Skip to main content

ఇంజనీరింగ్ తర్వాత..ప్రభుత్వ కొలువులు

మన దేశంలో ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థులు బీఈ/బీటెక్ కోర్సులు పూర్తిచేసుకుంటున్నారు. మన రాష్ట్రంలోనే ఏటా దాదాపు రెండు లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు క్యాంపస్‌ల నుంచి జాబ్ మార్కెట్‌లో అడుగుపెడు తున్నారు. అయితే వీరిలో చాలామందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఉద్యోగాల గురించి పూర్తి అవగాహన ఉండటం లేదు. ఈ నేపథ్యంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులకు ప్రభుత్వ రంగంలో ఉన్న వివిధ ఉద్యోగావకాశాలు, అర్హతలు తదితర వివరాలపై ప్రత్యేక ఫోకస్..

మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీల్లో..
నవరత్న, మహారత్న హోదా పొందిన కంపెనీల్లో ఉద్యోగాన్ని సాధించాలని ప్రతి ఒక్క ఇంజనీరింగ్ విద్యార్థి కోరుకుంటాడు. వీటిల్లో ప్రారంభంలోనే మంచి జీతభత్యాలు, ఇతర సదుపాయాలను పొందడంతోపాటు కెరీర్‌లోనే అత్యుత్తమ స్థాయికి చేరుకోవచ్చు. బీఈ/బీటెక్ పూర్తిచేసినవారికి కేంద్ర ప్రభుత్వ రంగంలోని మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీల్లో అనేక అవకాశాలున్నాయి. నియామకాలకు దాదాపు ఈ సంస్థలన్నీ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. వీటితోపాటు కంపెనీని బట్టి బృంద చర్చ, మౌఖిక పరీక్షలను నిర్వహించి ఎంట్రీ లెవల్ (ట్రైనీ ఇంజనీర్/జూనియర్ ఇంజనీర్) పోస్టులను భర్తీ చేస్తున్నాయి. వీటికి దరఖాస్తు చేసుకోవాలంటే నిర్దేశిత మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఫైనలియర్ చదువుతుండాలి. వయో పరిమితి నిబంధన కూడా ఉంది. నిర్దేశిత తేదీ నాటికి కంపెనీలు సూచించిన వయసును మించి ఉండకూడదు. అంతేకాకుండా గేట్‌కు దరఖాస్తు చేసుకుని ఉండాలి. ఈ కంపెనీల్లో ఎక్కువ ఉద్యోగాలు మాత్రం సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ వంటి కోర్ బ్రాంచ్‌ల్లోనే ఉంటున్నాయి.

గేట్ పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో మూడు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మొత్తం 65 ప్రశ్నలుంటాయి. మొత్తం మార్కులు 100. కొన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలోనూ, మరికొన్ని న్యూమరికల్ ఆన్సర్ విధానంలో ఉంటాయి.
జీతభత్యాలు: ప్రారంభంలో ఏడాదికి దాదాపు రూ. 8 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు అందుకోవచ్చు. వీటితోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సదుపాయాలు లభిస్తాయి.

భారతీయ వాయుసేనలో..
భారతీయ వాయు సేనలో ఇంజనీరింగ్ అర్హతతో మొత్తం మూడు విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. అవి.. ఫ్లైయింగ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్.

ఫ్లైయింగ్ బ్రాంచ్:
దీనికి ఎంపికైనవారు ఫైటర్ పైలట్ లేదా హెలికాఫ్టర్ పైలట్ లేదా ట్రాన్స్‌పోర్ట్ పైలట్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వివరాలు..

గ్రాడ్యుయేషన్‌తో సీడీఎస్‌ఈ ద్వారా..
బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా ఫ్లైయింగ్ బ్రాంచ్‌లో ప్రవేశించొచ్చు.
అర్హతలు: -అవివాహితులై ఉండాలి.
- పురుషులు మాత్రమే అర్హులు.
- బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి.
- సంబంధిత కోర్సులు చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులూ అర్హులే.
వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 19- 23 ఏళ్లు.
నోటిఫికేషన్: ఏడాదికి రెండుసార్లు (జూన్, అక్టోబర్)
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: www.upsc.gov.in

ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ:
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ)
లో ‘సి’ సర్టిఫికెట్ పొందినవారు ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా ఫ్లైయింగ్ బ్రాంచ్‌లో ప్రవేశం పొందొచ్చు.
అర్హతలు:
- అవివాహితులై ఉండాలి.
- 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లు చదివుండాలి.
- ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ సీనియర్ డివిజన్ నుంచి ‘సి’ సర్టిఫికెట్ పొంది ఉండాలి.
- సంబంధిత కోర్సులు ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులూ అర్హులే.
వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 19-23 ఏళ్లు.
దరఖాస్తు: ఎన్‌సీసీ ఎయిర్ స్క్వాడ్రన్స్/డెరైక్టర్ జనరల్, ఎన్‌సీసీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన ప్రకటనలు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్, వివిధ దినపత్రికల్లో వెలువడతాయి.

ఎస్‌ఎస్‌సీ (షార్ట్ సర్వీస్ కమిషన్) ఎంట్రీ:
ఇందులో ప్రవేశానికి మహిళలు, పురుషులూ ఇద్దరూ అర్హులే. ఏఎఫ్‌సీఏటీ ద్వారా ఇందులో అడుగుపెట్టొచ్చు.
అర్హతలు: అవివాహితులై ఉండాలి.
60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లు చదివుండాలి. వయోపరిమితి: 19 - 23 ఏళ్లు.
ప్రకటన: ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌కు ప్రతి ఏటా జూన్, డిసెంబర్‌లలో ప్రకటన వెలువడుతుంది.
మరిన్ని వివరాలకు..
వెబ్‌సైట్:
www.careerairforce.nic.in

యూపీఎస్సీ.. ఐఈఎస్ ద్వారా..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా నిర్వహించే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) ఎగ్జామ్ ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం నాలుగు డిపార్ట్‌మెంట్‌ల్లో వివిధ శాఖల్లో ఇంజనీర్లను నియమిస్తారు. అవి..
- సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్.

ఉద్యోగాలు ఇందులో:
ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్, సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీస్, సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ గ్రేడ్ ‘ఏ’ సర్వీస్, సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్ (రోడ్స్) గ్రూప్-ఏ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-బోర్డర్ రోడ్స్ ఇంజనీరింగ్ సర్వీస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీ అండ్ టీ బిల్డింగ్ వర్క్స్ గ్రేడ్ ‘ఏ’ సర్వీస్, ఇండియన్ నావల్ ఆర్మమెంట్ సర్వీస్, సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్- గ్రేడ్ ఏ, ఇండియన్ టెలికమ్యూనికేషన్ సర్వీస్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
వయో పరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 21 - 30 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, మౌఖిక పరీక్షల ఆధారంగా.
రాత పరీక్ష: రెండు సెక్షన్లుగా ఉంటుంది. మొదటి సెక్షన్‌లో పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. రెండో సెక్షన్‌లో వ్యాసరూప ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. రాతపరీక్షలో ఉత్తీర్ణులైనవారికి ఇంటర్వ్యూ ఉంటుంది.
వెబ్‌సైట్: www.upsc.gov.in

పరిశోధన సంస్థల్లో..
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), సతీశ్‌ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ వంటి సంస్థల్లోనూ, విభాగాల్లోనూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఎన్నో అవకాశాలున్నాయి. వివరాలు..

బార్క్‌కు మార్క్.. గేట్
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బార్క్ కూడా గేట్ స్కోర్ ప్రామాణికంగా సైంటిస్ట్ హోదాలో పలు ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేసింది. ముందుగా గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ట్రైనింగ్ స్కూల్‌లో ప్రవేశం కల్పించి.. నిర్ణీత కాలంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారిని సంస్థలో సైంటిస్ట్‌లుగా నియమిస్తోంది. ప్రస్తుతం రెండు ట్రైనింగ్ స్కీంలు అందుబాటులో ఉన్నాయి.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఏడాది వ్యవధి గల ఓరియెంటేషన్ కోర్స్: కనీసం 50 శాతం మార్కులతో శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు అణుశక్తి శాఖకు చెందిన పలు యూనిట్లలో సైంటిఫిక్ ఆఫీసర్ హోదా కల్పిస్తారు.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, ఫిజిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్లకు రెండేళ్ల డీఏఈ గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ ప్రోగ్రామ్: సంస్థ నిర్దేశించిన ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంటెక్ లేదా ఎంఈ(కెమికల్)లో సీటు ఖరారు చేసుకున్న అభ్యర్థులకు ట్యూషన్‌ఫీజు, స్టైఫండ్‌ను బార్క్ చెల్లిస్తుంది. ఈ అభ్యర్థులకు డీఏఈలో కొలువు ఖరారవుతుంది. వీరు తమ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీ మొదటి సంవత్సరం పూర్తి కాగానే అణుశక్తి శాఖకు చెందిన విభాగాల్లో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజనీరింగ్) ఉత్తీర్ణత/ బీఈ లేదా బీటెక్(ఇంజనీరింగ్ ఫిజిక్స్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అకడమిక్ విద్యార్హతలతోపాటు గేట్ స్కోర్ కార్డ్ తప్పనిసరి.
వెబ్‌సైట్: oces.hbni.ac.in

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ
తిరువనంతపురంలో ఉన్న ఐఐఎస్‌టీలో బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్, ఫిజికల్ సెన్సైస్ కోర్సుల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనవారిని అంతరిక్ష విభాగం పరిధిలోని వివిధ రాకెట్ ప్రయోగ కేంద్రాల్లో జూనియర్ ఇంజనీర్/సైంటిస్ట్‌గా నియమిస్తారు. అకడమిక్ రికార్డ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వెబ్‌సైట్: www.iist.ac.in

డీఆర్‌డీవో..
దేశ రక్షణకు సంబంధించిన ఆయుధాలు, క్షిపణులు, ఇతర అత్యాధునిక యంత్ర పరికరాల రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది డీఆర్‌డీవో. దీని పరిధిలో దాదాపు 50 లేబొరేటరీ లున్నాయి. వీటిల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు జూనియర్ ఇంజనీర్లుగా/శాస్త్రవేత్తలుగా ఎన్నో ఉద్యోగావకాశాలు ఉన్నాయి.

క్యాంపస్ నియామకాలు:
డీఆర్‌డీవోలో నియామకాలకు గతంలో సైంటిస్ట్ ఎంట్రీ టెస్ట్ (సెట్) నిర్వహించేవారు. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు సెట్ లేదు. ప్రస్తుతం క్యాంపస్ సెలెక్షన్ ఆధారంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ఐఐటీలు/ఎన్‌ఐటీలు/ఐఐఎస్సీ వంటి ప్రముఖ విద్యా సంస్థల్లో బీఈ/బీటెక్ కోర్సులు అభ్యసించిన విద్యార్థులను క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపిక చేస్తున్నారు. 65 శాతం మార్కులతో మొదటి ప్రయత్నంలోనే బీఈ/బీటెక్ ఉత్తీర్ణులైనవారు సైంటిస్ట్ - బీ ఉద్యోగాలకు అర్హులు. వీరికి డీఆర్‌డీవో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తుంది.

ఏరోనాటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డ్ ఫెలోషిప్: దీని ద్వారా కూడా డీఆర్‌డీవోలో సైంటిస్ట్-బీ హోదాలో అడుగుపెట్టొచ్చు. జాతీయస్థాయి కళాశాలల్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ కోర్సులు చదివేవారికి ఏఆర్‌డీబీ.. ఫెలోషిప్పులను అందిస్తోంది. వీరు కోర్సులు పూర్తిచేసుకున్న తర్వాత డీఆర్‌డీవో నిర్వహించే మౌఖిక పరీక్షలో విజయం సాధిస్తే జాబ్ దక్కించుకున్నట్లే..

లేటరల్ ఎంట్రీ స్కీమ్:
సంబంధిత అర్హతలతోపాటు పరిశోధన అనుభవం ఉన్నవారు సైంటిస్ట్ - బీ నుంచి సైంటిస్ట్ - జి వరకు అవకాశాలు దక్కించుకోవచ్చు. అకడమిక్ మెరిట్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకం ఖరారు చేస్తారు. వీటి ప్రకటనలు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడతాయి.
వెబ్‌సైట్: www.drdo.gov.in

ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కోల్లో
ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్‌కో), ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో)ల్లో కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు ఉంటాయి.
బీఈ/బీటెక్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసినవారు సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. వీటిల్లో పోస్టుల భర్తీకి వివిధ దినపత్రికల్లో ప్రకటనలు వెలువడుతుంటాయి.
వెబ్‌సైట్: www.aptransco.gov.in, www.apgenco.gov.in

మన రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా..
మన రాష్ట్రంలో వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహిస్తుంది. ఖాళీలను బట్టి ప్రకటనలు విడుదలవుతుంటాయి.
భర్తీ చేసే విభాగాలు: ఏఈఈ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్)- ‘ఐ అండ్ క్యాడ్’ ఇంజనీరింగ్ సర్వీస్, ఆర్ అండ్ బీ సర్వీస్, ఏఈఈ పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ సర్వీస్.
అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
రాత పరీక్ష: మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అన్ని ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి.
వెబ్‌సైట్: www.apspsc.gov.in

Published date : 10 Feb 2014 06:12PM

Photo Stories