Tech Skills: ఊహా ప్రపంచం.. ఊరిస్తున్న కొలువులు!
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో.. ఊహా ప్రపంచం ఆవిష్కృతమవుతోంది. సుదూర ప్రాంతాల్లోని సుందర దృశ్యాలు.. నట్టింట్లో కళ్ల ముందే కదలాడుతున్న అనుభూతిని అందిస్తున్న సాంకేతికత! ఈ టెక్నాలజీ పేరే.. వర్చువల్ రియాలిటీ(వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్)!! కొంతకాలంగా వీఆర్, ఏఆర్ టెక్నాలజీకి వివిధ రంగాల్లో ప్రాధాన్యం పెరుగుతోంది. సంస్థలు ఏఆర్, వీఆర్ నిపుణులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో.. వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీల ప్రత్యేకతలు, వీటిద్వారా లభిస్తున్న కొలువులు, అవసరమవుతున్న నైపుణ్యాలపై ప్రత్యేక కథనం...
- వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీల్లో అవకాశాలు
- వచ్చే రెండేళ్లలో దాదాపు రెండు లక్షల కొలువులు
- ఏఐ నైపుణ్యాలుంటే ఆఫర్లు ఖాయం
- మీరు ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లి.. అక్కడి ప్రకృతి అందాలను వీక్షించాలనుకుంటున్నారా.. కానీ సమయం, ఇతర సమస్యల వల్ల కుదరడం లేదా! అయినా ఏ మాత్రం బాధ పడక్కర్లేదు. ఇంట్లోనే ఉండి మీరు చూడాలనుకుంటున్న ప్రదేశాన్ని చక్కగా చూడొచ్చు.
- ఏదైనా ఒక వస్తువును కొనాలనుకుంటున్నారా.. దాన్ని భౌతికంగా పరిశీలించే అవకాశం కుదరట్లేదని భావిస్తున్నారా.. ఈ సమస్యకు కూడా పరిష్కారం ఉంది.
- ఈ రెండు సందర్భాల్లో..వ్యక్తులకు నిజమైన అనుభూతిని కల్పించే సాంకేతికతే వర్చువల్ రియాలిటీ(వీఆర్),ఆగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్).
- ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో సమయాభావంతో సతమతమవుతూ.. మానసిక ఉల్లాసం కోరుకునే వారికి చక్కటి సాధనంగా మారుతున్నాయి వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ.
- ఈ సేవలు అందించేందుకు అవసరమైన ఏఆర్, వీఆర్ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. కోరుకున్న కొలువు దక్కించుకోవచ్చు.
వీఆర్, ఏఆర్ అంటే
వర్చువల్ రియాలిటీ(వీఆర్)..ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఫలితంగా మనకు అందుబాటులోకి వచ్చిన ఓ వినూత్న అనుభూతి! వీఆర్ టెక్నాలజీ ఓకులస్ క్వెస్ట్ లేదా వాల్వ్ ఇండెక్స్‌గా పిలిచే హెడ్‌సెట్స్‌ను పెట్టుకొని.. ఉన్నచోట నుంచే వేరే ప్రదేశం సందర్శించిన అనుభూతిని పొందవచ్చు. హెడ్‌సెట్‌ను ఆన్ చేయగానే ఎల్‌సీడీ, ఓఎల్‌ఈడీ ప్యానల్స్ లెన్స్ ద్వారా స్క్రీన్ మీద ఏదైనా ఒక దృశ్యం వీడియో రూపంలో 360 డిగ్రీల కోణంలో కనిపిస్తుంది. దాంతో వీక్షకులు హెడ్‌సెట్‌లో డిస్‌ప్లే అయ్యే ప్రదేశాల్లో సంచరిస్తున్నట్టు, దగ్గరగా చూస్తున్న భావనకు లోనవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వాస్తవ పరిస్థితులను మరిపించి.. ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లేదే.. వర్చువల్ రియాలిటీ. వర్చువల్ ఆబ్జెక్ట్‌లను వాస్తవ పరిస్థితులతో సమ్మిళితం చేసి.. చూపించడాన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్) అంటారు.
చదవండి: Technology Jobs: బ్లాక్‌చైన్ డెవలపర్.. ఐబీఎం, అసెంచర్ వంటి కంపెనీల్లో ఉద్యోగం.. లక్షల్లో వేతనం..
మూడు రంగాల్లో ప్రధానంగా
- ప్రస్తుతం వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీకి ఆదరణ పెరుగుతుండటంతో.. ఈ రంగంలో నిపుణుల అవసరం ఏర్పడింది. ముఖ్యంగా మూడు రంగాల్లో వీఆర్, ఏఆర్ టెక్నాలజీల వినియోగం పెరుగుతోంది. అవి.. గేమింగ్, మొబైల్, టూరిజం సెక్టార్‌లు.
- గేమింగ్ రంగాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. నిర్దిష్టమైన టెక్నాలజీతో రూపొందించిన హెడ్‌సెట్స్ ద్వారా ఆన్‌లైన్ గేమ్స్‌ను ఆస్వాదించేలా గేమింగ్ సంస్థలు పరిశోధనలు సాగిస్తున్నాయి.
- మొబైల్ నెట్‌వర్క్ విషయంలో.. 5జీ టెక్నాలజీ ఆధారంగా వినియోగదారులకు రియల్ టైం ఎక్స్‌పీరియన్స్, ఎంజాయ్‌మెంట్ కలిగే విధంగా మిక్స్‌డ్ రియాలిటీ విధానంలో సేవలందిస్తున్నాయి.
- టూరిజం సెక్టార్‌లో.. పలు టూరిజం సంస్థలు వీఆర్, ఏఆర్ టెక్నాలజీలతో ఆయా ప్రదేశాలను ఆన్‌లైన్‌లో వీక్షించి, ఆస్వాదించే అవకాశం కల్పిస్తున్నాయి.
ఇతర రంగాల్లోనూ
- వీఆర్, ఏఆర్ టెక్నాలజీలు గేమింగ్, టూరిజం, మొబైల్ సెగ్మెంట్లలో అధికంగా వినియోగిస్తున్నప్పటికీ..ఇతర రంగాల్లోనూ ఈ టెక్నాలజీ ఆధారిత కార్యకలాపాలు పెరుగుతున్నాయి.
- ఐటీ, ఎడ్‌టెక్, హెల్త్‌కేర్ తదితర రంగాల్లోనూ వీఆర్, ఏఆర్ ఆధారిత కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా ఐటీ సంస్థలు ఏఆర్, వీఆర్ ఆధారంగా తమ ఉద్యోగులకు, క్లయింట్లకు సేవలందిస్తున్నాయి.
- హెల్త్‌కేర్ రంగంలో.. వర్చువల్ రియాలిటీ ఆధారంగా రోబోటిక్ ప్రాసెస్ ద్వారా సర్జరీలు కూడా చేస్తున్నారు.
- ఎడ్ టెక్ విభాగంలోనూ.. ఆన్‌లైన్ ట్యూటరింగ్ సంస్థలు, ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు వర్చువల్ లేబొరేటరీలు, వర్చువల్ క్లాస్ రూమ్స్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చి.. వాస్తవంగా తరగతి గదిలో ఉన్న అనుభూతి కలిగేలా చర్యలు తీసుకుంటున్నాయి.
మానవ ప్రమేయంతోనే
ప్రస్తుతం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటున్న ఏఆర్, వీఆర్ సమర్థవంతంగా కార్యరూపం దాల్చాలంటే.. మానవ ప్రమేయం తప్పనిసరి. వీటికి అవసరమైన కమాండ్స్, ప్రోగ్రామింగ్ చేయాలంటే.. బ్యాక్ ఎండ్‌లో మానవ ప్రమేయం తప్పనిసరి. కాబట్టి ఇందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. ఈ రంగాల్లో కెరీర్ అవకాశాలు లభిస్తాయి.
చదవండి: Career Opportunities: సైబర్ సెక్యూరిటీ.. భవితకు భరోసా!
ఏఐ ఆధారితంగానే
వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ సేవలు వినియోగంలోకి రావాలంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో అనుసంధానం తప్పనిసరి. ఏఆర్, వీఆర్‌లను ఏఐతో అనుసంధానించడం ద్వారా.. యాప్ ఫిల్టర్స్, ఫేస్‌బుక్‌లో ఫోటో ట్యాగింగ్ సమయంలో ఫేస్ రికగ్నిషన్ వంటి సౌకర్యాలు లభిస్తాయి.
సీఎస్‌ఈ, ఈసీఈకి అనుకూలమా!
వీఆర్, ఏఆర్ విభాగాలు కంప్యూటర్ సైన్స్, ఈసీఈ విద్యార్థులకు అనుకూలమనే అభిప్రాయం ఉంది. ప్రధానంగా ఏఐ–ఎంఎల్ పరిజ్ఞానం అవసరం అవుతున్న నేపథ్యంలో.. ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు ప్రోగ్రామింగ్, కోడింగ్ రాయడం, మానిటరింగ్ చేయడం వంటివి ఎంతో కీలకంగా నిలుస్తున్నాయి. దీంతో కంప్యూటర్ సైన్స్,ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అర్హతలుండి.. ఏఐ–ఎంఎల్ పరిజ్ఞానం ఉన్న వారికి ఈ విభాగంలో కొలువులు సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆసక్తి ఉంటే ఇతర కోర్సుల విద్యార్థులు కూడా ఆయా టెక్నాలజీపై పట్టు సాధించి అవకాశాలు దక్కించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
లభించే కొలువులు
వీఆర్, ఏఆర్ విభాగాల్లో.. ఏఆర్/వీఆర్ అసోసియేట్స్, ఇంజనీర్స్; సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, ప్రోగ్రామర్స్ వంటి కొలువులు లభిస్తున్నాయి. గేమ్ డిజైనర్, గేమ్ డెవలపర్, 2డీ కాన్సెప్ట్ ఆర్టిస్ట్, 3డీ ఆర్టిస్ట్, 3డీ యానిమేటర్, సౌండ్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. వీరికి ప్రారంభంలో నెలకు సగటున రూ.40వేల వరకు వేతనాన్ని సంస్థలు అందిస్తున్నాయి.
స్టార్టప్ అవకాశాలు
ఏఆర్, వీఆర్ విభాగాల్లో స్టార్టప్ అవకాశాలు కూడా విస్తృతమవుతున్నాయి. పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలు, ప్రొడక్ట్‌లు రూపొందించే క్రమంలో.. దేశంలో పలు స్టార్టప్ సంస్థలు ఏర్పాటవుతున్నాయి. నాస్‌కామ్, సీఐఐ, గేమింగ్ ఫెడరేషన్ వంటి సంస్థల అంచనా ప్రకారం–దేశంలో ప్రస్తుతం 250 వరకు వర్చువల్ రియాలిటీ స్టార్టప్‌లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇవి.. ఏఆర్, వీఆర్ కలయికగా ఉండే మిక్స్‌డ్ రియాలిటీ సాంకేతికతను కూడా రూపొందిస్తున్నాయి. ఈ స్టార్టప్స్‌లోనూ యువతకు కొలువులు లభిస్తున్నాయి.
చదవండి: Tech Skills: పైథాన్.. కొలువుల కొండ!
క్రియేటివిటీ, క్రిటికల్ అనాలిసిస్
ఏఆర్, వీఆర్ రంగాల్లో టెక్నికల్ స్కిల్స్‌తో అడుగుపెట్టినా.. ఇందులో రాణించాలంటే మాత్రం క్రియేటివిటీ, క్రిటికల్ అనాలిసిస్ నైపుణ్యాలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఆయా వినియోగదారులు, యూజర్ల అవసరాలను, ఆసక్తులను అంచనావేయగలగడం, అందుకు అనుగుణంగా ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్‌ను రూపొందించడం వంటివి చేయాల్సి ఉంటుంది. అందుకే సాంకేతిక నైపుణ్యాలకు తోడు క్రియేటివిటీ, క్రిటికల్ అనాలిసిస్ కూడా ఉంటే ఈ రంగంలో రాణించేందుకు అవకాశం ఉంటుంది.
నైపుణ్యాలకు మార్గాలు
ఏఆర్,వీఆర్‌లకు అవసరమైన నైపుణ్యాలు పొందేందుకు.. ఇప్పుడు పలు మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. కోర్సెరా,ఎడెక్స్,ఉడెమీ వంటి సంస్థలు మూక్స్ ద్వారా వీటిలో శిక్షణ కల్పిస్తున్నాయి.
ఏఆర్, వీఆర్.. ముఖ్యాంశాలు
- విస్తృతం అవుతున్న ఏఆర్, వీఆర్ సేవలు
- గేమింగ్, ఐటీ, హెల్త్‌కేర్, టూరిజం, ఎడ్‌టెక్‌లలో విస్తృతంగా వినియోగం.
- రిటైల్, ఈ–కామర్స్‌లలోనూ అమల్లోకి వస్తున్న ఏఆర్, వీఆర్ టెక్నాలజీస్.
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనాల ప్రకారం–దేశంలో వచ్చే రెండేళ్లలో దాదాపు అయిదు లక్షల ఉద్యోగాలు.
- ఏఐ–ఎంఎల్,ఏఆర్/వీర్ టెక్నాలజీస్‌లో నైపుణ్యంతో సులభంగా కొలువులు సొంతం చేసుకునే అవకాశం.
- ప్రారంభంలో సగటున రూ.25 వేల కనిష్ట వేతనం, గరిష్టంగా రూ.80 వేల వరకు సగటు వేతనం.
- స్టార్టప్ అవకాశాలు కూడా పెరుగుతున్నట్లు పలు అంచనాలు.
నైపుణ్యాలుంటే.. ఆఫర్లు
టెక్ కొలువులు కోరుకునే యువతకు ఇప్పుడు ఏఆర్, వీఆర్ విభాగాలు చక్కటి మార్గంగా నిలుస్తున్నాయడంలో సందేహం లేదు. ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితులు, భవిష్యత్తులోనూ ఆన్‌లైన్ ఆధారిత కార్యకలాపాలు కొనసాగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఎడ్‌టెక్, గేమింగ్, హెల్త్‌కేర్, రిటైల్ రంగాల్లో.. ఏఆర్, వీఆర్ కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నైపుణ్యాలుంటే.. మంచి ఆఫర్లు అందుకోవచ్చు.
–ఎ.శశి కుమార్, ఇండీడ్ డాట్‌కామ్
చదవండి: Robotics and AI: పది లక్షల ఉద్యోగాలకు వేదిక... రూ. 12 లక్షల వార్షిక వేతనం