Skip to main content

సంస్కరణల బాటలో...ఐఐటీలు

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు.. సంస్కరణల బాట పడుతున్నాయా? అంతర్జాతీయ ప్రమాణాలు అందుకునేందుకు తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాయా? అంటే...అవుననే సమాధానం వినిపిస్తోంది!! విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్.. ఫారెన్ ఫ్యాకల్టీ నియామకానికి వినూత్న విధానాలు..
కొత్త కోర్సులకు రూపకల్పన.. పరిశోధనలకు ప్రోత్సాహం... ఇలా ఎన్నో కోణాల్లో సరికొత్త పంథాలో ముందుకుసాగే ప్రయత్నాలను ఐఐటీలు ప్రారంభించాయి. ఇటీవల ఢిల్లీలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఐఐటీ కౌన్సిల్ సమావేశంలో ఎన్నో కీలక ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఐఐటీల్లో సంస్కరణల పథంపై విశ్లేషణ..

ఫారెన్ ఫ్యాకల్టీ :
  • దేశంలోని 23 ఐఐటీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. ఫారెన్ ఫ్యాకల్టీ కొరత. ఫారెన్ ఫ్యాకల్టీ రేషియో తక్కువగా ఉండటంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐఐటీలు సత్తా చాటలేకపోతున్న విషయం తెలిసిందే! తాజాగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) ఐఐటీల డెరైక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఈ సమస్యను అధిగమించేందుకు సరికొత్త విధానంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది.
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఫ్యాకల్టీని గుర్తించి నియామకాలు జరిపేందుకు వీలుగా.. వివిధ ఐఐటీలకు నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని (విదేశీ) ఎంహెచ్‌ఆర్‌డీ కేటాయించింది. ఆయా ప్రాంతాల నుంచి అన్ని ఐఐటీలకు అవసరమైన ఫ్యాకల్టీ నియామక ప్రక్రియను సదరు ఐఐటీ పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం దేశంలోని ఏ ఒక్క ఐఐటీలోనూ శాశ్వత ప్రాతిపదికన ఫారెన్ ఫ్యాకల్టీ లేకపోవడం గమనార్హం. కొన్ని ఐఐటీల్లో మాత్రం భారత మూలాలున్న కొంతమంది ఫ్యాకల్టీ బోధిస్తున్నారు.
  • ఆగస్టు 20న జరిగిన ఐఐటీ కౌన్సిల్ సమావేశంలో ఫారెన్ ఫ్యాకల్టీని ఆకర్షించేలా ఐఐటీలతో వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతోపాటు ఐఐటీల్లో విదేశీ ఫ్యాకల్టీ శాశ్వత నియామకాలకు ఆటంకంగా నిలుస్తున్న వీసా నిబంధనల సరళీకరణకు ఎంహెచ్‌ఆర్‌డీ, విదేశీ వ్యవహారాల శాఖతో చర్చిస్తోంది.
  • ఐఐటీలు ఫారెన్ ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా విదేశీయులతోపాటు భారత్‌కు తిరిగి రావాలనుకుంటున్న ఎన్నారైలను కూడా లక్ష్యంగా పెట్టుకున్నాయి. తాజా ప్రతిపాదనల అమలు పరంగా ఐఐటీ రోపార్ ముందు వరుసలో ఉంది. ఈ ఐఐటీ డెరైక్టర్ సరిత్ కుమార్ దాస్ సెప్టెంబర్ 15న టొరంటోలో వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహించారు.
  • ఫారెన్ ఫ్యాకల్టీ నియామకానికి సంబంధించి ఐఐటీలు ప్రధానంగా అమెరికాపై దృష్టిసారించాయి. ఎంహెచ్‌ఆర్‌డీ, ఐఐటీలకు రీజియన్ల కేటాయింపులో వాటి ట్రాక్ రికార్డును పరిగణలోకి తీసుకుంది.
  • ఐఐటీలు ఫారెన్ ఫ్యాకల్టీని ఆకర్షించలేకపోవడానికి వేతనాలు తక్కువగా ఉండటం ప్రధాన కారణమని చెబుతున్నారు. వాస్తవానికి విదేశీ ఫ్యాకల్టీ ఆశిస్తున్న స్థాయిలో ఐఐటీలు వేతనాలు అందించలేకపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఐఐటీ ఢిల్లీ త్వరలో తూర్పు ఐరోపా, రష్యా దేశాలకు సంప్రదింపుల బృందాన్ని పంపనుంది.
స్టడీ ఇన్ ఇండియా :
  • వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీలకు శరాఘాతంగా మారుతున్న మరో ప్రామాణికం.. ఫారెన్ స్టూడెంట్ రేషియో. దీన్ని దృష్టిలో పెట్టుకొని విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు ఎంహెచ్‌ఆర్‌డీ స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిద్వారా ఐఐటీలు, ఐఐఎంలతోపాటు ఇతర దేశీయ ఇన్‌స్టిట్యూట్స్‌లో విదేశీ విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. స్టడీ ఇన్ ఇండియాలో భాగంగా ఐఐటీలు, ఐఐఎంలు వంటి 160 ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో విదేశీ విద్యార్థుల ప్రవేశానికి కేంద్రం అనుమతించింది.
  • ప్రస్తుతం భారతదేశంలో 45,000 మంది విదేశీ విద్యార్థులు చదువుతున్నారు. ఇది ప్రపంచ విదేశీ విద్యార్థుల సంఖ్యలో ఒకశాతం మాత్రమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2022 నాటికి భారత్‌లో విదేశీ విద్యార్థుల సంఖ్యను 2 లక్షలకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
  • స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమంలో ప్రధానంగా నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, వియత్నాం, థాయిలాండ్, మలేషియా, ఈజిప్ట్ తదితర దేశాలపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా దరఖాస్తు చేసుకున్నవారిలో అత్యుత్తమ ప్రతిభావంతుల జాబితాలో నిలిచిన తొలి 25 శాతం మంది విదేశీ విద్యార్థులకు 100 శాతం ఫీజు మినహాయింపు ఇవ్వనున్నారు. ఆ తర్వాత మెరిట్ జాబితాలోని 25 శాతం మంది విద్యార్థులకు 50 శాతం; తదుపరి స్థానంలోని మరో 25 శాతం మంది విద్యార్థులకు 25 శాతం ఫీజును రద్దు చేయనున్నారు.
  • స్టడీ ఇన్ ఇండియా కింద తొలి అకడమిక్ సంవత్సరంలో 160 పబ్లిక్, ప్రైవేటు విద్యాసంస్థల్లోని 15,000 సీట్లను విదేశీయులకు కేటాయించనున్నారు. ఆయా టాప్ ఇన్‌స్టిట్యూట్‌లలో 10-15 శాతం సీట్లను సూపర్ న్యూమరరీ కింద విదేశీ విద్యార్థులకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
ఇంజనీరింగ్‌కు మానవీయత :
  • విద్యార్థులు కేవలం టెకీలుగా మారడం కాకుండా... మంచి పౌరులుగానూ ఎదగాలంటే.. హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్, ఆర్ట్స్ సబ్జెక్టులపైనా అవగాహన అవసరమని ఐఐటీలు భావిస్తున్నాయి. అందుకే కొద్దిరోజుల క్రితం జరిగిన ఐఐటీల కౌన్సెల్ సమావేశంలో యూజీస్థాయి కోర్సుల్లో ఆర్ట్స్, సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్ సబ్జెక్టులను సైతం విద్యార్థులు చదివేలా చూడాలని నిర్ణయించినట్లు తెలిసింది.
  • హ్యుమానిటీ కోర్సులు చదవడం వల్ల ఇంజనీరింగ్ విద్యార్థుల్లో టీమ్ వర్క్‌తోపాటు మానవ సంబంధాలపై అవగాహన-విలువలు పెంపొందుతాయని భావిస్తున్నారు.
  • ఇప్పటికే పలు ఐఐటీలు హ్యుమానిటీస్, సోషల్ సెన్సైల్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సులు అందిస్తున్నాయి. ఐఐటీ ఢిల్లీ హ్యుమానిటీస్‌లో రెండేళ్ల ప్రోగ్రామ్స్‌ని ఆఫర్ చేస్తుండగా.. ఐఐటీ ఖరగ్‌పూర్ ఏకంగా లా కోర్సునే నిర్వహిస్తోంది.
  • ఐఐటీలు కోర్ ఇంజనీరింగ్ కోర్సుల సరసన హ్యూమన్ స్టడీస్, ఫైన్ ఆర్ట్స్ కోర్సులను చేర్చనున్నాయి. ఇందులో భాగంగా నృత్యం, సంగీతం తదితర కోర్సులను ప్రారంభించనున్నాయి.
  • ఐఐటీ హైదరాబాద్‌లో విద్యార్థి ప్రతి సెమిస్టెర్‌లో క్రియేటివ్ ఆర్ట్స్‌కి సంబంధించి ఒక క్రెడిట్ కోర్సును ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో కర్ణాటక సంగీతం, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం, థియేటర్, సినిమా, మధుబనీ, పెయింటింగ్ తదితర కోర్సులు ఉన్నాయి.
  • ఐఐటీ ఖరగ్‌పూర్.. విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్ల కోసం సెంటర్ ఫర్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్‌ను ఏర్పాటు చేసింది.
  • ఐఐటీల సంస్కరణల జాబితాలో వినూత్న కోర్సుల ప్రారంభం; కొత్త విభాగాల్లో డిపార్ట్‌మెంట్‌ల ఏర్పాటు; ఇన్ హౌజ్ టెక్ స్టార్టప్స్ వంటివి ఉన్నాయి.
పరిశోధనలు..
  • ఐఐటీలు పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాయి. దీంతో ఇంతకాలం గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులకు ప్రాధాన్యం ఇచ్చిన ఐఐటీల్లో.. క్రమేణా మాస్టర్స్, పీహెచ్‌డీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.
  • ఐఐటీ మద్రాస్.. 2014లోనే కంబుషన్ (దహన స్థితి) రీసెర్చ్‌కి సంబంధించి ఇంటర్‌డిసిప్లినరీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కంప్యుటేషనల్ బ్రైన్ రీసెర్చ్, బయలాజికల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, డేటాసైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో ఇంటర్‌డిసిప్లినరీ కేంద్రాలు ఏర్పాడ్డాయి. ఐఐటీ క్యాంపస్‌కి బయట రీసెర్చ్ పార్క్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు.
  • ఐఐటీ బాంబేకు ఇప్పటికే పరిశోధనల పరంగా మంచి పేరుంది. దీంతోపాటు ఇతర ఐఐటీలు కూడా ఇటీవల కాలంలో పరిశోధనలపై ఎక్కువగా దృష్టిపెడుతున్నాయి.
  • ఐఐటీల్లో పరిశోధనలు, సంస్కరణలకు సంబంధించి ఐఐటీ బాంబే ముందు వరుసలో నిలుస్తోంది.
మల్టీడిసిప్లినరీ :
  • కొత్త విధానాల ద్వారా ఐఐటీలు మల్టీడిసిప్లినరీ కేంద్రాలుగా రూపొం దుతున్నాయి. ఫలితంగా కీలక సవాళ్లతో నిండిన ప్రాజెక్టులకు పనిచేసే బృందాలను అందించేలా ఎదుగుతున్నాయి. ఐఐటీలు అనుసరిస్తున్న నూతన విధానాల ద్వారా దేశ వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడొచ్చు.
  • ఐఐటీలు సమాజంలో ఉండే సమస్యలకు పరిష్కార కేంద్రాలుగా మారాలని ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విభాగాలు, బ్రాంచ్‌ల్లోని వారితో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
  • ఐఐటీ ఢిల్లీ తమ ఫ్యాకల్టీని ఇంటర్‌డిసిప్లినరీ ప్రాజెక్టుల ఏర్పాటు దిశగా ప్రోత్సహిస్తోంది.
స్కాలర్‌షిప్‌లు..
  • ఐఐటీ, ఢిల్లీ.. పీహెచ్‌డీలో చేరే విదేశీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ఫారెన్ రీసెర్చ్ స్కాలర్స్‌కి పూర్తిస్థాయి స్కాలర్‌షిప్‌లు అందించడం ద్వారా విదేశీ విద్యార్థులను ఆకర్షించాలని భావిస్తోంది.
  • ఐఐటీ ఢిల్లీ ఒక ఏడాదిలో 500 మంది విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా లభించడంతో ఐఐటీ ఢిల్లీకి కొన్ని అంశాల్లో మరింత స్వయం ప్రతిపత్తి లభించింది. దీంతో విదేశీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించాలని నిర్ణయించింది. తద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోవాలని ప్రయత్నిస్తోంది.
యువ ఫ్యాకల్టీ :
  • ఐఐటీ మద్రాస్ గత ఐదేళ్లలో 25 నుంచి 30 మంది యువ ఫ్యాకల్టీని నియమించుకుంది. అదే విధంగా ఐఐటీ బాంబే 30 మందికి పైగా ప్రొఫెసర్ల నియామకం జరిపింది.
  • 1980ల్లో ఐఐటీ ఫ్యాకల్టీ సరాసరి వయసు 60 ఏళ్లు కాగా.. ప్రస్తుతం అది 40 ఏళ్లకు తగ్గింది. కొత్తగా నియమితులవుతున్న ఈ యువ ఫ్యాకల్టీ ఆత్మవిశ్వాసం, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుండటంతో క్యాంపస్‌ల్లో చదువుపరంగా కొత్త వాతావరణం కనిపిస్తోంది.

కొత్త మార్గాలు..

ఐఐటీలు విద్యార్థులను కొత్త మార్గాల్లో ప్రోత్సహించేలా కార్యక్రమాలు ప్రారంభించాయి. ఐఐటీ మద్రాస్.. విద్యార్థులు మూడో సంవత్సరంలో ఉండగా.. ఇంటర్ డిసిప్లినరీలో మాస్టర్ ప్రోగ్రామ్ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఐఐటీ గాంధీనగర్ ఏటా ఆరుగురు విద్యార్థులకు ఎక్స్‌ప్లోరెర్ ఫెలోషిప్ అందిస్తోంది. విద్యార్థుల్లో వైవిధ్యాన్ని పెంపొందించడంతోపాటు భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా చేయడమే ఈ ఫెలోషిప్ ప్రధాన ఉద్దేశం.

బహుముఖ ప్రతిభ..
ఫారెన్ ఫ్యాకల్టీ, ఫారెన్ స్టూడెంట్ సంఖ్య తక్కువగా ఉండటంతో క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీలు సత్తా చాటలేకపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫారెన్ ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాలకు సంబంధించిన ఫలితాలను ఇప్పుడే అంచనా వేయలేం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు, ఇన్‌స్టిట్యూట్స్‌లో అనుసరిస్తున్న పద్ధతులు, ఫ్లెక్సిబిలిటీని అధ్యయనం చేసి వాటిని అమలుచేసేందుకు ఐఐటీలు ప్రయత్నిస్తున్నాయి. సామాజిక అవగాహన, మానవ విలువలకు సంబంధించి లోతైన పరిజ్ఞానం ద్వారా ఇంజనీర్లు.. బహుముఖ ప్రతిభతో వినూత్న రీతిలో సమాజానికి ఉపయోగపడగలరు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే హ్యుమానిటీస్‌కి ఐఐటీల్లో ప్రాధాన్యం పెరుగుతోంది.
- ప్రొఫెసర్ ఆర్.వి.రాజకుమార్, డెరైక్టర్, ఐఐటీ, భువనేశ్వర్.
Published date : 10 Oct 2018 03:45PM

Photo Stories