Skip to main content

‘ఆతిథ్యం’లో అద్భుత కెరీర్‌కుఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ

పోటీ ప్రపంచంలో ఎమర్జింగ్ కెరీర్... జీడీపీ వృద్ధి రేటులో కీలక పాత్ర... ఆకర్షణీయ వేతనాలతో ఉపాధి.. ఇంతటి ప్రాధాన్యమున్న హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేసుకోవాలంటే.. అకడమిక్ స్థాయి నుంచే అత్యున్నతంగా రాణించాలి. ఇందుకు ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అవకాశం కల్పిస్తున్నాయి. వీటిలో బ్యాచిలర్ డిగ్రీ (బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే.. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-2016 నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో పరీక్ష తీరుతెన్నులు, భవిష్యత్తు అవకాశాలపై విశ్లేషణ..
ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్.. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ పర్యవేక్షణలో నెలకొల్పిన ఇన్‌స్టిట్యూట్‌లు. ఇంజనీరింగ్‌కు ఐఐటీలు, మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ఐఐఎంలకు ఎంత ప్రాధాన్యం ఉందో.. హోటల్ మేనేజ్‌మెంట్ రంగానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌కు అంతే ప్రాముఖ్యత ఉంది. దేశవ్యాప్తంగా 21 సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్, 19 స్టేట్ ఇన్‌స్టిట్యూట్స్, మరో 13 ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. ఒక ప్రభుత్వ రంగ ఇన్‌స్టిట్యూట్ ఉంది. వీటిలో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ). తాజాగా 2016-17 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ-2016 నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షలో విజయం సాధించి సీటు సొంతం చేసుకుంటే కోర్సు పూర్తవుతూనే ‘కొలువు’దీరొచ్చు. అయితే ఇటీవల కాలంలో ఈ పరీక్షకు కూడా పోటీ తీవ్రంగా పెరుగుతోంది.

పరీక్ష విధానం
ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ మొత్తం అయిదు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. వివరాలు..
విభాగం ప్రశ్నలు మార్కులు
న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్ 30 30
రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ 30 30
జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 30 30
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 60 60
ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ 50 50
మొత్తం 200 200
సమయం: మూడు గంటలు

విజయ వ్యూహాలు
పరీక్షలో విజయం సాధించాలంటే అభ్యర్థులు సెక్షన్లవారీగా అనుసరించాల్సిన వ్యూహాలు..

న్యూవురికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్
అభ్యర్థుల్లోని గణిత నైపుణ్యాన్ని, విశ్లేషణ దృక్పథాన్ని పరీక్షించే ఈ విభాగంలో రాణించాలంటే హైస్కూల్ స్థాయిలోని మ్యాథమెటిక్స్ అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రధానంగా కసాగు, గసాభా, శాతాలు, లాభ - నష్టాలు, నంబర్ సిస్టమ్, సగటు, కాలం-పని, సాధారణ వడ్డీ, బారు వడ్డీ, కాలం-వేగం-దూరం, నిష్పత్తులు, జామెట్రీ వంటి అంశాల్లో పట్టు సాధించాలి. అనలిటికల్ ఆప్టిట్యూడ్‌లో డేటాను విశ్లేషించే సామర్థ్యం పెంపొందించుకోవాలి. డేటాలో పేర్కొన్న ముఖ్య సమాచారాన్ని క్రోడీకరించి ఇచ్చిన ప్రశ్నకు అనువుగా, సమాధానం ఇచ్చే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ఇందుకోసం గ్రాఫ్‌లు, పై చార్ట్‌లు, ఫ్లో చార్ట్‌లు వంటి వాటిని సాధన చేయాలి.

రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్
సునిశిత పరిశీలన, తార్కిక విశ్లేషణతో రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్‌లో రాణిస్తారు. ఈ విభాగంలో గరిష్ట మార్కుల సాధన కోసం మ్యాథమెటికల్ ఆపరేషన్స్, కోడింగ్-డీకోడింగ్, నంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్ వంటి రీజనింగ్ ఆధారిత అంశాలను సాధన చేయాలి. వీటితోపాటు డేటా సఫీషియన్సీ, వెన్ డయాగ్రమ్స్ సాధనచేస్తే ఉపయుక్తంగా ఉంటుంది.

జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్
ఈ విభాగంలో మంచి మార్కులు పొందాలంటే హైస్కూల్ స్థాయిలోని పుస్తకాల్లో ఉండే చరిత్ర, రాజ్యాంగం, జాగ్రఫీ, ఎకనామిక్స్ పాఠ్యాంశాలు చదవాలి. ముఖ్యంగా చరిత్రలో ముఖ్యమైన యుద్ధాలు-పరిణామాలు-పర్యవసానాలు, స్వాతంత్య్రోద్యమం గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలి. జాగ్రఫీలో దేశంలో ముఖ్యమైన ప్రదేశాలు, ఖనిజ వనరులు- అవి ఎక్కువగా లభించే ప్రాంతాలు, నదులు, సరస్సులు, పర్వతాల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వీటితోపాటు ముఖ్యమైన పంటలు - అవి ఎక్కువగా పండే ప్రదేశాలు, జనాభా వంటి అంశాల్లో అవగాహన పెంచుకోవాలి. కరెంట్ అఫైర్స్‌లో ఇతర పోటీ పరీక్షల మాదిరిగానే, ముఖ్యమైన సదస్సులు, సమావేశాలు, వార్తల్లోని వ్యక్తులు, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

ఇంగ్లిష్ లాంగ్వేజ్
టెన్సెస్, ప్రిపోజిషన్స్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, యాంటానిమ్స్, సినానిమ్స్, సెంటెన్స్ ఫార్మేషన్, స్పాటింగ్ ద ఎర్రర్స్, సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ అంశాలు ఈ విభాగంలో ముఖ్యమైనవిగా పేర్కొనొచ్చు. ఇందుకోసం అభ్యర్థులు బేసిక్ గ్రామర్ పుస్తకాలను అభ్యసనం చేయడంతోపాటు న్యూస్ పేపర్లను చదవాలి. వాటిలోని కొత్త పదాలను తెలుసుకొని, ఆ పదాలను వినియోగించిన తీరుపై అవగాహన ఏర్పరచుకోవాలి. పదో తరగతి స్థాయి ఇంగ్లిష్ పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా ఈ విభాగంలో పేర్కొన్న సిలబస్‌లో అధిక శాతం పూర్తిచేసుకోవచ్చు.

ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్.. స్పెషల్ సెక్షన్
ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈలో ప్రత్యేక సెక్షన్‌గా ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ సెక్షన్‌ను పేర్కొనొచ్చు. ఇందులో ప్రధానంగా అభ్యర్థికి ఆతిథ్య, పర్యాటక రంగాల్లో ఉన్న ఆసక్తి, దృక్పథాలను పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. వాస్తవ సంఘటన లేదా అంశం ఇచ్చి దానికి ఎలా స్పందిస్తారు? అనే తరహా ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలు అభ్యర్థుల్లో ఎదుటి వారిని మెప్పించే తీరు, సందర్భానికి తగినట్లు వ్యవహరించే శైలికి సంబంధించి ఉంటాయి. అందుకే ఈ విభాగంలో మార్కుల కేటాయింపు విధానం కూడా భిన్నంగా ఉంటుంది.
ఏదైనా ఒక ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఇస్తారు. అందులో కచ్చితమైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. కచ్చితమైన సమాధానానికి కొంచెం అటు, ఇటుగా సరితూగే సమాధానం ఇస్తే 0.75 మార్కు ఇస్తారు. అంటే అభ్యర్థులు ఎలాంటి సమాధానం ఇచ్చినా మార్కులు లభిస్తాయి. కానీ, కచ్చితమైన సమాధానానికి మాత్రమే ఒక మార్కు లభిస్తుంది.

టాప్ టెన్ ఇన్‌స్టిట్యూట్స్‌లో
ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ద్వారా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ క్యాంపస్‌లలో సీటు పొందాలంటే 20 వేల లోపు ర్యాంకుతోనే సాధ్యం. ఇక.. ఈ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లోనే టాప్-10గా నిలిచిన ఇన్‌స్టిట్యూట్స్‌లో అయిదు వేల లోపు ర్యాంకుతోనే సీటు సాధ్యం. ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ-2015లో ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో స్పాట్ రౌండ్ కౌన్సిలింగ్‌లో క్లోజింగ్ ర్యాంకులే ఇందుకు నిదర్శనం.

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ-2015

టాప్-10 ఇన్‌స్టిట్యూట్ల క్లోజింగ్ ర్యాంక్స్
క్యాంపస్ క్లోజింగ్ ర్యాంకు
ఢిల్లీ 484
ముంబై 987
గోవా 3740
జైపూర్ 4310
కోల్‌కతా 2373
గాంధీనగర్ 4981
హైదరాబాద్ 4921
బెంగళూరు 2096
చెన్నై 4111
చండీగఢ్ 2139

తెలుగు రాష్ట్రాల్లో మూడు ఇన్‌స్టిట్యూట్‌లు
  • దేశ వ్యాప్తంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ గుర్తింపు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లలో మొత్తం సీట్లు 7482
  • ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మూడు ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లు బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం కల్పిస్తున్నాయి. అవి..
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్: హైదరాబాద్ (230 సీట్లు)
  • డాక్టర్ వైఎస్‌ఆర్ ఎన్‌ఐటీహెచ్‌ఎం: హైదరాబాద్ (60 సీట్లు)
  • ఎస్‌ఐహెచ్‌ఎంటీ: తిరుపతి (60 సీట్లు)
ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ - 2016 ఇన్ఫో
  • అర్హత: ఇంగ్లిష్ ఒక సబ్జెక్ట్‌గా ఇంటర్మీడియెట్/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత
  • వయో పరిమితి: జూలై 1, 2016 నాటికి 22 సంవత్సరాలు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు
  • దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వెబ్‌సైట్: https://https://applyadmission. net/nchmjee2016
రిఫరెన్స్ బుక్స్
  • అరిహంత్ జనరల్ ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్
  • వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్: ఆర్.ఎస్.అగర్వాల్
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ఆర్.ఎస్. అగర్వాల్
  • ఆప్టిట్యూడ్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్: హోటల్ మేనేజ్‌మెంట్-ఆర్.గుప్తా
ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ముఖ్య తేదీలు
  • ఆన్‌లైన్ అప్లికేషన్: డిసెంబర్ 14, 2015 నుంచి ఏప్రిల్ 11, 2016
  • అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: ఏప్రిల్ 20, 2016 నుంచి
  • పరీక్ష తేదీ: ఏప్రిల్ 30, 2016
  • ఫలితాల వెల్లడి: మే, 2016
  • వెబ్‌సైట్: www.nchm.nic.in
ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ముఖ్యం
హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో కెరీర్ కోరుకునే అభ్యర్థులకు ఎదుటి వారిని మెప్పించే నేర్పు, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఎంతో ముఖ్యం. అకడమిక్స్‌లో భాగంగా వీటిని బోధిస్తున్నప్పటికీ, అభ్యర్థులకు సహజంగా ఈ స్కిల్స్ ఉంటే రాణించగలరు. ఇక అవకాశాల పరంగా ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదు. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ గుర్తింపు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లకు 95 శాతం మేర క్యాంపస్ ప్లేస్‌మెంట్ రికార్డ్‌లు ఉన్నాయి. కేవలం హోటల్ రంగంలోనే కాకుండా విమానయాన, టూరిజం సంస్థల్లోనూ అవకాశాలు లభిస్తున్నాయి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలన్నీ పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి సరైన ప్రణాళికతో ముందుకెళితే పరీక్షలో విజయావకాశాలు మెరుగవుతాయి.
- ఎస్.కె.ఠాకూర్, ప్రిన్సిపల్, ఐహెచ్‌ఎం-హైదరాబాద్
Published date : 24 Dec 2015 06:57PM

Photo Stories