Skip to main content

బీటెక్లో‘మొదటి’ నుంచే మెరవాలి!

విద్యార్థులు రెండేళ్ల పాటు కష్టపడి చదివి, ప్రవేశ పరీక్షలో విజయం సాధించి ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశిస్తున్నారు.
ఇంజనీరింగ్‌లో సుస్థిర కెరీర్‌ను అందుకునే లక్ష్యంతో కాలేజీ క్యాంపస్‌లో అడుగుపెడుతున్నారు. ప్రతిష్టాత్మక ఐఐటీ అయినా, సాధారణ కళాశాల అయినా ఎందులో చేరినప్పటికీ నాలుగేళ్ల బీటెక్/బీఈ కోర్సులో మొదటి ఏడాది నుంచే మెరవాలి... మెరికల్లా ముందుకు సాగాలి! అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులు వ్యక్తిగతంగా, అకడమిక్‌గా తమను తాము తీర్చిదిద్దుకునేందుకు నిపుణుల సూచనలు...

ఇంటర్‌లో చేరినప్పటి నుంచి ఇంజనీరింగ్ లక్ష్యంగా విద్యార్థులు చదువుతుంటారు. రెండేళ్ల పాటు పుస్తకాలు తప్ప మరో ప్రపంచం తెలియదనే విధంగా కష్టపడిన విద్యార్థులు, ఇంజనీరింగ్‌లో చేరగానే ఒక్కసారిగా స్వేచ్ఛా ప్రపంచంలో అడుగుపెట్టినట్లు భావిస్తారు. ఈ స్వేచ్ఛకు పరిమితులు విధించుకోవాలి. లక్ష్యాన్ని మరవకుండా, దాన్ని సాధించడంపైనే దృష్టినిలపాలి.

ఐఐటీలు, నిట్‌లు, మెట్రోసిటీల్లోని కళాశాలల్లో చేరే విద్యార్థుల్లో ఎక్కువ మంది ఒత్తిడికి గురవుతున్నారు. అకడెమిక్స్‌తో పాటు భిన్న సంస్కృతుల విద్యార్థులతో మమేకం కాలేక ఎక్కువ మంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, మాతృ భాషలో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన వారిలో ఈ సమస్య ఎక్కువ. ఈ క్రమంలో ఐఐటీలు, నిట్‌లు తదితర సంస్థలు సైకలాజికల్ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, విద్యార్థులకు ‘స్ట్రెస్ మేనేజ్‌మెంట్’ కౌన్సెలింగ్‌ను అందిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఒత్తిడిని అధిగమించడం ఎలా అనే దానిపై సెమినార్లు నిర్వహిస్తున్నాయి. వీటిని విద్యార్థులు ఉపయోగించుకోవాలి.

బేసిక్స్ నుంచే భేషుగ్గా:
వీలైనంత త్వరగా కొత్త వాతావరణానికి అలవాటుపడి, అకడమిక్స్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలి. బ్రాంచ్ ఏదైనప్పటికీ మొదటి ఏడాదిలో ఒకట్రెండు తప్ప అన్ని సబ్జెక్టులూ ఉమ్మడిగా ఉంటాయి. వీటిని వచ్చే మూడేళ్ల కోర్సుకు పునాదులుగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు ఏ బ్రాంచ్‌కు సంబంధించిన వారైనా రాణించాలంటే ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ మ్యాథ్స్ బేసిక్స్‌పై పట్టుండాల్సిందే. అందువల్ల మొదటి సంవత్సరంలోని సబ్జెక్టుల ప్రాథమిక అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.

అకడమిక్స్‌లో ఎదురయ్యే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. లేదంటే ఆ సందేహాలు అకడమిక్‌గా రాణించేందుకు అడ్డంకిగా మారుతాయి.

మెంటారింగ్ విభాగాలు:
ప్రస్తుతం ఉన్నత శ్రేణి కళాశాలలు మెంటారింగ్ సెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిలో సీనియర్లు, లెక్చరర్లు సభ్యులుగా ఉంటారు. తరగతిగదిలో సందేహాలు నివృత్తి చేసుకోలేని వారు వీటిని ఉపయోగించుకోవచ్చు. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన సందేహాలను నివృత్తిచేసుకోవచ్చు. మెంటార్లలో ఎక్కువ మంది సీనియర్లు ఉండటం వల్ల విద్యార్థుల్లో త్వరగా బిడియం పోతుంది.

గ్రూప్ కార్యక్రమాలు:
భవిష్యత్తులో ఉద్యోగాలు చేజిక్కించుకోవడంలో ఇంటర్ పర్సనల్ స్కిల్స్ కీలకపాత్ర పోషిస్తాయి. విద్యార్థి దశలో వీటిని పెంపొందించుకునేందుకు గ్రూప్ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. కళాశాలల్లో నిర్వహించే సెమినార్లు, బృంద చర్చల్లో పాల్గొనడం వల్ల ఎన్నో నైపుణ్యాలు అలవడతాయి. బృంద స్ఫూర్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం లభిస్తాయి.

స్వీయ అభ్యసన:
ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న కరిక్యులంను పరిగణనలోకి తీసుకుంటే, లెక్చరర్ లేదా ప్రొఫెసర్ బోధించే అంశాలకు అదనంగా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కాబట్టి స్వీయ అభ్యసన ద్వారా వివిధ అంశాలపై పట్టు సాధించాలి. దీనికోసం సంస్థలో ఉన్న అన్ని వనరులను (లైబ్రరీ, లేబొరేటరీలు, సబ్జెక్టు క్లబ్బులు...) సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.

కోర్సు, సబ్జెక్టు ఏదైనా ప్రస్తుతం ఆన్‌లైన్ లెర్నింగ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగకరం. ఆన్‌లైన్ లెర్నింగ్ సదుపాయాల్లో ఈ-లెర్నింగ్; Massively Open Online Courses (MOOCs - మూక్స్) పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఈ-లెర్నింగ్ విధానంలో నిర్దిష్ట వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుని, అవసరమైన లెక్చర్స్ వివరాలు తెలియజేసి, ఫీజు చెల్లిస్తే పాఠాలు ఆడియో విజువల్స్ రూపంలో సమకూరుతాయి. సందేహాల నివృత్తికి సబ్జెక్టు నిపుణులతో ఆన్‌లైన్ చాటింగ్ కూడా చేయొచ్చు.

మూక్స్.. విశ్వవ్యాప్త విజ్ఞానానికి సాధనాలు:
మూక్స్.. 21వ శతాబ్దపు సరికొత్త అభ్యసన సాధనంగా మారుతోంది. ఈ విధానంలో ప్రోగ్రామ్ బట్టి నిరంతరం ఆన్‌లైన్ పాఠాలు అందుబాటులో ఉంటాయి. కొన్ని మూక్స్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు కోర్సులు పూర్తిచేస్తే, ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నాయి. ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లు కూడా మూక్స్ విధానంలో కోర్సుల వారీగా అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ల లెక్చర్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. విదేశాల విషయం చూస్తే హార్వర్డ్ వంటి అంతర్జాతీయ యూనివర్సిటీల మొదలు దాదాపు ప్రతి యూనివర్సిటీలోనూ మూక్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఇంజనీరింగ్ విద్యార్థులు ఉపయోగించుకోవాలి.

ఆసక్తి మేరకు మూక్స్ వెబ్‌సైట్లో తమకు అవసరమైన కోర్సు, సబ్జెక్టులను పేర్కొని రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడే నిర్దిష్టమైన సమాచారం లభిస్తుంది. ఐఐటీ-ముంబై, ఐఐటీ-చెన్నై వంటి ఇన్‌స్టిట్యూట్లలో మూక్స్‌లో డొమైన్ స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి.

ఐఐటీలు, ఐఐఎస్‌సీ (బెంగళూరు) సంయుక్త సారథ్యంలోని నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హ్యాన్స్‌డ్ లెర్నింగ్ (ఎన్‌పీటీఈఎల్) అత్యంత ఆకర్షణీయ ఆన్‌లైన్ లెర్నింగ్ టూల్. దీనిద్వారా ఎన్నో కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా SWAYAM పేరుతో మూక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకుంటూ మొదట్నుంచీ మెరిస్తే మెరుగైన కెరీర్ మీ సొంతమవుతుంది.

స్వీయ అభ్యసనం ముఖ్యం
అన్ని అంశాలకూ తరగతిగదిలో పరిష్కారం లభిస్తుందని భావించకూడదు. చదువుతున్న సంస్థ ఏదైనప్పటికీ, సెల్ఫ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యమివ్వాలి. తరగతిగదిలో ప్రొఫెసర్ చెప్పిన అంశాన్ని విభిన్న కోణాల్లో విశ్లేషించగలిగే నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలి. వీటికి ఈ-లెర్నింగ్, ఆన్‌లైన్ లెక్చర్స్ వంటివి ఉపయోగపడతాయి.
- ప్రొఫెసర్ సి.కృష్ణ మోహన్, సీఎస్‌ఈ డిపార్ట్‌మెంట్, ఐఐటీ-హెచ్.
Published date : 20 Aug 2015 04:55PM

Photo Stories