Skip to main content

ఐఐఎంల్లో ఫైనాన్స్...హాట్ కేక్

ఐఐఎంలు.. దేశంలోని ప్రతిష్టాత్మక బీస్కూల్స్.మేనేజ్‌మెంట్ విద్యకు పెట్టిందిపేరు. ఐఐఎంల్లో అడుగుపెడితే భవిష్యత్తు బంగారమే అనే అభిప్రాయం. అందుకే విద్యార్థులు..ఫైనల్ ప్లేస్‌మెంట్ సీజన్ కోసం ఉత్కంఠగా ఎదురుచూడటం సహజం. ఇప్పటికే ముగిసిన సమ్మర్ ప్లేస్‌మెంట్స్‌లో ఫైనాన్షియల్ సెక్టార్ హాట్‌కేక్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో.. ఐఐఎంల్లో జనవరి,2018లో ప్రారంభం కానున్న ఫైనల్ ప్లేస్‌మెంట్స్ ట్రెండ్స్‌పై విశ్లేషణ..
సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్(ఎస్‌పీఓ) లభించిందంటే.. దాదాపు ఫైనల్ ప్లేస్‌మెంట్ ఖరారైనట్లే! విద్యార్థులు తమంతట తాము వదులుకుంటే తప్ప.. ఎస్‌పీఓ ఆధారంగా ఫైనల్ ప్లేస్‌మెంట్ సొంతం చేసుకోవడం ఖాయం. ఎస్‌పీఓల ద్వారా విద్యార్థులకు ఆయా సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం అందుతుంది. ఇంటర్న్‌షిస్ సమయంలో సంస్థ తీరుతెన్నులు, విధి విధానాలు, మార్కెట్ పరిస్థితులు, వ్యూహ రచన వంటి అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. అందుకే ఎస్‌పీఓ ఆఫర్లు ఇచ్చిన అభ్యర్థులకే ఫైనల్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ ఖరారు చేయడం పరిపాటి.

బీఎఫ్‌ఎస్‌ఐ హవా...
ఈఏడాది ఐఐఎంలతోపాటు, ఇతర బి-స్కూల్స్ ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌లో బీఎఫ్‌ఎస్‌ఐ(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్) రంగం హవా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎస్‌పీఓల పరంగా నమోదైన గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఐఐఎంలలో ఇటీవల నిర్వహించిన సమ్మర్ ప్లేస్‌మెంట్‌ఆఫర్స్‌లో బీఎఫ్‌ఎస్‌ఐ రంగం అగ్రస్థానంలో నిలిచింది. ఐఐఎం-కోజికోడ్‌లో 25శాతం; ఐఐఎం-కోల్‌కతలో 26శాతం మేర బీఎఫ్‌ఎస్‌ఐ రంగాలకు చెందిన సంస్థల ఎస్‌పీఓలు పెరిగాయి. ఐఐఎం-ఇండోర్‌లో 12శాతం మేరకు బీఎఫ్‌ఎస్‌ఐ ఎస్‌పీఓల్లో పెరుగుదల నమోదైంది. మొత్తంగా చూస్తే అన్ని ఐఐఎం క్యాంపస్‌లలోనూ గతేడాది కంటే 30శాతం నుంచి 40శాతం మేర బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో అధికంగా ఎస్‌పీఓలు లభించడం విశేషం.

ఆఫర్లు పెంచిన సంస్థలు...
2016-18లో బ్యాచ్ విద్యార్థులకు బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలు గతేడాది కంటే రెట్టింపు సంఖ్యలో ఎస్‌పీవోలను అందించడం గమనార్హం. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, డెలాయిట్ ఇండియా, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌వంటి సంస్థలు ఇంటర్న్‌షిప్ ఆఫర్స్ పరంగా 2015-17 బ్యాచ్‌తో పోల్చితే.. 2016-18 బ్యాచ్‌కు దాదాపు 20శాతం అధికంగా ఎస్‌పీఓలను అందజేశాయి. గోల్డ్‌మన్ శాచ్స్, డెచ్యు బ్యాంక్ వంటి ప్రముఖ కంపెనీలు కూడా ఎస్‌పీఓల సంఖ్యను గతేడాది కంటే రెట్టింపు చేశాయి. డెచ్యు బ్యాంక్ 47 మందికి ఇంటర్న్‌షిప్ ఆఫర్స్ అందించంది.

స్టయిపండ్ అధికంగానే..
బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలోని సంస్థలు రెండు నెలల వ్యవధిలో ఉండే ఇంటర్న్‌షిప్‌ పొందిన అభ్యర్థులకు అందిస్తున్న స్టయిపండ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. స్వదేశీ సంస్థలు రూ.లక్ష వరకు, విదేశీ సంస్థలు రూ.రెండు లక్షల వరకు స్టయిపండ్‌ను అందించడమే ఇందుకు నిదర్శనం. ఎస్‌పీఓ పేరుతో ఇంటర్న్‌షిప్‌లో రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు స్టయిపండ్ అందించే సంస్థలు.. ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌లో తమకు అనుకూలమైన అభ్యర్థులు లభిస్తే రూ.30లక్షల నుంచి రూ.40లక్షల వరకు వార్షిక వేతనం ఇవ్వడానికి సైతం వెనుకాడవు.

ప్రొఫైల్స్ ఇవే..
బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలోని సంస్థలు ప్రధానంగా నాలుగు ప్రొఫైల్స్ (విభాగాలు)లోనే ఎస్‌పీవోలను అందించాయి. అవి...
1. సేల్స్ అండ్ మార్కెటింగ్
2. జనరల్ మేనేజ్‌మెంట్
3. డేటాఅనలిటిక్స్, బిగ్‌డేటా
4. మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్.

సాంకేతిక నైపుణ్యాలుంటే..
మేనేజ్‌మెంట్ విద్యార్థులకు.. తమ రంగానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలుంటే.. ఆఫర్స్ ఇచ్చేందుకు బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలు వెనుకాడటంలేదు. ప్రధానంగా డేటా అనలిటిక్స్, బిగ్ డేటా మేనేజ్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు అగ్రపీఠం లభిస్తోంది. ఇది గత వేసవిలో ఆయా సంస్థలు ఇచ్చిన ఇంటర్న్‌షిప్ ఆఫర్స్‌లో స్పష్టంగా కనిపించింది. బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలు మేనేజ్‌మెంట్ విద్యార్థులను ఎంపిక చేసుకునే సమయంలో ప్రధానంగా పరిగణిస్తున్న మరో అంశం.. ఆయా విద్యార్థుల్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. అభ్యర్థుల ఆటిట్యూడ్, ఆప్టిట్యూడ్, సమస్య పట్ల స్పందించే గుణాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. వీటి ఆధారంగానే ఎస్‌పీఓలు, పీపీఓలు అందించే విషయంలో ఆచితూచి అడుగేస్తున్నాయి. ఎంపిక చేసుకునే సమయంలోనే..నిర్దిష్టంగా ఒక టాస్క్‌ను ఇచ్చి వాటిని ఏ రీతిలో పరిష్కరించారు? ఎంత సమయం వెచ్చించారు? అనే విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.

పెరగనున్న వేతనాలు!
  • ఈ ఏడాది బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలు ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌లో ఆకర్షణీయ వేతనాలు అందించే అవకాశముందని అంచనా.
  • గతేడాది డొమెస్టిక్ ఆఫర్స్ పరంగా రూ.25 లక్షల సగటు వేతనం నమోదు కాగా.. ఈ ఏడాది ఆ మొత్తం రూ.30 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు.
  • ఇంటర్నేషనల్ ఆఫర్స్ విషయంలో గతేడాది సగటు వేతనం రూ.50లక్షలు ఉండగా.. ఈ సంవత్సరం ఆ సంఖ్య రూ.70 లక్షలకు చేరే అవకాశముందని అభిప్రాయం.
జనవరిలో ఫైనల్ ప్లేస్‌మెంట్స్ :
ఐఐఎంలలో ఫైనల్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ జనవరిలో ప్రారంభం కానుంది. వాస్తవానికి టాప్ కంపెనీలు.. ఐఐటీల్లో డిసెంబర్‌లో మొదలయ్యే క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ తొలి దశలో పాల్గొని..టెక్నికల్ ప్రొఫైల్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాయి. ఆ తర్వాత జనవరి నుంచి ఐఐఎంలలో కోర్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ కోసం ప్లేస్‌మెంట్‌కు వస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఐఐఎంలు కూడా తమ ప్లేస్‌మెంట్ సీజన్‌ను జనవరిలో ప్రారంభిస్తున్నాయి. విద్యార్థులు సైతం ఆ సమయానికి తమ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసుకొని... ఇండస్ట్రీ రెడీ స్కిల్స్‌తో సిద్ధంగా ఉంటారు.

బీఎఫ్‌ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్స్ అంచనా...
  • గతేడాదితో పోల్చితే బీఎఫ్‌ఎస్‌ఐ ఆఫర్లు రెట్టింపు అయ్యే అవకాశం.
  • వార్షిక వేతనాల సగటులో కూడా 30 శాతం మేర పెరుగుదల నమోదుకానుందని అంచనా.
  • సగటున రూ.30లక్షలు(డొమెస్టిక్), రూ.70లక్షలు (ఇంటర్నేషనల్)తో ఆఫర్స్ లభించే ఆస్కారం.
  • డేటాఅనలిటిక్స్, బిగ్‌డేటా, డేటామేనేజ్‌మెంట్ నైపుణ్యాలున్న విద్యార్థులకు అదనపు ప్రయోజనాలు.
ఇప్పటికే పలు సంస్థల సంప్రదింపులు...
ఈసారి ఫైనల్ ప్లేస్‌మెంట్ ప్రక్రియలో కచ్చితంగా బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు సంప్రదింపులు జరిపాయి. క్యాంపస్ డ్రైవ్స్‌లో పాల్గొనేందుకు వివరాలు నమోదు చేసుకున్నాయి. అంతేకాకుండా విద్యార్థుల నుంచి వారు కోరుకుంటున్న నైపుణ్యాలను కూడా తెలియజేశాయి. ప్రధానంగా ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ స్కిల్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి.
- బి.కవితా కుమార్, ఐఐఎం-బి ప్రతినిధి
Published date : 08 Dec 2017 05:25PM

Photo Stories