Skip to main content

సైన్సా...ఇంజనీరింగా.. ఏది బెటర్ ?

నేటి ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ప్రపంచంలో.. సైన్స్, ఇంజనీరింగ్.. సమాజమనే బండికి రెండు చక్రాలు!! మానవ ప్రగతిలో సైన్స్ తోపాటు ఇంజనీరింగ్ పోషించిన ఘనమైన పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఈ ప్రస్తావన ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..! ఎందుకంటే.. ప్రస్తుతం ఇంజనీరింగ్, సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ క్రేజీ కోర్సుని కొందరు అంటుంటే...సైన్స్ తోనే ఉజ్వల భవిష్యత్ అనే అభిప్రాయం మరికొంత మందిలో వ్యక్తమవుతోంది. ఓ వైపు ఇంజనీరింగ్ పూర్తిచేసుకున్న వారికి ప్లేస్‌మెంట్స్ తగ్గుతున్నాయనే వార్తలు.. మరోవైపు ప్రభుత్వాలు సైన్స్ పరిశధోనలకు పెద్దపీట వేస్తున్న వైనం..! దాంతో సైన్స్, ఇంజనీరింగ్‌ల్లో.. ఏ కోర్సును ఎంచుకోవాలో తెలియని సందిగ్దత. అందుకే ఇంజనీరింగ్‌తోనే భవిష్యత్తా? సైన్స్ తో అత్యున్నత శిఖరాలు అధిరోహించే అవకాశమెంత..? అసలు ఇంజనీరింగ్‌కు సైన్స్ కు మధ్య తేడా ఏంటి?! ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానమే..ఈ ప్రత్యేక కథనం...
సైన్సా... ఇంజనీరింగా..!? ఏది బెటర్... ఎందుకు?! అని ప్రశ్నిస్తే.. ఠక్కున సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే.. రెండూ ఉన్నతమైన కోర్సులే! రెండింటితోనూ అద్భుత అవకాశాలు అందుకోవచ్చు. రెండు కోర్సులు అద్భుతాలు సృష్టించేందుకు వీలుకల్పించే మార్గాలే! అందుకే ఇప్పుడు తమ చదువుల ప్రయాణంలో కీలక దశకు చేరుకున్న విద్యార్థుల్లో..కెరీర్ దిశగా సైన్సా.. ఇంజనీరింగా.. ఎటువైపు అడుగులు వేస్తే బాగుంటుందో తేల్చుకోలేకపోతున్నారు. నిపుణులు మాత్రం సైన్స్, ఇంజనీరింగ్.. రెండూ ఒకదానికొకటి సమ్మిళితం.. రెండింటి అనుసంధానంతోనే సామాజిక ప్రగతి సాధ్యమని పేర్కొంటున్నారు. సైన్స్ ,ఇంజనీరింగ్‌ల్లో ఏది బెస్ట్..?! అనే వాదనకంటే... ఆయా కోర్సుల ద్వారా లభించే కెరీర్ అవకాశాల గురించి తెలుసుకొని.. అందుబాటులో ఉన్న అకడమిక్ మార్గాలు గురించి విశ్లేషించుకొని.. ఎందులో చేరాలో నిర్ణయించుకోవడం ఉత్తమం అంటున్నారు విద్యావేత్తలు. ప్రస్తుతం స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) విభాగంలో నిపుణుల కొరత ఉందనే వార్తల నేపథ్యంలో.. నైపుణ్యాలుంటే సైన్స్, ఇంజనీరింగ్‌లలో ఏ కోర్సు పూర్తిచేసినా... అవకాశాలకు కొదవుండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సైన్స్ వర్సెస్ ఇంజనీరింగ్ :
సైన్స్:
పరిశోధనల ద్వారా సరికొత్త ఆవిష్కరణలకు దారి చూపుతుంది సైన్స్. సిద్ధాంతాలను, సూత్రాలను అన్వయిస్తూ వినూత్న ప్రయోగాలు చేస్తుంది.
ఇంజనీరింగ్: సైన్స్ సూత్రాల ఆధారంగా.. కొత్త ఆవిష్కరణల రూపకల్పన దిశగా డిజైన్, ప్రొడక్షన్ వంటి కార్యకలాపాలు చేపట్టే విభాగం ఇంజనీరింగ్. అవరోధాలు.. అపోహలు:
  • దేశంలో ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని... ఏటా లక్షల మంది బయటికి వస్తున్నప్పటికీ.. వారిలో జాబ్‌రెడీ స్కిల్స్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ సిలబస్, కరిక్యులం, నైపుణ్యాలు.. లేకపోవడమే ఉజ్వల కెరీర్‌కు అవరోధంగా మారుతోంది.
  • సైన్స్ రంగంలో కెరీర్‌లో స్థిరపడాలంటే... సుదీర్ఘ కాలం వేచి చూడాలనే అపోహ చాలామంది విద్యార్థుల్లో ఉంది. సైన్స్తో ఉపాధి మార్గాలు పరిమితమనే వాదన సైతం నెలకొంది. వాస్తవానికి రెండు దశాబ్దాల క్రితం వరకు ఉన్నత విద్య పరంగా సైన్స్వైపు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఆశించిన స్థాయిలోనే ఉండేది. కానీ.. ఆ తర్వాత కాలంలో సాఫ్ట్‌వేర్ రంగం ఊపందుకోవడం.. ఇంజనీరింగ్ విద్యార్థులకు బ్రాంచ్‌తో సంబంధం లేకుండా.. ఐటీ రంగం ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగావకాశాలు కల్పించడంతో.. ఇంజనీరింగ్ క్రేజీ కోర్సుగా మారిపోయింది.

క్రేజ్‌కు కారణం ఇదే:
  • 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత ఉత్పత్తి రంగం మొదలు సాఫ్ట్‌వేర్ రంగం వరకూ.. విస్తరణ వేగం అందుకుంది. ఫలితంగా అప్పట్లో ఇంజనీరింగ్ పట్టా ఉంటే చాలు.. ఉత్పత్తి రంగం, సేవల రంగం, సాఫ్ట్‌వేర్‌లో.. కొలువులు అందుకునే వీలుకల్గింది. ఇంజనీరింగ్ పూర్తవుతూనే 22, 23 ఏళ్ల వయసులోనే కొలువుదీరే అవకాశం లభించింది. దాంతో ఇంజనీరింగ్ కోర్సుకు సమాజంలో క్రేజ్ పెరిగింది.
  • సైన్స్ రంగంలో ఒక్కసారి తమకంటూ పేరు తెచ్చుకుంటే.. ఇక భవిష్యత్తులో వెనుదిరిగి చూసుకోనక్కర్లేదు. ఇటీవల కాలంలో ప్రభుత్వాలు సైతం సైన్స్ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. సామాజిక అభివృద్ధి, దానికి సంబంధించి కొత్త ఆవిష్కరణల కోసం భవిష్యత్తు పరిశోధకులను తీర్చిదిద్దేందుకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి.

ఇంజనీర్... సైంటిస్ట్.. తేడాలివే!
సైన్స్ కోర్సులు చదివి పరిశోధనల దిశగా సాగితే సైంటిస్ట్ అని.. అలాగే ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేసి.. సంబంధిత కోర్ విభాగంలో పనిచేస్తుంటే ఇంజనీర్ అవుతారన్నది సర్వసాధారణ అభిప్రాయం! మరి సైంటిస్ట్‌కు ఇంజనీరింగ్‌కు మధ్య తేడాలు తెలుసుకుందామా..!..
  1. సైంటిస్ట్‌లు... పరిశోధనలు చేసి.. సూత్రాలు ప్రతిపాదిస్తారు.. ఇంజనీర్స్ ఆ సూత్రాలను ప్రాక్టికల్‌గా అమలు చేసి చూస్తారు.
  2. సైంటిస్ట్‌లు ల్యాబ్‌లో పనిచేస్తే.. ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ఉంటారు.
  3. సైంటిస్ట్‌లు ప్రశ్నిస్తూ, సమస్యను అర్థం చేసుకుంటాడు.. ఇంజనీర్ సమస్యకు పరిష్కారం అమలుచేస్తాడు.
  4. సైంటిస్ట్‌లు సాధారణంగా అకడెమిక్ విభాగంలో ఉంటే.. ఇంజనీర్లు ఎక్కువగా వృత్తి నిపుణులుగా గుర్తింపు పొందుతారు.
  5. సైంటిస్ట్ ముందుకు సాగాల్సిన మార్గం గురించి ఆలోచిస్తే.. ఇంజనీర్లు అంతిమ గమ్యం, ఫలితంపై దృష్టిసారిస్తారు.
  6. యంత్రాలు, వ్యవస్థల నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర కీలకమైతే... సైంటిస్టులు తమ చుట్టూ ఉన్న వ్యవస్థలను, యంత్రాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం సాధిస్తారు.

సైన్స్.. సక్సెస్ మార్గం ఇదిగో !
సైన్స్ రంగంలో కెరీర్ ప్రణాళిక వేసుకున్న వారికి ప్యూర్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్.. ఇలా అన్ని విభాగాల్లోనూ అద్భుత కెరీర్ అవకాశాలు ఖాయం. ఐఐఎస్‌ఈఆర్, ఐఐఎస్సీ వంటి ప్రత్యేక ఇన్‌స్టిట్యూట్స్‌లో సైన్స్ కోర్సులను అభ్యసించిన వారు సైన్స్ పరిశోధన రంగంలో దూసుకెళ్లొచ్చు.

ఐఐఎస్సీ, ఐఐఎస్‌ఈఆర్ :
  • సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో జాతీయ స్థాయిలో పలు ఇన్‌స్టిట్యూట్‌లకు మంచి పేరుంది. వీటిల్లో ఐఐఎస్‌సీ, ఐఐఎస్‌ఈఆర్‌లు ముఖ్యమైనవి.
  • సైన్స్ లో కీలకంగా భావించే పరిశోధనల దిశగా జాతీయ స్థాయిలో పలు ఇన్‌స్టిట్యూట్‌లు, రీసెర్చ్ లేబొరేటరీలు అందుబాటులో ఉన్నాయి. ప్యూర్ సెన్సైస్‌పై ఆసక్తి ఉన్న వి ద్యార్థులు సైన్స్ లో బ్యాచిలర్ స్థాయి కోర్సులు పూర్తికాగానే నేరుగా పీహెచ్‌డీ చేసే అవకాశముంది. అలాగే ఐఐఎస్‌సీ. ఐఐ ఎస్‌ఈఆర్ వంటి ప్రముఖ సంస్థల్లో ఇంటి గ్రేటెడ్ పీజీ,పీహెచ్‌డీ కోర్సులు, ఎంఎస్ బై రీసెర్చ్ కోర్సులు అభ్యసించొచ్చు. లైఫ్ సెన్సైస్ విభాగంలో.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ ఆధ్వర్యంలో పలు రీసెర్చ్ ప్రోగ్రా మ్స్‌లో స్కాలర్స్‌గా అడుగుపెట్టొచ్చు.

రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ :
  1. హోమీబాబా నేషనల్ ఇన్‌స్టిట్యూట్
  2. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్
  3. ఆర్యభట్ట ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్స్
  4. హరీశ్ చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
  5. ఐఐఎఎస్సీ-బెంగళూరు ఐఐఎస్‌ఈఆర్
  6. నైపర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
  7. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్
  8. నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సైన్స్
  9. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ సెంటర్
  10. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్

పరిశోధనలు.. ప్రవేశ మార్గాలు:
సైన్స్ రంగంలో పరిశోధనల దిశగా సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్, జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్(జెస్ట్) తదితర పరీక్షల ద్వారా ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల్లో పీహెచ్‌డీలో అవకాశం అందుకోవచ్చు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, రీసెర్చ్ సెంటర్లలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందొచ్చు. గేట్ ఉత్తీర్ణత ఆధారంగానూ యూ నివర్సిటీల్లో పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం లభిస్తుంది. సైన్స్ రంగంలో పీహెచ్‌డీ స్కాలర్స్‌కు ఆర్థికంగానూ ప్రోత్సాహం లభిస్తోంది. తొలుత మూడేళ్లు నెలకు రూ.25,000 జేఆర్‌ఎఫ్..ఆ తర్వాత రెండేళ్లు నెలకు రూ.28,000 ఎస్‌ఆర్‌ఎఫ్ లభిస్తుంది.

సైన్స్ తో అవకాశాలు:
  1. ఐఐసీటీ, సీఎస్‌ఐఆర్, ఐసీఏఆర్, ఎన్‌జీఐఆర్‌ఐ, ఇక్రిశాట్ తదితర సంస్థల్లో జూనియర్ సైంటిస్ట్‌లుగా అవకాశం.
  2. పీహెచ్‌డీ పూర్తిచేస్తే బోధన రంగంలో ఫ్యాకల్టీగా కెరీర్ ప్రారంభించే అవకాశం.
  3. ప్రైవేటు సంస్థల ఆర్ అండ్ డీ విభాగాల్లో సైంటిస్ట్‌లుగా ఆకర్షణీయ వేతనాలు అందుకోవచ్చు.

ఆసక్తి ప్రధానం...
సెన్సైస్‌లో ఇప్పుడు పలు రకాల అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో అడుగుపెట్టేముందు విద్యార్థులు ఒకటికి, రెండుసార్లు తమ ఆసక్తిని పరిగణనలోకి తీసుకోవాలి. నిరంతరం లేబొరేటరీల్లో పనిచేసే ఓర్పు, కొత్త ఆవిష్కరణల పట్ల ఉత్సుకత ఉంటేనే సైన్స్ రంగంలో అత్యున్నత శిఖరాలు అందుకోవచ్చు.
- ప్రొఫెసర్. వి.ఎస్.రావు, ఐఐఎస్‌ఈఆర్-తిరుపతి కోఆర్డినేటర్

ఎవర్‌గ్రీన్.. కానీ..
ఇంజనీరింగ్ ఎవర్‌గ్రీన్ అనేది నిస్సందేహం. శతాబ్దాలుగా సామాజిక అభివృద్ధిలో, సాంకేతిక ప్రగతిలో ఇంజనీరింగ్‌ది కీలక పాత్ర. ప్రస్తుతం సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్ వంటి కోర్, సర్క్యూట్ బ్రాంచ్‌ల హవా నడుస్తోంది. సాఫ్ట్‌వేర్ రంగం రాజ్యమేలుతున్న నేటి పరిస్థితుల్లో సైతం.. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్‌లకు వన్నె తగ్గట్లేదు. ఈ బ్రాంచ్‌లతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు.. నైపుణ్యాలుంటే.. చిన్న తరహా పరిశ్రమల నుంచి బహుళ జాతి సంస్థల వరకు ప్రతిచోటా అవకాశాలు అందుకోవచ్చు. పలు సర్వేల ప్రకారం-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉన్న వారి సంఖ్య 20 శాతం నుంచి 25 శాతం మధ్యలోనే ఉంటోంది.

పీజీ పట్టా ఉంటేనే:
  • ఇంజనీరింగ్‌తో ఉన్నత కెరీర్ అవకాశాలు అందుకోవాలంటే.. ఎంటెక్, పీహెచ్‌డీ పూర్తిచేయాలి.
  • గేట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా పీజీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం పొందొచ్చు.

కెరీర్ అవకాశాలు :
  1. ఉత్పత్తి రంగం నుంచి సాఫ్ట్‌వేర్ వరకు అవకాశాలు.
  2. జాబ్ రెడీ స్కిల్స్, అప్‌డేటెడ్ నాలెడ్‌‌జ ఉంటే రూ.లక్షల్లో వార్షిక వేతనాలు.
  3. పీహెచ్‌డీ పూర్తి చేస్తే టెక్నికల్ రీసెర్చ్ ల్యాబ్స్‌లో సైంటిస్ట్‌గా అవకాశం. బోధన రంగంలోనూ అధ్యాపకులుగా అవకాశం.

ఇంజనీరింగ్..
  • క్రియేటివిటీ
  • డొమైన్ నాలెడ్జ్
  • క్రిటికల్ థింకింగ్
  • అనలిటికల్ అప్రోచ్
  • ప్రాబ్లమ్ సాల్వింగ్
  • అప్‌డేటెడ్ నాలెడ్జ్

ఇంజనీరింగ్.. అప్‌డేట్ నాలెడ్‌‌జతో సాగితేనే
ఇంజనీరింగ్‌లో బెస్ట్ కెరీర్ సొంతం చేసుకోవాలంటే.. నిరంతరం నాలెడ్‌‌జ పెంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి విభాగంలోనూ లేటెస్ట్ టెక్నాలజీ అమల్లోకి వస్తోంది. వీటి గురించి అవగాహన పెంచుకుంటేనే.. ఇంజనీరింగ్‌లో రాణించగలరు. ఈ స్కిల్స్ లోపించడం వల్లనే అధిక శాతం మంది కెరీర్ పరంగా నిరాశకు గురవుతున్నారు.
- ప్రొఫెసర్. సి.హెచ్.సుబ్రహ్మణ్యం, డీన్, అకడమిక్స్, ఐఐటీ- హైదరాబాద్
Published date : 26 Jul 2018 06:11PM

Photo Stories