Skip to main content

ఈఎస్‌ఈ- 2020 పిపరేషన్ గెడైన్స్...

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాల్లో గ్రూప్ ఏ స్థాయి ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఏటా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(ఈఎస్‌ఈ) నిర్వహిస్తుంది. ఈఎస్‌ఈ 2020 నోటిఫికేషన్‌ను ఇటీవల విడుదల చేసింది. ఈఎస్‌ఈ పరీక్షలో ప్రతిభ చూపడం ద్వారా భారత ప్రభుత్వ సంస్థలైన రైల్వే, టెలికాం, బోర్డర్ రోడ్స్, సీపీడబ్ల్యూడీ, సీడబ్ల్యూసీ, సీపీఈఎస్, ఎన్‌హెచ్‌ఏఐ, నేవల్ ఆర్మమెంట్స్, ఐడీఎస్‌ఈ, ఎంఈఎస్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఉన్నత కొలువు సొంతం చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్‌తోనే ఉన్నత స్థాయి ఉద్యోగం.. సమాజంలో గుర్తింపు పొందేందుకు వీలుకల్పించే ఈఎస్‌ఈ 2020 నియామక ప్రక్రియ, ప్రిపరేషన్ గెడైన్స్...
ఈఎస్‌ఈ ద్వారా భర్తీ చేసే పోస్టులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వ రంగంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ కొలువులు అని చెప్పొచ్చు. కాబట్టి ఈఎస్‌ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా విపరీతమైన పోటీ ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్,ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తారు. యూపీఎస్సీ ఈఎస్‌ఈ-2020 ద్వారా మొత్తం 495 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. అర్హత పరీక్ష చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు:2020 జనవరి 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. (1990 జనవరి 2- 1999 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు, రిజర్వేషన్లు వర్తించే ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.నిర్దేశిత ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తున్న వారికి నిబంధలకు లోబడి వయోసడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ :
ఈఎస్‌ఈ ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో అర్హులైన వారికి రెండో దశలో మెయిన్ పరీక్ష (కన్వెన్షనల్ విధానంలో) నిర్వహిస్తారు. చివరి దశలో పర్సనాలిటీ టెస్ట్ నిర్వహించి మెరిట్ జాబితా రూపొందిస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష విధానం :

సబ్జెక్టు

సమయం

మార్కులు

పేపర్-1

జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్

2 గంటలు

200

పేపర్-2

సంబంధిత సబ్జెక్ట్

3 గంటలు

300

మొత్తం మార్కులు

500


  • ఈ రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. ప్రతి పొరపాటు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో మూడో వంతు మార్కుల కోత విధిస్తారు.
  • ప్రిలిమ్స్‌లో సాధించే మార్కులు తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.
  • ప్రిలిమినరీ దశ నుంచి మొత్తం ఖాళీల సంఖ్యకు 6 నుంచి 7 రెట్ల మంది అభ్యర్థులను మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు.
  • ప్రిలిమినరీ పరీక్షలో నిర్దేశిత కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.

మెయిన్ పరీక్ష విధానం:
మెయిన్ పరీక్ష రెండు పేపర్లలో 600 మార్కులకు జరుగుతుంది. ఒక్కో పేపర్‌కు 3 గంటల సమయం అందుబాటులో ఉంటుంది.

పేపర్

సబ్జెక్టు

మార్కులు

1

సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/

300

 

ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్

 

2

సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్

300


  • మెయిన్ పరీక్ష నుంచి మొత్తం ఖాళీల సంఖ్యకు రెండు రెట్ల మందిని పర్సనాలిటీ టెస్ట్‌కు ఆహ్వానిస్తారు.
  • స్టేజ్ 3(పర్సనాలిటీ టెస్ట్ట్) 200 మార్కులకు జరుగుతుంది. ఇందులో కనీస అర్హత మార్కులు సాధించాలనే నిబంధన లేదు.

సిలబస్ అంశాలు :
ఎలక్ట్రికల్ :
ఎలక్ట్రికల్ సర్క్యూట్లు, ఫీల్డ్స్, ఎలక్ట్రికల్ మెటీరియల్స్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ మెజర్‌మెంట్; కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషీన్స్, పవర్‌సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్, కంప్యూటర్ ఫండమెంటల్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సిస్టమ్ అండ్ సిగ్నల్ ప్రాసెసర్స్.

మెకానికల్ ఇంజనీరింగ్ :
ఇంజనీరింగ్ మెకానిక్స్, మెటీరియల్స్; మెకానిజమ్స్ అండ్ మెషీన్స్; ఇండస్ట్రియల్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, థర్మోడైనమిక్స్ అండ్ హీట్ ట్రాన్స్‌ఫర్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఐసీ ఇంజన్స్, టర్బో మెషినరీ, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, డిజైన్ ఆఫ్ మెషీన్ ఎలిమెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్, మెకట్రానిక్స్ అండ్ రోబోటిక్స్.

ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ :
కంట్రోల్ సిస్టమ్స్, అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, అనలాగ్ అండ్ డిజిటల్ సర్క్యూట్లు, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, మెటీరియల్స్ సైన్స్, ఎలక్ట్రానిక్ మెజర్‌మెంట్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, నెట్‌వర్క్ థియరీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్స్, అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ టాపిక్స్, అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్.

సివిల్ ఇంజనీరింగ్:
సాలిడ్ మెకానిక్స్, జియోటెక్నికల్, హైడ్రాలజీ అండ్ ఇరిగేషన్, ఫ్లూయిడ్ మెకానిక్స్, బిల్డింగ్ మెటీరియల్స్, ప్రశ్నలు; ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, స్ట్ట్రక్చరల్ అనాలిసిస్,డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్, డిజైన్ ఆఫ్ కాంక్రీట్ అండ్ మ్యాసనరీ స్ట్రక్చర్స్, కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్, సర్వేయింగ్, ట్రాన్స్‌పోర్టేషన్.

ప్రిపరేషన్.. పక్కాగా
  • ఈఎస్‌ఈ పరీక్ష సిలబస్ విస్తృతంగా ఉంటుంది. కాబట్టి ఈ పరీక్ష ప్రిపరేషన్ కోసం ఒక ఏడాదికాలం కేటాయిస్తే విజయ అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నది నిపుణుల అభిప్రాయం. ఇప్పటికే సిలబస్ మొత్తం ఒకసారి పూర్తి చేసుకొని ఉంటే మేలు. ఇప్పుడు రివిజన్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ప్రిలిమ్స్‌ను తేలిగ్గా తీసుకోవద్దు. ఇందులో సాధించే మార్కులు తుది జాబితాలో పరిగణనలోకి తీసుకుంటారు. ప్రణాళికబద్ధంగా చదివితే ఏకకాలంలో గేట్, ఈఎస్‌ఈల్లో నెగ్గొచ్చు. గేట్ ద్వారా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందే వీలుంది.
  • ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ గత ప్రశ్న పత్రాలు పరిశీలిస్తే.. పరీక్ష సరళి, కాఠిన్యత అర్థం అవుతుంది. గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయడం ద్వారా ఏ అంశం నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయనే విషయంపై అవగాహన పెంచుకోవచ్చు. అందుకు అనుగుణంగా ప్రిపరేషన్ వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి. చదవాల్సిన అంశాలు, కేటాయించాల్సిన సమయంతో ప్రత్యేకంగా టైంటేబుల్ రూపొందించుకోవాలి.
  • సమయం 3 నెలలే ఉంది. కాబట్టి ప్రణాళికబద్ధంగా చదవాలి. జనరల్ స్టడీస్‌కు ప్రాధాన్యమిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. జాతీయ, అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ముఖ్య ఘటనలు క్షుణ్నంగా తెలుసుకోవాలి. వీటికి అవసరానికి మించి ఎక్కువ సయమం కేటాయించకపోవడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
  • టెక్నికల్ సబ్జెక్టులు, నాన్ టెక్నికల్ సబ్జెక్టులను వేర్వేరుగా చదవాలి. ఇలా చేయడం వల్ల మధ్యలో బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇక మెటీరియల్ ఎంపికలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే చదివిన పుస్తకాలనే మళ్లీ మళ్లీ చదవాలి. కొత్త పుస్తకాలనూ చదవవద్దు. ఇన్ని రోజులపాటు సిద్ధం చేసుకున్న సొంత నోట్స్‌ను ర్యాపిడ్ రివిజన్ చేస్తుండాలి. ముఖ్యాంశాలు, ఫార్ములాలను కంఠస్తం చేయాలి.
  • జీఎస్ పేపర్‌కు ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డ్రాయింగ్, ఎథిక్స్, ఫిజిక్స్ సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, అంతర్జాతీయ వాణిజ్య అంశాలు, పర్యావరణ అంశాలు - ఒప్పందాలు - సదస్సులు - సమావేశాలు, క్రీడలు - విజేతలు, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలను నిశితంగా పరిశీలిస్తూ సొంత నోట్స్ సిద్ధం చేసుకోవడం లాభిస్తుంది.
  • సమయపాలన కోసం మాక్‌టెస్టులు రాయడం తప్పనిసరి. సిలబస్ పూర్తి చేశాక గ్రాండ్ టెస్టులు రాస్తే బలాలు, బలహీనతలను బేరీజు చేసుకోవచ్చు. ఫలితాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకోవచ్చు. స్వీయ విశ్లేషణతో ప్రిపరేషన్ స్థాయిపై ఒక అంచనాకు రావొచ్చు.
  • టెక్నికల్ సబ్జెక్టులను చదివే క్రమంలో ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ తరహాలో ప్రిపేర్ అవ్వాలి. ఒక్కో సబ్జెక్టును పూర్తి చేసుకొని.. మరోసారి పునశ్చరణ చేసుకున్న తర్వాత వేరే సబ్జెక్టును చదవడం మేలు.
  • అంతిమంగా 55 శాతం నుంచి 58 శాతం మార్కులు పొందిన అభ్యర్థులు తుది జాబితాలో నిలుస్తున్నారు.

సబ్జెక్టివ్ అప్రోచ్ ముఖ్యం :
గేట్‌లా కాకుండా ఈఎస్‌ఈకి సన్నద్ధమయ్యే విద్యార్థులు సబ్జెక్టివ్ అప్రోచ్‌తో ప్రిపేరవ్వాలి. బేసిక్ కాన్సెప్టులను బాగా అవగతం చేసుకోవాలి. ప్రిలిమ్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు.ఇందులో ఉత్తమ స్కోరు సాధించేందుకు కృషి చేయాలి. తుది ఫలితాల్లో ముందు వరుసలో నిలిపేందుకు ప్రిలిమ్స్ స్కోరు దోహదం చేస్తుంది. మెయిన్స్ కోసం రైటింగ్ ప్రాక్టీస్ ప్రధానం. ఈఎస్‌ఈ పోస్టులకు ఎంపికైతే సామాజిక హోదాతోపాటు ఆకర్షణీయమైన వేతనం అందుకోవచ్చు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లవచ్చు.
-పి.శ్రీనివాసులురెడ్డి, సీఎండీ,వాణి ఇన్‌స్టిట్యూట్

70 శాతం సిలబస్ పూర్తయినట్లే!
సివిల్ విభాగంలో స్ట్రెన్త్ ఆఫ్ మెటిరియల్స్, స్ట్రక్చరల్ అనాలసిస్, ఆర్‌సీసీ, జియోటెక్నికల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ సబ్జెక్టులు చదివితే 70 శాతం సిలబస్ పూర్తి అయినట్లే. ఇప్పటికే సిలబస్ పూర్తి చేసుకొని రివిజన్ ప్రారంభించాలి. మాక్‌టెస్టులు రాయాలి. ఫార్ములాలు, కాన్పెప్టులు రివిజన్ చేసుకోవాలి. గత పేపర్లు గమనిస్తూ ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో విశ్లేషించుకోవాలి.
- శశాంక్ యాదగిరి, ఐఈఎస్ 25వ ర్యాంకు-2018, సివిల్ ఇంజనీరింగ్.

ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:
15.10.2019
దరఖాస్తు రుసుం: రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఎలాంటి రుసుం లేదు).
పిలిమినరీ పరీక్ష తేదీ: జనవరి 5, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.upsc.gov.in
Published date : 04 Oct 2019 12:10PM

Photo Stories