Skip to main content

Job Opportunities : ఎలక్ట్రిక్‌ వాహన రంగం.. కొలువుల తరంగం.. ఈ కోర్సులు చదివితే..

ఈవీ.. ఎలక్ట్రిక్‌ వాహన రంగం. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. మన దేశంలోనూ విద్యుత్‌ వాహనాల సంఖ్య పెరుగుతోంది! ఫలితంగా ఈ రంగంలో వేల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్న పరిస్థితి! ఈ నేపథ్యంలో.. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో తాజా ట్రెండ్స్, కెరీర్‌ అవకాశాలు, అవసరమైన నైపుణ్యాలు తదితర అంశాలపై విశ్లేషణ..

శిలాజ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్‌తో వాతావరణానికి నష్టం జరుగుతోంది. అందుకే పర్యావరణాన్ని కాపాడే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ వాహనాల తయారీని, వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. పలు రాయితీలు సైతం కల్పిస్తోంది. దీంతో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ రంగం ఊపందుకుంది. భారత ఈవీ రంగం 2019–30 మధ్య కాలంలో.. 43శాతానికి పైగా వృద్ధి నమోదు చేసుకుంటుందని అంచనా. ఇదే ఇప్పుడు యువతకు చక్కటి కెరీర్‌ అవకాశంగా మారుతోంది. 

ప్రస్తుతం దేశంలో దాదాపు 15 లక్షల ఎలక్ట్రిక్‌ వాహనాలు.. : 
విద్యుత్‌ వాహన తయారీ రంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాల కారణంగా.. 2030 నాటికి ఈ రంగం మార్కెట్‌ విలువ 15 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం దేశంలో దాదాపు 15 లక్షల ఎలక్ట్రిక్‌ వాహనాలు వినియోగంలో ఉండగా.. ఆ సంఖ్యను 2030 నాటికి 30 శాతం మేరకు పెంచాలనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఇప్పటికే పలు సంస్థలు భారీగా.. : 

EV

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహన తయారీ రంగంపై అయిదేళ్ల క్రితమే ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ హైబ్రీడ్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఇన్‌ ఇండియా, నేషనల్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ మిషన్‌ ప్లాన్‌లను కూడా ప్రవేశ పెట్టింది. దీంతో..ఆటోమోటివ్స్‌ విభాగంలో అంతర్జాతీయంగా అయిదో స్థానంలో ఉన్న మన దేశంలో ఇప్పటికే పలు ఆటోమొబైల్‌ తయారీ సంస్థలు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి పూనుకున్నాయి. అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని..ఆర్‌ అండ్‌ డీలో నిమగ్నమయ్యాయి. ఇక ప్రభుత్వ రవాణా రంగంలో ఇప్పటికే ఎలక్ట్రిక్‌ బస్సులు రోడ్ల మీదికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. 2025 నాటికి ఎలక్ట్రిక్‌ వాహన తయారీ రంగంలో ప్రపంచంలోనే భారత్‌ మూడో స్థానానికి చేరుకుంటుందని అంచనా.

కొత్త స్టార్టప్‌ సంస్థలు..
ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇచ్చే క్రమంలో.. ఈ విభాగంలోని స్టార్టప్‌ సంస్థలకు కూడా ప్రభుత్వ మద్దతు లభిస్తోంది. ఫలితంగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి కొత్తగా.. 904 మిలియన్‌ డాలర్లకు సమానమైన 26 కొత్త స్టార్టప్‌ సంస్థలు ఆవిష్కృతం అయ్యాయి.

ఉద్యోగావకాశాలు ఇవే..
ఎలక్ట్రిక్‌ వాహన తయారీ రంగంలో ప్రొడక్ట్‌ ఆవిష్కరణకు మూలమైన డిజైనింగ్‌ నుంచి సదరు ప్రొడక్ట్‌ రోడ్‌ మీదకి వచ్చాక చార్జింగ్‌ వరకు వేల సంఖ్యలో అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఒక ఎలక్ట్రిక్‌ బస్‌ తయారీకి సగటున 12 నుంచి 15 మంది అవసరం అవుతారు. ఈవీ రంగంలో ప్రధానంగా కనిపించే జాబ్‌

ప్రొఫైల్స్‌ వివరాలు..
☛ ఆర్‌ అండ్‌ డీ సైంటిస్ట్స్‌: ఒక ప్రొడక్ట్‌ రూపొందించే విషయంలో రీసెర్చ్‌ స్థాయిలో ఉన్నత స్థాయి హోదాగా దీన్ని పేర్కొనొచ్చు. రీసెర్చ్‌కు సంబంధించిన కొలువులకు పీహెచ్‌డీ ఉంటేనే సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి.
☛ కెమికల్‌ ఇంజనీర్స్‌/కెమిస్ట్స్‌: ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వినియోగించే బ్యాటరీలకు సంబంధించిన విధులు నిర్వహిస్తారు.
☛ ఎలక్ట్రానిక్‌ ఇంజనీర్స్‌: ఒక కొత్త ప్రొడక్ట్‌ను డిజైన్‌ చేయడం, డెవలప్‌ చేయడం వంటి విభాగాల్లో ఎలక్ట్రానిక్‌ ఇంజనీర్లదే కీలక పాత్ర.
☛ ఇండస్ట్రియల్‌ ఇంజనీర్స్‌: ప్రొడక్ట్‌ డిజైన్‌కు ఆమోదం లభించాక.. దాన్ని ఉత్పత్తి చేసే క్రమంలో క్షేత్ర స్థాయిలో విధుల నిర్వహణ, మెటీరియల్, మ్యాన్‌ పవర్‌ అనుసంధానం వంటి విషయాల్లో కీలకంగా నిలుస్తున్నారు.
☛ మెకానికల్‌ ఇంజనీర్స్‌: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలోనూ మెకానికల్‌ ఇంజనీర్లు పాత్ర కీలకంగా ఉంది. ఎందుకంటే.. ప్రొడక్ట్‌ను డిజైన్‌ చేయడంలో మెకానికల్‌ ఇంజనీర్ల సహకారం తప్పనిసరి.
☛ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌: ఆధునిక టెక్నాలజీతో రూపొందుతున్న వాహనాలన్నీ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ ఆధారంగానే అని తెలిసిందే. ఇదే కోవలోనే ఈవీలు కూడా సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా పని చేయనున్నాయి. ముఖ్యంగా ప్రయాణ సమయంలో ఛార్జింగ్‌ స్థాయి, ఎప్పుడు ఛార్జింగ్‌ చేయాలి తదితర అంశాలు కనిపించే విధంగా ఆన్‌బోర్డ్‌ కంప్యూటర్లను ఈవీల్లో పొందుపరుస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్స్‌ను రూపొందించేందుకు సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌ అవసరం ఏర్పడుతోంది. దీనికోసం ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్, ఆపై స్థాయి అభ్యర్థులను సంస్థలు నియమించుకుంటున్నాయి.

మరెన్నో విభాగాలు..
ప్రొడక్ట్‌ తయారీలో క్షేత్ర స్థాయిలో పలు విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అవి.. ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ ఎక్విప్‌మెంట్‌ అసెంబ్లర్స్‌; ఎలక్ట్రోమెకానికల్‌ ఎక్విప్‌మెంట్‌ అసెంబ్లర్స్‌;ఇంజన్‌ అండ్‌ అదర్‌ మెషీన్‌ అసెంబ్లర్స్‌;టీమ్‌ అసెంబ్లర్స్‌; కంప్యూటర్‌ కంట్రోల్డ్‌ మెషీన్‌ టూల్ ఆపరేటర్స్‌; మెషినిస్ట్స్, ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ సూపర్‌వైజర్స్‌/మేనేజర్స్‌. ఈ విభాగాల్లో డిప్లొమా స్థాయి అర్హతలున్న వారికి అవకాశాలు లభిస్తాయి.

కస్టమర్‌ సర్వీస్‌ :
ఒక ప్రొడక్ట్‌ (ఎలక్ట్రిక్‌ వాహనం)ను కొనుగోలు చేసేందుకు వచ్చే వినియోగదారులకు సేవలందించే క్రమంలో సంప్రదాయ కొలువులు కూడా లభిస్తున్నాయి. అవి.. రిటెయిల్‌ సేల్స్‌ పర్సన్స్‌; కస్టమర్‌ సర్వీస్‌ రిప్రజెంటేటివ్స్‌; షో రూం మేనేజర్స్‌.
ఈ విభాగాల్లో డిగ్రీ అర్హత ఉండి, సర్వీస్‌ ఓరియెంటేషన్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉన్న వారు సరితూగుతారు.

ఆఫ్టర్‌ సేల్స్‌ విభాగం :
తయారీనే కాకుండా ఒక ప్రొడక్ట్‌ను విక్రయించిన తర్వాత సదరు ప్రొడక్ట్‌ సర్వీసింగ్‌కు సంబంధించి కూడా పలు విభాగాల్లో ఉద్యోగుల అవసరం ఉంటుంది. అవి.. ఆటోమోటివ్‌ సర్వీస్‌ టెక్నీషియన్స్‌ అండ్‌ మెకానిక్స్‌; ఎలక్ట్రిక్‌ పవర్‌ లైన్‌ ఇన్‌స్టాలర్స్‌ అండ్‌ రిపెయిరర్స్‌; ఎలక్ట్రిషియన్స్‌; చార్జింగ్‌ వర్కర్స్‌. ఐటీఐ లేదా సంబంధిత విభాగాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన వారు ఈ కొలువులు సొంతం చేసుకోవచ్చు. 

ఐఐటీల బాట పడుతున్న సంస్థలు..
ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి సిద్ధమవుతున్న పలు ఆటోమొబైల్‌ దిగ్గజాలు.. ఇంజనీర్‌ స్థాయి నిపుణుల కోసం ఐఐటీల్లో క్యాంపస్‌ డ్రైవ్స్‌ నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది టాటా మోటర్స్, మెర్సిడెజ్‌ బెంజ్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతి సుజుకి వంటి ప్రముఖ సంస్థలు ఐఐటీల్లో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా వేయి మంది బీటెక్‌ అభ్యర్థులను ఎలక్ట్రిక్‌ వాహన తయారీ విభాగాల్లో ఆఫర్లు ఇచ్చాయి. అంతేకాకుండా గత ఏడాదితో పోల్చితే ఈ సంఖ్య 30 శాతం ఎక్కువ కావడం ఈ రంగంలో పెరుగుతున్న మానవ వనరుల ఆవశ్యకతకు నిదర్శనం.

స్వీయ శిక్షణ కేంద్రాలు..
ఎలక్ట్రిక్‌ వాహన తయారీ రంగంలో సంబంధిత నైపుణ్యాలు కల్పించే దిశగా.. సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. పలు ఆటోమోటివ్‌ సంస్థలు కోర్‌ సబ్జెక్ట్‌ ఉన్న అభ్యర్థులను నియమించుకుని.. ఆ తర్వాత క్రమంలో తమ సొంత శిక్షణ కేంద్రాల ద్వారా స్కిల్స్‌ మెరుగుపరుస్తున్నాయి.

పది వేల మంది ఇంజనీర్లు..
ఎలక్ట్రిక్‌ వాహన తయారీ రంగంలో ఇంజనీర్స్‌ స్థాయిలో రానున్న ఏడాది కాలంలో పదివేల మంది అవసరమవుతారని అంచనా. రానున్న రెండేళ్లలో ఈ డిమాండ్‌ పదిహేను వేలకు చేరుకోనుంది. దీనికి అనుగుణంగా అకడమిక్‌ స్థాయిలోనూ నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

కొత్త కోర్సులు, రీసెర్చ్‌ దిశగా..
☛ ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం, నైపుణ్యాల ఆవశ్యకతను పరిగణనలోకి తీసుకున్న ఐఐటీలు.. వీటికి సంబంధించి రీసెర్చ్‌ కార్యకలాపాల దిశగా అడుగులు వేస్తున్నాయి. 
☛ ఐఐటీ ఢిల్లీ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైబాలజీ అనే విభాగాన్ని ఏర్పాటు చేసి.. ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ తయారీ, ఎనర్జీ స్టోరేజ్‌ సంబంధిత అంశాలపై పరిశోధనలు చేస్తోంది.
☛ ఐఐటీ మండి, చెన్నై, హైదరాబాద్‌ సహా పలు ఐఐటీలు ప్రైవేటు సంస్థలతో కలిసి రీసెర్చ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 
వేతనాలు
☛ రీసెర్చ్‌ స్థాయిలో నెలకు రూ.లక్ష వరకు వేతనం అందుతోంది. 
☛ ప్రొడక్ట్‌ తయారీ విభాగంలో ఇంజనీర్ల స్థాయిలో నెలకు రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు చెల్లిస్తున్నారు. 
☛ సూపర్‌వైజరీ స్థాయిలో నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభిస్తుంది. –కస్టమర్‌ సర్వీస్‌ విభాగంలోనూ ఇదే స్థాయిలో వేతనాలు అందుతున్నాయి. 

ఈవీ రంగం.. ముఖ్యాంశాలు..

electric vehicles india

 ➤ 2030 నాటికి 15 బిలియన్‌ డాలర్లకు చేరుకోనున్న ఈవీ రంగం. ∙2025 నాటికి ఈవీ వినియోగంలో మూడో స్థానంలో భారత్‌.
➤ ఈ ఏడాది ఇంజనీర్ల స్థాయిలో పది వేల మంది అవసరమని అంచనా.
➤ క్షేత్ర స్థాయిలో 2025 నాటికి మరో రెండు లక్షల ఉద్యోగాలకు వేదికగా ఈవీ రంగం.
➤ ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు కొత్తగా 26 ఈవీ స్టార్టప్‌ సంస్థల ఏర్పాటు.
➤ విదేశీ సంస్థలు, అకడమిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందాలు చేసుకుంటున్న భారత ఆటోమొబైల్‌ సంస్థలు.

Published date : 21 Nov 2022 06:23PM

Photo Stories