Skip to main content

వెయిటేజీకి అనుగుణంగా.. బేసిక్స్, అప్లికేషన్‌ అప్రోచ్‌తో ప్రిప‌రేష‌న్ సాగించండిలా..

ప్రిపరేషన్‌ పరంగా ముందుగా అభ్యర్థులు గేట్‌ పరీక్ష విధానంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.

ఇందుకోసం సిలబస్, గత ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. ప్రశ్న పత్రాల్లో ఆయా టాపిక్స్‌కు లభిస్తున్న వెయిటేజీని గుర్తించాలి. దానికి అనుగుణంగా ప్రిపరేషన్‌ సాగించాలి. ముఖ్యంగా బీటెక్‌ చివరి సంవత్సరం విద్యార్థులు.. సాధ్యమైనంత త్వరగా ప్రిపరేషన్‌ ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు గేట్‌ సిలబస్‌ను అకడమిక్‌ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్‌ సాగించొచ్చు.

బేసిక్స్, అప్లికేషన్‌ అప్రోచ్‌..
గేట్‌లో మంచి స్కోర్‌ సాధించి ఐఐటీల్లో ప్రవేశానికి మార్గం సులభం చేసుకోవాలంటే.. అభ్యర్థులు తాము ఎంచుకున్న సబ్జెక్ట్‌లో బేసిక్స్‌ నుంచి అడ్వాన్స్‌డ్‌ టెక్నిక్స్‌ వరకూ..సంపూర్ణ పట్టు సాధించాలి. ప్రతి సబ్జెక్టును చదివేటప్పుడు అందులో ప్రశ్నార్హమైన టాపిక్స్‌ను గుర్తించి.. వాటి ప్రాథమిక భావనలపై స్పష్టత పెంచుకోవాలి. ఒక టాపిక్‌ నుంచి ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశముందో గమనించి.. ఆ మేరకు ప్రశ్నలు సాధన చేయాలి. దీంతో పరీక్షలో ప్రశ్న ఎలా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. డిసెంబర్‌ చివరి వారం లేదా జనవరి మొదటి వారానికి ప్రిపరేషన్‌ పూర్తి చేసుకునేలా టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి. ఆ తర్వాత అందుబాటులో ఉండే సమయంలో ఆన్‌లైన్‌ మోడల్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లకు హాజరవ్వాలి. ఇలా ఇప్పటి నుంచే పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగిస్తే.. పరీక్షలో మంచి స్కోర్‌ సాధించొచ్చు.

ఆన్‌లైన్‌ నేర్పు..
గేట్‌ పరీక్ష ఆన్‌లైన్‌ విధానం(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌)లోlజరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో తడబాటు లేకుండా పరీక్ష రాసే నేర్పు సొంతం చేసుకోవాలి. వర్చువల్‌ కాలిక్యులేటర్‌ వినియోగం, ఆన్‌స్క్రీన్‌ ఆన్సర్స్‌ రికగ్నిషన్‌ వంటి అంశాలపై అవగాహన పొందాలి. ఇందుకోసం ఆన్‌లైన్‌ మోడల్‌ టెస్ట్‌లకు హాజరవడం ఉపయుక్తంగా ఉంటుంది.

600కు పైగా స్కోర్‌ లక్ష్యం..
గేట్‌ ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీటు ఆశించే విద్యార్థులు బెస్ట్‌ స్కోర్‌ సాధించేందుకు కృషి చేయాలి. అప్పుడే మలిదశ ఎంపిక ప్రక్రియకు అవకాశాలు మెరుగవుతాయి. దాదాపు అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు కనీస కటాఫ్‌ స్కోర్‌ను 600గా నిర్దేశిస్తున్నాయి. తుది ఎంపికలో టాప్‌ బ్రాంచ్‌లలో ఫైనల్‌ కటాఫ్‌ స్కోర్‌ 800 వరకు ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ, ఈఈఈ, మెకానికల్‌ వంటి బ్రాంచ్‌ల విద్యార్థులు.. సిలబస్‌పై గట్టి పట్టు సాధించేలా కృషిచేయాలి.

అకడమిక్‌ పుస్తకాలే ఆయుధం..
గేట్‌ అభ్యర్థులు అకడమిక్‌ పుస్తకాలే ఆయుధంగా ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలని నిపుణులు సూచిస్తున్నారు. మూల భావనలు, కాన్సెప్ట్‌లు, అప్లికేషన్‌ అప్రోచ్‌.. ఇలా అన్నింటినీ క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి. అలాగే ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ పాత ప్రశ్న పత్రాల సాధన కూడా గేట్‌ విజయానికి దోహదపడుతుంది.

మలి దశలో ఇలా..
గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఐఐటీల్లో సీటు, పీఎస్‌యూల్లో ఉద్యోగం కోసం మలి దశ ఎంపిక ప్రక్రియకు హాజరవ్వాల్సి ఉంటుంది.

మలిదశ ఎంపిక ప్రక్రియకు 30 శాతం వరకు వెయిటేజీ ఇస్తున్నారు. అంటే.. మొత్తం వంద మార్కులకు నిర్వహించే ఎంపిక ప్రక్రియలో.. గేట్‌ స్కోర్‌కు 70 శాతం మార్కులను; మలిదశ(గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వూ్య)కు 30 శాతం మార్కులను కేటాయిస్తారు.

ఈ రెండింటిలోనూ వచ్చిన స్కోర్‌ను క్రోడీకరించి.. తుది జాబితా రూపొందించి.. అందులో చోటు సాధించిన వారికి సీట్లు ఖరారు చేస్తున్నాయి.

గేట్‌–2022 ముఖ్య సమాచారం..
గేట్‌ మొత్తం పేపర్లు: 29.

అర్హత: ఇంజనీరింగ్‌/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్‌/కామర్స్‌/సైన్స్‌/ఆర్ట్స్‌ విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్‌ మూడో సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆగస్ట్‌లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం.

పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు రెండు స్లాట్లలో ఫిబ్రవరి–2022 మొదటి వారంలో జరిగే అవకాశం.
 
Published date : 09 Jun 2021 04:42PM

Photo Stories