Skip to main content

డిప్లొమాతోనే క్రేజీ కొలువు.. ఎస్‌ఎస్‌సీ జూనియర్‌ ఇంజనీర్ ఉద్యోగం సాధించండిలా..

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. ప్రతి ఏటా క్రమం తప్పకుండా చేపడుతోంది. వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లు/ఆర్గనైజేషన్స్‌ కోసం మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్‌ వంటి ఇంజనీరింగ్‌ విభాగాల్లో నియామకాల కోసం ‘ఎస్‌ఎస్‌సీ జూనియర్‌ ఇంజనీర్‌(జేఈ)’ నోటిఫికేషన్‌ విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌సీ జేఈ పోస్టులకు దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, పరీక్ష తీరుతెన్నులపై ప్రత్యేక కథనం..


డిప్లొమాతోనే క్రేజీ కొలువు..

ఎస్‌ఎస్‌సీ జేఈ పోస్టులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం–ఆయా విభాగాలను బట్టి చాలా వాటికి పాలిటెక్నిక్‌ డిప్లొమా అర్హతగా నిర్ణయించారు. కొన్ని పోస్టులకు మాత్రం ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉండాలి. అభ్యర్థుల వయో పరిమితి ఆయా కేంద్ర ప్రభుత్వ విభాగాలను అనుసరించి ఉంటుంది. వివిధ డిపార్ట్‌మెంట్లు/మినిస్ట్రీలు/ఆర్గనైజేషన్స్‌లో జేఈ పోస్టుల వయోపరిమితి 27ఏళ్ల నుంచి 32ఏళ్ల మధ్య ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఈబీసీ/వికలాంగులకు వయోసడలింపు లభిస్తుంది.


నియామకాలు–విభాగాలు..

ఎస్‌ఎస్‌సీ జేఈ నోటిఫికేషన్‌ ద్వారా.. ముఖ్యంగా మిలటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్‌(ఎంఈఎస్‌), బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్స్, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్‌ డిపార్ట్‌మెంట్‌(సీపీడ‌బ్ల్యూడీ),సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ క్వాలిటీ అష్యూరెన్స్ (నావెల్‌), ఫరక్కా బ్యారేజ్‌ ప్రాజెక్ట్, నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్ (ఎన్‌టీఆర్‌ఓ) తదితరాల్లో జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేస్తుంది.


పరీక్ష విధానం..

  • స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌–జూనియర్‌ ఇంజనీరింగ్‌(ఎ‹స్‌ఎస్‌సీ జేఈ) పరీక్షలో రెండు పేపర్లు.. పేపర్‌–1, పేపర్‌–2 ఉంటాయి. పేపర్‌–1 ఆన్‌లైన్‌ విధానంలో(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. పేపర్‌–2 ఆఫ్‌లైన్‌లో జరిగే(డిస్క్రిప్టివ్‌) రాత పరీక్ష.
  • పేపర్‌–1లో మొత్తం 200 మార్కులకు–200 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 50 ప్రశ్నలు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ఇవి అందరికీ కామన్‌. ఇక ముఖ్యమైన మూడో విభాగం సబ్జెక్టు ప్రాధాన్యం గలది. ఇందులో అభ్యర్థి ఏ పోస్టు కోసం(సివిల్‌ అండ్‌ స్ట్రక్చరల్‌/ఎలక్ట్రికల్‌/మెకానికల్‌) పరీక్ష రాస్తున్నారో.. ఆ విభాగం నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. మూడో విభాగంలో (పార్ట్‌–ఏ/బీ/సీ) ప్రశ్నలు.. అభ్యర్థి సబ్జెక్టు నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా అడుగుతారు.
  • జూనియర్‌ ఇంజనీర్‌(సివిల్‌/క్వాంటిటీ సర్వేయింగ్‌–కాంట్రాక్ట్స్‌) ఉద్యోగాలకు హాజరయ్యే అభ్యర్థులు.. పార్ట్‌–ఏ(సివిల్‌ అండ్‌ స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌) రాయాల్సి ఉంటుంది.
  • జూనియర్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌) పోస్టుకు హాజరయ్యే అభ్యర్థులు.. పార్ట్‌–బీ(ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌)లో ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు గుర్తించాల్సి ఉంటుంది.
  • జూనియర్‌ ఇంజనీర్‌(మెకానికల్‌) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు పార్ట్‌–సి (మెకానికల్‌ ఇంజనీరింగ్‌) విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
  • పేపర్‌–1లో ప్రశ్నలు అన్నీ మల్టిపుల్‌ ఛాయిస్‌లో ఉంటాయి. వీటిని 2 గంటల సమయంలో పూర్తి చేయాలి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.


పేపర్‌–2..

  • ఇది పెన్‌ అండ్‌ పేపర్‌ విధానంలో నిర్వహించే డిస్క్రిప్టివ్‌ పరీక్ష. పేపర్‌–1 మొత్తం 300 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు. ఇందులోనూ పార్ట్‌–ఏ జనరల్‌ ఇంజనీరింగ్‌(సివిల్‌ అండ్‌ స్ట్రక్చరల్‌), పార్ట్‌–బి జనరల్‌ ఇంజనీరింగ్‌(ఎలక్ట్రికల్‌), పార్ట్‌–సి జనరల్‌ ఇంజనీరింగ్‌(మెకానికల్‌) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
  • పార్ట్‌–ఎ సివిల్‌ అండ్‌ స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్, పార్ట్‌–బి ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, పార్ట్‌–సి మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో.. అభ్యర్థి దరఖాస్తులో పేర్కొన్న పోస్టు/సబ్జెక్టును ఎంచుకొని పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పేపర్‌ కోసం అభ్యర్థులు స్లైడ్‌ రూల్, కాలిక్యులేటర్, లాగర్‌థెమ్‌ టేబుల్, స్టీమ్‌ టేబుల్‌ వెంట తీసుకువెళ్లవచ్చు. ఈ పేపర్‌కు సంబంధించి ఎలాంటి నెగిటివ్‌ మార్కుల విధానం లేదు.


సిలబస్‌ విస్తృతం..

ఎస్‌ఎస్‌సీ జేఈ పరీక్షకు దేశవ్యాప్తంగా లక్షలమంది అభ్యర్థులు పోటీపడుతుంటారు. అందువల్ల ఈ పరీక్షలో విజయం సాధించాలంటే.. సిలబస్‌ అంశాలపై పూర్తిస్థాయి పట్టు అవసరం. మరోవైపు ఎస్‌ఎస్‌సీ జేఈ సిలబస్‌ విస్తృతంగా ఉంటుంది. కాబట్టి, విజయం కోసం సిలబస్‌లోని ప్రతి అంశంపైనా అభ్యర్థికి అవగాహన అవసరం. ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు.. డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్‌ (సివిల్‌/ఎలక్ట్రికల్‌/మెకానికల్‌) స్థాయిలో ఉంటాయి.

 

అందుకే పోటీ ఎక్కువ..

ఉద్యోగ ప్రొఫైల్, జీతం, కెరీర్‌ ఎదుగుదల మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పోలిస్తే కేంద్ర కొలువుల్లో అదనపు సౌకర్యాలు ఉంటాయి. దీనివల్లే కేంద్ర కొలువులకు పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది. పాలిటెక్నిక్‌ డిప్లొమా చేసిన విద్యార్థులు సర్కారీ కొలువు కోసం స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌–జూనియర్‌ ఇంజనీర్స్‌ ఎగ్జామ్‌ను తమ లక్ష్యంగా ఎంచుకోవచ్చు. పైగా ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్‌ వెలువడుతుంది. సిలబస్‌ను పూర్తిగా అవగాహన చేసుకొని.. పాత ప్రశ్న పత్రాలను పరిశీలించి.. ప్రిపరేషన్‌ సాగిస్తే.. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించవచ్చు. ఎస్‌ఎస్‌సీ జేఈ–2020 నోటిఫికేషన్‌కు సంబంధించిన పేపర్‌–1 ఎగ్జామ్‌ను కమిషన్‌ ఈ ఏడాది మార్చిలో నిర్వహించి.. ఏప్రిల్‌లో కీని సైతం విడుదల చేసింది. పేపర్‌–2 పరీక్ష త్వరలో నిర్వహించనున్నట్టు ఎస్‌ఎస్‌సీ ప్రకటించింది. ఇప్పటికే పేపర్‌–1రాసినవారు పేపర్‌–2కి సిద్ధమవడం మంచిది.


సీజీఎల్‌ వర్సెస్‌ జేఈ..

  • స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే మరో పరీక్ష.. కంబై¯ŒS్డ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌). ఇది భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలలో వివిధ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన పరీక్ష. ఈ పోస్టులన్నీ అడ్మినిస్ట్రేషన్‌ విభాగానికి సంబంధించినవి. కాగా, జూనియర్‌ ఇంజనీర్‌ పరీక్ష(ఎస్‌ఎస్‌సీ జేఈ).. టెక్నికల్‌ అండ్‌ అడ్మిన్‌ విభాగంలో పోస్టుల భర్తీకి నిర్వహిస్తారు.
  • సీజీఎల్‌ పోస్టుల ప్రొఫైల్‌ను పరిశీలిస్తే.. డిగ్రీ అర్హత గలవారు మాత్రమే రాసేందుకు అవకాశం ఉంది. వీరికి ఎక్కువగా క్లరికల్‌ వర్క్‌ సంబంధించిన విధులు ఉంటాయి. వివిధ విభాగాలు అడిగిన సమాచారం అందించడం, ప్రశ్నలకు ప్రతిస్పందించడం, ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాల మేరకు నోట్స్‌ తయారు చేసి ఫైలింగ్‌ చేయడం, అడ్మినిస్ట్రేషన్‌ సంబంధ విధులు, ఫీల్డ్‌ జామ్స్‌(తిరిగేవి), వివిధ విభాగాల ఆడిటింగ్, తనిఖీలు వంటి విధులు ఉంటాయి. పోస్టులో చేరిన నాలుగైదేళ్లకు పదోన్నతి పొందవచ్చు. అంటే.. సీజీఎల్‌ ఎగ్జామ్‌ ద్వారా అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌గా ఎంపికైనవారు.. ఐదేళ్లలో సీనియర్‌ ఆడిట్‌ ఆఫీసర్‌గా పదోన్నతి పొందవచ్చు.
  • అదే జేఈ పోస్టుల ప్రొఫైల్‌ను చూస్తే.. పాలిటెక్నిక్‌ డిప్లొమాతోనే సూపర్‌వైజింగ్‌కు(సీజీఎల్‌ కంటే పైస్థాయి)స్థాయి పోస్టుల్లో చేరొచ్చు. ఇందులో డిపార్ట్‌మెంట్స్‌ కోసం కార్యకలాపాలను ప్లాన్‌ చేయడం, అకౌంట్‌ మేనేజ్‌మెంట్, ప్రభుత్వ విధానాలను సజావుగా అమలు చేయడం, పై అధికారులకు సహాయపడటం వంటివి ఉంటాయి. మూడేళ్లలోనే నైపుణ్యాల ఆధారంగా సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ హోదాలు అందుకోవచ్చు.
  • వేతనాలు, సౌకర్యాలు కూడా ఎస్‌ఎస్‌సీ జూనియర్‌ ఇంజనీర్స్‌కు మెరుగ్గా ఉంటాయి. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల ఆధారంగా త్వరగా హోదాను పెంచుకునే అవకాశాలు జేఈలకు ఎక్కువ.
Published date : 01 Jun 2021 04:27PM

Photo Stories