Skip to main content

ఎంబీఏ.. ఎందుకు? ఎలా?

ఏ కోర్సు చదివినాదాని అంతిమ లక్ష్యం.. ఉద్యోగమే. జాబ్ మార్కెట్ కోణంలో.. కొన్ని కోర్సుల ఎంపికలో ముఖ్యంగా ఎంబీఏ విషయంలో ప్రస్తుతం పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇతర కోర్సులతో పోల్చితే ఎంబీఏకు ఎక్కువ వ్యయం కావడం, కోర్సును పూర్తి చేయడానికి పట్టే సమయం, బాగా పేరున్న కాలేజీలో చదివితేనే ప్లేస్‌మెంట్స్ వంటి అంశాలు ఈ కోర్సు విశ్వసనీయతకు పరీక్షగా నిలుస్తున్నాయి. మరో వైపు మన హైదరాబాద్ విద్యార్థుల్లో ఎక్కువమంది మేనేజ్‌మెంట్ కోర్సులవైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థుల్లోనూ ఈ ధోరణి కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఐఎస్‌బీ, ఐపీఈ, ఓయూ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లలో ఎంబీఏ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ప్రతిష్టాత్మక బీ స్కూల్స్ ఐఐఎంలలో ప్రవేశం కోసం అక్టోబర్‌లో జరిగే క్యాట్‌కు నగరంలోని విద్యార్థులు అప్పుడే సీరియస్ ప్రిపరేషన్ ప్రారంభించేశారు. ఈ నేపథ్యంలో జాబ్ మార్కెట్లో ఎంబీఏకు ఉన్న డిమాండ్, కోర్సు చేస్తే వచ్చే ప్రయోజనాలపై నిపుణుల విశ్లేషణ...

జీమ్యాక్ అధ్యయనం:
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంబీఏకు జాబ్ మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉంది? ఎంతమంది ఎంప్లాయర్స్ ఎంబీఏ విద్యార్థులను రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నారనే విషయంపై గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ (జీమ్యాక్, ప్రపంచవ్యాప్తంగా మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణికంగా పరిగణించే జీమ్యాట్ పరీక్షను నిర్వహించే సంస్థ) ఒక సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనం మేరకు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మూడొంతుల మంది ఎంప్లాయర్స్ అంటే దాదాపు 87 శాతం కంపెనీలు.. బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడం లేదా గతంతో పోల్చితే ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకునేందుకు సుముఖంగా ఉన్నాయి. అందుకనుగుణంగా హైరింగ్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇతర సంస్థల అంచనాలు కూడా దాదాపు జీమ్యాక్ అంచనాలతో సరిపోతున్నాయి.

పే ప్యాకేజ్:
వేతనాల విషయానికొస్తే.. హైరింగ్- పేప్యాకేజ్ అనే అంశాలు ఒకదానితో ఒకటి సహ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. జీమ్యాక్ అంచనా ప్రకారం ఈ ఏడాది 42 శాతం కంపెనీలు ఎంబీఏ అభ్యర్థుల జీతాలను స్థిరంగా కొనసాగించే అవకాశముంది. 56 శాతం కంపెనీలు మాత్రం ద్రవ్యోల్బణ రేటు లేదా అంతకంటే ఎక్కువ శాతంతో ఎంబీఏల వేతనాలను పెంచే ఉద్దేశంతో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎంబీఏ విద్యార్థులు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేమిటంటే.. కోర్సు పూర్తయ్యే నాటికి మంచి వేతనం లభిస్తుందా? లేదా? అనే ఆలోచనను పక్కనపెట్టండి. మీ నైపుణ్యాలకు తగినంత ప్రతిఫలం దక్కుతుందనే నమ్మకంతో ఉండండి.

నెట్‌వర్క్ కీలకం:
చాలా మంది తాము చేసిన వ్యయానికి ప్రతిఫలం దక్కుతుందా? లేదా? అనే భావనలో ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఎంబీఏతో ప్రతిఫలం ఆశించడమనేది మీరు ఏర్పర్చుకునే నెట్‌వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కోర్సులో భాగంగా సహ విద్యార్థులు, ప్రొఫెసర్లు తదితరులతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. వీరే భవిష్యత్‌లో మీ క్లైంట్లు లేదా భాగస్వాములుగా, రెఫరెన్‌‌సగా మారే అవకాశం ఉంది. ఇది ఎంబీఏకు ఉన్న విలక్షణత. కాబట్టి గతంలో మాదిరిగా బిజినెస్ స్కూల్లోనే అంతా నేర్పిస్తారనే భావనతో కాకుండా మీ చుట్టూ ఉన్న వారందరితో మంచి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి. గతంలో మీరు చదువుకున్న సహచరులతో సంబంధాలను కొనసాగించాలి. తద్వారా అవకాశాలు మెరుగవుతాయి. అందుకే బిజినెస్ స్కూల్స్ అలూమ్నీ అసోసియేషన్లను ఎక్కువగా ప్రోత్సహిస్తుంటాయి.

ప్రస్తుతం ఎంబీఏ తప్పనిసరి:
ఎలాంటి బీ-స్కూల్స్‌కు వెళ్లకుండా, మేనేజ్‌మెంట్ డిగ్రీ లేకుండానే విజయం సాధించిన వ్యాపారవేత్తలు ఎందరో కనిపి స్తుంటారు. అలా అనీ ఎంబీఏతో ప్రయోజనం లేదనే భావన సరికాదు. కాలంతోపాటు వ్యాపార నిర్వహణలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. తదనుగుణంగా ఆయా వ్యవహారాలను పర్యవేక్షించడానికి నిపుణుల అవసరం పెరిగింది. ప్రస్తుత ప్రపంచంలో బిజినెస్ పరంగా తలెత్తే నిర్వహణ సమస్యలను తగ్గించడానికి ఎంబీఏ మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. బీ-స్కూల్‌కు హాజరవడం ద్వారా వ్యాపారానికి సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన పొందొచ్చు. ఈ క్రమంలో ఫైనాన్స్, మార్కెటింగ్, అకౌంటింగ్, స్ట్రాటజీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలను బోధిస్తారు. అంతేకాకుండా ఆయా రంగాల్లోని వాస్తవిక పరిస్థితులను వివరిస్తారు. వ్యక్తిగత అభివృద్ధి క్రమంలో మీ బలాలు- బలహీనతలపై విశ్లేషణ కూడా ఉంటుంది.

అవసరం:
చదువు పూర్తయిన తర్వాత కెరీర్ క్రమంలో క్లిష్టమైన సమస్యలు ఎదురవుతుంటాయి. వాటికి పరిష్కారం కనుక్కునే క్రమంలో విపరీతంగా ఆలోచిస్తుంటారు. ఒక పరిమితికి మించి ఆలోచనలు ఏమాత్రం ముందుకు సాగవు. అటువంటి పరిస్థితిలో మేనేజ్‌మెంట్ కోర్సు చేయడం మంచి ప్రేరణగా ఉపయోగపడుతుంది. తిరిగి గాడిలో పడడానికి పలు విధాలుగా దోహదం చేస్తుంది. అంతేకాకుండా సృజనాత్మక శక్తిని తిరిగి తెచ్చుకోవడంతోపాటు సమస్య పరిష్కారానికి అందుబాటులో ఉన్న వివిధ అవకాశాలపై అవగాహన కల్పిస్తుంది. పరిష్కారాలను పరీక్షించడం, తప్పుల నుంచి నేర్చుకోవడం వంటివి లక్షణాలు అలవడుతాయి. తద్వారా భవిష్యత్‌లో నిర్వహణ చాతుర్యంతోపాటు సహోద్యోగులతో సమన్వయం చేసుకునే నైపుణ్యం పెరుగుతుంది.

స్పెషలైజ్డ్‌కు అవకాశాలెక్కువ:
ఎంబీఏతో పోల్చితే స్పెషలైజ్డ్ ఎంబీఏ కోర్సు చేసిన వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. మేనేజ్‌మెంట్, లీడర్ షిప్ నైపుణ్యాలతోపాటు ఒక రంగానికి సంబంధించిన స్పెష లైజ్డ్ ఎంబీఏ కోర్సులను ఎంచుకోవడం కెరీర్ పరంగా ప్రయో జనంగా ఉంటుంది. ఉదాహరణకు హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్. సాధారణ ఎంబీఏ కంటే.. ఇలాంటి స్పెషలైజ్డ్ కోర్సులు చేసిన వారికే అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. అంతేకాకుండా నచ్చిన రంగంలో స్థిరపడే అవకాశం ఉంటోంది. ఇటీవలి కాలంలో స్పెషలైజ్డ్ ఎంబీఏ చేసిన అభ్యర్థుల అవసరం 22 శాతం మేర పెరిగింది. అయితే స్పెషలైజ్డ్ ఎంబీఏ కోర్సుల్లో చేరే ముందు కొన్ని సూచనలను పాటించాలి. అవి.. సదరు స్పెషలైజ్డ్ కోర్సుకు సంబంధించి మార్కెట్ వాస్తవిక అవసరాలకనుగుణంగా నైపుణ్యాలను అందించే దిశగా బోధన సాగించే ఫ్యాకల్టీలు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లను ఎంచుకోవాలి.

వేగంగా ఉన్నత స్థానాలకు:
చాలా మంది తాము పని చేస్తున్న రంగంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. కానీ ఎంబీఏ కోర్సు చేస్తే స్వల్ప కాలంలో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. ఎంబీఏ కోర్సు ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. తద్వారా టీమ్ ప్రాజెక్ట్‌లను విజయవంతంగా నడిపించే స్థాయికి ఎదుగుతారు. ఎందుకంటే.. తరగతి గదిలో మీ పనితీరును సమీక్షించడం, స్టూడెంట్ క్లబ్ వంటి కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా సంబంధిత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశం లభిస్తుంది. తద్వారా వ్యక్తిగత నైపుణ్యాలతోపాటు సమిష్టితత్వం అలవడుతుంది. బలాలు-బలహీనతలను విశ్లేషించుకోవడంతోపాటు పనితీరు మేరకు ఉత్తమమైన కెరీర్‌ను ఎంచుకోవడానికి ఎంబీఏ కోర్సు ఇతోధికంగా సహాయం చేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు!
ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో ఉన్నత అవకాశాలందించే కోర్సుల్లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/మేనేజ్‌మెంట్ కోర్సులు ప్రథమ స్థానంలో ఉంటున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా ఈ కోర్సులకు డిమాండ్ ఉంటుంది. యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న ఎంబీఏ కోర్సులో ఏటా సుమారు 100 మంది విదేశీ విద్యార్థులు ప్రవేశం పొందుతుండడమే దీనికి నిదర్శనం. ఉస్మానియా రెగ్యులర్ ఎంబీఏతోపాటు టెక్నికల్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తోంది. అలాగే ఇతర యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలు ఎంబీఏకు సమానమైన ఇతర మేనేజ్‌మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్, మీడియా మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, హాస్పిటల్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రెగ్యులర్ ఎంబీఏ కోర్సులో రెండో సంవత్సరంలో స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. విద్యానేపథ్యాన్ని అనుసరించి కూడా సంబంధిత మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరే అవకాశం ఏర్పడుతోంది. ఉదాహరణకు ‘మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్’, ‘మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్’ కోర్సులను బీఫార్మసీ పూర్తి చేసిన వారు అభ్యసిస్తే మంచి అవకాశాలుంటాయి. ఎంబీఏ కోర్సులో రాణించాలంటే మంచి కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ స్కిల్స్‌తో పాటు అదనపు నైపుణ్యాలు తప్పనిసరి. ప్రతి అంశాన్ని మార్కెటింగ్ కోణంలో ఆలోచించే వారు ఎంబీఏ మార్కెటింగ్ విభాగంలో రాణిస్తారు. మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లకు సేవలు, రిటైల్, మౌలిక రంగాలతోపాటు సాఫ్ట్‌వేర్ తదితర రంగాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు లభిస్తున్నాయి.
- ప్రొఫెసర్. వి. శేఖర్, ప్రిన్సిపాల్,
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్,ఉస్మానియా యూనివర్సిటీ.
Published date : 25 Jul 2014 11:47AM

Photo Stories