Skip to main content

కెరీర్‌కు ఇంధనం.. పెట్రోలియం ఇంజనీరింగ్‌

మారుతున్న ప్రాధమ్యాలు.. పెరుగుతున్న అవసరాలు వెరసి వివిధ రంగాల్లో కాలక్రమేణా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. అదే సమయంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని వాటిని సమర్థంగా నిర్వహించే మానవ వనరులు కూడా ఎంతో అవసరం.. అటువంటి మానవ వనరులను తీర్చిదిద్దడంలో శాస్త్ర సాంకేతిక విద్య ప్రాధాన్యత ఎంతో.. ఆ మేరకు ఎప్పటికప్పుడు కరిక్యులంను రూపొందించడంతోపాటు ఎన్నో నూతన కోర్సులను శాస్త్ర సాంకేతిక విద్యలో ప్రవేశ పెడుతున్నారు.. అటువంటి కోర్సుల్లో పెట్రోలియం/ఎనర్జీ స్టడీస్ ఒకటి.

ద్విచక్ర వాహనం నుంచి విమానం వరకు ఏ వాహనం నడవాలన్నా.. ఇంట్లో వాడే గ్యాస్ స్టౌవ్ నుంచి ఏసీ వరకు ఇలా ఏది పని చేయాలన్నా కీలక పాత్ర పోషించేది ఇంధనం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఇంధనం లభించని రోజు ప్రపంచమే ఆగిపోతుందేమో? అనే అంతగా మానవ దైనందిన జీవితాన్ని ఇంధన రంగం ప్రభావితం చేస్తోంది. అటువంటి ఇంధన రంగం గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసే ఉద్దేశంతో పెట్రోలియం, ఎనర్జీ విభాగంలో పలు కోర్సులను ప్రవేశ పెట్టారు.

బ్యాచిలర్ డిగ్రీ నుంచే
అకడమిక్‌గా పెట్రోలియంకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్‌లో ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్‌గా పెట్రోలియం కోర్సులను అందిస్తున్నారు. వీటిని బీటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్/కెమికల్ అండ్ పెట్రోలియం)గా వ్యవహరిస్తున్నారు. ఇంటర్మీడియెట్/తత్సమానం (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) సబ్జెక్ట్‌లతో పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. డీప్‌వాటర్ ఇంజనీరింగ్, సబ్‌సీ టెక్నాలజీ వంటి కోర్సులను బీటెక్‌కు అనుబంధంగా చేయవచ్చు. బీటెక్ తర్వాత ఆసక్తి ఉంటే సంబంధిత లేదా అనుబంధ విభాగాల్లో ఎంటెక్/పీహెచ్‌డీ చేయవచ్చు. ఈ క్రమంలో ఎంటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్), ఎంటెక్ (గ్యాస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ), ఎంటెక్ (పైప్ లైన్ ఇంజనీరింగ్), ఎంబీఎ (పెట్రోలియం ఇంజనీరింగ్, గ్యాస్ మేనేజ్‌మెంట్) వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

విధులు
పెట్రోలియం ఇంజనీరింగ్ అభ్యర్థులు పెట్రోలియం ప్రొడక్షన్, ప్రాసెసింగ్ సంబంధిత విధులు నిర్వహిస్తుంటారు. చమురు అన్వేషణకు సంబంధించి ఒక ప్రదేశం/ వనరులు లభ్యమైనప్పుడు వీరి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో వీరు జియాలజిస్ట్‌లతో కలిసి సదరు నేల లేదా ఆయిల్ రిజర్వాయర్ భౌగోళిక లక్షణాలను విశ్లేషిస్తారు. వాటి ఆధారంగా పెట్రోలియం వెలికితీయడానికి అవసరమైన డ్రిల్లింగ్ పద్ధతులను రూపొందిస్తారు. అంతేకాకుండా సంబంధిత పరికరాలను కూడా తయారు చేస్తుంటారు. పెట్రోలియం ఇంజనీర్లకు అనుంబంధ అంశాలపై సమగ్ర అవగాహన ఉండాలి. ఈ క్రమంలో జియో ఫిజిక్స్, పెట్రోలియం జియాలజీ, డ్రిల్లింగ్, ఎకనామిక్స్, రిజర్వాయర్ ఇంజనీరింగ్, వెల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ లైఫ్ సిస్టమ్స్ వంటి అంశాలపై అవగాహన తప్పనిసరి.

పెరుగుతున్న అవకాశాలు
పెట్రోలియం ఇంజనీర్ అభ్యర్థులకు అవకాశాలు కొదవలేదని చెప్పొచ్చు. ఎందుకంటే పెట్రోలియం, సంబంధిత ఉత్పత్తులకు డిమాండ్ పెరగడమే తప్ప తగ్గడమే అనే మాట తలెత్తదు. డిమాండ్ పెరగడం అంటే తదనుగుణంగా నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతుందనే భావించాలి. కాబట్టి ఈ కోర్సును పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం ఖాయమని చెప్పొచ్చు. వీరు ఆయిల్ కంపెనీలు, గ్యాస్ పరిశ్రమలు, మైనింగ్ కంపెనీలు తదితరాల్లో అవకాశాలను దక్కించుకోవచ్చు. ప్రైస్ వాటర్ కూపర్ కన్సల్టెన్సీ సంస్థ అంచనా మేరకు వచ్చే ఐదేళ్లలో ఈ రంగలో దాదాపు 36 వేల నిపుణుల అవసరం ఏర్పడనుంది. నైపుణ్యం, అనుభవం మేరకు ఈ రంగంలో వివిధ రకాల జాబ్ ప్రొఫైల్స్ ఉంటాయి. అవి..రిజర్వాయర్ ఇంజనీర్, టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్, సీనియర్ జియో సైంటిస్ట్, డ్రిల్ బిట్ సిస్టమ్ ఫీల్డ్ ఇంజనీర్, పెట్రోలియం టెక్నాలజిస్ట్, డ్రిల్లింగ్ ఇంజనీర్, అనలిస్ట్, ప్రాసెస్ ఇంజనీర్, రిజర్వాయర్ పెట్రో ఫిజిక్సిస్ట్, టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్ తదితరాలు.

విదేశాల్లో
పెట్రోలియంను బ్లాక్ గోల్డ్‌గా పేర్కొంటారు. పారిశ్రామికీకరణ, ఆర్థిక రంగం వృద్ధి బాటలో పయనించడంలో పెట్రోలియం పాత్ర ఎంతో కీలకం. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా చమురు అన్వేషణను పెద్ద ఎత్తున్న సాగిస్తున్న ప్రస్తుత తరుణంలో పెట్రోలియం ఇంజనీరింగ్ అభ్యర్థులకు విదేశీ అవకాశాలు కూడా పుష్కలం. భారతీయ కంపెనీలు కూడా విదేశాల్లో పెట్రోలియం అన్వేషణలో నిమగ్నమవ్వడం కూడా ఇందుకు కారణంగా పేర్కొనవచ్చు. రష్యా, గల్ఫ్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్ట్ కంట్రీస్ (ఓపెక్) ఇందుకు చక్కని వేదికలుగా నిలుస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాలు, ఆఫ్రికా, సౌత్ అమెరికా దేశాల్లో అధిక పే ప్యాకేజ్‌లు లభిస్తున్నాయి.

వేతనాలు
వేతనాల విషయానికొస్తే..సాఫ్ట్‌వేర్ రంగానికి దీటుగా జీతా లు అందించే రంగాల్లో ఇది ఒకటి. ఫ్రెష్ గ్రాడ్యుయేట్‌కు కంపెనీని బట్టి వార్షిక సరాసరి వేతనం రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల మధ్య ఉంటోంది. కొన్ని సంస్థలు రూ. 6 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నాయి. అత్యధికంగా రూ. 30 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసే సంస్థలు కూడా ఉన్నాయి. అదే అంతర్జాతీయ సంస్థల్లోనైతే సంవత్సరానికి లక్ష డాలర్లు కూడా అందుకునే అవకాశం ఉంది.

ప్రత్యామ్నాయం
పెరుగుతున్న ఇంధన అవసరాలు ఒక వైపు, మరో వైపు తరుగుతున్న వనరుల ఫలితంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దాంతో జాబ్ మార్కెట్‌లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల (రెన్యూవబుల్ ఎనర్జీ) పట్ల అవగాహన ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రెన్యూవబుల్ ఎనర్జీకి అకడమిక్ సబ్జెక్ట్‌లలో స్థానం కల్పించారు. కొన్ని యూనివర్సిటీలు ఎనర్జీ స్టడీస్-ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో భాగంగా ఈ సబ్జెక్ట్‌ను బోధిస్తున్నాయి. మరికొన్ని యూనివర్సిటీలు పీజీలో స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి. ఇందులో సోలార్ ఎనర్జీ, బయోమాస్, విండ్ ఎనర్జీ, టైడ్ అండ్ వేవ్ ఎనర్జీ, ఫ్యూయల్ సెల్స్, హైడ్రోజన్ ఎనర్జీ, ఎనర్జీ మేనేజ్‌మెంట్, న్యూక్లియర్ ఎనర్జీ, ఎనర్జీ జనరేషన్, ఎనర్జీ పాలసీస్ వంటి అంశాలను బోధిస్తారు. సంబంధిత కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు సోలార్-విండ్-న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, బయోమాస్ కంపెనీలు, ఆర్కిటెక్చర్ ఫర్మ్స్, ఎన్‌జీవో, ఇంధనానికి సంబంధించిన ప్రభుత్వ శాఖల్లో అవకాశాలు ఉంటాయి.

అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
  • యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఎన ర్జీ అండ్ స్టడీస్-
    డెహ్రాడూన్; కోర్సు:
    ఎంటెక్ (పవర్ సిస్టమ్స్)
    వెబ్‌సైట్: www.upes.ac.in
  • అమిటీ యూనివర్సిటీ-నోయిడా
    కోర్సు:
    ఎంటెక్ (సోలార్ అండ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ)
    వెబ్‌సైట్: www.amity.edu
  • మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-భోపాల్;
    కోర్సు: ఎంటెక్ (రెన్యూవబుల్ ఎనర్జీ)
    వెబ్‌సైట్: www.manit.ac.in
  • టెరీ యూనివర్సిటీ-ఢిల్లీ;
    కోర్సు:
    ఎంటెక్
    (రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ మేనేజ్‌మెంట్)
    వెబ్‌సైట్: www.teriuniversity.ac.in
టాప్ రిక్రూటర్స్
ఓఎన్‌జీసీ, గెయిల్, ఐఓసీ, షెల్, రిలయన్స్, హెచ్‌పీసీఎల్ ఎస్సార్, కెయిర్న్ ఎనర్జీ, బ్రిటిష్ పెట్రోలియం

పముఖ సంస్థలు
  • ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్-ధన్‌బాద్
    కోర్సులు:
    బీటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్), బీటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్ విత్ ఎంటెక్ ఇన్ పెట్రోలియం మేనేజ్‌మెంట్, డ్యూయల్ డిగ్రీ)
    ప్రవేశం: జేఈఈ-అడ్వాన్స్‌డ్ ర్యాంక్ ఆధారంగా
    వెబ్‌సైట్: www.ismdhanbad.ac.in
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే
    కోర్సు: బీటెక్ ఎనర్జీ ఇంజనీరింగ్ విత్ ఎంటెక్ ఇన్ ఎనర్జీ సిస్టమ్స్ ఇంజనీరింగ్ (డ్యూయల్ డిగ్రీ)
    వెబ్‌సైట్: www.iitb.ac.in
  • యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్- డెహ్రాడూన్
    పెట్రోలియంకు సంబంధించి స్పెషలైజేషన్స్‌తో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ కోర్సులు
    ప్రవేశం: ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్ష, గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా
  • రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ-రాయ్‌బరేలీ (ఉత్తరప్రదేశ్)
    కోర్సు:
    బీటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్)
    ప్రవేశం: జేఈఈ-అడ్వాన్స్‌డ్ ర్యాంక్ ఆధారంగా
    వెబ్‌సైట్: www.rgipt.ac.in
  • పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ-గాంధీనగర్
    కోర్సు:
    బీటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్)
    వెబ్‌సైట్: pdpu.ac.in
  • జేఎన్‌టీయూ-కాకినాడ
    కోర్సు:
    బీటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్)
    ప్రవేశం: ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా
    వెబ్‌సైట్: www.jntuk.edu.in
  • ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
    కోర్సు:
    బీటెక్ (కెమికల్ ఇంజనీరింగ్ విత్ పెట్రోలియం ఇంజనీరింగ్, ఎలెక్టివ్‌గా)
    ప్రవేశం: ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా
    వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
Bavitha కేజీ బేసిన్‌లో పెట్రోలియం, సహజవాయువు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్, గెయిల్, ఆయిల్ ఇండియా, కేన్ ఇంజనీరింగ్ వంటి ప్రముఖ సంస్థలు సముద్రం డీప్‌వాటర్‌పోర్టు నుంచి ఆయిల్, గ్యాస్‌ను వెలికితీస్తున్నాయి. వీటికి అనుబంధంగా స్లమ్‌బర్గ్, హాలీబాటన్, వెదర్‌ఫర్డ్, యాసర్ సొల్యూషన్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు సంబంధిత పనుల్లో పాల్గొంటున్నాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అవసరమైన మానవ వనరులను అందించడం కోసం పెట్రోలియం ఇంజనీరింగ్‌ను ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లపై పట్టు ఉండాలి. పెట్రోలియం, పెట్రోకెమికల్స్‌పై అవగాహన, ఆసక్తి అవసరం. సృజనాత్మకత, పరిశోధన పట్ల ఆసక్తి, కష్టపడే తత్వం కలిగి ఉండాలి. కోర్సు పూర్తి చేసిన తరువాత భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఆయిల్ ఇండియా లిమిటెడ్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వంటి ప్రభుత్వరంగ సంస్థల్లోను, రిలయన్స్, కేన్ ఇంజనీరింగ్, జిందాల్, టాటా పెట్రోల్, హిందుస్థాన్ పెట్రోల్, జాన్ ఇంజనీరింగ్, పెట్రోనెట్, మిచెల్ డ్రిల్లింగ్, టోటల్ ఆయిల్ ఇండియా లిమిటెడ్, డీప్ డ్రిల్లింగ్, స్లంబర్గ్, హాలీబాటన్, వెదర్‌పోర్డ్ వంటి ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో రూ. 6 నుంచి రూ. 12 లక్షలు వరకు అత్యధిక వేతనంగాను, రూ. 2 నుంచి రూ. 4 లక్షల వరకు అత్యల్ప వేతనంగా అందిస్తున్నాయి. రూ.30 లక్షల వరకు కూడా ఆఫర్ చేసే కంపెనీలు ఉన్నాయి. ఈ కోర్సులు చేసిన విద్యార్థులకు గల్ఫ్ దేశాల్లో విరివిగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. దేశీయంగా ఓఎన్‌జీసీ సంస్థ ఈ రంగానికి సంబంధించి టాప్ రిక్రూటర్‌గా నిలుస్తోంది. ఈ సంస్థ ఏడాదికి 800 నుంచి 1000 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది.
Published date : 27 Jun 2014 11:11AM

Photo Stories