Skip to main content

పీఎస్‌యూ కొలువులకు ‘గేట్’వే

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)... ఐఐటీ, ఎన్‌ఐటీ, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పీహెచ్‌డీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే పరీక్ష. ప్రస్తుతం ఇది అకడెమిక్ ప్రవేశాలకే పరిమితం కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువులకు ‘గేట్’వేగా మారింది. నవరత్న, మహారత్న, మినీరత్న హోదా కలిగిన పీఎస్‌యూలు గేట్ స్కోర్ ఆధారంగా ఇంజనీరింగ్ విభాగాల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపిక ప్రక్రియలో పీఎస్‌యూలు అనుసరిస్తున్న విధానాలు? విజయానికి ఎలా సన్నద్ధం కావాలి? తదితర అంశాలపై ప్రత్యేక కథనం..
  • ఇటీవల గేట్ స్కోర్ ఆధారంగా ఉన్నత విద్యా కోర్సులకు దరఖాస్తు చేసుకునే వారితోపాటు ఆ స్కోర్ ఆధారంగా పీఎస్‌యూల్లో ఎంట్రీ లెవల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
  • 22, 23 ఏళ్లకే పీఎస్‌యూల్లో (ఎంట్రీ లెవల్) అడుగు పెడితే.. కెరీర్ పరంగా సుస్థిరత, భవిష్యత్తులో ఉన్నత హోదాలు అందుకోవచ్చు. అందుకే ఎక్కువ మంది విద్యార్థులు వీటిలో స్థిరపడాలనే లక్ష్యంగా కదులుతున్నారు. మరోవైపు సరైన సంసిద్ధతతో ఉన్న వారు మాత్రమే పీఎస్‌యూల మలిదశ ఎంపిక ప్రక్రియలో విజయవంతమవుతున్నారు.

30కి పైగా పీఎస్‌యూలు..
  • పీఎస్‌యూల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాల భర్తీకి గత నాలుగేళ్ల నుంచి గేట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొంటున్నారు. మొదట్లో పన్నెండు పీఎస్‌యూలు ప్రాథమికంగా గేట్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య 30కి పైనే ఉంది. ఈ జాబితాలో గెయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఓన్‌జీసీ, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బీహెచ్‌ఈఎల్ వంటి ప్రముఖ పీఎస్‌యూలతో పాటు పశ్చిమ బెంగాల్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్, పంజాబ్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ వంటి రాష్ట్ర స్థాయి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ సంస్థలన్నీ గేట్ స్కోర్ ప్రామాణికంగా ఇంజనీరింగ్ విభాగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నాయి.

కేబినెట్ సెక్రటేరియట్ సైతం
గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీచేసే సంస్థల జాబితాలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా చేరింది. కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ పరిధిలోని సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ (ఎస్ అండ్ టీ), సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలను గేట్ 2016 స్కోర్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ సైతం విడుదలైంది.

పీఎస్‌యూలు పరిగణనలోకి తీసుకుంటున్న అంశాలు
  • బీటెక్ (ఆయా బ్రాంచ్‌లు)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
  • బీటెక్‌తో పాటు ఇతర ఉన్నత విద్యార్హతలు.
  • ఓఎన్‌జీసీ, పీఎస్‌టీఎల్ వంటి సంస్థలు అదనపు అర్హతలకు తుది దశ ఎంపికలో ప్రత్యేక వెయిటేజీ కల్పిస్తున్నాయి.

ఎంపిక ప్రక్రియలో వెయిటేజీలు
పీఎస్‌యూలు మలి దశ ఎంపిక ప్రక్రియలో వివిధ అంశాలకు నిర్దేశిత మొత్తాల్లో వెయిటేజీ ఇచ్చి తుది జాబితా రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి.

కనీస కటాఫ్ మార్కులు
పీఎస్‌యూలు గేట్ స్కోర్‌కు సంబంధించి కనీస కటాఫ్ మార్కులు కూడా నిర్దేశిస్తున్నాయి. కనీస కటాఫ్ మార్కులు 550 నుంచి 600 మధ్యలో ఉంటున్నప్పటికీ తుది కటాఫ్‌లు మాత్రం 750 నుంచి 900 మధ్యలో ఉంటున్నాయి.
  • ముఖ్యంగా పోటీ ఎక్కువగా ఉండే మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, సీఎస్‌ఈ వంటి విభాగాల్లో ఫైనల్ కటాఫ్ 800కు పైనే ఉంటోంది.
  • పీఎస్‌యూలు మలి దశ ఎంపిక ప్రక్రియకు కనీస కటాఫ్‌ను ప్రకటించే సమయంలో 1:5 లేదా 1:7 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి జాబితాను ప్రకటిస్తున్నాయి.

మలి దశ ఎంపికలో ముఖ్యాంశాలు
గేట్ కనీస కటాఫ్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తున్న పీఎస్‌యూలు మలి దశలో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. వీటికి కూడా నిర్దిష్ట వెయిటేజీ ఇస్తున్నాయి. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలకు కలిపి 15 నుంచి 25 శాతం మధ్యలో వెయిటేజీ ఉంటోంది.

గ్రూప్ డిస్కషన్
పీఎస్‌యూల మలి దశ ఎంపిక ప్రక్రియలో మొదటగా గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. జీడీలో టెక్నికల్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్, బిజినెస్.. ఇలా ఏదైనా ఒక టాపిక్‌పై మాట్లాడమంటారు. అభ్యర్థులకు సాంకేతిక నైపుణ్యాలతోపాటు ఇతర అంశాలపై ఉన్న అవగాహనను జీడీలో ప్రధానంగా పరిశీలిస్తారు. కాబట్టి అభ్యర్థులు సమకాలీన అంశాల కోణంలో చర్చనీయాంశాల గురించి క్షుణ్నంగా అవగాహన ఏర్పరచుకోవాలి. ఆయా అంశాలపై తమకంటూ ఒక స్వీయ అభిప్రాయం కలిగుండాలి. న్యూస్ పేపర్స్ చదవటం, చర్చా కార్యక్రమాలను వీక్షించడం ద్వారా జీడీలో వాస్తవితకు దగ్గరగా అభిప్రాయాలను వెల్లడించవచ్చు. ఇది గ్రూప్ డిస్కషన్‌లో విజయానికి దోహదపడుతుంది.

పర్సనల్ ఇంటర్వ్యూ
గ్రూప్ డిస్కషన్‌లో విజయం సాధించిన అభ్యర్థులకు చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూలో రెండు రౌండ్లు ఉంటాయి.

టెక్నికల్ రౌండ్
టెక్నికల్ రౌండ్‌లో ఉద్యోగం చేయదలచుకున్న విభాగంలో ఉన్న నైపుణ్యాలు, అకడమిక్స్‌లో భాగంగా సబ్జెక్ట్‌కు సంబంధించి చేసిన ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్న్‌షిప్‌ల ద్వారా పొందిన నైపుణ్యాల గురించి ప్రశ్నిస్తారు. కాబట్టి అభ్యర్థులు బీటెక్‌లో చేసిన ప్రాజెక్ట్ వర్క్ ప్రాధాన్యం? దాని ద్వారా సంబంధిత సమస్యకు కనుగొన్న పరిష్కారం.. వంటి అంశాలను వివరించగలిగే భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇంటర్న్‌షిప్‌పై అడిగే ప్రశ్నల్లో ప్రధానంగా ఇంటర్న్‌షిప్ కంపెనీ ప్రొఫైల్ ఏంటి? ఏ విభాగంలో ఇంటర్న్‌షిప్ చేశారు? మీకు కేటాయించిన పని ఏంటి? అభ్యర్థుల పనితీరుపై టీం లీడర్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ లేదా పార్టిషిపేషన్ సర్టిఫికెట్ వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతారు.

పర్సనల్ రౌండ్
టెక్నికల్ రౌండ్‌లో రాణించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో పూర్తిగా అభ్యర్థుల వ్యక్తిగత అభిరుచి, కుటుంబ నేపథ్యం, ఇంజనీరింగ్ కోర్సులో చేరిన లక్ష్యం, వ్యక్తిగత లక్ష్యాలు వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతారు. అయితే భవిష్యత్తు లక్ష్యాలను పేర్కొనే క్రమంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. భవిష్యత్తు లక్ష్యాలను సాధించేందుకు అనుసరించనున్న వ్యూహాలపై స్పష్టత ఉండాలి. బోర్డ్ సభ్యులను మెప్పించే రీతిలో ఆయా అంశాలను చెప్పగలగాలి. ఈ దశలోనూ విజయం సాధిస్తే సంస్థను బట్టి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్) వంటి హోదాలతో పీఎస్‌యూల్లో కొలువులను ఖరారు చేసుకోవచ్చు.

సర్వీస్ అగ్రిమెంట్, ట్రైనింగ్
ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు నిర్దిష్ట కాల వ్యవధికి సర్వీస్ అగ్రిమెంట్ రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది సంస్థను బట్టి ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఉంటోంది. పీఎస్‌యూలు సర్వీస్ అగ్రిమెంట్ ఇచ్చిన అభ్యర్థులకు రెండేళ్ల శిక్షణ తర్వాత పూర్తిస్థాయి కొలువులు ఖాయం చేస్తున్నాయి. శిక్షణ సమయంలో వీరిని ట్రైనీలుగా పేర్కొంటారు. శిక్షణ తర్వాత మరో ఏడాది ప్రొబేషనరీ పిరియడ్ ఉంటుంది. పీఎస్‌యూలో ఉద్యోగం సొంతం చేసుకుంటే రూ.7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు వార్షిక ప్యాకేజీ అందుకోవచ్చు.

ప్రముఖ పీఎస్‌యూలు వెయిటేజీల వివరాలు..
మొత్తం ఎంపిక ప్రక్రియను 100 మార్కుల ప్రాతిపదికగా తీసుకుని అంశాల వారీగా పీఎస్‌యూలు ఇస్తున్న వెయిటేజీలు (శాతాల్లో)

సంస్థ

గేట్ స్కోర్

జీడీ

ఇంటర్వ్యూ

ఎన్‌టీపీసీ

85

5

10

పవర్ గ్రిడ్

85

3

12

గెయిల్

85

5

10

ఓఎన్‌జీసీ

60

5

10

ఐఓసీఎల్

75

15

10

బీహెచ్‌ఈఎల్

75

15

10

నైవేలీ లిగ్నైట్

80

10

10

హెచ్‌పీసీఎల్

85

5

10

బీపీసీఎల్

85

5

10

కేబినెట్ సెక్రటేరియట్

75

-

25

సీఈఎల్

85

3

12

ఎన్‌హెచ్‌పీసీ

80

20

20

ఆయిల్ ఇండియా

75

10

15

ఎన్‌ఎఫ్‌ఎల్

80

5

15

ఎన్‌బీసీఎల్

85

3

12


పీఎస్‌యూలు... దరఖాస్తు తేదీలు

సంస్థ

దరఖాస్తుకు చివరి తేదీ

వెబ్‌సైట్

బీపీసీఎల్

జనవరి 30

www.bpclcareers.in

ఐఓసీఎల్

ఫిబ్రవరి 7

www.iocl.co

గెయిల్

జనవరి 29

www.gailonline.com

బీహెచ్‌ఈఎల్

ఫిబ్రవరి 1

www.careers.bhel.in

ఓఎన్‌జీసీ

(జనవరి తర్వాత)

www.ongcindia.com

హెచ్‌పీసీఎల్

ఫిబ్రవరి 2

www.hindustanpetroleum.com

ఎన్‌టీపీసీ

జనవరి 29

www.ntpccareers.net

పవర్‌గ్రిడ్

ఫిబ్రవరి 29

www.powergridindia.com

ఎన్‌బీసీసీ

జనవరి 30

www.nbccindia.com

ఎన్‌ఎఫ్‌ఎల్

జనవరి 22

www.nationalfertilizers.com

నైవేలీ లిగ్నైట్

జనవరి 22

www.nlcindia.com

ఆయిల్ ఇండియా

ఫిబ్రవరి 14

www.oilindia.com

కేబినెట్ సెక్రటేరియట్

(మార్చిలో నోటిఫికేషన్)

https://cabsec.nic.in/

ఎన్‌హెచ్‌పీసీ

ఫిబ్రవరి 1

www.nhpcindia.com


ఎంపిక ప్రక్రియకు అంగీకారం
గేట్ ఫలితాలు వెల్లడయ్యాక అప్పటికే తమ నోటిఫికేషన్లను అనుసరించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల డేటా ఆధారంగా పీఎస్‌యూలు అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తాయి. ఇందులో నుంచి మలి దశ ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు ఆమోదాన్ని తెలిపిన అభ్యర్థులకు మాత్రమే జీడీ / పీఐ కాల్ వస్తుంది. కాబట్టి అభ్యర్థులు తమకు అనుకూలమైన కంపెనీలకు దరఖాస్తు చేయడం, ప్రాథమ్యాలను పేర్కొనడం కీలకం.

ఆలోచించి అంగీకారం చెప్పండి
ఇప్పటికే పలు పీఎస్‌యూలు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. త్వరలో జరిగే గేట్ ఫలితాల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి వ్యక్తిగతంగా వారికి ఆ విషయాన్ని తెలియజేస్తాయి. ఈ నేపథ్యంలో ఒకటికి మించి ఎక్కువ పీఎస్‌యూలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సమ్మతి తెలిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సదరు సంస్థ నిర్వహించే మలి దశ ఎంపిక ప్రక్రియలో అప్పటికే విజయం సాధించిన వారిని సంప్రదించి వివరాలు సేకరించాలి. అంతేకాకుండా తమ అభిరుచి, ఆసక్తికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.
- కె.శ్రీధర్, గేట్ ఫోరమ్

టెక్నికల్ రౌండ్‌లో..
పీఎస్‌యూ ఇంటర్వ్యూలకు సంబంధించి అభ్యర్థులు టెక్నికల్ రౌండ్‌లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా డొమైన్ ఏరియా నుంచి అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా సన్నద్ధం కావాలి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ మాదిరిగా కాకుండా విశ్లేషణాత్మకంగా సిద్ధం కావాలి. ముఖ్యంగా ప్రాజెక్ట్ వర్క్‌ను వివరించటంలో మెళకువలు నేర్చుకోవాలి. అప్పుడే టెక్నికల్ రౌండ్‌ను సులువుగా పూర్తి చేసుకోవచ్చు.
- ఆర్.శ్రీకాంత్, గేట్-2013 విజేత, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఇంజనీర్.
Published date : 22 Jan 2016 11:00AM

Photo Stories