Skip to main content

ఇంజనీరింగ్ దాటితే..ఇదిగో రూటు

బీటెక్ విద్యార్థులు కేరీర్‌లో స్థిరపడం గగనమైపోతున్న విషయం తెలిసిందే. కానీ మూడో ఏడాదిలో ఉన్నప్పటి నుంచే సరైన ప్రణాళికతో ఇంజనీరింగ్ తర్వాత ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని విజయశిఖరాలు అదిరోహించవచ్చు. మీకోసం ఇవిగో ఆ.....దారులు.
ఇంజనీరింగ్ తర్వాత ఉన్నత విద్య, ఫారిన్ ఎడ్యుకేషన్, ప్రభుత్వ ఉద్యోగాలు, స్వయం ఉపాధి.. వీటిల్లో తమకు నప్పే వాటిని ఎంచుకొని.. ఆ మార్గంలో ముందుకెళ్లడానికి కృషి చేయాలి. కాబట్టి ఇప్పుడు వేసే తొలి అడుగే కేరీర్‌లో పైస్థాయికి తీసుకెళుతుందనే విషయాన్ని మరువకూడదు. ఇంజనీరింగ్ తర్వాత విద్యార్థులకు ఉన్న పలు మార్గాలేంటో చూద్దాం.

క్యాంపప్ ప్లేస్‌మెంట్స్
ఇంజనీరింగ్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న సువర్ణ అవకాశం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్. పేరున్న కాలేజీల్లో కంపెనీలు నియామకాలు చేపడుతుంటాయి. విద్యార్థులు సరైన సన్నద్ధతతో ఉద్యోగం సాధించవచ్చు. బీటెక్ తర్వాత ఉద్యోగమే చేయాలని నిర్ణయించుకున్న వారు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌ను సీరియస్‌గా తీసుకొని సన్నద్ధత సాగించాలి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం సాధించడం కేరీర్‌కు కీలక మలుపు అని గుర్తించాలి. ప్లేస్‌మెంట్స్ కోసం వచ్చే కంపెనీల ప్రొఫైల్స్, జాబ్‌రోల్ తెలుసుకొని హాజరవ్వాలి. ప్లేస్‌మెంట్స్‌లో రాణించాలంటే.. ఇప్పటికే సదరు కంపెనీల్లో పనిచేస్తున్న సీనియర్ల సలహాలు తీసుకోవడంతోపాటు, కాలేజీ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ల సలహాలు, సూచనలు స్వీకరించాలి.

ఉన్నత విద్య.. ఎంటెక్
ఇంజనీరింగ్ తర్వాత విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో చక్కటి అవకాశం.. ఉన్నత విద్య. ఇంజనీరింగ్ విభాగంలోనే కొనసాగాలనుకుంటే.. నచ్చిన సబ్జెక్టుల్లో మరింత ప్రావీణ్యులుగా తీర్చిదిద్దే ఎంటెక్‌ను ఎంచుకోవాలి. స్పెషలైజ్డ్ కోర్సుల్లో ఎంటెక్ పూర్తిచేస్తే జాబ్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగావకాశాలు పెరగడంతోపాటు, ఆకర్షణీయ వేతన ప్యాకేజీలు అందుకోవచ్చు.
  • ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఎంటెక్ చదవాలనుకునే విద్యార్థులు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)లో ర్యాంకు సొంతం చేసుకోవాలి.
  • రాష్ట్రాల స్థాయిలోని యూనివర్సిటీల్లో ఎంటెక్ చదవాలనుకుంటే.. ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నిర్వహించే పీజీఈసెట్(పీజీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీజీఈసెట్)లో ప్రతిభ చూపాలి. పలు డీమ్డ్ యూనివర్సిటీలు సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి.

ఎంబీఏ వైపు అడుగులు
  • బీటెక్ తర్వాత ఎంబీఏ చేసే విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మేనేజ్‌మెంట్ విద్యకు పేరుగాం చిన ఐఐఎంల్లో ప్రవేశానికి నిర్వహించే.. కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)కు హాజరయ్యే వారిలో, టాప్‌లో నిలిచే వారిలో ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య గణనీయం. బీటెక్ పూర్తయ్యాక మేనేజ్‌మెంట్ కెరీర్ వైపు వెళ్లాలనుకునే విద్యార్థులు.. తమ టెక్నికల్ నాలెడ్జ్‌కు తోడు మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు మెరుగుపరచుకునేందుకు ఎంబీఏలో చేరుతున్నారు.
  • ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏలో చేరాలనుకునే విద్యార్థులు క్యాట్, ఎక్స్‌ఏ టీ, మ్యాట్, సీమ్యాట్, ఐసెట్ తదితర ప్రవేశ పరీక్షలు రాసి మంచి ర్యాంకు ద్వారా పేరున్న కాలేజీల్లో చేరొచ్చు.

ఈ- కోర్సులతో కొలువు
ఇంజనీరింగ్ తర్వాత క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగాలు సాధించలేని విద్యార్థులు.. జాబ్ ఓరియెంటెడ్ కోర్సుల్లో చేరొచ్చు. ఎంబీఏ, ఎంటెక్ లాంటి ఉన్నత విద్యపై ఆసక్తి లేని వారు.. వీఎల్‌ఎస్‌ఐ, రోబోటిక్స్, ఎథికల్ హ్యాకింగ్, ప్రొటోకాల్ టెస్టింగ్, మెషిన్ డిజైనింగ్, ఎంబెడెడ్ టెక్నాలజీ లాంటి జాబ్ ఓరియెంటెడ్ కోర్సుల్లో చేరాలనేది నిపుణుల సలహా. సదరు టెక్నాలజీలపై పట్టు సాధించడం ద్వారా సంబంధిత రంగంలోని కంపెనీల్లో ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకోవచ్చు.

స్టార్టప్
మన దేశంలోనూ గత కొన్నేళ్లుగా కనిపిస్తోన్న ట్రెండ్.. స్టార్టప్స్. ఇంజనీరింగ్ పూర్తయ్యాక సరికొత్త ఆలోచనతో స్టార్టప్ దిశగా సొంతంగా సంస్థను స్థాపించవచ్చు. మీ స్టార్టప్ ఐడియా నచ్చితే పెద్ద సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయి. ప్రభుత్వాలు కూడా స్టార్టప్‌లకు మేలు చేసే విధంగా సరికొత్త విధానాలు రూపొందిస్తున్నాయి. కాబట్టి ఇంజనీరింగ్ తర్వాత మీకున్న ఆలోచనలు సృజనాత్మకంగా, కొలువుల సృష్టి, అపార అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఉంటే.. మీరే ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారొచ్చు. మీకు మీరే బాస్ కావచ్చు. కానీ సంస్థ నిలదొక్కుకోవాలంటే అంతా ఆషామాషీ కాదనే విషయాన్ని తెలుసుకొని రంగంలోకి దిగాలి. సరికొత్త సవాళ్లు, పోటీ సంస్థల కంటే మీ ఆలోచనలు ఏ విధంగా భిన్నంగా ఉంటాయి. వాటి అమలు సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకొని స్టార్టప్‌ల స్థాపనకు ఉపక్రమించాలి. సవాళ్లను ఎదుర్కొనుకునే సత్తా, మెండైన ఆత్మవిశ్వాసం అవసరం. అన్నింటి కంటే ముఖ్యంగా ఫెయిల్యూర్‌ను తట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఆర్థిక వెసులుబాటు కూడా అవసరమే.

అభిరుచి, ఆసక్తికి పట్టం
చాలామందికి చదువుతోపాటు ఇతర అభిరుచులూ ఉంటాయి. జీవితంలో అకడమిక్ ప్రతిభ కంటే హాబీలతో పాపులర్ అయిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా తమ చదువులతో పాటు తమ అభిరుచులు ఏంటో తెలుసుకొని వాటికి కొంత సమయం కేటాయించి స్కిల్స్ పెంచుకోవాలి. డాన్సింగ్, ఫోటోగ్రఫీ, పెయింటింగ్, మ్యూజిక్, రైటింగ్, స్పోర్ట్స్, కళలు మొదలైన హాబీలుంటే... వాటికి కాస్త మెరుగులు దిద్దుకుంటే వాటి ద్వారానూ అనువైన కేరీర్‌ను ఎంచుకోవచ్చు!!

సివిల్స్, గ్రూప్స్.. సాధ్యమే
ఇంజనీరింగ్ విద్యార్థులకు ముందున్న మరో అవకాశం.. ప్రతిష్టాత్మక సివిల్స్,గ్రూప్స్ పరీక్షలు. దేశ అత్యున్నత సర్వీసులుగా పేరొందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర పోస్టులను దక్కించుకునే వీలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ పరీక్ష ద్వారా లభిస్తుంది. సివిల్స్ పరీక్షకు ఏటా పోటీపడుతున్న ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. సివిల్స్ సాధిస్తున్న వారిలో ఇంజనీరింగ్ నేపథ్యమున్న విద్యార్థులే ఎక్కువగా ఉండటం గమనార్హం. దాంతోపాటు యూపీఎస్సీ నిర్వహించే ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ తదితర పరీక్షల్లో ప్రతిభ ద్వారా ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు పొందొచ్చు. గేట్‌లో మంచి స్కోర్ ద్వారా పీఎస్‌యూల్లో సర్కారీ కొలువు సొంతం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్1, గ్రూప్2 పరీక్షల ద్వారా రాష్ట్రస్థాయిలో కీలక ఉద్యోగాలు పొందొచ్చు. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్‌‌స, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్‌ వంటి ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. సుస్థిరమైన కెరీర్, సామాజిక సేవా, ఉన్నత హోదా కోరుకునే బీటెక్ గ్రాడ్యుయేట్లు సివిల్స్, గ్రూప్స్ పరీక్షల సాధనపైన దృష్టి పెట్టాలి.
  • ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ దళాలు స్వాగతం పలుకుతున్నాయి. దేశానికి నేరుగా సేవ, సమాజంలో గౌరవం, ఆకర్షణీయమైన వేతనాలు మొదలైన వాటివల్ల ఈ ఉద్యోగాలకు యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇంజనీరింగ్ విద్యార్థులు ఎఫ్‌క్యాట్ పరీక్ష ద్వారా డిఫెన్స్ సర్వీసుల్లో ఉద్యోగం సాధించే అవకాశముంది.
Published date : 13 Apr 2018 02:46PM

Photo Stories