Skip to main content

ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్లు... అవకాశాలు కోకొల్లలు

ఇంజనీరింగ్.. మారుతున్న కాలంతోపాటు అవసరాలు మారుతున్నాయి. కొత్త కోర్సులు ఆవిష్కృతమవుతున్నాయి.
కోర్ బ్రాంచ్‌లు.. అప్‌కమింగ్ బ్రాంచ్‌లు ఓ వైపు.. మరోవైపు ఇంటర్ డిసిప్లినరీ కోర్సులకూ రూపకల్పన జరుగుతోంది. అందుకే ఇంజనీరింగ్ ఔత్సాహికుల్లో.. ఎన్నో సందేహాలు. ముఖ్యంగా ‘కోర్’ బ్రాంచ్ ఔత్సాహికుల్లో ఆందోళన. అనేక అప్‌కమింగ్ బ్రాంచ్‌లు పుట్టుకొస్తుంటే.. కేవలం ‘కోర్’ బ్రాంచ్‌లతోనే సమున్నత కెరీర్ సాధ్యమా? అనే సందిగ్ధం. అయితే.. ‘కోర్’ బ్రాంచ్‌లు ఎవర్‌గ్రీన్! వాటి ఫ్యూచర్ స్కోప్ షైనింగ్!! ఈ బ్రాంచ్ ఔత్సాహికులకు నో టెన్షన్!!- అంటున్నారు నిపుణులు. నేటి తీవ్ర పోటీ ప్రపంచంలో సైతం.. ఏ మాత్రం కళ తగ్గనివి కోర్ బ్రాంచ్‌లు అనేది వారి నిశ్చితాభిప్రాయం. మరికొద్ది రోజుల్లో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో కోర్ బ్రాంచ్‌లతో అవకాశాలపై విశ్లేషణ..

సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్.. ప్రస్తుతం అంతర్జాతీయంగా కోర్ బ్రాంచ్‌లుగా పేరొందిన ఇంజనీరింగ్ బ్రాంచ్‌లు. ఇటీవల కాలంలో పరిశ్రమ వర్గాల అవసరాల మేరకు కొత్తగా ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచ్‌లకు రూపకల్పన జరుగుతోంది. వాస్తవానికి అవి కూడా కోర్ బ్రాంచ్‌లకు అనుసంధానంగానో లేదా కోర్ బ్రాంచ్‌ల సమ్మిళితంగానో రూపొందినవే. దీన్ని బట్టి కోర్ బ్రాంచ్‌ల ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఇంజనీరింగ్ విద్యారంగ నిపుణులు.

సివిల్ ఇంజనీరింగ్
సామాజిక అవసరాల పరంగా పరిధి, అవకాశాలు విస్తృత స్థాయిలో ఉండే బ్రాంచ్.. సివిల్ ఇంజనీరింగ్. అందుకే దశాబ్దాలుగా వన్నె తరగని బ్రాంచ్‌గా పేరొందుతోంది. ఫిజిక్స్, మ్యాథమెటికల్, డిజైన్ స్కిల్స్ ఉన్న విద్యార్థులకు సరితూగే బ్రాంచ్ ఇది. నిర్మాణ రంగ నైపుణ్యాలు అందించే సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే.. అవకాశాలకు కొదువ లేదు. సృజనాత్మకత, అకడమిక్‌గా నేర్చుకున్న అంశాల విజువలైజేషన్ స్కిల్స్.. ఉపాధి అవకాశాలకు అదనపు అర్హతలుగా నిలుస్తున్నాయి. రానున్న అయిదేళ్లలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రైవేటు రంగంలో దాదాపు 40-50 వేల అవకాశాలు అందుబాటులోకి రావడం ఖాయమని అసోచామ్, సీఐఐ వంటి పలు సంస్థల సర్వేల గణాంకాలు తెలియజేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ పలు నిర్మాణాలు చేపడుతోంది. దీంతో ప్రభుత్వ రంగంలోనూ సివిల్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతోంది.


సానుకూలతలు:
  • వేతనాలు ఎక్కువ.
  • విస్తృత అవకాశాలు.
ప్రతికూలతలు:
  • పని ఒత్తిడి ఎక్కువ.
  • అధిక శాతం ఫీల్డ్ వర్క్.

కెమికల్ ఇంజనీరింగ్
శతాబ్దాల చరిత్ర, సైన్స్ రంగంలో ఎన్నో ఆవిష్కరణలకు దోహదపడిన మరో కోర్ బ్రాంచ్.. కెమికల్ ఇంజనీరింగ్. పెట్రోలియం, ఫార్మాస్యూటికల్, ఆగ్రో కెమికల్స్, ఆర్ అండ్ డీ.. ఇలా పలు విభాగాల్లో అవకాశాలు కల్పించే విభాగం.. కెమికల్ ఇంజనీరింగ్. వీటి పురోగతికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. కెమికల్ ఉత్పత్తుల ఎగుమతులు ఆశాజనకంగా ఉంటున్నాయి. ఇండియా స్కిల్ రిపోర్ట్ కెమికల్ విభాగంలో రానున్న అయిదేళ్లలో వేల సంఖ్యలో అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్, పెట్రోలియం విభాగాల్లో అవకాశాలు ఎక్కువ ఉంటాయని పేర్కొంది. తాజా అభ్యర్థులు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. తమ అకడమిక్ అధ్యయనంతోపాటు నిరంతరం ఈ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి.

సానుకూలతలు:
  • ఇతర బ్రాంచ్‌లతో పోల్చితే వేతనాలు ఎక్కువ.
  • సృజనాత్మకత ఎక్కువ.

ప్రతికూలతలు:
  • ఉపాధి అవకాశాలు పరిమితం.
  • హానికరమైన కెమికల్స్‌తో పనిచేయాల్సి రావడం.

మెకానికల్.. నిరంతర మెరుపులు
ఇంజనీరింగ్ రంగంలో నిరంతరం వెలుగులీనే బ్రాంచ్.. మెకానికల్ ఇంజనీరింగ్. సూక్ష్మ, చిన్న తరహా నుంచి బహుళజాతి కంపెనీల వరకూ.. ఉత్పత్తి రంగంలోని సంస్థలకు అవసరమైన విభాగం మెకానికల్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్ నిత్యనూతన బ్రాంచ్‌గా పేరొందుతోంది. దీనికితోడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులకు చక్కటి అవకాశంగా మారనుంది. ముఖ్యంగా ఈ ఏడాది ఇందులో చేరి నాలుగేళ్ల తర్వాత పట్టాతో బయటికొచ్చే సమయానికి వేల సంఖ్యలో అవకాశాలు స్వాగతం పలకడం ఖాయం. ఇండస్ట్రీ వృద్ధి గణాంకాల అంచనాలు కూడా ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ‘సీఐఐ-బీసీజీ మాన్యుఫాక్చరింగ్ లీడర్‌షిప్ సర్వే’ ప్రకారం- దేశంలో ఉత్పత్తి రంగం.. వచ్చే అయిదేళ్లలో 5 నుంచి 10 శాతం పురోగతి సాధించనుంది. ఫిక్కీ నిర్వహించిన సర్వేలో కూడా 85 శాతం సంస్థలు తమ ఉత్పత్తి కార్యకలాపాలు విస్తరిస్తున్నామని, నియామకాలు పెరగడం సహజమని పేర్కొన్నాయి. ఇవి సాంకేతిక, ఉత్పత్తి విభాగాల్లోనే 55 శాతం మేర ఉంటాయని తెలిపాయి. వీటన్నిటినీ విశ్లేషిస్తే సమీప భవిష్యత్తులో వందల సంఖ్యలో కొత్త సంస్థల ఆవిర్భావం, ఇప్పటికే ఉన్న సంస్థల విస్తరణ ఖాయమని తేలింది. ఫలితంగా నిపుణులైన మానవ వనరులు ముఖ్యంగా ఉత్పత్తి రంగంలో ఎంతో కీలకంగా వ్యవహరించే మెకానికల్ ఇంజనీర్ల అవసరం భారీగా ఉంటుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు వీటన్నిటినీ గుర్తించి అకడమిక్‌గా రాణించేందుకు తొలి రోజు నుంచే శ్రమిస్తే కొలువులు ఖాయం. పరిశోధనాత్మక దృక్పథం, డ్రాయింగ్ నైపుణ్యం, కొత్త పరికరాల గురించి విశ్లేషించే తత్వం... లాంటి సహజ లక్షణాలు తప్పనిసరి.

సానుకూలతలు:
  • బీటెక్‌తోనే ఉద్యోగ అవకాశాలు.
  • ఉద్యోగ భద్రత ఎక్కువ.

ప్రతికూలతలు:
  • సిలబస్ పరిధి విస్తృతం.
  • నిర్దిష్ట పనివేళలు లేకపోవడం.

ఎలక్ట్రికల్ - ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
థామస్ ఆల్వా ఎడిసన్.. విద్యుత్ బల్బు కనుగొన్న నాటి నుంచి నేటి వరకు నిరంతరం కొత్త వెలుగులు ప్రసరిస్తున్న విభాగం.. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ప్రస్తుత దైనందిన జీవితంలో ప్రతి దశలోనూ ఎలక్ట్రికల్ వస్తువుల వినియోగం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు పలు చర్యలు చేపడుతోంది. రానున్న అయిదేళ్లలో దాదాపు లక్ష మెగావాట్ల సామర్థ్యం గల పవర్ ప్లాంట్స్ నెలకొల్పాలని లక్ష్యంగా చేసుకుంది. వీటి నిర్వహణలో కీలకమైన ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు భవిష్యత్తులో అద్భుత అవకాశాలతో పాటు శరవేగంగా పురోగతి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో స్వదేశీ ఉత్పత్తుల సంఖ్య 2020 నాటికి 40 శాతం మేర పెరగనుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులు ఇవ్వాలనే నిర్ణయంతో మరెన్నో ఎంఎన్‌సీలు భారత్‌లో కార్యకలాపాలు విస్తరించడంతో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లకు మంచి అవకాశాలు కల్పిస్తాయి. ఈ బ్రాంచ్ ఔత్సాహికులకు సూక్ష్మ పరిశీలన నైపుణ్యాలు అవసరం.

సానుకూలతలు:
  • ఆహ్లాదకరమైన పని వాతావరణం.
  • కెరీర్ ఆప్షన్‌‌స ఎక్కువ.

ప్రతికూలతలు:
  • టెక్నాలజీ మార్పుతో తప్పనిసరి ఉన్నత విద్య.
  • కరెంట్‌తో పని కాబట్టి కొంత రిస్క్.

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్
కోర్ బ్రాంచ్‌లలో మరో ముఖ్యమైన బ్రాంచ్.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. బ్రాడ్ బ్యాండ్ సేవల విస్తరణ; ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అమలు దిశగా వేగంగా అడుగులు; దేశీయంగా సెమీ కండక్టర్స్, మొబైల్ పరికరాల ఉత్పత్తుల పెంపు దిశగా చేపడుతున్న చర్యలు; వంటి కారణాలతో సమీప భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్ విభాగంలో నిపుణుల అవసరం భారీ సంఖ్యలో ఏర్పడనుంది. కొత్త పరికరాల పనితీరు స్వీయ విశ్లేషణ, అన్వేషణ చేయడం లాంటి లక్షణాలు ఉన్నవారు ముందంజలో ఉంటారు. డిజిటల్ ఇండియా, డిజిటలైజేషన్, డిజిటల్ లిటరసీ మిషన్ వంటి పథకాలతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కేవలం ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విభాగంలోనే కాకుండా.. విద్య, వైద్య రంగాలు మొదలు.. శాటిలైట్ ప్రయోగాల వరకు ప్రతి రంగంలోనూ ఎలక్ట్రానిక్ విభాగం నిష్ణాతులకు డిమాండ్ పెరగనుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ బ్రాంచ్‌లో చేరే విద్యార్థులు నాలుగేళ్ల తర్వాత సర్టిఫికెట్లు అందుకునే నాటికి సర్కారీ, కార్పొరేట్ కొలువులు స్వాగతం పలకడం ఖాయం.

సానుకూలతలు:
  • రీసెర్చ్ నైపుణ్యాలకు అవకాశం.
  • ఇతర విభాగాల్లోనూ ఉద్యోగాలు.

ప్రతికూలతలు:
  • కాలానుగుణంగా సిలబస్‌లో మార్పు లేకపోవడం.
  • స్వీయ అభ్యసనానికి తక్కువ అవకాశాలు.

కెరీర్‌కు ఊతమిచ్చే కోర్ బ్రాంచ్‌లు
ఇంజనీరింగ్ ఔత్సాహికులకు కెరీర్ పరంగా కోర్ బ్రాంచ్‌లు ఊతమిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కోర్ బ్రాంచ్‌లపై ఆసక్తి ఉన్న విద్యార్థులు వీటిలో చేరే విషయంలో ఆందోళన అనవసరం. ప్రస్తుతం కోర్ బ్రాంచ్ నైపుణ్యాలు అవసరం. అందుకు తగిన విధంగా ఎన్నో ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచ్‌లు వస్తున్నాయి. వాటితోనే అవకాశాలు లభిస్తాయనే అభిప్రాయం సరికాదు. ఏ బ్రాంచ్‌లో చేరే విద్యార్థులైనా దానికి సంబంధించి నిరంతరం తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా కోర్ బ్రాంచ్ ఔత్సాహికులు ఆర్ అండ్ డీ దృక్పథంతో ముందుకు సాగాలి. అప్పుడే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.
- ప్రొఫెసర్ జి.ఎస్.ఎన్.రాజు, వైస్ చాన్స్‌లర్, ఆంధ్రా యూనివర్సిటీ.


కోర్ బ్రాంచ్‌లు.. ఉన్నత విద్యతో ఉన్నతంగా
బీటెక్‌లో కోర్ బ్రాంచ్‌ల ఔత్సాహిక విద్యార్థులు.. కేవలం బీటెక్‌కే పరిమితం కాకూడదు. ఉన్నత విద్య ఎంటెక్ దిశగా దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచుకోవాలి. ఫలితంగా ఎక్కువ నైపుణ్యాలు లభించి అవకాశాలు కూడా అదే స్థాయిలో లభిస్తాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో.. ఎంటెక్ స్థాయిలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ వంటి స్పెషలైజేషన్లు మారుతున్న అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి వస్తున్నాయి. వీటిపై ఇప్పటి నుంచే అవగాహన ఏర్పరచుకుని ముందుకు సాగాలి. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ సాఫ్ట్‌వేర్ ప్రమేయం పెరిగింది. కాబట్టి విద్యార్థులు తమ బ్రాంచ్‌కు అనుబంధంగా ఉన్న సాఫ్ట్‌వేర్ కోర్సులను నేర్చుకోవాలి.
- ప్రొఫెసర్ ఎన్.వి.రమణరావు, రిజిస్ట్రార్, జేఎన్‌టీయూ-హెచ్


పరిశోధనాత్మక దృక్పథం
మెకానికల్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వంటి కోర్ బ్రాంచ్‌లలో చేరే విద్యార్థులు అకడమిక్‌గా పరిశోధనాత్మకత దృక్పథంతో అడుగులు వేయాలి. క్లాస్ రూం లెర్నింగ్ కంటే ప్రాక్టికల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. మెకానికల్ ఇంజనీరింగ్‌లో అకడమిక్‌గా, భవిష్యత్తులో విధుల నిర్వహణ పరంగా ప్రాక్టికాలిటీదే పెద్దపీట. ఈ రంగంలో కొత్తగా ఆవిష్కృతమవుతున్న సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలు కూడా అందిపుచ్చుకోవాలి.
- ప్రొఫెసర్ కె.హేమచంద్రా రెడ్డి, జేఎన్‌టీయూ-ఏ.


క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లోనూ తొలి ప్రాధాన్యం
క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ సమయంలోనూ కోర్ బ్రాంచ్ విద్యార్థులకు కంపెనీలు తొలి ప్రాధాన్యమిస్తున్నాయి. కాబట్టి ఈ బ్రాంచ్‌ల ఔత్సాహికులు కెరీర్ గురించి ఆందోళన చెందక్కర్లేదు. అయితే అనలిటికల్ స్కిల్స్, అప్లికేషన్ అప్రోచ్ అలవర్చుకోవాలి. అప్పుడు అవకాశాలు మెరుగవుతాయి. కేవలం గ్రాడ్యుయేషన్‌కే పరిమితం కాకుండా ఎంటెక్ దిశగా అడుగులు వేయడం ఉపయుక్తంగా ఉంటుంది.
- ప్రొఫెసర్ బి.వెంకటేశం, ప్లేస్‌మెంట్ ఆఫీసర్, ఐఐటీ-హెచ్
Published date : 28 May 2015 01:31PM

Photo Stories