Skip to main content

ఐటీ కోర్సులతో భవిష్యత్తులో ముందుకు దూసుకెళ్తున్న యువత.. ఉపాధి మార్గాలు తెలుసుకోండిలా!!

కంప్యూటర్ నేడు మానవ దైనందిన జీవితంలో ప్రాథమిక అవసరంగా మారింది. అంతేకాదు కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటేనే ఏ కొలువైనా దక్కే పరిస్థితి!! దాంతో ప్రస్తుతం చదువుతున్న కోర్సుతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులతోపాటు బీకామ్, బీఎస్సీ,బీఏ అభ్యర్థులు కూడా తమకు అనువైన కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసి.. ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. ఎంచుకున్న మార్గాన్ని బట్టి ఎలాంటి కంప్యూటర్ కోర్సులు పూర్తి చేయాలో తెలుసుకుందాం...
కంప్యూటర్‌కూ ఓ భాష..
కొంతమంది విద్యార్థులు కోడింగ్, కంప్యూటర్ లాంగ్వేజ్‌లు నేర్చుకోవడం చాలా కష్టమని భావిస్తుంటారు. వాస్తవానికి ‘కోడింగ్’ అనేది అంత క్లిష్టమేమీ కాదు. ఇది కంప్యూటర్‌తో మనకు కావాల్సిన పనులు చేయించుకునేందుకు ఉపయోగించే ఓ భాష (లాంగ్వేజ్-సి, సి++, జావా, పైథాన్, రూబీ, పీహెచ్‌పీ వంటివి) మాత్రమే. వివిధ ప్రాంతాల ప్రజలు వివిధ భాషలతో సంభాషించినట్టే.. మనుషులు కంప్యూటర్స్‌తో అనుసంధానమయ్యేందుకు కొన్ని భాషలున్నాయి. అలాంటి లాంగ్వేజెస్‌ను వివిధ ఆంగ్ల అక్షరాలు, వివిధ గుర్తులతో ‘మెషీన్ కోడ్’లో రూపొందిస్తారు. దాన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటారు.

ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి..
అవసరాలకు అనుగుణంగా అనేక కంప్యూటర్ లాంగ్వేజెస్(సి, సి++, జావా, పైధాన్, రూబీ, పీహెచ్‌పీ) అందుబాటులో ఉన్నాయి. ప్రోగ్రామర్లు ఎప్పటికప్పుడు కొత్తవి కూడా రూపొందిస్తున్నారు. అంటే.. ఒక లాంగ్వేజ్ వచ్చాక.. అంతకంటే మెరుగ్గా పనిచేసే భాషను నిర్దిష్ట అవసరాల కోసం రూపొందిస్తున్నారు. కాని ఎన్నో ఏళ్లుగా కొన్ని లాంగ్వేజెస్ మాత్రం వాణిజ్య ఉపయోగంలో ఉన్నాయి. జావా స్క్రిప్ట్, పీహెచ్‌పీ, రూబీ వంటివి అలాంటివే. కంప్యూటర్ లాంగ్వేజెస్‌లో.. సులువుగా నేర్చుకోవడానికి, తేలిగ్గా ఉపయోగించడానికి ఉత్తమమైన భాష ఇదీ అని చెప్పలేం. ఆయా అవసరాలకు అనుగుణంగా విభిన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ను వినియోగి స్తుంటారు. చాలామంది ప్రోగ్రామర్లు వారి కోడింగ్ కెరీర్‌లో ఒకటి కంటే ఎక్కువ లాంగ్వేజెస్‌ను నేర్చుకుంటారు. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను ఎంచుకుంటు న్నారో.. ఏ ప్రయోజనం కోసం నేర్చుకోవాలనుకుంటున్నారో.. తెలుసుకొని అందుకు అనువైన కోడింగ్ నేర్చుకోవడం ఉత్తమమని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇంకా తెలుసుకోండి: part 2: ఎలాంటి కంప్యూటర్ జాబ్ చేయాలనుకుంటున్నారో.. తెలుసుకోండిలా!!
Published date : 15 Oct 2020 04:52PM

Photo Stories