ఐటీ కొలువులకు మార్గాలు
- ‘వచ్చే మూడేళ్లలో ఐటీ రంగంలో ఏటా 1.75 లక్షల నుంచి 2 లక్షల ఉద్యోగాల్లో కోత’ – హెడ్ హంటర్స్ సర్వే .
- ‘2021 నాటికి ఐటీ రంగంలో లోస్కిల్డ్ కేటగిరీలో 7.5 లక్షల ఉద్యోగాల కోత. అదే సమయంలో హై స్కిల్డ్ కోణంలో కొత్తగా మూడు లక్షల ఉద్యోగాల కల్పన’ – హెచ్‌ఎఫ్‌ఎస్ సర్వే అంచనా.
- ‘కంపెనీలు ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వైపు మొగ్గు చూపుతున్న కారణంగా రానున్న నాలుగేళ్లలో ఐటీ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 50 శాతం కోత’ – మెకిన్సే నివేదిక.
ఐటీ రంగంలో ప్రస్తుత పరిస్థితులు, ముఖ్యంగా హైరింగ్ ట్రెండ్స్‌పై పలు సర్వే సంస్థలు వ్యక్తం చేస్తున్న విషయాలివి. కానీ.. నాస్‌కామ్, కేంద్ర ఐటీ శాఖలు మాత్రం.. ఐటీ నియామకాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. భారత ఐటీ పరిశ్రమ భేషుగ్గా ముందుకు సాగుతోందని.. 2025 నాటికి ఈ రంగంలో 25 లక్షల నుంచి 30 లక్షల ఉద్యోగాల కల్పన ఖాయం అని ఘంటాపథంగా చెబుతున్నాయి.
సమస్య ఎక్కడ?
నాస్‌కామ్ ఏదైనా చెబితే అది.. కంపెనీలకు, అభ్యర్థులకు ఒక భరోసా! కానీ.. వాస్తవంగా మాత్రం ఇటీవల కాలంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పలు కంపెనీలు చిన్నపాటి హెచ్చరిక కూడా లేకుండా.. వేల మందిని తొలగిస్తున్న వైనం. మరి నాస్‌కామ్ అంచనాలకు.. కంపెనీలు అనుసరిస్తున్న వైఖరికి మధ్య వ్యత్యాసం ఎక్కడ? అనేది ప్రశ్న. కొత్త స్కిల్స్, లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీస్ లేమి కారణంగానే ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇస్తున్నట్లు సంస్థలు చెబుతున్నాయి. కొత్త నియామకాల విషయంలోనూ లేటెస్ట్ టెక్నాలజీపై పట్టు ఉన్నవారికే∙ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంటున్నాయి.
ఎలా ముందడుగు వేయాలి?
ఇలాంటి పరిస్థితుల్లో.. ఐటీ రంగంలో కొలువు కోరుకునే అభ్యర్థులు ఎలా ముందడుగు వేయాలనే ప్రశ్నకు వినిపిస్తున్న సమాధానం ఒక్కటే..! అది ‘ఔత్సాహికులు కొత్త నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి. సంస్థల దృక్కోణంలో ఆలోచించి.. లేటెస్ట్ టెక్నాలజీని ఔపోసన పట్టాలి.
ఆ టెక్నాలజీ ఏంటో చూద్దాం...
వర్చువల్ రియాలిటీ: ఐటీ రంగంలో ఇప్పుడు విస్తృతంగా వినిపిస్తున్న మాట.. వర్చువల్ రియాలిటీ. ఇదిæ 3–డి టెక్నా లజీకి ఆధునిక నామంగా పేర్కొనొచ్చు. ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్‌ను భౌతికంగా ఎలాంటి పరికరాలు వినియోగించ కుండానే.. కేవలం విజువలైజేషన్ ఆధారంగా కంప్యూటర్ సహాయంతో డిజైన్ చేయడం.. ఆ డిజైన్‌కు అనుగుణంగా ప్రొడక్ట్ రూపకల్పనలో అనుసరించాల్సిన విధానాలపై అవగాహన ఏర్పరచుకోవడమే వర్చువల్ రియాలిటీ.
ఆగ్‌మెంటెడ్ రియాలిటీ :
ఒకవైపు సంప్రదాయ విధానాలను, మరోవైపు డిజిటల్ టెక్నాలజీలను సమన్వయం చేసుకుంటూ.. వినియోగదారులకు ఉపయోగపడే రీతిలో 3–డి ఆధారిత ప్రొడక్ట్‌లను లేదా సర్వీసులను రూపొందించే విధానం.. ఆగ్‌మెంటెడ్ రియాలిటీ. ప్రస్తుతం మనం తరచుగా వింటున్న జీపీఎస్(గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ఆగ్‌మెంటెడ్ రియాలిటీ విధానంలో రూపొందినదే.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. భవిష్యత్ అంతా ఈ టెక్నాలజీ చుట్టూనే తిరుగుతుందని అంచనా. ఈ విధానంలో ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా.. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆధారంగా ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్‌ను రూపొందించి ఎండ్ యూజర్‌కు అందించడం. ఈ విధానంపై అవగాహన పొందాలంటే.. అప్లికేషన్ నైపుణ్యాలు, అనలిటికల్ థింకింగ్ వంటి స్కిల్స్ అవసరం.
మెషిన్ లెర్నింగ్
ఐటీ రంగంలో డిజిటల్ టెక్నాలజీ బాటలో ప్రాచుర్యం పొందుతున్న మరో టెక్నాలజీ.. మెషిన్ లెర్నింగ్. ఒక రకంగా ఇది ఆర్టిషిషియల్ ఇంటెలిజెన్స్‌లో అంతర్భాగంగా పేర్కొనొచ్చు. ఇన్–పుట్ డేటా ఆధారంగా అల్గారిథమ్స్ రూపొందించడం.. గణాంకాల విశ్లేషణ ఆధారంగా నిర్దిష్టమైన ఔట్–పుట్‌ను ఆవిష్కరించడం.. మెషిన్ లెర్నింగ్ ద్వారా లభించే ప్రధాన నైపుణ్యం. ఇప్పుడు ఇది కూడా ఐటీ కంపెనీల కార్యకలాపాల్లో కీలకంగా మారింది.
రోబోటిక్స్ :
కోర్‌మాన్యుఫ్యాక్చరింగ్ నుంచి సాఫ్ట్‌వేర్ సంస్థల వరకూ.. ఇప్పుడు తప్పనిసరిగా మారుతోంది.. రోబోటిక్స్. రోబోను రూపొందించడం.. అది నిర్వర్తించా ల్సిన విధులకు సంబంధించిన ప్రోగ్రామింగ్ కోడ్‌ను రాయడం.. అప్లికేషన్ టూల్స్‌ను తయారుచేయడం, కమాండ్స్ రూపొం దించడం వంటివి రోబోటిక్స్ నైపుణ్యాలు.
శిక్షణ ఎలా?
కంపెనీలకు కొత్త నియామకాల పరంగా కీలకంగా మారు తున్న ఈ టెక్నాలజీల్లో శిక్షణ పొందడానికి ఇప్పుడు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. పలు ప్రముఖ సాఫ్ట్‌వే ర్ సంస్థలు తమ సొంత ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా శిక్షణనిస్తున్నాయి. అదే విధంగా కొన్ని కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులకు ఈ నైపుణ్యాలు అందించ్చేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయి.
నాస్‌కామ్ రంగంలోకి..
విద్యార్థులు, నిరుద్యోగలు, ఉద్యోగులకు... ఇలా ప్రతి ఒక్కరికీ కొత్త టెక్నాలజీపై అవగాహన తప్పనిసరైన నేపథ్యంలో నాస్‌కామ్ కూడా రంగంలోకి దిగింది. పలు ఐటీ సంస్థలతో కలిసి ఉమ్మడిగా నూతన టెక్నాలజీల్లో శిక్షణ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాకుండా కళాశాలల స్థాయిలో ఈ నైపుణ్యాలపై అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం టియర్–1 నగరాలపై దృష్టి పెట్టిన నాస్‌కామ్.. త్వరలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, ఇన్‌స్టిట్యూట్‌లలో బీటెక్ విద్యార్థుల కోసం ఈ తరహా శిక్షణ కార్యకలాపాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
వాస్తవ దృక్పథంతో ఆలోచించాలి...
ప్రస్తుతం బీటెక్‌లో చేరిన విద్యార్థులు, ఉద్యోగాన్వే షణలో ఉన్న అభ్యర్థులు వాస్తవ దృక్పథంతో ఆలోచిం చి ముంద డుగు వేయాలి. కేవలం క్లాస్ రూం లెర్నింగ్‌కు పరిమితం కాకుండా.. కొత్త టెక్నాలజీలను అంది పుచ్చుకునేందుకు కృషిచేయాలి. అందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలి. విద్యార్థులకు ఇప్పుడు పలు ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని సద్వినియోగం చేసు కోవడం ద్వారా ఐటీ కంపెనీలకు అవసరమవు తున్న కొత్త నైపుణ్యాలపై అవగాహన పెంచుకోవాలి.
– డాక్టర్. సంధ్య చింతల, ఈడీ–నాస్‌కామ్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్