Skip to main content

ఐటీ సర్టిఫికేషన్స్...ఉన్నత అవకాశాలకు మార్గాలు

ఐటీ రంగంలో కొలువు కావాలంటే.. స్కిల్ ఉండాలి. ఐటీలో గ్రోత్ ఎంత వేగంగా వస్తుందో.. నైపుణ్యాలను పెంచుకోకుంటే అంతే త్వరగా కెరీర్ ముగిసిపోతుంది. సాఫ్ట్‌వేర్ కొలువులకు ప్రస్తుతం ఒక్కో పోస్టుకు పదుల సంఖ్యలో పోటీ ఉంటోంది. క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలో సైతం ఇదే పరిస్థితి! సీఎస్‌ఈ, ఐటీ వంటి ఇంజనీరింగ్ బ్రాంచ్‌లతో.. బీటెక్ పూర్తిచేసిన వారికి సైతం ఇదే పరిస్థితి ఎదురవుతోంది. మరి ఈ అవరోధాలను అధిగమించి సాఫ్ట్‌వేర్ కొలువును సొంతం చేసుకోవడం ఎలా? అందివచ్చిన ఐటీ ఉద్యోగాన్ని కాపాడుకోవడం ఎలా..! దానికీ ఓ మార్గం ఉంది!! అదే.. ఐటీ సర్టిఫికేషన్లు!! కొత్త నైపుణ్యాలను అందిస్తూ.. ఉద్యోగావకాశాలను విస్తృతం చేసే ఐటీ సర్టిఫికేషన్స్‌పై ప్రత్యేక కథనం...
సీసీఎన్‌ఏ :
సిస్కో సర్టిఫైడ్ నెట్‌వర్కింగ్ అసోసియేట్ (సీసీఎన్‌ఏ). ఇది నెట్‌వర్కింగ్‌లో ప్రత్యేక నైపుణ్యాలు అందించే సర్టిఫికేషన్. రూటింగ్ అండ్ స్విచింగ్; సెక్యూరిటీ; సర్వీస్ ప్రొవైడర్ ఆపరేషన్స్; సర్వీస్ ప్రొవైడర్; వాయిస్ అండ్ వైర్‌లెస్ స్పెషలైజేషన్లలో ఉండే సీసీఎన్‌ఏను పూర్తిచేయడం ద్వారా నెట్‌వర్కింగ్‌లో వాస్తవ పరిస్థితులపై అవగాహన ఏర్పడుతుంది. ఈ సర్టిఫికేషన్‌ను సొంతం చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా సిస్కో నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాల్సి ఉంటుంది. సీసీఎన్‌ఏ తర్వాత దశలుగా సీసీఎన్‌పీ; సీసీఐఈ (సిస్కో సర్టిఫైడ్ ఇంటర్నెట్ వర్క్ ఇంజనీర్); సీసీఎస్‌పీ (సిస్కో సర్టిఫైడ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్) షార్ట్‌టర్మ్ కోర్సులు ఉంటాయి. ఆయా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఆన్‌లైన్ లెర్నింగ్ విధానాన్ని సిస్కో అందుబాటులోకి తెచ్చింది.
వెబ్‌సైట్: www.cisco.com

మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అసోసియేట్ (ఎంటీఏ) :
మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ వినియోగం, ఇతర కార్యకలాపాల్లో ప్రత్యేక నైపుణ్యాలు పొందేందుకు ఉపయోగపడే కోర్సు.. మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అసోసియేట్ (ఎంటీఏ). దీనిద్వారా విండోస్ ఆపరేషన్స్, విండోస్ ఫోన్ ఆపరేషన్, నెట్‌వర్క్ టూల్స్, విండోస్ సర్వర్ టెక్నాలజీస్‌లో నైపుణ్యాలు లభిస్తాయి. దీన్ని పూర్తిచేయడం ద్వారా ప్రోగ్రామర్; సాఫ్ట్‌వేర్ అనలిస్ట్; సాఫ్ట్‌వేర్ డెవలపర్; సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వంటి ఉద్యోగాలను అందుకోవచ్చు. ఈ సర్టిఫికేషన్ కోసం మైక్రోసాఫ్ట్ నిర్వహించే పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికేషన్ శిక్షణకు మైక్రోసాఫ్ట్ వివిధ లెర్నింగ్ విధానాలను అమలుచేస్తోంది.
వెబ్‌సైట్: www.microsoft.com/learning

రెడ్ హ్యాట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ :
సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్‌లో స్పెషలైజ్డ్ స్కిల్స్ అందుకునేందుకు ఉపయోగపడే సర్టిఫికేషన్.. రెడ్ హ్యాట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (RHCSA). ముఖ్యంగా లినక్స్ ప్లాట్‌ఫామ్‌లో నెట్‌వర్క్ డిజైన్, డెవలప్‌మెంట్‌లో కెరీర్‌కు ఈ సర్టిఫికేషన్ దోహద పడుతుంది. సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచ్‌ల ఉత్తీర్ణులే కాకుండా.. సాఫ్ట్‌వేర్ రంగంలో ఆసక్తి ఉన్న సంప్రదాయ డిగ్రీ విద్యార్థులు కూడా ఈ కోర్సు పూర్తిచేసుకోవచ్చు. ఆర్‌హెచ్‌సీఎస్‌ఏ తర్వాత దశ.. రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ ఇంజనీర్ (ఆర్‌సీహెచ్‌ఈ).
వెబ్‌సైట్: www.redhat.com/training

హెచ్‌సీఎల్ హార్డ్‌వేర్ సర్టిఫికేషన్ కోర్సులు..
సాఫ్ట్‌వేర్ డొమైన్ విభాగాల్లో విధులే కాకుండా.. హార్డ్‌వేర్ నైపుణ్యాలు కూడా అందించే సర్టిఫికేషన్స్... హెచ్‌సీఎల్ హార్డ్‌వేర్ సర్టిఫికేషన్ కోర్సులు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ రూపొందించిన ఈ సర్టిఫికేషన్ కోర్సులను పూర్తిచేయడం ద్వారా నెట్‌వర్కింగ్, హార్డ్‌వేర్ విభాగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ప్రస్తుతం హెచ్‌సీఎల్ సర్టిఫైడ్ ఇంజనీర్; హెచ్‌సీఎల్ సర్టిఫైడ్ నెట్‌వర్క్ ఇంజనీర్; హెచ్‌సీఎల్ సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్; హెచ్‌సీఎల్ సర్టిఫైడ్ సిస్టమ్ ప్రొఫెషనల్; హెచ్‌సీఎల్ సర్టిఫైడ్ టెక్నాలజీ స్పెషలిస్ట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: www.hclcdc.in

ఒరాకిల్.. మెనీ సర్టిఫికేషన్స్
సాఫ్ట్‌వేర్ దిగ్గజంగా పేరొందిన ఒరాకిల్ సంస్థ సర్టిఫికేషన్లు అంటే టక్కున గుర్తొచ్చేది.. జావా సర్టిఫికేషన్. ఒరాకిల్ ప్రస్తుతం లినక్స్ అడ్మినిస్ట్రేషన్; ఈ-బిజినెస్ టూల్స్; డేటా రిలేషన్ షిప్ మేనేజ్‌మెంట్; ఒరాకిల్ సీపీక్యూ క్లౌడ్; ఒరాకిల్ మార్కెటింగ్ క్లౌడ్; మై ఎస్‌క్యూఎల్; ఒరాకిల్ డేటాబేస్ తదితర కోర్సులను ఆఫర్ చేస్తోంది. బీటెక్ ఫ్రెషర్స్ నుంచి మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్ వరకు అర్హతలకు అనుగుణంగా ఆయా సర్టిఫికేషన్స్‌లో చేరొచ్చు.
వెబ్‌సైట్: education.oracle.com

వీఎం వేర్.. విభిన్న సర్టిఫికేషన్లు
సాఫ్ట్‌వేర్, ఐటీ విద్యార్థులు/ఉద్యోగులకు సుపరిచితమైన.. నెట్‌వర్కింగ్, జావా వంటి వాటితోపాటు క్లౌడ్ కంప్యూటింగ్ ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. క్లౌడ్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్; సర్టిఫైడ్ అడ్వాన్స్‌డ్ ప్రొఫెషనల్ (క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిజైన్); సర్టిఫైడ్ అడ్వాన్స్‌డ్ ప్రొఫెషనల్ (క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేషన్); క్లౌడ్ విజువలైజేషన్ వంటి కోర్సులను పూర్తి చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులకు మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: www.mylearn.vmware.com

ఐబీఎం సర్టిఫైడ్ సొల్యూషన్ అడ్వైజర్ :
ఇవి బిగ్‌డేటా అండ్ అనలిటిక్స్, డేటాఅడ్మినిస్ట్రేషన్, డేటా ఆర్కిటెక్చర్స్, సొల్యూషన్స్ అండ్ ప్రాసెస్ విభాగాల్లో నైపుణ్యాలు అందించేందుకు ఐబీఎం సంస్థ ప్రవేశపెట్టిన కోర్సులు. వీటిని పూర్తిచేస్తే ఐబీఎంలోనే ఉద్యోగాలు సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.
వెబ్‌సైట్: www.ibm.com

హెచ్‌పీ వెర్టికా :
కంప్యూటర్స్, సాఫ్ట్‌వేర్ తయారీ సంస్థల్లో పేరుగాంచిన హెచ్‌పీ సంస్థ.. హెచ్‌పీ వెర్టికా అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసి బిగ్‌డేటాకు సంబంధించి పలు సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. వీటిలో ముఖ్యమైంది హెచ్‌పీ వెర్టికా బిగ్‌డేటా అక్రెడిటెడ్ సొల్యూషన్స్ ఎక్స్‌పర్ట్. ఈ కోర్సు ద్వారా అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్‌లో పనిచేయాలనుకునే వారికి స్పెషలైజ్డ్ నైపుణ్యాలు సొంతమవుతాయి.
వెబ్‌సైట్: www.vertica.com

సర్టిఫికేషన్లు... ఇలా చేస్తే మేలు
  1. ఇప్పుడు విద్యార్థులకు ఎన్నో ఐటీ సర్టిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని సాఫ్ట్‌వేర్ సంస్థలే స్వయంగా అందిస్తున్నాయి. కేవలం ప్రైవేటు శిక్షణకే పరిమితం కాకుండా.. ఆయా ఐటీ సంస్థల్లో రిజిస్టర్ చేసుకొని నిర్దేశిత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే సులభంగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
  2. సర్టిఫికేషన్లను ఎంపిక చేసుకునే ముందు మార్కెట్‌లో వాటికున్న ఆదరణ, భవిష్యత్తు అవకాశాల గురించి తెలుసుకోవాలి.
  3. కెరీర్‌ను నిర్దేశించుకున్న డొమైన్‌లో మాత్రమే సర్టిఫికేషన్లు పూర్తిచేయాలి.
  4. సర్టిఫికేషన్లను అందిస్తున్న సాఫ్ట్‌వేర్ సంస్థలు ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ సైతం అందిస్తున్నాయి. ఔత్సాహికులు వాటిని సాధ్యమైనంత మేరకు సద్వినియోగం చేసుకోవాలి. ఆయా సంస్థల వెబ్‌సైట్లలో పొందుపరిచిన మెటీరియల్, ప్రీవియస్ పేపర్లను పరిశీలించడం ద్వారా పరీక్షల శైలిపై అవగాహన ఏర్పడుతుంది.

అవకాశాలు విస్తృతం :
ఐటీ అనుబంధ సర్టిఫికేషన్లను పూర్తిచేయడం ద్వారా అవకాశాలు విస్తృతమవుతాయి. సంప్రదాయ డిగ్రీ విద్యార్థులు సైతం ఐటీ సర్టిఫికేషన్స్‌ను పూర్తిచేయొచ్చు. ఆయా విద్యార్థులు టెక్నికల్ సర్టిఫికేషన్ల జోలికి పోకుండా.. ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేషన్లపై దృష్టిసారించాలి. ఐటీ అనుబంధ డిగ్రీ విద్యార్థులు మైక్రోసాఫ్ట్, ట్యాబ్యులా, అమెజాన్, క్లౌడ్ టెక్నాలజీ, బిగ్‌డేటా సర్టిఫికేషన్లను పూర్తిచేయడం ద్వారా డేటా అనలిస్ట్, డైటా సైంటిస్ట్‌గా స్థిరపడొచ్చు. తాజాగా అందుబాటులోకి వచ్చిన పెగా సర్టిఫికేషన్ సైతం అవకాశాలను అందించడంలో ముందుంటోంది.
- శ్రీనివాస్, ఎక్సెల్ జీనియసెస్ సాఫ్ట్‌వేర్, హైదరాబాద్.
Published date : 01 Aug 2018 06:14PM

Photo Stories