Skip to main content

ఎంబీఏలకు మంచి డిమాండ్...

మేనేజ్‌మెంట్ కోర్సు చివరి సంవత్సరం చదువుతున్నారా..కార్పొరేట్ కొలువుల్లో చేరడమే మీ లక్ష్యమా.. పేప్యాకేజ్‌లు ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటున్నారా.. అయితే.. మీకు ఆనందం కలిగించే సర్వే నివేదికను ప్రముఖ సంస్థ జీమ్యాక్ వెల్లడించింది.
ఈ ఏడాది అంతర్జాతీయంగా ఎంబీఏలకు కంపెనీలు పెద్దపీట వేయనున్నట్లు తెలిపింది. గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ (జీమ్యాక్) వార్షిక సర్వే వివరాలపై విశ్లేషణ..

మేనేజ్‌మెంట్ కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు.. ఈ ఏడాది కార్పొరేట్ కొలువులపై ఆశలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే..అంతర్జాతీయంగా ఈ సంవత్సరం ఎంబీఏలకు మంచి డిమాండ్ ఉంటుందని జీమ్యాక్ సంస్థ నిర్వహించిన సర్వే నివేదిక తెలియజేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తాము చేపట్టిన సర్వేలో 81 శాతం సంస్థలు బి-స్కూల్స్ పట్టభద్రులను నియమించుకోవడానికి సానుకూలంగా ఉన్నట్లు తేలిందని పేర్కొంది. వేతనాల పరంగానూ ఆకర్షణీయమైన వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. జీమ్యాక్ వార్షిక సర్వే ప్రకారం మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ల నియామకం ఈ ఏడాది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా ఉండనుంది. ఈ ప్రాంతానికి చెందిన 90 శాతం సంస్థలు ఈ ఏడాది తాజా గ్రాడ్యుయేట్లను నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాయి. మన దేశం భాగంగా ఉండే దక్షిణాసియా ప్రాంతం నుంచి 22 శాతం మేర సంస్థలు నియామకాలు చేపడతామని తెలిపాయి. ఎంబీఏల నియామకాలకు సంబంధించి జీమ్యాక్ సంస్థ మొత్తం 42 దేశాల్లోని 1066 సంస్థలను సంప్రదించింది. గత నాలుగేళ్లలో తొలిసారిగా ఈ ఏడాది మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లకు సానుకూల వాతావరణం నెలకొందని తన తాజా సర్వేలో పేర్కొంది. అంతేకాకుండా ఈ సంస్థ చేపట్టిన సర్వేలో ఫార్చూన్ గ్లోబల్ 100 సంస్థల్లో 20 శాతం సంస్థలు.. తాము మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ల నియామకాలకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొనడం విశేషం.

పెద్ద కంపెనీలు సానుకూలం..
ఎంబీఏలకు పెద్దపీట వేసేందుకు సానుకూలంగా ఉన్నవాటిలో భారీ స్థాయి కంపెనీల సంఖ్య ఎక్కువగానే ఉంది. వీటితోపాటు స్టార్టప్ సంస్థల్లోనూ గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం నియామకాల సంఖ్య పెరగనుంది. గతేడాది స్టార్టప్ సంస్థల్లో నియామకాలు 55 శాతం ఉంటే.. ఈ సంవత్సరం అది 77 శాతానికి చేరే అవకాశముందని నివేదిక తెలిపింది. మరోవైపు 75 శాతం కంపెనీలు..తాజా గ్రాడ్యుయేట్లను మిడిల్ మేనేజ్‌మెంట్ హోదాల్లో నియమించుకుంటామని చెప్పడం ఫ్రెషర్స్‌కు కలిసొచ్చే అంశం.

‘పీజీ’లకు ప్రాధాన్యం :
జీమ్యాక్ సర్వే అంచనా ప్రకారం సంస్థలు మేనేజ్‌మెంట్ పీజీ పూర్తిచేసిన వారి వైపు మొగ్గు చూపుతున్నాయి. ఆసియా పసిఫిక్‌లో 73 శాతం; యూరప్‌లో 72 శాతం; లాటిన్ అమెరికాలో 69 శాతం సంస్థలు మేనేజ్‌మెంట్ పీజీ పట్టభద్రులకు నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సర్వే వెల్లడించింది. ఈ విషయంలో హెల్త్‌కేర్, కన్సల్టింగ్, ప్రొడక్ట్స్, సర్వీసెస్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగ సంస్థలు ముందంజలో నిలవనున్నాయి.

డేటాఅనలిటిక్స్‌కు డిమాండ్ :
జీమ్యాక్ సర్వేలో వెల్లడైన మరో అంశం... డేటాఅనలిటిక్స్ నిపుణులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ నెలకొనడం. సర్వేలో పాల్గొన్న మొత్తం సంస్థల్లో 71 శాతం కంపెనీలు డేటాఅనలిటిక్స్ నిపుణుల నియామకాలు చేపట్టనున్నట్లు తెలపడమే ఇందుకు నిదర్శనం. డేటాఅనలిటిక్స్‌లో ప్రత్యేకంగా మాస్టర్ ఆఫ్ డేటాఅనలిటిక్స్ వంటి కోర్సులు పూర్తిచేసిన వారికి మరింత డిమాండ్ కనిపించనుంది. డేటాఅనలిటిక్స్ నిపుణులను నియమించుకునే విషయంలోనూ ఆసియా పసిఫిక్ ప్రాంతం ముందంజలో నిలవనుంది. ఈ ప్రాంతంలో 62 శాతం సంస్థలు డేటాఅనలిటక్స్ నిపుణుల నియామకాలకు సన్నద్ధమవుతున్నాయి.

అమెరికా సంస్థల్లోనూ అవకాశం :
అంతర్జాతీయంగా ఉద్యోగం అనగానే గుర్తొచ్చే దేశం.. అమెరికా. జీమ్యాక్ సర్వేలో పాల్గొన్న అమెరికాకు చెందిన సంస్థల్లో 47 శాతం కంపెనీలు విదేశీ ఎంబీఏలను నియమించుకునేందుకు సానుకూలంగా ఉన్నట్లు పేర్కొనడం గమనార్హం. అమెరికా సంస్థలు తమ విదేశీ కార్యాలయాల్లో నియామకాలు చేపడతామని చెప్పడం అభ్యర్థులకు ఊరటనిస్తుందని చెప్పొచ్చు. అమెరికా సంస్థల్లో విదేశీయుల నియామకాల పరంగా టెక్నాలజీ, కన్సల్టింగ్ సంస్థలు ముందంజలో నిలుస్తున్నాయి.

వేతనాలు ఆకర్షణీయం :
ఈ ఏడాది ఎంబీఏలకు సగటు ప్రారంభ వేతనాలు సైతం ఆకర్షణీయంగా ఉండే అవకాశముందని జీమ్యాక్ సర్వే పేర్కొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 35వేల డాలర్ల వార్షిక సగటు వేతనం అందించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా ఎంబీఏ ఇంటర్న్‌షిప్ ఔత్సాహికులకూ ముందున్నది మంచి కాలమేనని సర్వే పేర్కొంటోంది. సంస్థల్లో స్వల్ప కాలం పనిచేసి, వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసే ఇంటర్న్‌షిప్ ట్రైనీల నియామకాల విషయంలోనూ సంస్థలు సానుకూల ధోరణితో స్పందించాయి. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో 65 శాతం సంస్థలు, అమెరికాలో 62 శాతం సంస్థలు ఇంటర్న్‌షిప్ ట్రైనీలను నియమించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు జీమ్యాక్ సర్వే వెల్లడించింది.

జీమ్యాక్ సర్వే ముఖ్యాంశాలు..
  • కన్సల్టింగ్, సర్వీస్, హెల్త్‌కేర్, ప్రొడక్ట్స్, మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థల్లో నియామకాలు
  • సగటు ప్రారంభ వార్షిక వేతనాల్లో పెరుగుదల
  • డేటా అనలిటిక్స్ ప్రొఫైల్స్‌లో నియామకానికి ప్రాధాన్యం
  • ఫైనాన్స్‌, అకౌంటింగ్, మార్కెటింగ్‌లో మాస్టర్ డిగ్రీ అభ్యర్థులకు అవకాశం
  • ఇంటర్న్ ట్రైనీలను నియమించుకునేందుకు సుముఖత వ్యక్తం చేసిన 60 శాతంపైగా సంస్థలు.
Published date : 03 Jul 2018 12:44PM

Photo Stories