Skip to main content

గేట్ 2022లో కొత్త‌గా మ‌రో రెండు కొత్త పేపర్లు.. ప‌రీక్ష విధానం ఇదే..

గేట్‌.. గ్రాడ్యుయేట్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌! దేశంలోని.. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో.. ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష.. గేట్‌! ఈ పరీక్షలో స్కోర్‌తో ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) ఉద్యోగం సైతం దక్కించుకోవచ్చు.

గేట్‌ లక్ష్యంగా నిర్దేశించుకున్న విద్యార్థులు.. ప్రిపరేషన్‌ మొదలుపెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది! కారణం.. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి గేట్‌–2022 సన్నాహకాలు ప్రారంభం కావడమే! గేట్‌ 2022ను ఐఐటీ–ఖరగ్‌పూర్‌ నిర్వహిస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇటీవల వెలువడింది. దాంతోపాటు కొత్తగా మరో రెండు పేపర్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. గేట్‌ 2022 తీరుతెన్నులు, కొత్త మార్పులు, ప్రిపరేషన్‌ గైడెన్స్‌...


గేట్‌.. ఐఐటీలు, నిట్‌లు వంటి టాప్‌ ఇంజనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంటెక్‌ కోర్సులో చేరాలనుకునే బీటెక్‌ విద్యార్థులకు చక్కటి మార్గం. అంతేకాకుండా గేట్‌ స్కోర్‌తో జాతీయ స్థాయిలో పలు ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్, ట్రైనీ ఇంజనీర్స్‌ ఉద్యోగాలు కూడా సొంతం చేసుకోవచ్చు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, అదే విధంగా పీఎస్‌యూలు గేట్‌లో స్కోర్‌ ఆధారంగా మలిదశ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తాయి. ఇందులోనూ ప్రతిభ చూపిన వారికి ఎంటెక్‌లో ప్రవేశం/పీఎస్‌యూల్లో కొలువు ఖాయం అవుతుంది. పీఎస్‌యూ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులు ఆయా ప్రభుత్వ రంగ సంస్థ జాబ్‌ నోటిఫికేషన్‌కు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నిర్వహణ–ఐఐటీ ఖరగ్‌పూర్‌..
గేట్‌–2022ను ఐఐటీ ఖరగ్‌పూర్‌ నిర్వహించనుంది. ఈ మేరకు ఇటీవలే నిర్ణయం వెలువడింది. గతంలో మాదిరిగానే 2022 ఫిబ్రవరి మొదటి వారం లేదా రెండో వారంలో.. ఆన్‌లైన్‌ విధానంలో.. రోజుకు రెండు స్లాట్లలో గేట్‌ పరీక్ష జరిగే అవకాశం ఉంది.

కొత్తగా రెండు పేపర్లు
ప్రతి ఏటా గేట్‌ పరీక్షలో ఏదో ఒక మార్పు కనిపిస్తున్న విషయం తెలిసిందే. గేట్‌–2022 విషయంలో ఇప్పటివరకు వెల్లడైన మార్పులను గమనిస్తే.. కొత్తగా రెండు పేపర్లను చేర్చారు. అవి.. నావల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ మెరైన్‌ ఇంజనీరింగ్, జియోమాటిక్స్‌ ఇంజనీరింగ్‌. గత ఏడాది ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ విద్యార్థులకూ అవకాశం కల్పించారు. అందుకోసం హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌సైన్సెస్‌ (ఎక్స్‌హెచ్‌) పేపర్‌ను, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ పేపర్‌ను కొత్తగా ప్రవేశపెట్టారు. గేట్‌–2022లో కొత్తగా మరో రెండు పేపర్లను చేర్చడంతో.. మొత్తం గేట్‌ పేపర్ల సంఖ్య 29కు చేరుకుంది.

గత ఏడాది ఇంజనీరింగ్‌ విద్యార్థులు రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశం కల్పించారు. ఈ విధానం ఈ సంవత్సరం కూడా కొనసాగనుంది. అభ్యర్థులు కోర్‌ సబ్జెక్ట్‌తోపాటు దానికి సరితూగే మరో పేపర్‌ కూడా రాయొచ్చు.

గేట్‌–2022.. పరీక్ష విధానం
గేట్‌ పరీక్ష మొత్తం 65 ప్రశ్నలు–100 మార్కులకు జరుగుతుంది.
ఆన్‌లైన్‌ విధానంలో మూడు గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు.

జనరల్‌ ఆప్టిట్యూడ్‌ విభాగం 15 మార్కులకు ఉంటుంది. ఇందులో ఒక మార్కు ప్రశ్నలు అయిదు, రెండు మార్కుల ప్రశ్నలు అయిదు ఉంటాయి.

ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్‌ 13 మార్కులకు; అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌పై 72 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.

మూడు రకాలుగా ప్రశ్నలు..
గేట్‌ పరీక్షలో.. మూడు రకాల ప్రశ్నలు ఎదురవుతాయి. అవి.. మల్టిపుల్‌ ఛాయిస్‌ కొశ్చన్స్‌(ఎంసీక్యూలు)గా పిలిచే ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు. రెండో రకం.. మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్‌(ఎంఎస్‌క్యూ). మూడో రకం.. న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌(ఎన్‌ఏటీ) ప్రశ్నలు.

ఎంసీక్యూల్లో.. నాలుగు లేదా అయిదు ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్‌ను సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది.

మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్‌లో.. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు సమాధానంగా ఉండే ప్రశ్నలు అడుగుతారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. సదరు కొశ్చన్, దానికి సంబంధించిన టాపిక్‌పై పూర్తి స్థాయి అవగాహన ఉండాలి.

న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు కొంత కాలిక్యులేషన్స్‌తో కూడినవిగా ఉంటాయి.
 
Published date : 09 Jun 2021 04:34PM

Photo Stories