Skip to main content

కొలువు కొట్టేదేలా...?

ఓవైపు..బీటెక్, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులతో పాటు సంప్రదాయ డిగ్రీలు పూర్తి చేసుకుని మరికొన్ని నెలల్లో లక్షల మంది జాబ్ మార్కెట్లో అడుగు పెట్టనున్నారు.
మరోవైపు..ఏటా దాదాపు 13 మిలియన్ల మంది కొత్తగా జాబ్ మార్కెట్‌లోకి వస్తుంటే.. వ్యవస్థీకృత రంగంలో అందు బాటులోకి వస్తున్న ఉద్యోగాల సంఖ్య మాత్రం 2-3 లక్షలు దాటడం లేదు.

ఇంకోవైపు.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు నియామకాల తీరు ఎలా ఉంది? రానున్న రోజుల్లో ఎలా ఉండే అవకాశముంది..? కొలువు చేజిక్కాలంటే అవసరమైన నైపుణ్యాలేమిటి..? ఎలాంటి పరిజ్ఞానం సొంతం చేసుకోవాలి..? కొత్తగా ఉద్యోగ వేటలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న అభ్యర్థుల్లో ఇలా అనేకానేక సందేహాలు....ఈ నేపథ్యంలో ప్రధాన రంగాల్లో ప్రథమార్థం (జనవరినుంచి జూన్) వరకు కనిపించిన నియామక ధోరణులు.. రానున్న రోజుల్లో పరిస్థితిపై విశ్లేషణ..

ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)...
  • జాబ్ మార్కెట్ అనగానే ప్రస్తుతం ఎలాంటి సందేహం లేకుండా ఠక్కున గుర్తొచ్చే రంగం ఇది. నియామకాల సంఖ్యపరంగా మాత్రం ఈ ప్రథమార్థం మందకొడిగానే సాగింది.
  • నిపుణుల అభిప్రాయం ప్రకారం అప్లికేషన్ ప్రోగ్రామింగ్, ఐటీ కన్సల్టెంట్స్, సిస్టమ్ అనలిస్ట్ జాబ్ ప్రొఫైల్స్‌లో కొంతమేర నియామకాలు జరిగాయి. మొత్తంమీద సగటున మూడు శాతం మాత్రమే వృద్ధి కనిపించింది.
  • ముఖ్యంగా ప్రాథమిక స్థాయి (ఎంట్రీ లెవల్) ఉద్యోగాల విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరించాయి. ఇదే సమయంలో మిడిల్, సీనియర్ స్థాయిల్లో నైపుణ్యాలున్నవారు అవకాశాలు అందుకునే వీలు చిక్కింది.
  • రానున్న రోజుల్లో పరిస్థితి కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. పలు అంతర్జాతీయ ఐటీ సంస్థలు భారత్‌లో ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సీఎస్‌ఈ అభ్యర్థులు ఆశావహంగా ఉండొచ్చు.

టెలికాం :
  1. మిగతావాటితో పోల్చితే టెలికాం రంగం పర్వాలేదనిపించేలానే నిలిచింది. ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్, డిజైన్ ఆర్కిటెక్ట్‌లకు ప్రాథమిక స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఇదే ధోరణి రానున్న రోజుల్లోనూ కనిపించొచ్చు.
  2. ఎలక్ట్రానిక్స్ అభ్యర్థులకు టెలికాంతో పాటు.. ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ, ఆటో మొబైల్స్ రంగాల్లోనూ అవకాశాలు లభించాయి. జూనియర్ లెవల్‌లో పీఎస్‌యూలు ప్రధాన వేదికలుగా నిలిచాయి.
  3. వీటితోపాటు ప్రైవేటు టెలికాం సంస్థల్లో సగటున నెలకు రూ.20 వేల జీతంతో ప్రాథమిక స్థాయిలో ట్రైనీ ఇంజనీర్స్, ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు లభించాయి.

ఆటోమొబైల్ ....
  • నేరుగా నియామకాలు చేపట్టకపోయినా.. దీనికి అనుబంధంగా పేర్కొనే ఉత్పత్తి రంగంలో పది శాతం కొత్తవారి భర్తీ జరిగింది. గతంతో పోల్చితే ఆశించిన స్థాయిలో లేకున్నా తయారీ, ఉత్పత్తి, నిర్వహణ అంశాల్లో ప్రాథమిక స్థాయిలో కొంతమేర అవకాశాలు లభిం చాయి.
  • మౌలిక సదుపాయాల రంగంలో తయారీ, డిజైన్, కన్‌స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో జూనియర్ స్థాయి నుంచి సీనియర్ వరకు మంచి నైపుణ్యాలున్నవారికి కొలువులు దక్కాయి.
  • ఆటోమొబైల్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో రానున్న ఆరు నెలల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాల పరిస్థితి స్థిరంగా ఉండొచ్చు. స్థూలంగా చెప్పాలంటే.. సివిల్ ఇంజనీర్లకు మౌలిక రంగం కొంతమేర ఉపాధి కల్పించింది.

బ్యాంకింగ్, ఫైనాన్షియల్-ఇన్సూరెన్స్...
  1. గతంతో పోల్చితే ఈ ఏడాది ప్రథమార్థంలో నియామకాలు అంత ఆశాజనకంగా లేవనే చెప్పొచ్చు.
  2. జీఎస్‌టీ, నగదు రహిత లావాదేవీల కారణంగా కోర్ జాబ్ ప్రొఫైల్స్‌తో పాటు వివిధ విభాగాల్లో సగటున 20 శాతం మాత్రమే నియామకాలు జరిగాయి.
  3. కోర్ బ్యాంకింగ్ ప్రొఫెషనల్స్‌తో పాటు ఐటీ నిపుణులకు ఈ రంగంలో చోటు లభించింది. స్పెషలైజ్డ్‌విగా పేర్కొనే ఫైనాన్షియల్ ఎనలిస్ట్‌లు, క్రెడిట్ అనలిస్ట్ జాబ్స్‌కు కొంతమేర డిమాండ్ నెలకొంది.
  4. ఎంబీఏ ఫైనాన్స్, అకౌంటింగ్, చార్టర్డ్ అకౌంటెన్సీ చేసిన అభ్యర్థులకు కలిసొచ్చింది. రానున్న రోజుల్లో నియామకాలు కొంత తగ్గుముఖం పడతాయని యాంత్రీకరణ ప్రభావమే ఇందుకు ముఖ్య కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్...
  • ముఖ్యంగా బిజినెస్ మేనేజ్‌మెంట్, ప్రొడక్షన్, లాజిస్టిక్స్, డేటా మేనేజ్‌మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ నైపుణ్యాలున్నవారు అవకాశాలు అందుకునే వీలు కలిగింది.
  • ఈ విభాగంలో ఈ-కామర్స్ కార్యకలాపాలు విస్తృతమైన నేపథ్యంలో ఐటీ నిపుణులకు ముఖ్యంగా బిగ్ డేటా నిపుణులకు డిమాండ్ ఏర్పడింది. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లోనూ కొనసాగుతుందని.. అయితే అది మెట్రో నగరాలకే పరిమితమవుతుందని నిపుణుల అంచనా.

రిటైల్.. మిడిల్ లెవల్ :
  1. కొంత పర్వాలేదనిపించినప్పటికీ.. అవి మధ్య స్థాయి నిపుణులకే ఉండటం గమనార్హం. టైర్ 2 నగరాల్లో సీనియర్ లెవల్ నియామకాలే ఎక్కువగా నమోదయ్యాయి.
  2. మధ్య స్థాయిలో గతేడాదితో పోల్చితే 45 శాతం మేరకు నియామకాలు జరిగాయి. జూనియర్ స్థాయిలో మాత్రం ఆ సంఖ్య పది శాతానికే పరిమితమైంది.
  3. ఇవి కూడా రిటైల్ సేల్స్, ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్, కస్టమర్ సపోర్ట్ వంటి వాటిలోనే ఉన్నాయి. మందకొడి పరిస్థితి మరికొంత కాలం కొనసాగనుందని.. ఈ-కామర్స్ వెబ్‌సైట్లు కొంతమేరకు వెనుకబడటం ఇందుకు కారణంగా చెబుతున్నారు.

డిగ్రీతో అవకాశాలు...
  • బీఏ, బీకాం, బీఎస్‌ఈ వంటి సంప్రదాయ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు ఎక్కువగా బీపీఓ, బీపీఎం వంటి ఐటీఈఎస్‌లలో ఉద్యోగాలు లభించాయి.
  • 15 ఏళ్లుగా అవకాశాలు కల్పిస్తూ వచ్చిన ఐటీబీపీవో రంగంలో ఇటీవల అత్యంత నైపుణ్యం ఉన్నవారికే కొలువులు దక్కాయి.
  • మరోవైపు బీకాం అభ్యర్థులు ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ, టెలికాం విభాగాల్లోనూ జాబ్ ఆఫర్స్‌కు ప్రయత్నిస్తున్నారు. వీరు ప్రాథమిక స్థాయిలో అకౌంట్స్ అనలిస్ట్, క్రెడిట్ అనలిస్ట్ వంటి అవకాశాలు అందుకున్నారు. బీఎస్సీ పూర్తిచేసిన వారు నైపుణ్యం ఉంటే మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థల్లో ఉద్యోగాలు సొంతం చేసుకునే వీలుంది.

మెట్రో నగరాలకే పరిమితం...
ఈ సరళిని పరిశీలిస్తే.. కొలువులన్నీ మెట్రో నగరాలకే పరిమితం కావడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం కంపెనీల కేంద్ర స్థానాలు అక్కడ ఉండటమే. అభ్యర్థుల కోణంలో చూస్తే అకడమిక్ స్థాయిలో లభిస్తున్న నైపుణ్యాలు, కంపెనీలు కోరుకునే సాఫ్ట్ స్కిల్స్‌లో ముందంజలో నిలవడంతో మెట్రో నగరాల్లోని ఇన్‌స్టిట్యూట్‌లలో చదివినవారికే కొంత ప్రయోజనం కలిగింది.

కంపెనీలు కోరుకుంటున్న నైపుణ్యాలివే...
  • నాలెడ్జ్ అప్‌డేషన్
  • రెగ్యులర్ లెర్నింగ్
  • న్యూ టెక్నాలజీస్ అడాప్షన్
  • టీమ్ వర్కింగ్ కల్చర్
  • ఇంటెగ్రిటీ
  • కమిట్‌మెంట్ -ఐఓటీ స్కిల్స్
  • అనలిటికల్ స్కిల్స్
  • పాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్
  • క్రిటికల్ థింకింగ్
  • ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్

468 మిలియన్లు: ఆర్థిక సర్వే 2016-17 ప్రకారం దేశంలోని వర్క్‌ఫోర్స్
13 మిలియన్లు: ఇండస్ట్రీ వర్గాల అంచనా మేరకు దేశంలో ఏటా కొత్తగా జాబ్ మార్కెట్‌లో అడుగుపెట్టేవారి సంఖ్య
5 మిలియన్లు: వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల్లో మొత్తంగా ఏటా అందుబాటులోకే వచ్చే అవకాశమున్న ఉద్యోగాలు
8 మిలియన్లు: ఏటా జాబ్ మార్కెట్‌లో అడుగుపెట్టేవారికి.. అందుబాటులోకి వస్తున్న ఉద్యోగాల మధ్య అంతరాన్ని పరిగణనలోకి తీసుకుంటే నిరుద్యోగులుగా మిగిలిపోయే ఆస్కారం ఉన్నవారు.

సరికొత్త నైపుణ్యాలతో..
రానున్న రోజుల్లో నియామకాలు మందకొడిగా సాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అందుబాటులో ఉన్న కొద్దిపాటి కొలువులను సొంతం చేసుకోవాలంటే.. అభ్యర్థులు తమ డొమైన్ ఏరియాస్‌కు సంబంధించి సరికొత్త నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. క్లాస్ రూం పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ..కొత్త సాంకేతికతను నేర్చుకోవడంపై దృష్టిపెట్టాలి.
-ఎ.రాజ్‌కుమార్, హెచ్‌ఆర్ డెరైక్టర్- ర్యాండ్‌స్టాండ్ ఇండియా

అకడమిక్స్‌తో పాటు ఎన్నో...
ప్రస్తుతం కంపెనీలు అభ్యర్థుల నుంచి అకడమిక్స్‌తో పాటు మరెన్నో నైపుణ్యాలను కోరుకుంటున్నాయి. ప్రధానంగా ఆటోమేషన్, బిగ్ డేటా, అప్లికేషన్ ఓరియెంటేషన్‌పై దృష్టిసారిస్తున్నాయి. ఐటీ, సీఎస్‌ఈ వంటి సాఫ్ట్‌వేర్ సంబంధిత విభాగాలతో పాటు కోర్ బ్రాంచ్‌లుగా భావించే సివిల్, మెకానికల్ తదితరవాటిలోనూ ఇవి కీలకంగా మారాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు నిరంతరం మెరుగుపడుతూ ముందుకు సాగాలి.
-ప్రొఫెసర్.బి.వెంకటేశం, ఐఐటీహెచ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్
Published date : 27 Sep 2017 11:39AM

Photo Stories