Skip to main content

ఇంజనీరింగ్‌లోని బ్రాంచ్‌ల ఎంపిక ఎలా?ఇష్టమైన సబ్జెక్టు చదవాలంటే ఏ బ్రాంచ్ తీసుకోవాలి?

ఎంసెట్, ఐఐటి-జెఇఇ, ఇతర ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వస్తుంది, ఏ బ్రాంచ్‌లో సీటు దొరుకుతుంది, అసలు ఏ బ్రాంచ్ ఎంపిక చేసుకోవాలి, అసలు బ్రాంచ్‌లకు ఉండే తేడా ఏమిటి, ఆ బ్రాంచ్‌కు ఉండే కెరీర్ అవకాశాలు ఏంటి... ఇలా అనేక సందేహాలతో సతమతమవుతున్నారు. తమ బంధుమిత్రుల్లో ఎవరైనా ఇంజనీరింగ్ గురించిన అవగాహన ఉన్న వారిని కలిసి తమ సందేహాలను నివృత్తిచేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సాక్షి భవిత తరపున నిర్వహించిన కెరీర్ ఫెయిర్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు దాదాపుగా ఇవే ప్రశ్నలను అడగటం జరిగింది. ఈ ఆర్టికల్ ద్వారా ఎంసెట్ విద్యార్థులకు సాధారణంగా వచ్చే వివిధ ప్రశ్నలు, తలెత్తే సందేహాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం సాక్షి ఎడ్యుకేషన్.కామ్ చేస్తోంది.

ఇందులో విద్యార్థులు అత్యధికంగా మొగ్గు చూపే బ్రాంచ్‌లు, వాటిలో ఉండే ప్రధాన సబ్జెక్టులను గురించి చర్చించడం జరిగింది. అదే విధంగా ఇసిఇ, ఇఇఇ, ఇఐఇ బ్రాంచ్‌ల మధ్య ఉండే వ్యత్యాసాలు, సిఎస్‌ఇ, ఐటి బ్రాంచ్‌ల మధ్య ఉండే వ్యత్యాసాలను మరో రెండు ఆర్టికల్స్‌లో చర్చించడం జరిగింది. ఆయా బ్రాంచ్‌ల వివరాల తరువాత ఇచ్చిన లింక్స్ ద్వారా బ్రాంచ్‌ల మధ్య వ్యత్యాసాలను వివరించే ఆర్టికల్స్‌ను చూడవచ్చు. ఇవికాక సాక్షిఎడ్యుకేషన్.కామ్, సాక్షి భవితలో గతంలో వచ్చిన ఆర్టికల్స్ లింక్స్ కూడా ఇచ్చాము. ఈ సమాచారమంతా విలువైనదే. కనుక విద్యార్థులు శ్రద్దగా వీటిని చదివితే వారికి ఉండే అనేక ప్రాధమిక సందేహాలు దాదాపుగా నివృత్తి అవుతాయి.

ఇంజనీరింగ్‌లో ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకుంటోన్న బ్రాంచ్‌లు, అందుకు కారణాలు, ఆయా బ్రాంచ్‌ల్లో వారు చదివే ప్రధాన సబ్జెక్టులు:

ఇంజనీరింగ్‌లో సుమారు 90శాతం మంది విద్యార్థులు ఎంచుకుంటోన్న బ్రాంచ్‌లు -
  1. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఇసిఇ)
  2. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఇఇఇ)
  3. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ (ఇఐఇ)
  4. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సిఎస్‌ఇ)
  5. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి)
  6. మెకానికల్ ఇంజనీరింగ్ (ఎమ్‌ఇ)
  7. సివిల్ ఇంజనీరింగ్ (సిఇ)
ఇవే కాక ఏరో నాటికల్, మైనింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, కెమికల్, పెట్రోలియం ఇంజనీరింగ్‌తో పాటు ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నిర్వహిస్తోన్న ఫుడ్ సైన్స్, డెయిరీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వంటి బ్రాంచ్‌లకూ విద్యార్థుల డిమాండ్‌పెరుగుతోంది. అయితే ఇవన్నీ ప్రత్యేక సబ్జెక్టు ఆధారితం కావటంతో ఆయా సబ్జెక్టులపై అవగాహనతోను, ఇష్టంతోనూ వాటిని విద్యార్థులు ఎంచుకొంటున్నారు.

రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో BME, CSE, EEE, ECE, ECM, EIE, ETM, IT/CST, ICEలను సర్క్యూట్ బ్రాంచ్‌లుగా, ఇతర బ్రాంచ్‌లు AE, AG Engg, Automobile, Chem Engg, CE, MC, MP, ME, MMT, PE, CEE, Nano, Mining Engg. Mining Machinery నాన్ సర్క్యూట్ బ్రాంచ్‌లుగా వర్గీకరించారు.

మొదటి సంవత్సరం సిలబస్ సర్క్యూట్ బ్రాంచ్‌లు అన్నింటికి ఒక రకంగా, నాన్ సర్క్యూట్ బ్రాంచ్‌లు అన్నింటికి మరో రకంగా ఉంటుంది.

అయితే అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులు మొదటి సంవత్సరం కామన్‌గా చదివే సబ్జెక్టులు కొన్ని ఉన్నాయి. అవి -
  1. ఇంగ్లిష్
  2. మేథమెటిక్స్
  3. ఇంజనీరింగ్ ఫిజిక్స్
  4. ఇంజనీరింగ్ కెమిస్ట్రీ
  5. కంప్యూటర్ ప్రోగ్రామింగ్
  6. ఇంజనీరింగ్ డ్రాయింగ్
  7. ఇంజనీరింగ్ మెకానిక్స్
కొన్ని యూనివర్సిటీలు ఫ్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, లేదా బ్రాంచ్‌కు సంబంధించిన ఒక బేసిక్ సబ్జెక్టును కూడా మొదటి సంవత్సరం సిలబస్‌లో చేరుస్తున్నాయి. వీటితో పాటు ఇంగ్లిష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, ఇంజనీరింగ్ వర్క్‌షాప్ ల్యాబ్ సెషన్స్ ఉంటాయి.

రెండవ సంవత్సరం నుండి బ్రాంచ్‌కు సంబంధించిన సబ్జెక్టులతో ప్రతీ బ్రాంచ్ సిలబస్ ప్రత్యేకంగా ఉంటుంది.

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
CSIR ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకుంటోన్న బ్రాంచ్ ఇది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ రంగానికి మూలమైన సర్క్యూట్ డిజైన్, కమ్యూనికేషన్ పరికరాల తయారీ రంగంలో ఎక్కువ ఉపాధి లభించటం, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీలో అద్భుతమైన రీసెర్చ్ అవకాశాలు, ఎం.టెక్., ఎం.ఎస్. లో స్పెషలైజేషన్ కోసం విస్తృతమైన సబ్జెక్టులు అందుబాటులో ఉండటం కూడా విద్యార్థులు ఈ బ్రాంచ్ ఎంపిక చేసుకోవటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఇసిఇలో విద్యార్థులు చదివే ప్రధాన సబ్జెక్టులు:
  1. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ డివెసైస్ & సర్క్యూట్స్
  2. ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్
  3. పల్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్
  4. ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ
  5. స్విచింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్
  6. లీనియర్ అండ్ డిజిటల్ IC అప్లికేషన్స్
  7. మైక్రోప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్
  8. VLSI డిజైన్
  9. మెక్రోవేవ్ ఇంజనీరింగ్
  10. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్
  11. ఎంబెడెడ్ సిస్టమ్స్
  12. కంప్యూటర్ నెట్‌వర్క్స్
  13. ఆప్టికల్ కమ్యూనికేషన్స్
  14. ఏనలాగ్, సెల్యులార్ అండ్ మొబైల్, వైర్‌లెస్/శాటిలైట్ కమ్యూనికేషన్స్
  15. రాడార్ సిస్టమ్స్
సమర్థులైన ఇసిఇ బ్రాంచ్ విద్యార్థులకు Bharat Electronics Limited (BEL), Electronics Corporation of India Limited (ECIL), Intel, SONY, Toshiba, Philips Semiconductors, Texas Instruments, LG Electronics, AMD, CISCO, Nvdia, HP, IBM,BSNL, Nokia, ISRO, DRDO, Samsung, Motorola వంటి కంపెనీలు మంచి శాలరీతో ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి.

కమ్యూనికేషన్ సిస్టమ్స్, మొబైల్ అండ్ వైర్‌లెస్ కమ్యూనికేషన్స్, గ్లోబల్ నేవిగేషన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, టెలిమేటిక్ ఇంజనీరింగ్, బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్, VLSI వంటి సబ్జెక్టులతో ఎం.టెక్., ఎం.ఎస్. ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి.

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌పై మరింత సమాచారాన్ని ఈ క్రింది ఆర్టికల్‌లో పొందవచ్చు -
www.sakshieducation.com/EngggStory.aspx?nid=49214&cid=49

ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
CSIR ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్‌పై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఆయా పరిశోధనల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ రీసెర్చ్ టీముల్లో భాగమవటంతో పాటు విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యవస్థల్లోనూ, ఎలక్ట్రానిక్ రంగంలోని చిప్ డిజైన్, VLSI, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాల్లో అవ కాశాలు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లకు లభిస్తున్నాయి. వీరికి ఎం.టెక్., ఎం.ఎస్. లలో స్పెషలైజేషన్ ఆప్షన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్ కామన్‌గా ఉండటం వలన EEE విద్యార్థులు కూడా సుమారు సగం సబ్జెక్టులను ECE వారు చదివినవే చదువుతారు.

EEE లో విద్యార్థులు చదివే ప్రధాన సబ్జెక్టులు:
  1. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ డివెసైస్ & సర్క్యూట్స్
  2. ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్
  3. ఎలక్ట్రికల్ మెషిన్స్
  4. ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ
  5. ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్
  6. స్విచింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్
  7. ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్
  8. లీనియర్ అండ్ డిజిటల్ IC అప్లికేషన్స్
  9. పవర్ సిస్టమ్స్ ఆపరేషన్ అండ్ కంట్రోల్
  10. మైక్రోప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్
  11. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్
  12. స్విచ్‌గేర్ అండ్ ప్రొటెక్షన్
  13. ఎంబెడెడ్ సిస్టమ్స్
  14. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్
  15. HVDC & FACTS డివెసైస్
BHEL, DMRC, NHPC, Power Grid, State Electricity Boards వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు Crompton Greaves, Siemens, Hitachi, Jindal Steel & Power, GE, Reliance, L&T, Tata, Samsung Engineering వంటి కంపెనీలు అర్హులైన ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు ఉద్యోగాలిచ్చేందుకు సిద్ధంగా ఉంటున్నాయి.

పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ ఇండస్ట్రియల్ డ్రైవ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, హైవోల్టేజ్ ఇంజనీరింగ్ వంటి సబ్జెక్టులతో ఎం.టెక్., ఎం.ఎస్. కోర్సులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు చేయవచ్చు.

ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌పై మరింత సమాచారాన్ని ఈ క్రింది ఆర్టికల్‌లో పొందవచ్చు -
www.sakshieducation.com/EngggStory.aspx?nid=49213&cid=49

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
CSIR ఎలక్ట్రానిక్స్ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌తో పాటు పారిశ్రామికరంగంలో కొత్తకొత్త యంత్రాలను అభివృద్ధి చేయాల్సి రావటం, ఆయా యంత్రాలను నియంత్రించేందుకు మైక్రోప్రాసెసర్ల వినియోగం పెరగటం, మనిషి శ్రమను తగ్గించి యంత్రాల ద్వారా మెరుగైన, నాణ్యమైన వస్తు ఉత్పత్తులు, సేవలు పొందేందుకు ప్రపంచమంతా ఆసక్తి చూపించటం.. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నాయి. ఎం.టెక్., ఎం.ఎస్. చేసేందుకూ వీరికి ఎక్కువ సంఖ్యలో ఆప్షన్లు ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్ కామన్‌గా ఉండటం వలన EIE విద్యార్థులు కూడా సుమారు సగం సబ్జెక్టులను ECE వారు చదివినవే చదువుతారు.

EIE లో విద్యార్థులు చదివే ప్రధాన సబ్జెక్టులు:
  1. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ డివెసైస్ & సర్క్యూట్స్
  2. ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్
  3. పల్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్
  4. స్విచింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్
  5. ఎలక్ట్రానిక్ మెజర్‌మెంట్స్
  6. ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ
  7. లీనియర్ అండ్ డిజిటల్ IC అప్లికేషన్స్
  8. మెక్రోప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్
  9. VLSI డిజైన్
  10. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్
  11. ఆటోమేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్
  12. బయోమెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్
  13. ఆప్టో ఎలక్ట్రానిక్స్ అండ్ లేజర్ ఇన్‌స్ట్రుమెంటేషన్
  14. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్
  15. ఇండస్ట్రియల్ ఇన్‌స్ట్రుమెంటేషన్
థర్మల్ పవర్ ప్లాంట్స్, ఫర్టిలైజర్స్, సిమెంట్ కంపెనీలు, ఆయిల్ రిఫైనరీలు, స్టీల్ ప్లాంట్స్ వంటి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లోని R&D విభాగాల్లోఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్లకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. SONY, LG, SAMSUNG, PHILIPS, HONEYWELL వంటి కంపెనీలతో పాటు, మైనింగ్, టెక్స్‌టైల్స్, రోబోటిక్స్, క్రేన్స్ & హాయిస్ట్స్ వంటివి వ్యాపారంగా ఉన్న అన్ని కంపెనీలలో ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్లకు డిమాండ్ ఉంది.

రోబోటిక్స్, మెకట్రానిక్స్, విఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెట్రాలజీ & మెజర్‌మెంట్ సిస్టమ్స్, ఆటోమోబైల్, ఏరోనాటికల్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, నానోటెక్నాలజీ, బయోటెక్నాలజీ, మైక్రో ఎలక్ట్రానిక్స్‌లో ఇఐఇ విద్యార్థులు ఎంటెక్, ఎం.ఎస్. చేసేందుకు అవకాశాలు ఉన్నాయి.

ECE, EEE, EIEబ్రాంచ్‌ల మధ్య వ్యత్యాసం ఏమిటి? వాటిలో ఏ బ్రాంచ్‌ని ఎన్నుకోవాలో చెప్పే వివరాల కోసం ఈ క్రింది ఆర్టికల్ చదవండి -
www.sakshieducation.com/(S(jz1ic0unsdw4kmrg3teiu355))/EAM/EamcetStory.aspx?nid=74888&cid=9&sid=311&chid=883&tid=0

మెకానికల్ ఇంజనీరింగ్
CSIR ఏదైనా ఒక యంత్రం పనిచేయాలంటే దానికి మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఏదో ఒక సూత్రం ఆధారం కావలసిందే. ఒక జిప్ తెరుచుకుని మూసుకోవటం నుంచి రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లటం వరకూ ప్రతి పని మెకానికల్ ఇంజనీరింగ్ నియమాలను గౌరవించాల్సిందే. మనిషి శారీరక శ్రమను తగ్గించి, సుఖాన్ని, సౌకర్యాన్ని పెంచేందుకు జరిగే ప్రతి పరిశోధన వెనుక మెకానికల్ ఇంజనీరింగ్ నిపుణత మనకు కనిపిస్తుంది.

మెకానికల్ ఇంజనీర్‌కు ఆటోమోబైల్స్, రోబోటిక్స్, ఏవియేషన్, స్పేస్ టెక్నాలజీ, పవర్ జనరేషన్ వంటి రంగాలలో ప్రవేశంతో పాటు కొత్త పరిశోధనలకు అవకాశం లభిస్తుంది. Turbo machinery, Aerospace, Aeronautical/ Marine Engineering or Mechatronicsలో ఎం.టెక్., ఎం.ఎస్ లోనూ మంచి అవకాశాలున్నాయి.

మెకానికల్ ఇంజనీరింగ్‌లో విద్యార్థులు చదివే ప్రధాన సబ్జెక్టులు:
  1. మెటీరియల్స్ సైన్స్
  2. థర్మో డైనమిక్స్ అండ్ థర్మల్ ఇంజనీరింగ్
  3. మెషిన్ డ్రాయింగ్
  4. కైనమేటిక్స్ ఆఫ్ మెషినరీ
  5. ఫ్లూయిడ్ మెకానిక్స్
  6. మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీ
  7. టర్బయిన్స్ అండ్ జెట్ ప్రొపల్షన్స్
  8. డిజైన్ ఆఫ్ మెషిన్ టూల్స్ అండ్ ఎలిమెంట్స్
  9. డైనమిక్స్ ఆఫ్ మెషినరీ
  10. CAD/CAM
  11. రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్
  12. ఆటోమోబైల్ ఇంజనీరింగ్
  13. మెట్రాలజీ
  14. ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్
  15. ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్
మిధాని, బెల్, భెల్, ఐఒసిఎల్, ఎన్‌టిపిసి వంటి ప్రభుత్వ సంస్థలు, పవర్ ప్రాజెక్టులతో పాటు Maruti Suzuki, M&M, FIAT, Hyundai, Tata Motors, Ashok Leyland & Intergraph, maytas వంటి కంపెనీలు మెకానికల్ ఇంజనీర్లను ఆహ్వానిస్తున్నాయి.

మెకానికల్ ఇంజనీరింగ్‌పై అదనపు సమాచారానికి కింది లింకులో ప్రయత్నించవచ్చు.
www.sakshieducation.com/EngggStory.aspx?nid=49212&cid=49

సివిల్ ఇంజనీరింగ్
CSIR ఒకప్పుడు ఇంజనీరింగ్ చేసేవారిలో ఎక్కువ మంది సివిల్ బ్రాంచ్‌నే తీసుకునేవారు. పాత ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో ఇదీ ఒకటి. రోడ్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, బిల్డింగులు, వాటర్, పవర్ ప్రాజెక్టులు కట్టడం వంటి కన్‌స్ట్రక్షన్ రంగంలో సివిల్ ఇంజనీర్లు పనిచేస్తారు. ప్లానులు తయారు చేయటం, వాటి ప్రకారం నిర్మాణాలను పూర్తి చేయించటం వీరి బాధ్యతల్లో భాగమవుతాయి.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంటోన్న ‘గ్రీన్ హౌసింగ్, ఇకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్’ పర్యావరణ పరిరక్షణలో సివిల్ ఇంజనీర్ల భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కన్‌స్ట్రక్షన్‌తో పాటు ఆర్కిటెక్చర్, లాండ్ స్కేపింగ్ తదితర రంగాల్లో ఉన్నత విద్యకు, ఉద్యోగ అవకాశాలకు కొదవలేదు. ప్రభుత్వ ఉద్యోగాలకూ తరచుగా నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి.

సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు చదివే ప్రధాన సబ్జెక్టులు:
  1. సర్వేయింగ్
  2. ఫ్లూయిడ్ మెకానిక్స్
  3. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్
  4. హైడ్రాలిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషినరీ
  5. కాంక్రీట్ టెక్నాలజీ
  6. ఇంజనీరింగ్ జియాలజీ
  7. ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్
  8. వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్
  9. రిమోట్ సెన్సింగ్ & GIS
  10. కన్‌స్ట్రక్షన్ మేనేజిమెంట్
  11. ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్
  12. ఫౌండేషన్ ఇంజనీరింగ్
  13. స్టీల్ స్ట్రక్చర్స్ డిజైన్ అండ్ డ్రాయింగ్
  14. CAD/CAM
  15. స్ట్రక్చరల్ అనాలిసిస్
రోడ్లు భవనాల శాఖ, వ్యవసాయం, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, రైల్వేలు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, నేషనల్ హైవేస్, విపత్తు నిర్వహణ మండలి వంటి ప్రభుత్వ విభాగాల్లో, Jaypee, Reliance Infra, L&T, ACC, LANCO, SOMA,PATEL ENGEERS, DLF వంటి ప్రైవేటు నిర్మాణ సంస్థలు సివిల్ ఇంజనీర్లకు మంచి జీతంతో ఉద్యోగాలు ఇవ్వజూపుతున్నాయి.

ట్రాన్స్‌పోర్టేషన్, జియోటెక్నికల్, స్ట్రక్చర ల్, ఎన్విరాన్‌మెంటల్ఇంజనీరింగ్, హైడ్రాలిక్, వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షనల్ మేనేజ్‌మెంట్ వంటి సబ్జెక్టులలో ఎం.టెక్., ఎం.ఎస్ చేసేందుకుసివిల్ ఇంజనీర్లకు అవకాశం ఉంది.

సివిల్ ఇంజనీరింగ్‌పై అదనపు సమాచారానికి కింది లింకులో ప్రయత్నించవచ్చు.
www.sakshieducation.com/EngggStory.aspx?nid=49215&cid=49

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
CSIR ఇప్పుడు కంప్యూటర్ ప్రమేయం లేని రోజు మనకు గడవటం లేదు. ఇంతకు ముందు ఇక్కడ కంప్యూటర్ ఉపయోగమేముంటుందిలే అనుకునే హోటళ్లు, సూపర్ మార్కెట్ల వంటి చోట కూడా అవి తిష్టవేసేశాయి. ఇక ప్రపంచాన్ని అరచేతిలో చూపెడుతున్న మొబైల్ ఫోన్ కూడా బుల్లి కంప్యూటరే కదా. ప్రజల జీవితాన్ని ఇంతగా కంప్యూటర్లతో నింపింది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లే అని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.

మనిషి శారీరక శ్రమ తగ్గించేందుకు ఇసిఇ, ఇఇఇ, ఇఐఇ, మెకానికల్ బ్రాంచ్‌ల ఇంజనీర్లు కృషి చేస్తోంటే, మానసిక శ్రమ తగ్గించేందుకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. చిన్న కాలిక్యులేటర్ల నుంచి సూపర్ కంప్యూటర్ల వరకూ సృష్టికర్తలు వీరే. ఒక అవసరానికి తగినట్లుగా లాజిక్ రాసుకుని, దానిని సమర్ధవంతంగా నడిపేందుకు కావలసిన సర్క్యూట్ డిజైన్ చేస్తారు. అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను, యూజర్ ఇంటర్‌ఫేస్ తయారు చేస్తారు.మనం వాడే మొబైల్స్, లాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్స్‌తో పాటు ఆటోమోబైల్స్, వాషింగ్ మెషిన్స్, మైక్రోవేవ్ ఓవెన్స్ వంటి మైక్రోకంప్యూటర్స్ ఉపయోగించే ఉపకర ణాల తయారీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు కీలక పాత్ర పోషిస్తారు.

ఆసక్తిని బట్టి కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లకు ఎం.టెక్., ఎం.ఎస్. చేసేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి.

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో విద్యార్థులు చదివే ప్రధాన సబ్జెక్టులు:
  1. డిజిటల్ లాజిక్ డిజైన్
  2. ఎలక్ట్రానిక్ డివెసైస్ అండ్ సర్క్యూట్స్
  3. అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్
  4. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్
  5. డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గరిథమ్స్
  6. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్
  7. కంప్యూటర్ నెట్‌వర్క్స్
  8. ఆపరేటింగ్ సిస్టమ్స్
  9. మైక్రోప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్
  10. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
  11. వెబ్ టెక్నాలజీస్
  12. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్
  13. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ
  14. వైర్‌లెస్ సెన్సర్ నెట్‌వర్క్స్
  15. గ్రిడ్ అండ్ క్లస్టర్ కంప్యూటింగ్
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌పై అదనపు సమాచారాన్ని ఈ క్రింది లింకులో పొందవచ్చు -
www.sakshieducation.com/EngggStory.aspx?nid=49226&cid=49

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
CSIR కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు కంప్యూటర్లు తయారీలో కీలకంగా మారితే.. ఆ కంప్యూటర్లను ఉపయోగించి సమాచారాన్ని నిల్వచేయటం, రక్షించటం, అవసరమైనంత వరకే ఉపయోగించనివ్వటం, పొరపాటున పోగొట్టుకున్న సమాచారాన్ని తిరిగి పొందేలా చేయటం వంటి ప్రధాన కర్తవ్యాలను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీర్లు నిర్వహిస్తారు.

డేటా మేనేజిమెంట్, కంప్యూటర్ హార్డ్‌వేర్, డేటా బేస్ డిజైనింగ్ అండ్ మెయింటెనెన్స్, సాఫ్ట్‌వేర్ డిజైన్, నెట్‌వర్క్ ఇంజనీరింగ్ వ్యవస్థల్లో ఐటి నిపుణులు సేవలందిస్తారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యార్థులు చదివే ప్రధాన సబ్జెక్టులు:
  1. డిజిటల్ లాజిక్ డిజైన్
  2. ఎలక్ట్రానిక్ డివెసైస్ అండ్ సర్క్యూట్స్
  3. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్
  4. డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గరిథమ్స్
  5. మైక్రోప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్
  6. కంప్యూటర్ నెట్‌వర్క్స్
  7. ఆపరేటింగ్ సిస్టమ్స్
  8. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్
  9. వెబ్ టెక్నాలజీస్
  10. డే టా వేర్‌హౌసింగ్ అండ్ డేటా మైనింగ్
  11. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ
  12. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్
  13. మొబైల్ అప్లికేషన్ డెవెలప్‌మెంట్
  14. వైర్‌లెస్ సెక్యూరిటీ
  15. క్లౌడ్ కంప్యూటింగ్
కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. రెండింటిలోనూ నిపుణులైన అభ్యర్ధులకు DRDL, ISRO, ECIL, BEL వంటి ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, Microsoft, Google, Yahoo, Amazon, IBM, Facebook, Oracle, Cisco, Infosys, TCS, Wipro వంటి ప్రైవేటు కంపెనీలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇందుకోసం కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు IT సబ్జెక్టులోనూ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యార్థులు CS సబ్జెక్టులోనూ ఎం.టెక్., ఎం.ఎస్. చేసేందుకు ప్రయత్నించాలి.

CSE, ITబ్రాంచ్‌ల మధ్య వ్యత్యాసం ఏమిటి? వాటిలో ఒకటి ఎలా ఎన్నుకోవాలి?అన్న వివరాలు తెలుసుకోవడం కోసం ఈ క్రింది ఆర్టికల్ చదవండి -
www.sakshieducation.com/(S(jz1ic0unsdw4kmrg3teiu355))/EAM/EamcetStory.aspx?nid=74889&cid=9&sid=311&chid=883&tid=0
Published date : 28 Jun 2014 10:34AM

Photo Stories