Skip to main content

ఎంబీఏ.. స్పెషలైజేషన్ కీలకం

మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.. ఎంబీఏ.. మేనేజ్‌మెంట్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటున్న వారికి సరైన కోర్సు.. ఈ కోర్సులో రెండో ఏడాదిలో స్పెషలైజేషన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. కెరీర్ పరంగా దీన్ని కీలక దశగా పరిగణించవచ్చు.. ఈ సమయంలో ఎంచుకునే స్పెషలైజేషన్.. భవిష్యత్ గమనాన్ని నిర్దేశిస్తుందని చెప్పొచ్చు.. ఈ నేపథ్యంలో స్పెషలైజేషన్‌ను ఎంచుకునే క్రమంలో ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? డిమాండ్ ఉన్న స్పెషలైజేషన్స్? తదితర అంశాలపై ఫోకస్..

ఫైనాన్స్ మేనేజ్‌మెంట్:
సంస్థకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అంశాలపై మెలకువలను బోధించే స్పెషలైజేషనే ఫైనాన్స్ మేనేజ్ మెంట్. ఇందులో కార్పొరేట్ ఫైనాన్స్, కాస్టింగ్, బడ్జెటింగ్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్, సెక్యూరిటీలు తదితర అంశాలను బోధిస్తారు. అనలిటికల్ స్కిల్స్, అకౌంటింగ్, ఆడిటింగ్ అంశాలపై పట్టు, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంపెనీ-ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టాలు-వాటిల్లో వస్తున్న మార్పులపై అవగాహన ఉంటే ఈ రంగంలో రాణించవచ్చు. వీరికి ఫైనాన్షియల్ కంపెనీలు, బ్యాంకింగ్, బ్రోకింగ్ ఫర్మ్స్, స్టాక్ మార్కెట్లు, మానుఫాక్చరింగ్ కంపెనీలు, ఫారెన్ మనీ ట్రేడింగ్ సంస్థలు కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఎంబీఏ(ఫైనాన్స్)-సీఏ అర్హత ఉంటే.. ఈ రంగంలో అత్యున్నత స్థాయిలో స్థిర పడొచ్చు. రిస్క్ అండ్ ఇన్సూరెన్స్ మేనేజర్స్, క్రెడిట్ మేనేజర్స్, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ ఆఫీసర్ వంటివి దీంతో ఉండే జాబ్ ప్రొఫైల్స్. తర్వాత చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్థాయికి కూడా చేరుకోవచ్చు.

మార్కెటింగ్:
కమ్యూనికేషన్ స్కిల్స్, మార్కెట్ పరిస్థితులను అవగాహన చేసుకునే సామర్థ్యం, కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ఉత్పత్తులను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేసే సామర్థ్యం, బృందంగా పని చేసే నేర్పు ఉన్న వారికి ఈ స్పెషలైజేషన్ సరిపోతుంది. ఈ స్పెషలైజేషన్‌లో ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, ప్రమోషన్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, కన్జ్యూమర్ బిహేవియర్, సర్వీసెస్ అండ్ రిటైల్ మార్కెటింగ్, అడ్వర్‌టైజింగ్ తదితర అంశాలు ఉంటాయి. పెరుగుతున్న పోటీ కారణంగా ఎంబీఏ-మార్కెటింగ్ అభ్యర్థులకు డిమాండ్ ఎప్పుడూ అధికంగానే ఉంటోంది. వీరికి వివిధ సంస్థల్లో మార్కెటింగ్ మేనేజర్, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్, బ్రాండ్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్ వంటి హోదాల్లో అవకాశాలు ఉంటాయి. తర్వాత చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ స్థాయికి కూడా చేరుకోవచ్చు. ప్రస్తుత టాప్ ఎంఎన్‌సీల సీఈఓల్లో చాలా మంది ఎంబీఏ (మార్కెటింగ్) నేపథ్యం ఉన్న వారే కావడం గమనార్హం.

హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్:
ఒక సంస్థ/ కంపెనీలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడం, వారి పనితీరును అంచనా వేయడం, అవసరమైన అంశాల్లో శిక్షణనివ్వడం, మెర్జర్స్-ఎక్విజిషన్స్, సంస్థ పనితీరు మెరుగుపరచడం కోసం వ్యూహాలు రూపొందించడం వంటి విధులను హెచ్‌ఆర్ మేనేజర్లు నిర్వహిస్తుంటారు. ఈ స్పెషలైజేషన్‌లో స్టాఫింగ్, రిక్రూటింగ్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, పర్సనల్ మేనేజ్‌మెంట్, పెర్ఫామెన్స్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్ అండ్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్, లేబర్ లాస్ తదితర అంశాలను బోధిస్తారు. సందర్భానుసారంగా వ్యవహరించే నేర్పు, ప్రశాంతమైన వాతావరణంలో విధులను నిర్వహించాలనుకునే వారు, బృందంగా పనిచేసే సామర్థ్యం ఉన్న వారికి సరిపడే స్పెషలైజేషన్ ఇది. ఏ సంస్థకైనా హెచ్‌ఆర్ విభాగం తప్పనిసరి. కాబట్టి వీరికి అవకాశాలు పుష్కలం అని చెప్పొచ్చు. ఈ క్రమంలో పబ్లిక్, ప్రైవేట్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, కార్పొరేట్ హౌసెస్, ఎంఎన్‌సీలు కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి.

ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్:
ట్రేడింగ్, సర్వీసెస్, మాన్యుఫ్యాక్చరింగ్ ఇలా ఏ సంస్థ అయినా.. ప్రారంభ దశ నుంచి అడుగడుగునా ఉపయోగపడే విభాగం ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్. ఈ స్పెషలైజేషన్‌లో ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, వెండార్ డెవలప్‌మెంట్, ప్రొడక్షన్, క్వాలిటీ మేనేజ్‌మెంట్, పర్చేజ్ ఫంక్షన్స్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్లాంట్స్, యుటిలిటీస్ తదితర అంశాలుంటాయి. ఇందులో ప్రొడక్షన్/ మాన్యుఫాక్చరింగ్ ఆపరేషన్స్, సర్వీసెస్ ఆపరేషన్స్ అనే రెండు రకాల ఉపవిభాగాలు ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, బృందంగా పనిచేసే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే ఈ స్పెషలైజేషన్‌ను ఎంచుకోవచ్చు. వీరికి రిటైల్, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, ఐటీ తదితర సంస్థల్లో మెటీరియల్- సప్లై చైన్ మేనేజ్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్, లాజిస్టిక్స్, ఇన్వెంటరీ కంట్రోల్, ప్రొడక్షన్ ప్లానింగ్, వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో అవకాశాలు ఉంటాయి. ప్రారంభంలో ప్రొడక్ట్ మేనేజర్, టెక్నికల్ సూపర్‌వైజర్ వంటి హోదాల్లో పని చేయాల్సి ఉంటుంది. తర్వాత చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, జీఎం స్థాయికి కూడా చేరుకోవచ్చు. ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ చక్కగా సరిపోతుంది. ఎందుకంటే ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, డిజైన్, ఇంట్రానెట్ డెవలప్‌మెంట్ సంబంధిత అంశాల్లో ఇతర అభ్యర్థుల కంటే ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎక్కువ అవగాహన కలిగి ఉంటారు. ప్రస్తుతం చాలా కంపెనీలు ఇంజనీరింగ్/టెక్నికల్ విభాగాలతో బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ (ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్) అర్హత ఉన్న అభ్యర్థులను నియమించుకోవడానికి ప్రాధాన్యత నిస్తున్నాయి.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ:
ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన స్పెషలైజేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ). ఐటీ నేపథ్యం (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లేదా ఐటీ గ్రాడ్యుయేట్), కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ వంటి కంప్యూటర్ సంబంధ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న విద్యార్థులకు సరిపోయే స్పెషలైజేషన్ ఇది. ఒక సంస్థ అవసరాలకు సరిపడే వివిధ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ప్లాట్‌ఫాంలను గుర్తించి వాటిని అమలు చేసే మెలకువలను ఇందులో బోధిస్తారు. ఈ క్రమంలో మేనేజ్‌మెంట్ కాన్సెప్ట్స్, మేనేజీరియల్ ఎకనామిక్స్, ఎక్స్‌ఎల్, పవర్‌పాయింట్ వంటి సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలు, ఇంటర్నెట్ ఆపరేషన్స్, ఎలక్ట్రానిక్ కామర్స్-ఎలక్ట్రానిక్ బిజినెస్, కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలు ఉంటాయి. ఈ స్పెషలైజేషన్ పూర్తి చేసిన వారికి ఐటీ , సంబంధిత కంపెనీల్లో బిజినెస్ అనలిస్ట్, బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్, టెక్నికల్ సిస్టమ్స్ మేనేజర్, టెక్నికల్ అనలిస్ట్, టెక్నికల్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ మేనేజర్, క్వాలిటీ మేనేజర్, ఈఆర్‌పీ కన్సల్టెంట్లుగా అవకాశాలు లభిస్తాయి. తర్వాత చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ స్థాయికి కూడా చేరుకోవచ్చు.


ఇంటర్నేషనల్ బిజినెస్:
భిన్న సంస్కృతుల్లో పనిచేసే సంసిద్ధత, ప్రయాణాలు చేసే ఆసక్తి, నిరంతర అధ్యయనం చేసే ఓర్పు, ఎగుమతులు- దిగుమతులకు సంబంధించిన విధానాలను పరిశీలించడం వంటి లక్షణాలు ఉన్న వారికి ఈ స్పెలైజేషన్ సరిపోతుంది. ఈ స్పెషలైజేషన్‌లో మేనేజ్‌మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్ లా, డబ్ల్యూటీఓ ట్రేడ్ పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్ వంటి అంశాలు ఉంటాయి. వీరికి ఎక్స్‌పోర్ట్ హౌసెస్, బ్యాంకులు, విదేశీ వాణిజ్య విభాగాలు, పోర్టులు, ఏవియేషన్ కంపెనీలు, ఐటీ తదితర కంపెనీల్లో.. ఎగ్జిక్యూటివ్, ఎక్స్‌పోర్ట్ మేనేజర్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఇంటర్నేషనల్ బిజినెస్ కన్సల్టెంట్ వంటి హోదాల్లో స్థిర పడొచ్చు. మార్కెటింగ్ స్పెషలైజేషన్ విద్యార్థులు దాని కాంబినేషన్‌గా ఇంటర్నేషనల్ బిజినెస్‌ను డ్యూయల్ స్పెషలైజేషన్‌గా ఎంచు కోవడం లాభిస్తుంది.

హాస్పిటల్/హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్:
హాస్పిటల్ నిర్వహణ, సంబంధిత సిబ్బంది నియామకం, పరిపాలన సంబంధ విధులు, వివిధ విభాగాల మధ్య సమన్వయం,ఆరోగ్య సేవల మూల్యాంకనం, తదితర విధులను వీరు నిర్వహిస్తుంటారు. ఈ కోర్సులో హేల్త్‌కేర్ ఎకనామిక్స్, ఐటీ ఫర్ హెల్త్‌కేర్, హెల్త్‌కేర్ టెక్నాలజీ అండ్ ఫార్మాస్యుటికల్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలు ఉంటాయి. కార్పొరేట్ హాస్పిటల్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు, ఐటీ కంపెనీలు, బీపీఓలో.. మేనేజర్ హోదాలో అవకాశాలు ఉంటాయి. తర్వాత జనరల్ మేనేజర్ స్థాయికి కూడా చేరుకోవచ్చు.

మరికొన్ని అప్‌కమింగ్ స్పెషలైజేషన్లు:
  • బ్యాంకింగ్
  • ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
  • హాస్పిటాలిటీ అండ్ టూరిజం
  • మీడియా మేనేజ్‌మెంట్.
  • అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్
  • రూరల్ మేనేజ్‌మెంట్
  • సప్లై చైన్ మేనేజ్‌మెంట్
  • ఫార్మసీ/ ఫార్మాస్యుటికల్ మేనేజ్‌మెంట్
  • బయోటెక్నాలజీ
  • టెలీకమ్యూనికేషన్స్
  • ఎంబీఏ (కోర్ట్ మేనేజ్‌మెంట్/కార్పొరేట్ గవర్నెస్/ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ మేజర్ సబ్జెక్ట్‌లుగా)
ఎంపిక ఎలా స్పెషలైజేషన్ ఎంచుకునే ముందు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

వ్యక్తిగత బలాలు:
ముందుగా వ్యక్తిగతంగా విశ్లేషణ చేసుకోవాలి. ఏ అంశం పట్ల ఆసక్తి ఉందో తెలుసుకోవాలి. ఉదాహరణకు ఎటువంటి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు? డెస్క్ జాబ్ (ఆఫీస్‌లో ఉండే)కు ప్రాధాన్యతనిస్తున్నారా? ప్రయాణాలు అంటే ఆసక్తా? ప్రజలతో సంభాషించడం ఇష్టంగా భావిస్తారా? వంటి ఆంశాలను పరిగణనలోకి తీసుకుని స్పెషలైజేషన్‌ను ఎంచుకోవాలి. ఉదాహరణకు డెస్క్ జాబ్ చేయాలనుకుంటే హెచ్‌ఆర్ స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకోవాలి.

అకడెమిక్:
అకడెమిక్ పరంగా బలాలు, బలహీనతల ఆధారంగా కూడా స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు మ్యాథమెటిక్స్, అకౌంటింగ్స్ అంశాలపై ఆసక్తి ఉంటే ఫైనాన్స్ స్పెషలైజేషన్‌ను ఎంచుకోవాలి.

ట్రెండ్:
ప్రస్తుతం డిమాండ్‌ను బట్టి స్పెషలైజేషన్‌ను ఎంచుకోవడం అంత సమర్థనీయం కాదు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ మీరు కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉండకపోవచ్చు. కాబట్టి దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని స్పెషలైజేషన్‌ను ఎంచుకోవాలి. భవిష్యత్‌లో ఎవరితో పోటీ పడుతున్నామనే విషయంలో స్పష్టమైన అవగాహన ఎంతో అవసరం.

రిసోర్సెస్:
మీరు ఎంచుకోవాలనుకున్న స్పెషలైజేషన్‌కు సంబంధించి ఆ రంగంలో అప్పటికే స్థిరపడిన వారితో సంప్రదించడం తప్పకుండా మేలు చేస్తుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు, మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీ, సీనియర్లు, స్నేహితులతోపాటు ఫేస్‌బుక్ వంటి ఆన్‌లైన్ సోర్సెస్ ద్వారా కూడా ఒక అంచనాకు రావచ్చు.

స్పెషలైజేషన్ ఏదైనా అవకాశాలు అనేకం..

ప్రస్తుతం ఎంబీఏలో ఫైనాన్స్, హెచ్.ఆర్., మార్కెటింగ్.. ఇలా ఏ స్పెషలైజేషన్ ఎంచుకున్నప్పటికీ అవకాశాలకు కొదవ లేదు. కానీ విద్యార్థులకు ప్రాథమికంగా అవసరమైన లక్షణాలు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అవసరం. అంతేకాకుండా ఎంచుకున్న స్పెషలైజేషన్‌కు సంబంధించి.. వాస్తవ కోణంలో సదరు రంగం గురించి వర్తమాన, భవిష్యత్తు పరిణామాలను అంచనా వేయగలిగే సామర్థ్యం సొంతం చేసుకోవాలి. స్పెషలైజేషన్‌ను ఎంచుకునే ముందు కేవలం జాబ్ మార్కెట్ ట్రెండ్‌నే కాకుండా తమ స్వీయ అభిరుచి, విద్యా నేపథ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మార్కెటింగ్ స్పెషలైజేషన్‌లో రాణించగలరు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం తమ స్పెషలైజేషన్‌కే పరిమితం కాకుండా దానికి సంబంధించి స్వల్పకాలిక అనుబంధ కోర్సులు చేస్తే ఉద్యోగావకాశాలు మరింత విస్తరిస్తాయి. ఉదాహరణకు ఫైనాన్స్ స్పెషలైజేషన్ విద్యార్థులు ఈక్విటీ రీసెర్చ్, సీ.ఆర్.ఎం., సెబి, ఎన్‌ఎస్‌ఈ వంటి సంస్థలు అందించే సర్టిఫికెట్ కోర్సులు చేయడం అదనపు ప్రయోజనం. అదే విధంగా హెచ్.ఆర్. అభ్యర్థులు ఆ.ఆర్.పీ. ప్రోగ్రామ్స్ (ఉదా: శాప్, పీపుల్‌సాఫ్ట్ తదితర) చేయొచ్చు. మార్కెటింగ్ వారికి ప్రత్యేక ప్రయోజనం కలిగించే సర్టిఫికెట్ కోర్సు సీ.ఆర్.ఎం. ఇలా.. ఎంబీఏలో చేరిన విద్యార్థి స్పెషలైజేషన్ ఎంపిక మొదలు ఉద్యోగ సాధన వరకు ప్రతి దశలో వ్యూహాత్మకంగా వ్యవహరించి, విశ్లేషణాత్మక నైపుణ్యాలు పెంచుకుంటూ.. అంచనా, ఆసక్తి, అవగాహన వంటివి ప్రధాన లక్షణాలుగా అలవర్చుకుని ముందడుగు వేయాలి. కొత్తగా చేరనున్న విద్యార్థులు కూడా కేవలం.. ఒక కోర్సులో చేరుతున్నామనే భావనకు పరిమితం కాకుండా తొలి రోజు నుంచే వ్యక్తిగతంగా, భవిష్యత్తులో వృత్తి పరంగా రాణించే విధంగా అడుగులు వేయాలి. ఇందుకోసం గ్రూప్ డిస్కషన్స్‌లో పాల్పంచుకోవడం, ఆయా సెమినార్లకు హాజరు కావడం, కేస్ స్టడీల ను విశ్లేషణ చేయడం వంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఫలితంగా సర్టిఫికెట్ చేతికందే సమయానికి ‘ఇండస్ట్రీ రెడీ’ అభ్యర్థిగా గుర్తింపు పొందుతారు. ఆల్ ది బెస్ట్.

పి. రమేశ్, హెడ్,
డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్,

Published date : 14 Jun 2013 02:55PM

Photo Stories