Skip to main content

ఉన్నత కొలువులకు ‘గేట్’వే!

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్).. ఇంజనీరింగ్ చదివే ప్రతి విద్యార్థిరాయాలనుకునే పరీక్ష! ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఐఐటీలు, నిట్‌లు తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణికంగా నిలిచే ఈ పరీక్ష.. గత కొన్నేళ్ల నుంచి ప్రభుత్వ రంగ సంస్థల ఎంట్రీ లెవల్ నియామకాలకు గేట్‌వేగా నిలుస్తోంది. 2015 గేట్ స్కోర్‌తో నియామకాల కోసం నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు...

ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి పరిశ్రమలు ఆశిస్తున్న అన్వయ సామర్థ్యం, సమస్యా సాధన, విశ్లేషించే గుణం, తార్కిక వివేచన వంటి నైపుణ్యాలను పరీక్షించడంలో గేట్‌కు మించిన పరీక్ష మరొకటి లేదని చెప్పొచ్చు. అంతేకాకుండా గతంలో ప్రభుత్వ రంగ సంస్థలు.. సొంతంగా నిర్వహించే నియామక ప్రక్రియలో ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఈ అంశాలను పరీక్షించడం సాధ్యమయ్యేది కాదు. గేట్ వంటి పరీక్షల్లో విజయం సాధించాలంటే సంబంధిత సబ్జెక్ట్‌లో ప్రాథమిక భావనలపై పట్టు ఉండాలి. ఈ విషయాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే ప్రతిభ ఉన్న విద్యార్థులు మాత్రమే గేట్‌లో మంచి స్కోర్ సాధించగలుగుతున్నారు. గేట్‌ను దేశంలోని అత్యున్నత సాంకేతిక సంస్థలైన ఐఐటీలు, ఐఐఎస్సీ అత్యంత ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా నిర్వహిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లు గేట్ స్కోర్ ఆధారంగా ఎంట్రీ లెవల్ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి.

వేర్వేరుగా ప్రకటనలు:
ఉద్యోగ నియామకాలకు సంబంధించి పీఎస్‌యూలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేస్తాయి. వాటికనుగుణంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నియామక ప్రక్రియలో గేట్ స్కోర్‌కు ప్రాధాన్యం ఇస్తారు. గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులకు తర్వాతి దశలో బృంద చర్చలు, వ్యక్తిగత ఇంటర్వ్యూలు (కంపెనీని బట్టి ఇవి మారుతుంటాయి) నిర్వహించి నియామకాన్ని ఖరారు చేస్తారు. హెచ్‌పీసీఎల్, పవర్ గ్రిడ్, ఎన్‌సీఎల్, గెయిల్ వంటి సంస్థలు గ్రూప్ డిస్కషన్ లేదా గ్రూప్ టాస్క్ పేరుతో బృంద చర్చలు సైతం నిర్వహించి అందులోనూ రాణించిన వారిని మాత్రమే ఇంటర్వ్యూ దశకు ఎంపిక చేస్తాయి. ఈ క్రమంలో దాదాపు 75 శాతం వెయిటేజీని గేట్ స్కోరుకు ఇచ్చి మిగతా 25 శాతం వెయిటేజీని ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్‌లకు కేటాయిస్తున్నాయి. కాబట్టి గేట్‌లో మంచి స్కోర్ సాధించడం కీలకమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ముందుగా గేట్:
ఈ కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ముందుగా గేట్-2015కు దరఖాస్తు చేసుకోవాలి. గేట్ అడ్మిట్ కార్డ్‌పై ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఆయా కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలి. గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్/ఇంటర్వ్యూకు ఎంపికైతే గేట్ దరఖాస్తు ప్రింటవుట్, అడ్మిట్ కార్డ్, స్కోర్ కార్డ్ తీసుకువెళ్లాలి. దరఖాస్తు చేసుకునేటప్పుడు గేట్ దరఖాస్తులో ఏ వివరాలైతే (పేరు, పుట్టిన తేదీ, చిరునామా) నింపారో అవే వివరాలను సంబంధిత కంపెనీల దరఖాస్తులోనూ నింపాలి. అయా కంపెనీల్లో ఏ విభాగాల్లో అయితే నియామక ప్రకటనలు వెలువడ్డాయో అదే ఇంజనీరింగ్ బ్రాంచ్ పేపర్‌తో గేట్ రాయాలి.

ఎంపిక ప్రక్రియ:
తొలుత పీఎస్‌యూలు గేట్ నిర్వహణ తేదీ కంటే ముందుగానే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. అభ్యర్థులు వీటికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. గేట్ ఫలితాలు వెలువడ్డాక ర్యాంకుల ఆధారంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తాయి. ఆ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఎంపిక ప్రక్రియలో తదుపరి దశలకు హాజరయ్యేందుకు తమ సంసిద్ధతను తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడే వారికి మలి దశలకు అనుమతి లభిస్తుంది.

ఇంటర్వ్యూ కాల్:
గేట్ స్కోర్ 500లోపు (ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు) ఉండాలి. ఓబీసీ అభ్యర్థులు 700 నుంచి 800 ర్యాంకులోపు, ఎస్సీ/ఎస్టీ అభ్యరులు 1500 నుంచి మూడు వేల మధ్య ర్యాంకు సాధిస్తే ఇంటర్వ్యూ కాల్ ఆశించొచ్చు.

ఇంటర్వ్యూలో రెండు ముఖ్యమైన అంశాలు:
ఎంపిక ప్రక్రియ తుది దశ ఇంటర్వ్యూలో రెండు ముఖ్యమైన అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. అవి.. వ్యక్తిగత నేపథ్యం, టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్‌కు సంబంధించి సైద్ధాంతిక అవగాహనతో పాటు బీటెక్ స్థాయిలో అభ్యర్థులు చేసిన ప్రాజెక్ట్ వర్క్స్, ఇంటర్న్‌షిప్స్, మినీ ప్రాజెక్ట్ వర్క్స్ వంటి వాటిపైనా ప్రశ్నలు అడుగుతారు. ఇందులోనూ విజయం సాధించిన అభ్యర్థులకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ వంటి హోదాలతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు లభిస్తాయి.

సర్వీస్ అగ్రిమెంట్:
కొన్ని పీఎస్‌యూలు ఎంపికైన అభ్యర్థుల నుంచి నిర్ణీత కాలానికి సర్వీస్ అగ్రిమెంట్ కూడా తీసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇది ఒక ఏడాది వ్యవధిలో ఉంటోంది. అంటే ఎంపికైన వారు తప్పనిసరిగా ఏడాది పాటు సంస్థలో విధులు నిర్వర్తించాల్సిందే.

శిక్షణ:
ఎంపికైన అభ్యర్థులు మొదట కొంత కాలంపాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ సమయంలో వీరికి మేనేజ్‌మెంట్ ట్రైనీ, ట్రైనీ ఇంజనీర్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ వంటి హోదాలు కేటాయిస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారిని శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారు. ఈ సమయంలో వీరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు, సౌకర్యాలు, భత్యాలు లభిస్తాయి. వేతనాల విషయానికొస్తే.. ప్రారంభ వేతనం ఏడాదికి సగటున ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉంటుంది.

పీఎస్‌యూల నోటిఫికేషన్లు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
భర్తీ చేసే విభాగాలు:
మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్.
అర్హత: సంబంధిత లేదా అనుబంధ బ్రాంచ్‌లో బీఈ/ బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్). మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్విహిస్తారు. చివరగా మెడికల్ టెస్ట్ ద్వారా నియామకాన్ని ఖరారు చేస్తారు. ఎంపికైన వారిని మేనేజ్‌మెంట్ ట్రైనీస్‌గా వ్యవహరిస్తారు. వీరికి దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 17, 2014.
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 30, 2015.
వెబ్‌సైట్: www.bpclcareers.in

నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
భర్తీ చేసే విభాగం:
ఎలక్ట్రికల్
అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత లేదా అనుబంధ బ్రాంచ్‌లలో బీఈ/బీటెక్/ఎంఎస్సీ/ఎంటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్)
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జనవరి 1, 2015
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 31, 2015.
వెబ్‌సైట్: www.nhpcindia.com

కోల్ ఇండియా
భర్తీ చేసే విభాగాలు:
మెకానికల్, ఎలక్ట్రికల్, జియాలజీ, మైనింగ్.
అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత లేదా అనుబంధ బ్రాంచ్‌లలో బీఈ/బీటెక్/ఎంఎస్సీ/ఎంటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్)
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబర్ చివరి వారంలో
వెబ్‌సైట్: www.coalindia.in

గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్
భర్తీ చేసే విభాగాలు:
ఎలక్ట్రికల్, మెకానికల్, మెటలర్జీ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్.
అర్హత: సంబంధిత లేదా అనుబంధ బ్రాంచ్‌లో బీఈ/బీటెక్. మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులవ్వాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మార్చి 15, 2015
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 30, 2015.
వెబ్‌సైట్: www.gsecl.in

హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
భర్తీ చేసే విభాగాలు:
సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూ నికేషన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్.
వెబ్‌సైట్: www.hindustanpetroleum.com

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
భర్తీ చేసే విభాగాలు:
ఎలక్ట్రికల్, ఈసీఈ, మెకానికల్, మెటీరియల్ సైన్స్
అర్హత: సంబంధిత లేదా అనుబంధ బ్రాంచ్‌లలో బీఈ/బీటెక్/ ఎంఎస్సీ/ ఎంటెక్
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 15, 2014
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 15, 2015.
వెబ్‌సైట్: www.celindia.co.in

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
భర్తీ చేసే విభాగాలు:
కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఎలక్ట్రికల్, ఈసీఈ, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జికల్, మైనింగ్
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 17, 2014
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 21, 2015.
వెబ్‌సైట్: www.iocl.com

గేట్ స్కోర్‌తో నియామకం చేపట్టే మరికొన్ని సంస్థలు
  • గెయిల్ (గ్యాస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)
  • నాల్కో (నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్)
  • ఓఎన్‌జీసీ లిమిటెడ్ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్)
  • ఎన్‌టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) లిమిటెడ్
  • భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్
  • పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఠి రైట్స్ లిమిటెడ్
భవిష్యత్తుపై స్పష్టతతో.. తగిన ప్రణాళిక
గేట్ ర్యాంకు ఇప్పుడు ఐఐటీల్లో ఉన్నత విద్యకు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సాధనంగా మారిన నేపథ్యంలో అభ్యర్థులు భవిష్యత్తుపై స్పష్టతతో తగిన ప్రణాళిక రూపొందించుకోవాలి. ఉన్నత విద్య లేదా ఇతర ఉద్యోగాలు లక్ష్యంగా ఆలోచించే అభ్యర్థులు పీఎస్‌యూల్లో దరఖాస్తు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆయా సంస్థల నియామక నిబంధనలపై పూర్తి స్థాయి అవగాహన ఏర్పడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా సర్వీస్ అగ్రిమెంట్, ఇతర సర్వీస్ నిబంధనలు అమలు చేస్తున్న సంస్థలకు దరఖాస్తు చేసుకునేందుకు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక.. పీఎస్‌యూల్లో ఉద్యోగమే లక్ష్యంగా నిర్దేశించుకున్న అభ్యర్థులు, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ వంటి వాటిపై ఆందోళన చెందక్కర్లేదు. ఇవి సాధారణంగా బీటెక్ స్థాయిలో తమ బ్రాంచ్‌కు సంబంధించిన అంశాలపైనే ఉంటాయి. ఈ నేపథ్యంలో గేట్‌లో టాప్-500లోపు ర్యాంకు లక్ష్యంగా కృషి చేస్తే.. పీఎస్‌యూ ఆఫర్ గ్యారెంటీ.
ఎ. రవితేజ, గేట్-2013 ఆల్ ఇండియా
2వ ర్యాంకు (ఎలక్ట్రికల్)
Published date : 12 Sep 2014 12:25PM

Photo Stories