Skip to main content

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అపార అవకాశాలు..

వ్యాపార సంస్థల్లో కొంగొత్త టెక్నాలజీల వినియోగం మెరుగుపడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది.
2019లో ఏఐ ఉద్యోగుల సంఖ్య రెట్టింపయ్యింది. అయితే, నిపుణులు తగినంత స్థాయిలో దొరక్కపోతుండటంతో ఇంకా చాలా రంగాల సంస్థల్లో ఏఐ ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయని, ఈ విభాగంలో నిపుణులకు అపార అవకాశాలు ఉన్నాయని ఎడ్యుటెక్ సంస్థ గ్రేట్ లెర్నింగ్ ఒక నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం ఏఐ ఉద్యోగుల సంఖ్య గతేడాది 40,000గా ఉండగా.. 2019లో 72,000కు చేరింది. ఏఐ ప్రాజెక్టులపై పనిచేసే కంపెనీల సంఖ్య గతేడాది సుమారు 1,000 దాకా ఉండగా.. ఈ ఏడాది మూడు రెట్లు పెరిగి 3,000కు చేరింది. వ్యాపారాలు, డేటా నిర్వహణకు కంపెనీలు పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతికతను వినియోగిస్తుండటం పెరుగుతోందని గ్రేట్ లెర్నింగ్ తెలిపింది. ఏఐ నిపుణుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. ఇది డిమాండ్‌కు తగ్గ స్థాయిలో ఉండటం లేదని పేర్కొంది. దీంతో వివిధ సంస్థల్లో ఏఐ సంబంధ ఉద్యోగాలు 2,500 పైగా ఖాళీగా ఉన్నాయని వివరించింది. ఫ్రెషర్స్ మొదలుకుని మధ్య, సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌‌స దాకా దేశీయంగా పలు సంస్థల్లోని ఏఐ, మెషీన్ లెర్నింగ్ విభాగాల్లో ప్రొఫెషనల్స్ ఈ సర్వేలో పాల్గొన్నారు.

415 మిలియన్ డాలర్లకు ఏఐ పరిశ్రమ..
గ్రేట్ లెర్నింగ్ అధ్యయనం ప్రకారం.. దేశీ ఏఐ పరిశ్రమ ఆదాయం ఈ ఏడాది 415 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 2,950 కోట్లు) చేరింది. 2018లో ఇది 230 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1,600 కోట్లు)గా ఉంది. దేశీయంగా ఏఐ నిపుణుల సగటు అనుభవం 7.2 సంవత్సరాలుగా ఉంటోంది. 29 శాతం మంది ఏఐ ప్రొఫెషనల్స్‌కు పదేళ్ల పైగా అనుభవం ఉంది. ఈ విభాగంలో చేరిన ఫ్రెషర్స్ సంఖ్య గతేడాది 3,700గా ఉండగా.. ఇది ప్రస్తుతం 60 శాతం వృద్ధి చెంది 6,000కు పెరిగింది. ‘రాబోయే రోజుల్లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నాం. అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ వచ్చే ఏడాది పెద్ద సంఖ్యలో ఏఐ కెరియర్ల వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయి‘ అని గ్రేట్ లెర్నింగ్ సహ వ్యవస్థాపకుడు హరి కృష్ణన్ నాయర్ చెప్పారు.

బెంగళూరు టాప్..
ఏఐ నిపుణులు ఎక్కువగా బెంగళూరును ఎంచుకుంటున్నారు. బెంగళూరులో ఏఐ ఉద్యోగాల కల్పన గతేడాది 13,000 స్థాయిలో ఉండగా.. 2019లో 23,000 పైగా నమోదైంది. సుమారు 8,000 ఉద్యోగాలతో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ (17,000), ముంబై (9,000) రెండు.. మూడు స్థానాల్లో నిల్చాయి. అనుభవం, నైపుణ్యాలను బట్టి ఏఐ నిపుణులకు సగటు జీతభత్యాలు రూ. 14.7 లక్షలుగా ఉంటోంది. ముంబైలో ప్రొఫెషనల్స్ అత్యధికంగా వార్షికంగా రూ. 17 లక్షల ప్యాకేజీ అందుకుంటుండగా, చెన్నైలో అత్యంత తక్కువగా రూ. 10.8 లక్షల స్థాయిలో ప్యాకేజీ ఉంటోంది. 39 శాతం మంది ఏఐ నిపుణులు .. భారీ సంస్థల్లోనూ, 29 శాతం మంది మధ్య స్థాయి సంస్థల్లోనూ, 32 శాతం మంది స్టార్టప్ సంస్థల్లోనూ సేవలు అందిస్తున్నారు. మహిళా ఏఐ నిపుణుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంటోంది.
Published date : 26 Dec 2019 03:31PM

Photo Stories