను ఎంచుకుంటే.. కెరీర్ మరింత కళకళలాడటం ఖాయం. మేనేజ్‌మెంట్ కోర్సుల ఔత్సాహికుల అద్భుత కెరీర్‌కు సోపానంగా నిలుస్తున్న ఆరు వినూత్న స్పెషలైజేషన్స్ వివరాలు మీ కోసం!!

రిటైల్ మేనేజ్‌మెంట్.. రైజింగ్ స్పెషలైజేషన్
ఎంబీఏ సరికొత్త స్పెషలైజేషన్లలో శరవేగంగా దూసుకెళ్తోంది.. రిటైల్ మేనేజ్‌మెంట్. ఒకప్పుడు మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో ఒక సబ్జెక్ట్‌గా ఉండే రిటైల్ మేనేజ్‌మెంట్..ఇప్పుడు ప్రత్యేక స్పెషలైజేషన్/కోర్సుగా అవతరించింది. దీనికి ప్రధాన కారణం.. రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అంగీకారం తెలపడమే. ఈ కారణంగా రిటైల్ రంగం 2015 నాటికి దాదాపు 600 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ వృద్ధి సాధిస్తుందని అంచనా. అంటే.. ఆ స్థాయిలో రిటైల్ అవుట్‌లెట్లు అందుబాటులోకి రానున్నాయి. వాటి సమర్థ నిర్వహణకు సుశిక్షితులైన అభ్యర్థులు అవసరం అనేది నిస్సందేహం. పై గణాంకాల ప్రకారం- మానవ వనరుల విషయంలో రిటైల్ రంగంలో ప్యాకింగ్ నుంచి సీఈఓ స్థాయి వరకు లక్షల్లో అభ్యర్థుల అవసరం ఏర్పడనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఏడాది, రెండేళ్ల వ్యవధిలో పీజీ, పీజీ డిప్లొమా పేరుతో పూర్తి స్థాయి రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. మరికొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు ఎంబీఏలో రిటైల్ మేనేజ్‌మెంట్‌ను ఒక స్పెషలైజేషన్‌గా ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సులో ఒక రిటైల్ అవుట్‌లెట్‌కు సంబంధించి ప్యాకింగ్, కస్టమర్ రిలేషన్‌షిప్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ ఆఫ్ అవుట్‌లెట్, మర్కండైజింగ్ వంటి పలు అంశాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దేలా సిలబస్ ఉంటుంది. ఈ కోర్సు/ స్పెషలైజేషన్ పూర్తిచేస్తే ప్రారంభంలోనే రూ.25వేల జీతం అందుకోవచ్చు. ‘రాష్ట్రంలో ఇప్పటికే భారతి వాల్‌మార్ట్, మెట్రో వంటి ప్రఖ్యాత రిటైల్ సంస్థలు అడుగుపెట్టాయి. త్వరలో ఇవి ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించనున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుంటే రిటైల్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ కెరీర్ రైజింగ్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు’ అంటున్నారు ప్రముఖ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, హైదరాబాద్ క్యాంపస్ మార్కెటింగ్, సేల్స్ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కవిత శశిధరన్ కులకర్ణి.

హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్.. అప్‌కమింగ్ కెరీర్
మేనేజ్‌మెంట్ కెరీర్ పరంగా అప్‌కమింగ్ స్పెషలైజేషన్‌గా మారుతున్న మరో స్పెషలైజేషన్.. హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్. పరిశ్రమ పరంగా మూడో పెద్ద రంగంగా నిలుస్తోంది హెల్త్‌కేర్ విభాగం. ఏటా స్థిరంగా 20 శాతం వృద్ధి సాధిస్తున్న ఈ రంగం.. 2015 నాటికి దాదాపు వంద బిలియన్ డాలర్లకు చేరుతుందని నిపుణుల అంచనా. ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు రెండు రంగాల్లోనూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, సౌకర్యాలతో హాస్పిటల్స్ విస్తరణ ఏటేటా పెరుగుతోంది. అంతేకాకుండా హెల్త్ టూరిజం కూడా ఈ రంగం విస్తరణకు దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో.. కేవలం వైద్యపరమైన అంశాలే కాకుండా.. పరిపాలన పరంగా వాటి సమర్థ నిర్వహణకు సుశిక్షితులైన అభ్యర్థులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో పలు ఇన్‌స్టిట్యూట్‌లు హెల్త్‌కేర్/హాస్పిటల్ మేనేజ్‌మెంట్ పేరుతో కోర్సులకు రూపకల్పన చేశాయి. మన రాష్ట్రంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ (హైదరాబాద్) పీజీ డిప్లొమా ఇన్ హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తోంది. అదే విధంగా అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కూడా హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తోంది. హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ విభాగంలో పేషెంట్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ మొదలు డెరైక్టర్/సీఈఓ స్థాయి వరకూ.. లక్షల్లోనే అవకాశాలు లభించనున్నాయి. ఈ స్పెషలైజేషన్‌లో మాస్టర్ డిగ్రీ అందుకుంటే హాస్పిటల్స్ మాత్రమే కాకుండా.. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, క్లినికల్ ప్రొడక్ట్ సంస్థలు వంటి ఇతర ఆరోగ్య అనుబంధ సంస్థల్లోనూ ఉద్యోగాలు అందుకోవచ్చు. ‘మన దేశంలోని హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉన్న వైద్యపరమైన సదుపాయాల దృష్ట్యా అగ్రరాజ్యం అమెరికా మొదలు.. ఆఫ్రికాలోని మారుమూల దేశాల నుంచి ఏటా లక్షల మంది ఇక్కడ వైద్యం కోసం వస్తున్నారు. ఈ క్రమంలో క్లినికల్ ఆపరేషన్స్‌తోపాటు హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేటర్స్ అవసరం కూడా ఎంతో ఉంది. కాబట్టి విద్యార్థులు ఈ రంగం వైపు దృష్టిసారిస్తే సుస్థిర భవిష్యత్తు సొంతమవుతుంది’ అనేది అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపాల్ డి. ఓబుల్ రెడ్డి అభిప్రాయం.

ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్
తాజాగా తళుకులీనుతున్న మరో స్పెషలైజేషన్.. ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్. ఈ కోర్సు ప్రధాన ఉద్దేశం.. కుటుంబ ఆధీనంలో నడిచే సంస్థలను ప్రగతి పథంలోకి తీసుకెళ్లడం. వాస్తవానికి బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల్లో టాప్-500లో 60 నుంచి 70 శాతం వరకు కుటుంబ యాజమాన్యంలో కార్యకలాపాలు సాగిస్తున్నవే. బిర్లా గ్రూప్, రిలయన్స్, డాబర్ ఇండియా లిమిటెడ్ వంటివే ఇందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలో.. కుటుంబ పరిధిలోని సంస్థకు అవసరమైన సుశిక్షితులను అందించే కోర్సు ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్. మరో రకంగా చెప్పాలంటే.. ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్‌ను అందించే కోర్సు. ఇప్పటివరకు ఈ తరహా కోర్సులను ఆయా కుటుంబాల పరిధిలోని యాజమాన్యాల వారసులే అభ్యసించేవారు. అదే విధంగా ఈ తరహా కోర్సుల సంఖ్య కూడా తక్కువగా ఉండి, విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ధోరణి మారింది. కుటుంబ యాజమాన్య పరిధిలోని సంస్థలు కూడా తమ సంస్థల సమర్థ నిర్వహణ, అభివృద్ధి దిశగా నిష్ణాతుల కోసం ఎదురుచూస్తున్నాయి. సంస్థ ఏర్పాటుకు అవసరమైన నిధులు అందించే సామర్థ్యం ఉన్న కుటుంబాలు ముఖ్యంగా ఈ కోవలో ముందంజలో ఉన్నాయి. దీన్ని గుర్తించిన పలు మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు ఇటీవల కాలంలో ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్నాయి.

మన రాష్ట్రంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 15 నెలల కోర్సును అందిస్తోంది. అదేవిధంగా ప్రఖ్యాత మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఎస్.పి.జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ వంటివి కూడా ఈ కోర్సుకు రూపకల్పన చేశాయి. అటు కుటుంబ నిర్వహణ, ఇటు సంస్థ కార్యకలాపాల మధ్య సమతుల్యత పాటించే నైపుణ్యం అందించే విధంగా ఈ కోర్సుల రూపకల్పన ఉంటోంది. ఇప్పటికీ దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడుతున్న సంస్థల్లో అధిక శాతం కుటుంబ నియంత్రణ, నిర్వహణ పరిధిలోని సంస్థలే. ఎలాంటి అర్హతలు లేకుండా ఆర్థిక వనరుల ఆధారంగా సంస్థను ప్రారంభించి.. ఆ తర్వాత మేనేజ్‌మెంట్ కోర్సును అభ్యసించిన యజమానులు ఎందరో! ఇలాంటి తరుణంలో ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్ భవిష్యత్తు ఔత్సాహికులకు ఎంతో ఆశాజనకంగా ఉంటుంది. అయితే ఈ కోర్సు.. తాజా గ్రాడ్యుయేట్లతో పోల్చితే వర్కింగ్ ఎగ్జిక్యూటివ్‌లకు మరింతగా ఉపయోగపడుతుంది. అలాగని తాజా గ్రాడ్యుయేట్లు ఆందోళన చెందక్కర్లేదు. కోర్సులోని అన్ని అంశాల్లో ప్రాక్టికల్ అప్రోచ్‌తో నైపుణ్యం సాధిస్తే వారికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది’ అంటున్నారు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్, చిత్తూరు రవీంద్ర.

టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్
కళకళలాడే కెరీర్‌కు సోపానంగా నిలుస్తున్న మరో మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ ..టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్. ఎకో టూరిజం, హెల్త్/మెడికల్ టూరిజం, కల్చరల్ టూరిజం ద్వారా విదేశీ పర్యాటకులను ఆకర్షించి విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఫలితంగా జీడీపీలో సగటున 5.9 శాతం వృద్ధితో సాగుతున్న ఈ రంగం కార్యకలాపాలు.. 2015 నాటికి వంద కోట్ల డాలర్లకుపైగా చేరుతాయని అంచనా. ఇలా.. ఏటా లక్షల సంఖ్యలో విదేశీ పర్యాటకుల రాకతో.. టూరిజం, హాస్పిటాలిటీ రంగం దినదినప్రవర్థమానం అవుతోంది. మరోవైపు ఈ రంగంలో నిష్ణాతులైన మానవ వనరుల కొరత తీవ్రంగా ఉంది. 2015 నాటికి ఈ రంగంలో గైడ్ మొదలు డెరైక్టర్ స్థాయి వరకు దాదాపు లక్ష మంది అవసరం ఏర్పడనుంది. దీన్ని గుర్తించిన పలు ఇన్‌స్టిట్యూట్‌లు పీజీ స్థాయిలో టూరిజం అండ్ హాస్పిటాలిటీ లేదా హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ పేరుతో కోర్సును అందిస్తున్నాయి. మన రాష్ట్రంలో డాక్టర్ వైఎస్‌ఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్.. ఎంబీఏ హాస్పిటాలిటీ కోర్సును అందిస్తోంది. ప్రయాణాలు, ఎదుటివారిని మెప్పించే తత్వం ఉన్న వారికి సరైన కోర్సు ఇది. కోర్సులో భాగంగా పర్యాటకులను ఆహ్వానించే శైలి నుంచి వీడ్కోలు పలికే వరకు.. వారిని మెప్పించే విధంగా అనుసరించాల్సిన నైపుణ్యాలపై(టూర్ డెరైక్షన్, రూట్ మ్యాప్, గెస్ట్ రిలేషన్‌షిప్ స్కిల్స్ తదితర) శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తి చేసిన వారికి ప్రారంభంలోనే రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం లభిస్తుంది. ‘టూరిజం అండ్ హాస్పిటాలిటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో ఈ రంగం కెరీర్ పరంగా అవకాశాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. విద్యార్థుల్లో అవగాహన లోపం కారణంగా ఈ రంగంవైపు పెద్దగా దృష్టి సారించట్లేదు. ఎంబీఏ అంటే.. ఫైనాన్స్, హెచ్‌ఆర్ వంటి సాంప్రదాయ స్పెషలైజేషన్లే అనే భావనలోనే ఉన్నారు. దీన్ని విడనాడి విస్తృత దృక్పథంతో ఆలోచించి ఈ రంగంవైపు అడుగులు వేస్తే భవిష్యత్తు బంగారుమయం అవుతుందనడంలో సందేహం లేదు’ అంటున్నారు డాక్టర్ వైఎస్‌ఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ డెరైక్టర్ పి.నారాయణరెడ్డి.

ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. స్వయం ఉపాధికి సోపానం
భవిష్యత్తులో స్వయం ఉపాధి కోరుకునే వారికి, సొంతంగా సంస్థలు నెలకొల్పి జాబ్ ప్రొవైడర్స్‌గా నిలవాలని ఆలోచించే ఔత్సాహిక అభ్యర్థులకు అద్భుత అవకాశం.. ఎంబీఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్‌మెంట్. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ సాధన క్లిష్టంగా మారిన తరుణంలో ఈ కోర్సు పూర్తి చేసిన వెంటనే సొంతంగా సంస్థ నెలకొల్పే నైపుణ్యాలు (సేల్స్, మార్కెటింగ్, నెగోషియేషన్స్, గోల్ సెట్టింగ్స్, మోటివేటింగ్ స్కిల్స్, లీడర్‌షిప్, వెంచర్ ప్లానింగ్, కస్టమర్ రిలేషన్‌షిప్ తదితర) అందించే కోర్సు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్‌మెంట్. కేవలం సొంత సంస్థలు స్థాపించేందుకే కాకుండా.. ఇతర సంస్థల్లోనూ ఈ కోర్సు ఉత్తీర్ణులకు పలు అవకాశాలు లభిస్తాయి. ఇతర దేశాలతో పోల్చితే అటు అభ్యర్థులు, ఇటు ఇన్‌స్టిట్యూట్‌ల పరంగానూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్‌మెంట్ ఆవశ్యకత, అవగాహన విషయంలో మన దేశం కొంత వెనుకంజలో ఉంది. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులో భాగంగా ఈ స్కిల్స్‌ను అందిస్తుంటే.. మరికొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఒక ఎలక్టివ్ సబ్జెక్ట్‌గా మాత్రమే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను రూపొందించాయి. దేశం మొత్తంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (అహ్మదాబాద్) మాత్రమే పూర్తి స్థాయి కోర్సును అందిస్తోంది.

రూరల్ మేనేజ్‌మెంట్
సామాజిక సేవా దృక్పథం, సహనం, వైవిధ్యం కోరుకునే వారికి సంతృప్తితోపాటు సంపాదనను అందించే స్పెషలైజేషన్.. రూరల్ మేనేజ్‌మెంట్. 120కోట్ల జనాభా ఉన్న భారత్‌లో దాదాపు 70 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ.. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ వృత్తులు, ఇతర సాంప్రదాయ వృత్తుల్లో జీవనం సాగిస్తున్నారు. వారికోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. ఇటీవల కాలంలో వాటిని విస్తృతం చేస్తోంది. అదేవిధంగా యూనిసెఫ్ కూడా పలు పథకాలు రూపొందిస్తోంది. దీంతోపాటు ఐక్యరాజ్య సమితి మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ పథకంలో గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసి.. పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రత్యేక విభాగాలను ఆవిష్కరించింది (ఉదా: ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునెటైడ్ నేషన్స్). ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లోని ప్రజల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని రూపొందించినవే. ఈ క్రమంలో వాటి సమర్థ నిర్వహణకు నిష్ణాతుల అవసరం ఏర్పడుతోంది. ఈ నిష్ణాతులను తీర్చిదిద్దే కోర్సే.. రూరల్ మేనేజ్‌మెంట్. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలతోపాటు, పలు స్వచ్ఛంద సంస్థలు చేపట్టే కార్యకలాపాల నిర్వహణపై అవగాహన పొందేలా రూరల్ మేనేజ్‌మెంట్ కోర్సు స్వరూపం ఉంటుంది. కోర్సు పూర్తి చేసిన వారికి కొలువు ఖాయం. ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లుగా పేరొందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(అహ్మదాబాద్), టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్(ముంబై), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్(ఆనంద్), కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (హైదరాబాద్)లు పూర్తిస్థాయిలో రూరల్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్నాయంటే దీని ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు, మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్‌లో పేర్కొన్న లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటే.. రానున్న మూడు నుంచి అయిదేళ్లలో.. వేల సంఖ్యలో రూరల్ మేనేజ్‌మెంట్ నిష్ణాతుల అవసరం ఏర్పడనుంది. ప్రారంభంలోనే రూ. 20 వేల జీతంతో కెరీర్ ప్రారంభించొచ్చు.

Published date : 26 Sep 2013 05:20PM

Photo Stories