Skip to main content

గేట్-2016కు గెలుపు బాట!

బంగారు భవితకు ‘గేట్’ వే.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్! గేట్ స్కోర్ సహాయంతో జాతీయ ప్రాధాన్య సంస్థలుగా, అత్యున్నత విద్యా సంస్థలుగా పేరున్న ఐఐటీల్లో ఎంఈ, ఎంటెక్, డాక్టోరల్ కోర్సుల్లో ప్రవేశించొచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఇంతటి ప్రాధాన్యమున్న గేట్-2016 పరీక్షలు జనవరి 30న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న కొద్ది సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? మంచి స్కోర్‌కు మార్గాలపై నిపుణుల సూచనలు..
గేట్-2016 పరీక్షలు జనవరి 30న ప్రారంభం కానున్నాయి. అందుబాటులో ఉన్న ఈ కొద్ది సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మంచి స్కోర్ సొంతమవుతుంది. ఈ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే దాన్ని గుర్తించి, ప్రణాళికాయుతంగా ప్రిపరేషన్ కొనసాగించాలి.
  • సిలబస్ మేరకు మళ్లీ అన్ని అంశాలను చదవాలనుకోవడం సరికాదు. మొదట్నుంచి మళ్లీ చదవడానికి ఇది సరైన సమయం కాదు. ఇప్పటికే సిద్ధం చేసుకున్న షార్ట్ నోట్స్‌ను రివిజన్ చేయాలి. ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను ప్రాక్టీస్ చేయాలి.
  • తొలుత సులభమైన అంశాలను రివిజన్ చేయాలి. వీటికి సంబంధించిన ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు గుర్తించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్లిష్టమైన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడానికి సన్నద్ధత లభిస్తుంది.
  • రివిజన్ చేస్తున్న సమయంలో చాలా ముఖ్యమైన అంశాలను క్లుప్తంగా నోట్స్‌లో రాసుకోవాలి. వీటిని క్విక్ రివిజన్/లాస్ట్ మినిట్ రివిజన్‌కు ఉపయోగించుకోవాలి. ట్యుటోరియల్స్, డిస్కషన్స్, లేదా ఇతర మెటీరియల్ నుంచి షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. ఇది ప్రిపరేషన్‌ను వేగవంతం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
  • గత పరీక్ష పత్రాలు, మోడల్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయాలి. బలాలు, బలహీనతలను బేరీజువేసుకొని తెలియని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు ప్రయత్నించాలి. ఈ సమయంలో అంశాల వారీగా వివరణ ఎక్కువగా ఉన్న పుస్తకాలు చదవకపోవడం మంచిది.
  • మార్కుల కేటాయింపును బట్టి సబ్జెక్టులను ప్రాధాన్యత ఆధారంగా విభజించుకొని టైం టేబుల్ రూపొందించుకోవాలి. దీని ప్రకారం ప్రిపేరవ్వాలి. అలా కాకుండా ఏదో ఒకటి చదువుకుంటూ పోవడం వల్ల గందరగోళం తలెత్తుతుంది.
  • అభ్యర్థులు ప్రధానంగా న్యూమరికల్ ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేసేటప్పుడు వేగం, కచ్చితత్వానికి ప్రాధాన్యమివ్వాలి.

కటాఫ్‌ను చేరాలంటే:
  • గేట్ పేపర్ 100 మార్కులకు ఉంటుంది. మూడు గంటల వ్యవధిలో 65 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (ఎంసీక్యూ), న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. సమాధానం గుర్తించేందుకు ప్రతి ప్రశ్నకు సగటున 2.8 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది.
  • ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, జనరల్ ఆప్టిట్యూడ్ విభాగాల ప్రశ్నలు మధ్యస్థ కాఠిన్యతతో ఉంటాయి. లాజిక్ లేదా ఫార్ములా ఆధారంగా ఉంటున్నాయి. వీటికి సమాధానాలు గుర్తించేందుకు తక్కువ సమయం సరిపోతుంది. అందువల్ల తొలుత ఈ విభాగాల ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. తర్వాత టెక్నికల్ సబ్జెక్టు ప్రశ్నలను సాధించాలి.
  • బాగా ప్రిపేరైతే మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ విభాగాల్లో కనీసం 25 మార్కులు సాధించవచ్చు. గేట్‌లో అర్హత సాధించడంలో ఈ మార్కులు కీలకమవుతాయి. ఎందుకంటే కటాఫ్ 25 మార్కులకు అటూఇటుగా ఉంటోంది.
  • మాక్ టెస్ట్‌లు రాయటం వల్ల టైం మేనేజ్‌మెంట్ అలవడుతుంది. ఒక ప్రశ్నకు సమాధానం గుర్తించేందుకు దాదాపు ఆరు నిమిషాల సమయం వెచ్చిస్తే అలాంటి ప్రశ్నను వదిలేయడం మంచిది. ఇలాంటి వాటిని చివర్లో సమయం మిగిలితే సాధించాలి.

‘కోర్’ను విస్మరించొద్దు:
  • టెక్నికల్ సబ్జెక్టుకు సంబంధించి కోర్ అంశాలను నిర్లక్ష్యం చేయకుండా పూర్తిస్థాయిలో ప్రిపేరవ్వాలి.
  • మెకానికల్‌లో థర్మోడైనమిక్స్, ప్రొడక్షన్ టెక్నాలజీ/ మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అంశాలు ముఖ్యమైనవి.
  • ఈసీఈలో అనలాగ్ సర్క్యూట్లు, ఎలక్ట్రానిక్ డివెసైస్ ముఖ్యమైన అంశాలు.
  • ఎలక్ట్రికల్‌లో నెట్‌వర్క్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అంశాలు చాలా ముఖ్యమైనవి.

మరికొన్ని టిప్స్:
  • కొన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు ఆప్షన్లు ఉపయోగపడతాయి. ఎలిమినేట్ మెథడ్ ద్వారా సరైన సమాధానం గుర్తించడానికి వీలవుతుంది. దీన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.
  • మొదట్లో సమాధానాలు గుర్తించేందుకు ఇబ్బంది తలెత్తితే, ప్రశ్నలను ర్యాండమ్‌గా ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా ఉంటుంది.
  • పరీక్షకు ముందు రోజు కొత్తగా ఏమీ చదవద్దు. విశ్రాంతికి ప్రాధాన్యమివ్వాలి.
  • సౌకర్యవంతమైన బట్టలు ధరించాలి. జీన్స్ దుస్తులు పరీక్ష గదిలో అసౌకర్యంగా ఉంటాయి. రిస్ట్ వాచీ, క్యాలిక్యులేటర్‌ను తీసుకెళ్లడం మరచిపోకూడదు. కనీసం గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
Published date : 19 Jan 2016 11:56AM

Photo Stories