పరిశోధనలతో పాటు విదేశీ విద్యకు భవిష్యత్తులో సమస్యలు..?
పర్యవసానంగా దేశంలో ఆర్ అండ్ డీ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడే ఆస్కారముంది. పీజీ స్థాయిలో.. సర్క్యూట్, కోర్ బ్రాంచ్‌ల విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్‌పై అవగాహన లేకుంటే రాణించడం కష్టమే అంటున్నారు. ఉదాహరణకు ఫిజిక్స్, మ్యాథ్స్ లేకుండా.. బీటెక్ పూర్తి చేసి.. ఎంటెక్‌లో వైర్‌లెస్ కమ్యూనికేషన్స్, ఆర్‌ఎఫ్ సిగ్నల్స్ వంటి సబ్జెక్ట్‌లలో రాణించడం ఎంతో కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విదేశీ విద్యకు...
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎంఎస్ కోర్సుల్లో చేరాలంటే.. పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకూ.. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లు చదివుండాలనే నిబంధన ఉంది. అంతేకాకుండా ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణిక టెస్ట్‌గా పరిగణించే జీఆర్‌ఈలోనూ మ్యాథమెటిక్స్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతున్నారు. మరికొన్ని విదేశీ యూనివర్సిటీలు.. జీఆర్‌ఈ సబ్జెక్ట్ టెస్ట్‌లను కూడా అర్హతగా పేర్కొంటున్నాయి. వీటికి సంబంధించి విద్యార్థులు పీజీ స్థాయిలో తాము చదవాల నుకుంటున్న స్పెషలైజేషన్స్‌కు అనుగుణంగా ఈ సబ్జెక్ట్ టెస్ట్‌లలో స్కోర్ సాధించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో మ్యాథ మెటిక్స్ సంబంధిత కోర్సులు చదవాలనుకునే విద్యార్థులు.. జీఆర్‌ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ టెస్ట్‌లో స్కోర్ సాధించాలి. ఈ సబ్జెక్ట్ టెస్ట్‌లో కాలిక్యులస్, అల్జీబ్రా, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నైపుణ్యాలు పొందాలంటే.. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్ స్థాయిలో వీటిని అభ్యసిస్తేనే సాధ్యమనేది నిపుణుల అభిప్రాయం.
జాబ్ మార్కెట్..
మ్యాథ్స్, ఫిజిక్స్ లేకుండా.. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు జాబ్ మార్కెట్‌లో నిలదొక్కుకోవడం కష్టమేనని అభిప్రాయం నెలకొంది. ఉదాహరణకు.. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆటోమేషన్ ఆధారిత కార్యకలాపాలు సాగుతున్నాయి. రోబోటిక్స్, డేటా అనలిటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, కోడింగ్, 3–డి డిజైన్ ప్రింటింగ్ వంటి వాటికి ప్రధాన్యం పెరుగుతోంది. ఈ విభాగాల్లో రాణించాలంటే.. ప్రోగ్రామింగ్, కోడింగ్ స్కిల్స్ కీలకం అవుతున్నాయి. వీటికి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లలో పట్టుతో పాటు అప్లికేషన్ నైపుణ్యాలు తప్పనిసరి. ఇలాంటి నైపుణ్యాలు ఇంటర్‌లో పూర్తి స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివిన వారికే లభిస్తాయని సబ్జెక్ట్ నిపుణులు అంటున్నారు.
ఇంకా చదవండి: part 4: ఆ మూడు సబ్జెక్ట్‌ల ఆధారంగా నిర్వహించే జేఈఈ పరిస్థితి ఏంటి?